ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశం అధ్యక్షతన సమావేశం అయిన జీ-20 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్
హైదరాబాద్ లో జరిగిన సమావేశం ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్
' మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగి పోలేదు .భవిష్యత్తులో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి సమర్ధ పర్యవేక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందాలి.. డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
“ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవడానికి పటిష్ట సమర్ధ బహుపాక్షిక భాగస్వామ్యం అవసరాన్ని కోవిడ్-19 గుర్తు చేసింది. ప్రాథమిక ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతిస్పందన వ్యవస్థను అభివృద్ధి చేసినప్పుడు అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి" డాక్టర్ భారతి ప్రవీణ్
అందరికీ ఆరోగ్య సంరక్షణ కల్పించి ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి జీ-20 సహకారం అందించి క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది...శ్రీ జి కిషన్ రెడ్డి
ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ స్థాయిలో ఆరోగ్య రంగంలో నిరంతర జోక్యాల ద్వారా మాత్రమే ప్రభావవంతమైన మహమ్మారి నివారణ, సంసిద్ధత , ప్రతిస్పందన సాధ్యం అవుతాయి : ప్రొఫెసర్ ఎస్ పి సింగ్ బఘెల్
Posted On:
04 JUN 2023 1:06PM by PIB Hyderabad
“మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగి పోలేదు. ప్రస్తుత పరిస్థితిలో ఆరోగ్యం-ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను ఏకీకృతం చేసి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది." అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. .ఈ రోజు ఇక్కడ భారతదేశం అధ్యక్షతన జరిగిన 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్‌పి సింగ్ బాఘెల్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి కె పాల్ కూడా పాల్గొన్నారు.
ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రపంచ దేశాల మధ్య సహకారం, సమన్వయం తప్పనిసరి అని డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ స్పష్టం చేశారు. “ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవడానికి పటిష్ట సమర్ధ బహుపాక్షిక భాగస్వామ్యం అవసరాన్ని కోవిడ్-19 గుర్తు చేసింది. అత్యవసర పరిష్టితి ఏర్పడినప్పుడు మాత్రమే కాకుండా సాధారణ సమయాల్లో కూడా దేశాల మధ్య సహకారం, సమన్వయం తప్పనిసరి. ప్రాథమిక ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతిస్పందన వ్యవస్థను అభివృద్ధి చేసినప్పుడు అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేస్తాయి" అని డాక్టర్ భారతి ప్రవీణ్ అన్నారు." జీ-20 సమావేశాల ద్వారా దేశాల మధ్య బలపడే బంధం పరస్పర సహకారం, సమాచార మార్పిడి, నూత్న వ్యవస్థల అభివృద్ధికి దారి తీస్తుంది. అన్ని దేశాల కలిసి పని చేసినప్పుడు సానుకూల ప్రభావం ఏర్పడి ఫలితాలు సాధించడానికి వీలవుతుంది" అని మంత్రి పేర్కొన్నారు. .
ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి సురక్షితమైన, సమర్థవంతమైన, నాణ్యమైన వైద్య ప్రతిస్పందన వ్యవస్థ పనిచేయాల్సి ఉంటుందని డాక్టర్ పవార్ అన్నారు. భారతదేశం అధ్యక్షతన జీ-20 ప్రపంచ వ్యాప్తంగా అమలు జరిగే విధంగా గ్లోబల్ మెడికల్ కౌంటర్‌మెజర్ వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నెట్‌వర్క్ ఆఫ్ నెట్‌వర్క్‌ల విధానాన్ని అనుసరించి , ప్రపంచ, ప్రాంతీయ స్థాయిలో అమలులో ఉన్న వ్యవస్థల ఆధారంగా గ్లోబల్ మెడికల్ కౌంటర్‌మెజర్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఏకాభిప్రాయాన్నిసాధించడానికి జీ-20 కృషి చేస్తుందని డాక్టరో పవార్ వివరించారు. దీనిలో భాగంగా ఇంటర్‌గవర్నమెంటల్ నెగోషియేటింగ్ బాడీ (INB) ప్రక్రియ ద్వారా పనిచేసే ఒక తాత్కాలిక వ్యవస్థ రూపకల్పనకు కృషి చేయాలని జీ-20 దేశాలకు డాక్టర్ పవార్ సూచించారు.
