రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

డ్యూరాండ్ కప్ 'ట్రోఫీ టూర్'ను ప్రారంభించిన సైనిక, వాయు దళాల అధిపతులు

Posted On: 30 JUN 2023 2:51PM by PIB Hyderabad

చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ & ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్ చౌదరి, అఖిల భారత ఫుట్‌బాల్ సంఘం (ఏఐఎఫ్‌ఎఫ్‌) అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే కలిసి 132వ డ్యూరాండ్ కప్ పోటీల “ట్రోఫీ టూర్”ను ప్రారంభించారు. ఇవాళ దిల్లీ కాంట్‌లోని మానెక్‌షా సెంటర్‌లో ఏర్పాటు చేసిన వేడుకలో “ట్రోఫీ టూర్”ను ప్రారంభించారు. ఇది, భారతదేశ పురాతన ఫుట్‌బాల్ టోర్నమెంటు. ఈ క్రీడా పోటీలు కోల్‌కతాలో ఆగస్టు 03 నుంచి సెప్టెంబర్ 03 వరకు జరుగుతాయి. “ట్రోఫీ టూర్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి యువ ఫుట్‌బాల్ క్రీడాకారులు, క్రీడా ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

డ్యూరాండ్ కప్ పోటీలు ఆసియాలో అత్యంత పురాతనమైనది, ప్రపంచంలో మూడో పురాతన ఫుట్‌బాల్ టోర్నమెంటు ఇది. భారతదేశంలోని అగ్రశ్రేణి ఫుట్‌బాల్ జట్లు ఇందులో పాల్గొంటాయి. భారత సాయుధ దళాలు దీనిని నిర్వహిస్తాయి. ఫుట్‌బాల్‌ క్రీడలో భారతదేశ ప్రతిభను దశాబ్దాలుగా డ్యూరాండ్ కప్ చాటుతోంది, ప్రతిభావంతులను వెలికి తీస్తోంది. తొలి పోటీలు 1888లో సిమ్లాలో జరిగాయి. తొలుత, ఆర్మీ కప్‌గా ఈ టోర్నమెంటు ప్రారంభమైంది. భారతదేశంలోని బ్రిటీష్ ఇండియన్ సైనిక దళాలకు మాత్రమే అప్పట్లో ప్రవేశం ఉండేది. తర్వాతి కాలంలో పౌర జట్లు పాల్గొనడానికి కూడా అనుమతి లభించింది.

డ్యూరాండ్ కప్‌ టోర్నమెంటు విజేత జట్టుకు మూడు జ్ఞాపికలు బహూకరిస్తారు, అందుకే ఈ టోర్నమెంటు చాలా ప్రత్యేకమైనది. విజేత జట్టుకు డ్యూరాండ్ కప్ (రోలింగ్ ట్రోఫీ, ఇదే అసలు జ్ఞాపిక), సిమ్లా ట్రోఫీ (రోలింగ్ ట్రోఫీ, సిమ్లా వాసులు 1904లో తొలిసారి అందించారు), ప్రెసిడెంట్స్ కప్ (విజేత జట్టు శాశ్వతంగా దాచుకునే కప్‌, 1956లో భారతదేశపు మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటిసారి అందించారు) లభిస్తాయి. రాబోయే నెల రోజుల్లో, ట్రోఫీ టూర్‌లో భాగంగా ఈ మూడు జ్ఞాపికలను సిమ్లా, ఉధంపూర్, జైపూర్, ముంబై, పుణె, బెంగళూరు, భువనేశ్వర్, కోక్రాఝార్, గువాహతి, షిల్లాంగ్ సహా కొన్ని ప్రధాన నగరాల్లో ప్రదర్శిస్తారు. ఈ విధంగా ఇవి దేశంలోని అన్ని మూలలను చుట్టి వస్తాయి. కోల్‌కతాలో టోర్నమెంటు ప్రారంభ సమయానికి ఆ నగరానికి చేరుకుంటాయి.

నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ జట్లు సహా 24 జట్లు 132వ టోర్నమెంటులో పాల్గొంటున్నాయి. 27 సంవత్సరాల విరామం తర్వాత విదేశీ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. అన్ని దేశీయ జట్లకు తలుపులు ఎప్పుడు తెరిచే ఉండాయి. అఖిల భారత ఫుట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలోని డ్యూరాండ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ సొసైటీ (డీఎఫ్‌టీఎస్‌) ఈ పోటీలను నిర్వహిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ, క్రీడాస్ఫూర్తి, పోటీతత్వానికి ఈ టోర్నమెంటు ఎప్పుడూ నిదర్శనంగా నిలుస్తోంది.

****



(Release ID: 1936408) Visitor Counter : 171