పర్యటక మంత్రిత్వ శాఖ
గోవాలో పర్యాటక కార్యాచరణ బృందం 4వ సమావేశం ప్రారంభం; తొలిరోజు రెండు అనుబంధ కార్యక్రమాలు
ఈ కార్యక్రమాల్లో భాగంగా నౌకా పర్యాటకం.. పర్యాటక రంగంలో
ప్లాస్టిక్స్ వర్తుల ఆర్థిక వ్యవస్థపై శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రసంగం;
నౌకా పర్యాటకుల సంఖ్య 2015-16లో 1.26 లక్షలు కాగా..
2019-20 నాటికి 4.68 లక్షలకు పెరిగింది: శ్రీ జి.కె.రెడ్డి;
గోవాకు మాత్రమేగాక భారతదేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడగల
సామర్థ్యం నౌకా పర్యాటక రంగానికి ఉంది: శ్రీపాద యశోనాయక్
Posted On:
19 JUN 2023 6:27PM by PIB Hyderabad
గోవాలో ఇవాళ జి-20 పర్యాటక కార్యాచరణ బృందం నాలుగో సమావేశం ప్రారంభమైంది. తొలిరోజున రెండు ప్రధాన అనుబంధ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కేంద్ర పర్యాటక-సాంస్కృతిక-‘డోనర్’ శాఖల మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద యశోనాయక్, గోవా పర్యాటక శాఖ మంత్రి శ్రీ రోహన్ ఖౌంటే, ఆ శాఖ కార్యదర్శి శ్రీమతి వి.విద్యావతి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. “సుస్థిర-బాధ్యతాయుత ప్రయాణానికి నమూనాగా నౌకా పర్యాటకం” ఇతివృత్తంగా తొలి అనుబంధ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ- గోవా రాష్ట్రం సూర్యుడు, సముద్రం, ఇసుకల సంపూర్ణ సమ్మేళనమని అభివర్ణించారు. భారతదేశంలోని ఈ అందమైన రాష్ట్రంలో ప్రకృతి సౌందర్యాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని ఆయన పిలుపునిచ్చారు. గోవా ప్రజలు ప్రేమాభిమానాలకు, నిత్యం విందులు-వినోదాలతో సంగీత-షడ్రసోపేత సమ్మిళిత జీవితానందానికి ప్రతీకలని పేర్కొన్నారు.
భారతదేశం 7,500 కిలోమీటర్ల పొడవైన తీరరేఖతో సముద్ర రంగంలో అగ్రస్థానంలో ఉందని ఆయన అన్నారు. ఆసియావ్యాప్తంగా స్పష్టంగా కనిపించే భారత నాగరికత-సంస్కృతి ప్రభావం మన సుసంపన్న సముద్ర చరిత్రకు నిదర్శనమని పేర్కొన్నారు. నేటి వియత్నాంలోని చంపా రాజ్యం, మొంబాసా రేవుద్వారా ఆఫ్రికాతో భారత వాణిజ్యం కూడా ఇందులో భాగమన్నారు. భారత సుదీర్ఘ తీరప్రాంతం వాణిజ్య విస్తరణ, ఎగుమతుల వృద్ధికి మాత్రమే పరిమితం కాదన్నారు. ఈ తీరం పొడవునా అద్భుతమైన బీచ్‌లు, ప్రకృతి సౌందర్యంతో అలరారే దీవులు, అనేక ఓడరేవుల సౌలభ్యం వంటివి పర్యాటక అభివృద్ధికి అవకాశాలని స్పష్టం చేశారు. భారత్ సందర్శించే నౌకా పర్యాటకుల సంఖ్య 2015-16లో 1.26 లక్షలు కాగా, 2019-20 నాటికి 4.68 లక్షలకు పెరగడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇదే వ్యవధిలో పర్యాటక నౌకల సంఖ్య కూడా 128 నుంచి 451కి పెరిగిందని గుర్తుచేశారు.
భారతీయ నౌకా పర్యాటకం జీవితంలోని ఒత్తిడికి దూరంగా ప్రశాంతతవైపు నడిపిస్తుందని, ప్రకృతి సహజ పరిసరాలతో జీవితానంద ఆస్వాదన అవకాశమిస్తుందని ఆయన అభివర్ణించారు. ఆ మేరకు కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అద్భుత ఆనందానుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు. బహుళ తరాల్లో ప్రయాణాభిరుచికి నౌకా పర్యాటకం ఒక సరైన ఎంపిక కాగలదని ఆయన చెప్పారు. “నౌకా ప్రయాణికుల్లో 73 శాతం నేడు సకుటుంబంగా పర్యటిస్తున్నారు. అంటే- రెండు తరాలవారు ఈ ప్రయాణానుభవాన్ని చవిచూస్తున్నారు” అని మంత్రి పేర్కొన్నారు. దేశంలో పర్యాటక రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ చక్కని చేయూతనిస్తున్నదని ఆయన తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక సహాయ పథకం ద్వారా రేవులు, పర్యాటక నౌకా కూడళ్లు, లైట్‌హౌస్‌ల నిర్మాణంతోపాటు పడవల కొనుగోలు, నదీ నౌకా విహార సర్క్యూట్లు వంటివాటి అభివృద్ధికి తోడ్పాటు ఇస్తున్నదని వివరించారు.
ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాల మంత్రిత్వ శాఖ కూడా పర్యాటక నౌకలు, పర్యాటకుల కో్సం ప్రత్యేక కూడళ్లను నిర్మిస్తున్నదని ఆయన చెప్పారు. అలాగే నౌకా పర్యాటకంపై పర్యాటక, నౌకా రవాణా మంత్రిత్వ శాఖలు ప్రత్యేక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు శ్రీ జి.కె.రెడ్డి వెల్లడించారు. మరో్వైపు సముద్ర విమాన కార్యకలాపాల నిర్వహణకు వీలుగా 16 చోట్ల జల విమానాశ్రయాలు కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మొత్తంమీద దేశంలోని ఎంపిక చేసిన ఓడరేవులలో 2023కల్లా జాతీయ, అంతర్జాతీయ పర్యాటక నౌకా కూడళ్ల అభివృద్ధికి లక్ష్యనిర్దేశం చేసుకున్నామని ఆయన తెలిపారు. అలాగే దేశంలో నౌకా పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఓడరేవుల ఉన్నతీకరణ-ఆధునీకరణ, క్రమబద్ధీకరణ-రేవు రుసుముల హేతుబద్ధీకరణ, ఔస్టింగ్ రుసుముల తొలగింపు, పర్యాటక నౌకలకు ప్రాధాన్య బెర్తుల కేటాయింపు, ఇ-వీసా సదుపాయ కల్పన తదితరాల దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన వెల్లడించారు.
బీచ్/లైట్‌హౌస్/నౌకా పర్యాటకం ద్వారా తీరప్రాంత పర్యాటక రంగానికి ప్రోత్సాహంతో మత్స్యకార సంఘాలు వంటి సామాజిక సమూహాలకు ఇతర జీవనోపాధి అవకాశాలు కల్పిస్తాయని శ్రీ జి.కిషన్ రెడ్డి అన్నారు. తద్వారా ప్రస్తుత ఆదాయానికి అనుబంధ ఆర్జన మార్గం లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు 75కుపైగా లైట్‌హౌస్‌ల పక్కనేగల భూమిలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ఓ కార్యక్రమం రూపొందించిందని మంత్రి వెల్లడించారు. నమామి గంగ కార్యక్రమం ద్వారా గంగానది పునరుజ్జీవనం కోసం కేంద్ర ప్రభుత్వం 4.3 బిలియన్ డాలర్ల (రూ.35,414 కోట్ల)కుపైగా వెచ్చించిందని గుర్తుచేశారు. అంతేకాకుండా నదుల ప్రక్షాళనతో నౌకా పర్యాటకం వంటి కార్యకలాపాలకూ అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా శ్రీపాద యశోనాయక్ మాట్లాడుతూ- నౌకా పర్యాటకానికి అపార సామర్థ్యం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగం సాధించిన విశేష విజయాలను ఈ కార్యక్రమం వెలుగులోకి తెచ్చిందని పేర్కొన్నారు. కాగా, గోవాలో బ్యాక్‌ప్యాకర్ల నుండి విలాస ప్రయాణికుల దాకా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆనందానుభూతి లభిస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వాస్తుశిల్పం, పోర్చుగీస్ బంగళాలు, ఆధునిక హోటళ్ల సమ్మేళనంగా గోవాను ఆయన అభివర్ణించారు. గోవా కార్నివాల్, సన్‌బర్న్ ఫెస్టివల్ వంటివి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వేడుకలని, ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయని గుర్తుచేశారు. ఈ రాష్ట్ర సుసంపన్న సంస్కృతికి ఇవి ప్రతీకలని, సందర్శకులకు మరపురాని అనుభూతిని అందిస్తాయని వివరించారు. గోవాకు మాత్రమేగాక యావద్దేశంలో వృద్ధికి తోడ్పడగల అపార సామర్థ్యం నౌకా పర్యాటక రంగానికి ఉందన్నారు. ఆ మేరకు ఉపాధి అవకాశాల సృష్టితోపాటు పన్ను రాబడి పెంపు, ఆర్థిక వృద్ధికి ఈ రంగం విశేషంగా దోహదపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారసత్వ వ్యవసాయ-కళా సంస్కృతిని ప్రోత్సహించే దిశగా మంత్రులు శ్రీ జి.