ప్రపంచ స్థాయి ఆరోగ్య వ్యవస్థ నిర్మాణానికి జీ-20, జీ-7 ప్రాధాన్యత ఇస్తున్నాయని డాక్టర్ పవార్ తెలిపారు. జీ-7 అధ్యక్ష హోదాలో జపాన్ పనిచేసిన సమయంలో ఎంసిఎం ప్రారంభమైన అంశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీ-20 ప్రతిపాదనకు అనుగుణంగా జీ-7 ప్రారంభించిన ఎంసిఎం వ్యవస్థ ఉందన్నారు. ఈ దిశలో సాగుతున్న ప్రయత్నాలకు సహకారం అందించాలని ప్రపంచ దేశాలను కోరిన డాక్టర్ పవార్ '' పరిష్కార మార్గాలు సిద్ధం అయ్యేంతవరకు మహమ్మారి వేచి ఉండకపోవచ్చు. తగిన వ్యూహంతో సిద్ధం కావాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది" అని అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ ఆరోగ్య రంగంలో ప్రవేశ పెట్టడానికి వీలు కల్పించే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న వ్యవస్థ కోసం భారతదేశం ప్రతిపాదనలు అందించిందని డాక్టర్ పవార్ తెలిపారు. భారతదేశం ప్రతిపాదించిన అంశాలను వివరించిన డాక్టర్ పవార్ " డిజిటల్ రంగంలో దేశాల మధ్య ఉన్న అంతరాన్నిభారతదేశం చేసిన ప్రతిపాదనలు తగ్గిస్తాయి. దీనివల్ల సాంకేతికత ఫలాలు ప్రపంచంలోని ప్రతి పౌరుడికి అందుబాటులోకి వస్తాయి" అని అన్నారు.
ఆరోగ్య సంరక్షణకు భారతీయ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను అందిస్తున్న సహకారాన్ని వివరించిన శ్రీ జి కిషన్ రెడ్డి "నివారణ, సంపూర్ణ శ్రేయస్సు భారత సాంప్రదాయ విజ్ఞాన వ్యవస్థ లక్ష్యం " అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం , యోగా చూపుతున్న ప్రభావాన్ని మంత్రి ప్రస్తావించారు. "భారతీయ నాగరికత, సాంస్కృతిక వారసత్వం గా ఆయుర్వేదం వైద్య విధానాన్ని ప్రస్తుత తరానికి అందించింది. జీవన శాస్త్రమైన ఆయుర్వేదం ఐదు వేల సంవత్సరాల వైద్య విధానం. శారీరక, మానసిక శ్రేయస్సు రెండింటినీ పెంచడానికి యోగా అత్యంత విశ్వసనీయ అభ్యాసాలలో ఒకటిగా గుర్తింపు పొందింది" అని మంత్రి పేర్కొన్నారు.
విలువ ఆధారిత వైద్య పర్యాటక కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దశ,దిశ నిర్దేశించారని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. భారతదేశం సరసమైన, సమర్థవంతమైన,విశ్వసనీయమైన ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఉందని అన్నారు. విలువ ఆధారిత వైద్య సేవలకు భారతదేశం గమ్యస్థానంగా మారిందన్నారు. ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇష్టపడే మొదటి పది దేశాల్లో భారతదేశం కూడా ఉందని ఆయన తెలియజేశారు.
ప్రాణ రక్షణ, జీవనోపాధిని రక్షించడం అనే విలువలకు ప్రాధాన్యత ఇస్తున్న భారతదేశం "ప్రపంచ ఫార్మసీ"గా గుర్తింపు పొందిందన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో కేవలం హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ 33 శాతం వాటాను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.
