ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ గీతా ప్రెస్ శతాబ్ది వేడుకల ముగింపు వేడుకలనుద్దేశించి ప్రధాని ప్రసంగం


చిత్రమయ శివ పురాణా గ్రంథం ఆవిష్కరణ; లీలాచిత్ర ఆలయ సందర్శన


“గీతా ప్రెస్ కేవలం ముద్రణాలయం కాదు, ఒక సజీవ విశ్వాసం”

“వాసుదేవ సర్వమ్, అంటే అంతా వాసుదేవుని లోనిదే”

“1923 లో గీతా ప్రెస్ రూపంలో వెలిగించిన ఆధ్యాత్మిక దీపం నేడు మొత్తం మానవాళికి దారిదీపంగా మారింది”

“గీతా ప్రెస్ భారతదేశాన్ని అనుసంధానం చేసి దేశ సంఘీభావాన్ని పటిష్టం చేస్తుంది”

“ఒక విధంగా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’కు ప్రాతినిధ్యం వహిస్తుంది గీతా ప్రెస్”


“మానవ విలువలను, ఆదర్శాలను పురుద్ధరించటానికే గీతా ప్రెస్ లాంటి సంస్థలు ఆవిర్భవించాయి”

“మనం నవ భారతాన్ని నిర్మించి మనదైన ప్రపంచ సంక్షేమ దార్శనికతను విజయవంతం చేద్దాం”

Posted On: 07 JUL 2023 5:36PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఉన్న చారిత్రాత్మక  గీతా ప్రెస్ శతాబ్ది వేడుకల ముగింపు వేడుకలనుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా చిత్రమాయ శివ పురాణ గ్రంథాన్ని ఆవిష్కరించారు.  గీతా ప్రెస్ ఆవరణలోని లీలా చిత్ర ఆలయాన్ని కూడా ప్రధాని సందర్శించారు. శ్రీరామునికి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తూ, ఈ శ్రావణ మాసంలో ఇంద్రదేవుని ఆశీస్సులతో గోరఖ్ పూర్ లోని  గీతా ప్రెస్ లో ఉండే అవకాశం దక్కిందని వ్యాఖ్యానించారు. శివ అవతారపు గురు గోరఖ్ నాథ్ ను ఆరాధించే చోటు, ఎంతో మంది ఋషుల కార్యస్థానం కావటం మరువలేనిదన్నారు. తన గోరఖ్ పూర్ సందర్శన గురించి ప్రస్తావిస్తూ అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ సంపద కలబోసుకున్న ప్రదేశంగా అభివర్ణించారు.  తాను అక్కడినుంచి గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ కు వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ పునరభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్టు, రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను  జెండా ఊపి ప్రారంభించబోతున్నానని చెప్పారు. ప్రతిపాదిత రైల్వే స్టేషన్ ఊహాచిత్రాలు ప్రజలలో ఎంతో ఉత్సాహాన్ని  నింపాయన్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ గురించి ప్రస్తావిస్తూ, మధ్య తరగతి ప్రజల సౌఖ్యాన్ని బాగా పెంచిందన్నారు. ఒకప్పుడు మంత్రులు తమ ప్రాంతాల్లో రైలుకు హాల్ట్ ఉండాలని కోరుతూ లేఖలు రాసేవారని, ఇప్పుడు వందే భారత్ రైళ్ళు  ప్రారంభించాలని కోరుతున్నారని గుర్తు చేశారు. “ వందే భారత్ రైళ్ళు ఒక క్రేజ్ గా మారాయి.” అన్నారు. ఈరోజు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, గోరఖ్ పూర్ ప్రజలను ప్రధాని అభినందించారు.   

కోట్లాది మంది ప్రజలకు గీతా ప్రెస్ ఒక ఆలయం లాంటిదని అభివర్ణిస్తూ, “గీతా ప్రెస్ కేవలం ముద్రణాలయం కాదు, సజీవ విశ్వాసం” అని ప్రధాని అన్నారు. గీతా అనగానే కృష్ణుడు వస్తాడని, కృష్ణుడు అనగానే ఓదార్పు, కర్మ గుర్తుకు వస్తాయని అన్నారు. అందులో జ్ఞానం, శాస్త్రీయ పరిశోధన ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. “వాసుదేవ సర్వమ్, అంటే అంతా వాసుదేవుని లోనిదే” అనే గీతలోని మాటలను ప్రధాని ఉటంకించారు.

