హోం మంత్రిత్వ శాఖ

రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద 19 రాష్ట్రాలకు రూ.6,194.40 కోట్ల విడుదలకు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఆమోదం


2023-24లో 9 రాష్ట్రాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కేంద్ర వాటా రూపంలో రూ.3649.40 కోట్ల విడుదలకు ఇప్పటికే ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా 2021-22 నుంచి 2025-26 వరకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కోసం రూ.1,28,122.40 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

Posted On: 30 JUN 2023 7:50PM by PIB Hyderabad

రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద 19 రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.6,194.40 కోట్ల విడుదలకు కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు ఆమోదం తెలిపారు.

ఈ రూ.6,194.40 కోట్లలో, 2022-23 సంవత్సరానికి నాలుగు రాష్ట్రాలకు (ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్) ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కేంద్ర వాటాగా రూ.1,209.60 కోట్లు; 2023-24 సంవత్సరానికి 15 రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బిహార్, గోవా, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, త్రిపుర) రూ.4,984.80 కోట్లు ఉన్నాయి. ప్రస్తుత రుతుపవన కాలంలో రాష్ట్రాలు సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ నిధులు సాయం చేస్తాయి.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, 2023-24 కోసం, 9 రాష్ట్రాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కేంద్ర వాటా రూపంలో రూ.3649.40 కోట్ల విడుదలకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా 2021-22 నుంచి 2025-26 కాలానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,28,122.40 కోట్లు కేటాయించింది.

 

*****



(Release ID: 1936715) Visitor Counter : 162