ప్రధాన మంత్రి కార్యాలయం

తెలంగాణలోని వరంగల్ లో రూ. 6,100 కోట్లకు పైగా విలువ చేసే మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనాలు. ప్రారంభోత్సవాలు


రూ. 5,500 కోట్లతో 176 కి. మీ. జాతీయ రహదారి ప్రాజెక్టుకు శంకుస్థాపన


రూ. 500 కోట్ల రైల్వే తయారీ విభాగానికి కాజీపేటలో శంకుస్థాపన


భద్రకాళి ఆలయ సందర్శన, పూజలు


“తెలుగు ప్రజల సామర్థ్యం దేశ సామర్థ్యాన్ని పెంచుతూనే ఉంది”


“శక్తిమంతమైన నేటి యువ భారతం వెలిగిపోతోంది”


“పాడుబడిన మౌలిక వసతులతో వేగవంతమైన అభివృద్ధి అసాధ్యం”


“చుట్టుపక్కల ఉన్న ఆర్థిక కార్యక్రమ కేంద్రాలను అనుసంధానం చేస్తూ తెలంగాణ ఒక్క ఆర్థిక కార్యకలాపాల హబ్ గా మారుతోంది”


“యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించటంలో తయారీ రంగం అతి పెద్ద వనరు కాబోతోంది”

Posted On: 08 JUL 2023 12:46PM by PIB Hyderabad

తెలంగాణలోని వరంగల్ లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు  రూ.6,100 కోట్లకు పైగా విలువ చేసే మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపనాలు,  ప్రారంభోత్సవాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలలో రూ. 5,500 కోట్లకు పైగా విలువ చేసే 176 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది.  అదే విధంగా కాజీ పేటలో తలపెట్టిన రూ. 500 కోట్లకు పైగా విలువ చేసే రైల్వే తయారీ యూనిట్ ఉంది. ప్రధాని ఇక్కడి భద్రకాళి ఆలయాన్ని కూడా సందర్శించారు. దర్శనం చేసుకొని పూజలు జరిపారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినా, 9 ఏళ్ళు పూర్తి చేసుకుందని  గుర్తు చేస్తూ, భారతదేశ చరిత్రలో తెలంగాణ పాత్ర చాలా కీలకమన్నారు. తెలుగు ప్రజల సామర్థ్యం ఎప్పుడూ భారతదేశ సామర్థ్యాన్ని పెంచుతూనే ఉందన్నారు. భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావటంలో తెలంగాణ పాత్ర గణనీయంగా ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు.  పెట్టుబడులకు, ఎదుగుదల అవకాశాలకు భారతదేశం పెట్టింది పేరుగా ఉన్నదని, వికసిత భారతదేశం కోసం అందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు.  

 

 

“నేటి నవయవ్వన భారతదేశం శక్తిమంతంగా ఉందని, 21వ శతాబ్దపు మూడో దశకం స్వర్ణ సమయంగా మారిందని, అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  వేగంగా సాగుతున్న అభివృద్ధిలో దేశంలోని ఏ ప్రాంతాన్నీ వదిలే ప్రసక్తే లేదన్నారు. అదే సమయంలో గత తొమ్మిదేళ్లలో తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ రోజు రూ. 6,000 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులను తెలంగాణకు అందిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలియజేశారు.

 

 

కొత్త లక్ష్యాల సాధనకు కొత్త మార్గాలు కనుక్కోవాలని, అప్పుడే భారతదేశ అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ప్రధాని అన్నారు. పాత మౌలిక వసతులతో ఇది అసాధ్యం కాబట్టే కొత్త మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వవలసి ఉందని అన్నారు.  అనుసంధానత లోపం, ఖరీదైన రవాణా ఖర్చు వలన వ్యాపారాభివృద్ధికి సమస్యలు ఎదురావుతాయని అందుకే వేగవంతమైన అభివృద్ధి లక్ష్యంగా  సౌకర్యాల మీద ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.  ఎక్స్ ప్రెస్ హైవేలు, పారిశ్రామిక కారిడార్లు, ఆర్థిక కారిడార్లు ఏర్పాటు చేస్తూ రెండు లేన్ల, నాలుగు లేన్ల రహదారులు అభివృద్ధి చేయటం ద్వారా, కొన్నింటిని ఆరు లేన్ల రహదారులుగా మార్చటం ద్వారా రవాణా వ్యవస్థను పటిష్ఠపరుస్తున్నామన్నారు.