1923 లో గీతా ప్రెస్ రూపంలో వెలిగించిన ఆధ్యాత్మిక దీపం నేడు మొత్తం మానవాళికి దారిదీపంగా మారిందని ప్రధాని అన్నారు. మానవతా మిషన్ నూరేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భానికి సాక్షి కావటం తన అదృష్టమన్నారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ప్రభుత్వం గీతా ప్రెస్ కి గాంధీ శాంతి పురస్కారం ప్రకటించిందని ప్రధాని వెల్లడించారు. మహాత్మాగాంధీకి గీతా ప్రెస్ తో ఉన్న ఉద్వేగపూరితమైన బంధాన్ని ప్రస్తావిస్తూ,  కళ్యాణ్ పత్రిక ద్వారా గాంధీజీ గరీటా ప్రెస్ కు కూడా రచనపు పంపేవారన్నారు. ఆనాడు గాంధీజీ చెప్పిన మాటమీద ఇప్పటికీ అందులో ప్రకటనలు ప్రచురించటం లేదని ప్రధాని మోదీ గుర్తు చేశారు. వందేళ్ల  అద్భుత వారసత్వాన్ని గౌరవిస్తూ దేశం గీతా ప్రెస్ ను గాంధీ శాంతి బహుమతితో  సత్కరించుకుంటోందన్నారు. ఈ వందేళ్లలో గీతా ప్రెస్ కోట్లాది పుస్తకాలు ప్రచురించిందని, ఖరచుకంటే తక్కువకే ఇంటింటికీ అందించిందని ప్రధాని అన్నారు. వీటివలన అందిన జ్ఞానం, ఆధ్యాత్మిక భావజాలం, మేధాపరమైన సంతృప్తి ఎంతోమంది పాఠకులను సంపాదించిపెట్టిందని, అదే సమయంలో అంకిత భావంగల పౌరులను సమాజానికి అందించినట్టయిందని చెప్పారు. ఈ యజ్ఞంలో నిస్వార్థ సేవలందిస్తూ, ఎలాంటి ప్రచారమూ కోరుకోకుండా పాల్గొన్న  సేథీ జయదయాళ్ గోయాండ్కా,   భాయిజీ శ్రీ హనుమాన్ ప్రసాద్ పోద్దార్ లాంటి వారికి ప్రధాని ఘనంగా నివాళులర్పించారు.

గీతా ప్రెస్ లాంటి సంస్థ కేవలం మతానికే పరిమితమై పనిచేయలేదని చెబుతూ దీనికొక జాతీయ సౌశీల్యత ఉందన్నారు. “గీతా ప్రెస్ భారతదేశాన్ని అనుసంధానం చేసి దేశ సంఘీభావాన్ని పటిష్టం చేస్తుంది” అని వ్యాఖ్యానించారు. గీతా ప్రెస్ కు దేశవ్యాప్తంగా 20 శాఖలున్నాయని. దేశంలోని ప్రతి రైల్వే స్టేషన్ లోనూ ఒక స్టాల్ ఉండటాన్ని గుర్తు చేశారు.   గీతా ప్రెస్ 15 విభిన్న భాషలలో 1600 గ్రంథాలు ప్రచురిస్తూ భారతదేశపు ప్రాథమిక ఆలోచనలకు ప్రాచుర్యం కల్పిస్తూ సామాన్య  ప్రజలకు అందించిందన్నారు. “ఒక విధంగా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’కు ప్రాతినిధ్యం వహిస్తుంది గీతా ప్రెస్” అన్నారు. 

దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్య దిన వేడుకలు జరుపుకుంటున్న సమయంలోనే గీతా ప్రెస్ తన 100 ఏళ్ల యాత్ర పూర్తి చేసుకోవటం యాదృచ్ఛికమన్నారు. 1947 కు ముందే సాంస్కృతిక పునరుజ్జీవనానికి వివిధ రంగాలలో కృషి జరగటం వల్లనే భారత అంతరాత్మ మేల్కొన్నదని ప్రధాని గుర్తు చేశారు. దాని ఫలితంగానే బానిస సంకెళ్ళు తెంచుకొని భారతదేశం సంసిద్ధం కాగలిగిందన్నారు. అందులో గీతా ప్రెస్ తనదైన పాత్ర పోషించిందని అభినందించారు. వందలాది సంవత్సరాల అణచివేత కాలంలో విదేశీ ఆక్రమణదారులు భారత గ్రంథాలయాలను  తగులబెట్టారని, మన గురుకుల సంప్రదాయాన్ని నాశనం చేశారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ శాస్త్ర గ్రంథాలు మాయమవుతున్న సమయంలో ముద్రణాలయాలు వచ్చినా,  పుస్తకాల ప్రచురణ ఖరీదైన వ్యవహారంగా మారిన సమయంలో గీతా, రామాయణం లేకుండా మన సమాజం ఎలా మనుగడ సాగించేదని ప్రధాని ప్రశ్నించారు. విలువలు, ఆదర్శాలకు మూలాధారమైన రచనలు అందుబాటులో లేకపోతే సమాజ ప్రవాహం దానంతట అదే  ఆగిపోతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. 