2030 నాటికి అందరికీ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అందించాలన్న లక్ష్యానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి స్పష్టం చేశారు. "ప్రపంచ ప్రజలందరికి ఆరోగ్య సంరక్షణ కల్పించి ఆరోగ్యకర ప్రపంచాన్ని అభివృద్ధి చేయడంలో జీ-20 కీలకంగా ఉంటుంది." అని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు.
మహమ్మారి నివారణ, సంసిద్ధత,ప్రతిస్పందనకు విభిన్న బహుపాక్షిక ప్రయత్నాలు అవసరమని ప్రొఫెసర్ ఎస్‌పి సింగ్ బాఘెల్ పేర్కొన్నారు. “ఇటీవలి కోవిడ్ 19 మహమ్మారి స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ ద్వారా మాత్రమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెందుతుంది అన్న వాస్తవాన్ని తెలియజేసింది. . ప్రాంతీయ, జాతీయ , ప్రపంచ స్థాయిలో ఆరోగ్య రంగంలో నిరంతర జోక్యాల ద్వారా మాత్రమే ప్రభావవంతమైన మహమ్మారి నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన సులభతరం అవుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
అందరికీ అత్యుత్తమ ఆరోగ్య సౌకర్యాలు, వ్యాక్సిన్‌లు, థెరప్యూటిక్స్, డయాగ్నస్టిక్‌లను జీ-20 ద్వారా అందించడం భారతదేశం లక్ష్యంగా ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి అనారోగ్య రంగానికి అవసరమైన నిధులు సమకూర్చే అంశానికి ప్రాధాన్యత ఇస్తున్న జీ-20 జాయింట్ ఫైనాన్స్ మరియు హెల్త్ టాస్క్ ఫోర్స్ , జీ-7 ప్రయత్నాలను ఆయన అభినందించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు, గ్లోబల్ ఫండ్, పాండమిక్ ఫండ్ వంటి సంస్థలు నిధులు సమకూర్చే అంశంలో కీలకంగా ఉంటాయన్నారు.
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ మాట్లాడుతూ “‘అందరికీ ఆరోగ్యం’ అనేది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో పొందుపరిచిన ఒక ముఖ్యమైన లక్ష్యమని తెలిపారు. ఇటీవల ముగిసిన 76వ ప్రపంచ ఆరోగ్య సమావేశాలు కూడా ఇదే అంశంపై జరిగాయన్నారు. "ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు" అనే నినాదంతో పనిచేస్తున్న జీ-20 సార్వత్రిక ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి ప్రపంచ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు అమలులోకి రావాలని ఆయన సూచించారు. నివారణ , ప్రతిస్పందన; ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రపంచ దేశాలు కలిసి కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అభివృద్ధికి ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలు, జీ-7, జీ-20 , వంటి ప్రపంచ, ప్రాంతీయ ఆరోగ్య ప్రక్రియలను ఏకీకృతం చేయడం అవసరమని శ్రీ రాజేష్ భూషణ్ అన్నారు.
మూడు ఆరోగ్య ప్రాధాన్యతలను నిర్దేశించిన భారతదేశానికి ఇండోనేషియా, బ్రెజిలియన్ ట్రోయికా సభ్యులు అభినందనలు తెలిపారు. ఆరోగ్య సంసిద్ధత, నివారణ, ప్రతిస్పందన చర్యలను బలోపేతం చేయడానికి, వేగంగా సమిస్తిగా చర్యలు అమలు జరగాలని వారు కోరారు.
కార్యక్రమంలో ఐసిఎంఆర్ డిజి, ఆరోగ్య పరిశోధన శాఖ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ బహ్ల్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, భారతదేశం జీ 20 ప్రెసిడెన్సీ సౌస్ షెర్పా శ్రీ అభయ్ ఠాకూర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి. హెకాలి జిమోమి, జీ 20 సభ్య దేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, ఫోరమ్‌లు ,ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, వంటి భాగస్వామ్య సంస్థలు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1929728)
Visitor Counter : 224