 

తెలంగాణలో జాతీయ రహదారుల నెట్వర్క్ 2500 కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్లకు పెరిగిందని గుర్తు చేశారు. మరో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం వివిధ దశలలో పురోగతిలో ఉందని కూడా ప్రధాని గుర్తు చేశారు.

భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా డజన్ల కొద్దీ కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయని, అందులో అనేకం తెలంగాణ గుండా వెళుతున్నాయన్నారుహైదరాబాద్- ఇండోర్ ఆర్థిక కారిడార్, చెన్నై-సూరత్  ఆర్థిక కారిడార్, హైదరాబాద్- పనాజీ ఆర్థిక కారిడార్, హైఫడరాబాద్- విశాఖపట్నం ఇంటర్ కారిడార్ ను ఈ  సందర్భంగా ప్రధాని ఉదాహరించారు.  ఒక విధంగా తెలంగాణ చుట్టుపక్కల ఉన్న అనేక ఆర్థిక ప్రాంతాలకు కేంద్రంగా ఉందన్నారు. ఆ విధంగా అనేక ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా తయారవుతోందని కితాబునిచ్చారు.  

 

ఈ రోజు శంకుస్థాపన చేసిన నాగ పూర్-విజయవాడ కారిడార్ లోని మంచిర్యాల-వరంగల్ సెక్షన్ గురించి మాట్లాడుతూ, ఇది తెలంగాణకు అటు మహారాష్ట్రతోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్ తోనూ మరింత మెరుగైన అత్యాధునిక అనుసంధానత కలిగిస్తుందని చెప్పారు. మరో వైపు మంచిర్యాల, వరంగల్ మధ్య దూరం తగగయించి ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి పలుకుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది గిరిజనులున్నారని, చాలా కాలంగా వారు నిర్లక్ష్యానికి గురయ్యారని ప్రధాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బహుళ రవాణా అనుసంధానతకు ఈ కారిడార్ మార్గనిర్దేశనం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్-వరంగల్ సెక్షన్ ను నాలుగు లేన్ల రహదారిగా మార్చటం వలన హైదరాబాద్ – వరంగల్ పారిశ్రామిక కారిడార్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, వరంగల్ ఎస్ ఈ జెడ్ ఎక్కువగా లబ్ధిపొందుతాయన్నారు.

 

తెలంగాణలో పెరిగిన అనుసంధానత వలన రాష్ట్రంలో నేరుగా పరిశ్రమలు, పర్యాటకరంగం లబ్ధిపొందుతాయన్నారు. సాంస్కృతిక వారసత్వ సంపద ప్రదేశాలకు, తీర్థయాత్రా స్థలాలకూ చేరుకోవటం ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా మారిందని అన్నారు. వ్యవసాయ పరిశ్రమలతో బాటు కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమ కూడా లబ్ధిపొందుతాయన్నారు. రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వృత్తి నిపుణులు కావచ్చు అందరూ లబ్ధిపొందగలుగుతున్నారని ప్రధాని గుర్తు చేశారు. యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు.