నిజాన్ని ప్రమాదమే మేఘం కమ్మివేసినప్పుడు భయంకరమైన శక్తులు బలపడినప్పుడు భగవద్గీత ఒక స్ఫూర్తిమంతమైన వనరుగా మారిందన్నారు. భగవద్గీతను ఉటంకిస్తూ, ధర్మానికి హానికలిగి అధర్మం  చెలరేగి ప్రాణికోటికి హానికరమైనప్పుడు వారిని రక్షించి దుష్టులను శిక్షించటానికి పరమాత్ముడు అవతరిస్తాడని అన్నారు.  గీతా ప్రెస్ లాంటి సంస్థలు మానవ విలువలను, ఆదర్శాలను పునరుద్ధరించటానికి పుడతాయన్నారు. 1923 లో ఏర్పాటైనప్పటినుంచి గీతా ప్రెస్ భారతదేశపు ఆలోచనావిధానాన్ని ప్రభావితం చేసిందని అన్నారు.

“మన లక్ష్యాలు, మన విలువలు స్వఛ్ఛమైనవి అయినప్పుడు విజయం దానంతట అదే వస్తుందంటానికి గీతా ప్రెస్ నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు. సామాజిక విలువలు పెంపొందించి ప్రజల విధ్యుక్త ధర్మాన్ని  చూపిన సంస్థగా గీతా ప్రెస్ ను ప్రధాని అభివర్ణించారు. అందుకు ఉదాహరణలుగా గంగానది శుభ్రత, యోగా విజ్ఞానం, పతంజలి యోగసూత్రాల ప్రచురణ, ఆయుర్వేదం మీద ఆరోగ్యాంకం,  ప్రజలకు భారత జీవనశైలిని అలవరచే జీవన చర్య అంకం, సమాజ సేవ లాంటి అనేక విషయాల ద్వారా దేశ నిర్మాణానికి కృషి చేసే తీరును ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. 

“ఋషుల తపస్సులు వృధా కావు, వారి దీక్ష నిష్ఫలం కాదు: అని ప్రధాని వ్యాఖ్యానించారు. మానసిక బానిసత్వం నుంచి బైటపడి మన వారసత్వ సంపద పట్ల గర్వించాల్సిన సమయం ఆసన్నమైందని తన ఎర్రకోట ప్రసంగంలో చెప్పిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  దేశం అభివృద్ధితో బాటు వారసత్వ సంపదను కూడా వెంటబెట్టుకొని ముందుకు సాగుతోందన్నారు. ఒకవైపు భారతదేశం  డిజిటల్  టెక్నాలజీలో ముందడుగు వేస్తూనే, అదే సమయంలో కాశీలోని విశ్వనాథ ధామం కూడా కాశీ కారిడార్ పునరభివృద్ధిలో  భాగమైందన్నారు.   అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పిస్తూనే కేదార్ నాథ్, మహాకాల్ మహాలోక్ లాంటి గొప్ప తీర్థస్థలాలను కూడా అభివృద్ధిపరుస్తున్నామన్నారు.  శతాబ్దాల అనంతరం అయోధ్యలో రామాలయా నిర్మాణం కూడా సాకారం కాబోతున్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. రాజ్ పథ్ ను కర్తవ్య పథ్ గా పేరు మార్చటం ద్వారా వీధి నిర్వహణ స్ఫూర్తి పెంచామని, దేశ వ్యాప్తంగా మ్యూజియంలు ఏర్పాటు చేయటం ద్వారా గిరిజన సంప్రదాయాన్ని, గిరిజన స్వాతంత్ర్య సమర యోధులను  గౌరవించి గుర్తు చేయటానికి అవకాశం ఏర్పడిందని అన్నారు. అదే విధంగా, విదేశాలకు తరలిపోయిన పవిత్ర విగ్రహాలను తిరిగి దేశానికి రప్పించ గలుగుతున్నామన్నారు.

ప్రధాని తన ప్రసంగం ముగిస్తూ, అభివృద్ధి చెందిన, ఆధ్యాత్మిక భారతదేశ ఆలోచనను మన పూర్వీకులు మనకు ఇచ్చారని ఈరోజు మనం దానిని అర్థవంతమైన దిశలో  సాకారం చేసేలా ముందుకు  సాగుతున్నామని అన్నారు. మన సాధువులు, ఋషులు వారి శక్తిని, ఆధ్యాత్మిక ఆచారణను  భారత దేశ సర్వతోముఖాభివృద్ధికోసం వినియోగిస్తారని  ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. “మనం నవ భారతాన్ని నిర్మించి మనదైన ప్రపంచ సంక్షేమ దార్శనికతను విజయవంతం చేద్దాం” అంటూ ముగించారు.

ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్,  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గోరఖ్ పూర్ ఎంపీ శ్రీ రవికిషన్, గీతా ప్రెస్ ట్రస్ట్ బోర్డు ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణు ప్రసాద్ చాంద్ గోథియా, ఛైర్మన్ కేశోరాం అగర్వాల్  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

*****

DS/TS



(Release ID: 1938082) Visitor Counter : 154