కిషన్‌రెడ్డి, శ్రీ శ్రీపాద యశోనాయక్‌ల సమక్షంలో ‘ఎయిర్‌బిఎన్‌బి’తో పర్యాటకశాఖ ఇవాళ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఇక “అంతర్జాతీయ ప్లాస్టిక్ పర్యాటక కార్యక్రమం-పర్యాటకంలో ప్లాస్టిక్ వర్తుల ఆర్ధిక వ్యవస్థ వైపు పయనం” ఇతివృత్తంగా రెండో అనుబంధ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా శ్రీ జి.కె.రెడ్డి మాట్లాడుతూ- “ఈ భూమాత మన తల్లి-మనమంతా ఆమె బిడ్డలం” అంటూ అథర్వవేదం నుంచి శ్లోకాన్ని ఉటంకించారు. భారతీయ తత్వశాస్త్రం-జీవనశైలి ప్రకృతితో సదా సహజీవన భావనను పాదుకొల్పాయని గుర్తుచేశారు. సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ మన నైతికతలో అంతర్భాగమైన నాగరికతకు మూలస్తంభాలని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గడచిన తొమ్మిదేళ్లుగా సుస్థిర, సమ్మిళిత వృద్ధికి మద్దతులో భారతదేశం ప్రపంచ మార్గదర్శిగా ఆవిర్భవించిందని ఆయన నొక్కిచెప్పారు. సుస్థిర పర్యాటకానికి చైతన్యం, బాధ్యతాయుత ఆతిథ్యం సుస్థిర చోదకాలని మంత్రి స్పష్టం చేశారు. అలాగే భూగోళం-మానవాళిక ప్రాధాన్యం, పర్యాటక ప్రదేశాల కర్బనవిముక్తి, వ్యవస్థాపకులకు సాధికారతలకు పెద్దపీట వేయాల్సి ఉందన్నారు.
భారతదేశంలో దాదాపు 30,000 యువ పర్యాటక క్లబ్బులున్నాయని, 4వ తరగతి నుంచి కళాశాల విద్యార్థులదాకా వీటిలో సభ్యులున్నారని పేర్కొన్నారు. ఇవి బాధ్యతాయుత పర్యాటక పద్ధతులను ప్రోత్సహిస్తూ సుస్థిర పర్యాటకంపై ఆసక్తిని పునరుద్ధరిస్తాయని తెలిపారు. అలాగే ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’, ‘దేఖో అప్నా దేశ్’ వంటి కార్యక్రమాలు కూడా పర్యాటక ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటిస్తాయని ఆయన తెలిపారు. సుస్థిర పర్యాటకంపై భారత ప్రభుత్వ జాతీయ వ్యూహం, పర్యాటక మంత్రిత్వశాఖ రూపొందించిన స్వదేశ్ దర్శన్ 2.0 కార్యక్రమాలు పర్యాటక రంగంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు మార్గదర్శకాలను నిర్దేశించాయని తెలిపారు. ఇదేవిధంగా జి-20 కూటి దేశాలు ‘విజ్ఞతతో కూడిన సుస్థిర వినియోగం’ అనే నైతికతతో ప్లాస్టిక్ వినియోగం తగ్గింపునకు దోహదపడే పటిష్ట చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. ఈ రెండో కార్యక్రమంలో భాగంగా, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి సమక్షంలో పర్యాటక రంగంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని సంయుక్త నిర్మూలనపై ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిపై సుస్థిర పర్యాటకంపై కేంద్ర నోడల్ సంస్థ, ‘ఆర్‌టిఎస్‌ఒఐ’, పంజాబ్ పర్యాటక బోర్డు ప్రతినిధులు సంతకాలు చేశారు.
ఈ సమావేశంలో భాగంగా అనుభవాలు-ఉత్తమాచరణలు, సూచనలు-సలహాల ఆదానప్రదానంతోపాటు ముందడుగుకు మార్గాలు, భాగస్వామ్యాల విస్తరణకు దోహదం చేసే అంశాలపై చర్చాగోష్ఠులు నిర్వహించబడ్డాయి. నౌకా పర్యాటకంలో లింగ సమతౌల్యం, నౌకా పర్యాటన కూడలిగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడం, నౌకా పర్యాటకంపై ప్రపంచ దృష్టికోణంపై తదితర అంశాలపై ప్రత్యేక చర్చలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గోవా పర్యాటక సంస్థ వివరణాత్మక ప్రదర్శన ఇచ్చింది. ఈ మేరకు ‘పర్ల్ ఆఫ్ ది ఓరియంట్’, గోవా పర్యాటక రంగ ప్రత్యేకతలు, సామర్థ్యాలను ప్రముఖంగా వివరింది.
*****
(Release ID: 1933617)
Visitor Counter : 154