 

మేకిన్  ఇండియా ప్రచారోద్యమం గురించి ప్రస్తావిస్తూ, తయారీ రంగం దేశంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని గుర్తు చేశారు.  పి ఎల్ ఐ పథకం వలన తయారీ రంగానికి ఎంతో ప్రోత్సాహం లభించిందని  అన్నారు. ఎక్కువగా తయారు చేస్తున్నవారు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందుకోగలుగుతున్నారని చెప్పారు. తెలంగాణలోనే ఈ పథకం కింద 50 కి పైగా పెద్ద సంస్థలు లబ్ధిపొందుతున్నాయన్నారు. . భారతదేశం ఈ సంవత్సరం రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతిలో రికార్డు సృష్టించిందన్నారు. 9 సంవత్సరాల కిందట రూ. 1000 కోట్లు ఉన్న రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు 16 వేల కోట్లు దాటాయన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా లబ్ధిపొందాటాన్ని  ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

తయారీ రంగంలో భారతీయ రైల్వేలు కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయని, అనేక మైలురాళ్ళు దాటుతున్నాయని అన్నారు. మేడ్ ఇన్ ఇండియా వందే భారత్ రైళ్ళను ప్రధాని గుర్తు చేశారు. భారతీయ రైల్వేలు వేలాది ఆధునిక కోచ్ లు, లోకోమోటివ్ లు తయారు చేశాయని చెబుతూ, కాజీపేటలో ఈ రోజు శంకుస్థాపన చేసిన రైల్వే తయారీ యూనిట్ మేకిన్  ఇండియాకు సరికొత్త జీవం పోస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివలన కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబమూ ఏదో ఒక విధంగా లబ్ధిపొందుతుందని చెప్పారు.

ప్రధాని తన ప్రసంగం ముగిస్తూ, ఇది ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ కు నిదర్శనంగా అభివర్ణించారు. అభివృద్ధి మంత్రంలో భాగస్వామి కావాలని తెలంగాణకు పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్య రాజన్, కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖామంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, కేంద్ర పర్యాటక శాఖామంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, ఎంపీ శ్రీ బండి సంజయ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

నేపథ్యం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 176 కిలోమీటర్ల పొడవున్న జాతీయ రహదారికి శంకుస్థాపన చేశారు. దీని అంచనా వ్యయం రూ. 5,500 కోట్లకు పైనే ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నాగపూర్-విజయవాడ కారిడార్ లోని 108 కిలోమీటర్ల మంచిర్యాల-వరంగల్ సెక్షన్ ఉంది.  ఈ సెక్షన్ వలన మంచిర్యాల-వరంగల్ మధ్య దూరం 34 కిలోమీటర్లు తగ్గుతుంది. దీనివలన ప్రయాణ సమయం తగ్గటంతోబాటు 44, 45 జాతీయ రహదారుల మీద ట్రాఫిక్ తగ్గుతుంది. 563 వ జాతీయ రహదారిలోని కరీంనగర్-వరంగల్ సెక్షన్ లో 68 కిలోమీటర్ల మేర అప్ గ్రేడ్ చేసే కార్యక్రమానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. దీనివల్ల ఇప్పుడున్న రెండు లేన్ల రహదారి నాలుగు లేన్ల రహదారిగా అమారుతుంది. దీనివలన హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, వరంగల్ ఎస్ ఈ జెడ్ లబ్ధిపొందుతాయి.

 

కాజీపేట దగ్గర రైల్వే తయారీ యూనిట్ కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. దీన్ని రూ. 500 కోట్లకు పైగా వెచ్చించి అభివృద్ధి చేస్తారు. ఈ అధునాతన తయారీ కేంద్రంలో మెరుగైన  రోలింగ్ స్టాక్ తయారీ సామర్థ్యం నెలకొల్పుతారు. ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తారు. వాగన్ల రోబోటిక్ పెయింటింగ్, అత్యాధునిక యంత్రాలు, సామగ్రి నిల్వకు అత్యాధునిక ప్లాంట్ లాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఈ కేంద్రంలో ఉంటాయి. స్థానికులకు ఉద్యోగాల కల్పనలో, పరిసర ప్రాంతాలలో అనుబంధ పరికరాల తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఇది దోహదపడుతుంది. 

 

DS/TS

*****



(Release ID: 1938167) Visitor Counter : 286