ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో 2023 జూన్ 4 నుంచి మొదలయ్యే జి-20 ఆరోగ్య కార్యాచరణ బృందం 3వ సమావేశానికి సన్నద్ధమైన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ


జి-20కి భారత అధ్యక్షత నేపథ్యంలో దక్షిణార్థ గోళ ఆరోగ్య సవాళ్లపై ఈ సమావేశంలో కార్యాచరణ బృందం గళం విప్పుతుంది: శ్రీ లవ్‌ అగర్వాల్;

ఈ సందర్భంగా పరిశోధన-అభివృద్ధి-ఆవిష్కరణలపై సమావేశం దృష్టి

Posted On: 03 JUN 2023 3:22PM by PIB Hyderabad

   భారత జి-20 అధ్యక్షతలో భాగంగా ఆరోగ్య కార్యాచరణ బృందం (హెచ్‌డబ్ల్యుజి) తన 3వ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తుంది. రేపటినుంచి మూడు రోజులపాటు సాగే ఈ సమావేశం వివరాలను కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ లవ్‌ అగర్వాల్‌ విలేకరులకు వెల్లడించారు. ఈ మేరకు జి-20 కూటమి పరిధిలో ఆరోగ్య రంగంలోని మూడు కీలకాంశాలపై ‘హెచ్‌డబ్ల్యుజి’ సమావేశం దృష్టి సారిస్తుంది. అలాగే అనుబంధ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆరోగ్య రంగ సంబంధిత ఔషధ, టీకా, చికిత్స, రోగనిర్ధారణ సహా పరిశోధన-ఆవిష్కరణలపై చర్చకు ప్రాధాన్యమిస్తుంది.

   సందర్భంగా అదనపు కార్యదర్శి మాట్లాడుతూ- 2022 డిసెంబరు 1వ తేదీ భారతదేశానికి ఒక మైలురాయి వంటిదని పేర్కొన్నారు. ఆ రోజున ‘వసుధైవ కుటుంబకం’ అంటే- “ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు” ఇతివృత్తంగా జి-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత్‌ స్వీకరించిందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో జి-20 అధ్యక్ష హోదాపై ప్రధానమంత్రి దృక్పథాన్ని పునరుద్ఘాటిస్తూ- “ఇది సార్వజనీనం, ప్రతిష్టాత్మకం, ఆచరణాత్మకం, నిర్ణయాత్మకం”గా ఉంటుందని ఉటంకించారు. దక్షిణార్థ గోళ దేశాల సమస్యలను ప్రపంచం ముందుంచేందుకు ఇ-20 అధ్యక్ష హోదా ఒక విశిష్ట అవకాశం కల్పించిందని శ్రీ లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఈ బాధ్యతను భారత్‌కు ముందు ఇండోనేషియా నిర్వహించగా, మన తర్వాత బ్రెజిల్‌ జి-20 అధ్యక్షత చేపడుతుందని గుర్తుచేశారు. ఆ రెండూ వర్ధమాన దేశాలు కావడం వల్ల దక్షిణార్థ గోళంలో ఎదురవుతున్న సవాళ్లను జి-20 అధ్యక్షత ద్వారా మరింత సమర్థంగా వెల్లడించే అవకాశం లభించిందని ఆయన వివరించారు.

   జి-20 ఆరోగ్య ప్రాథమ్యాలలో భాగంగా భారత అధ్యక్షత కింద మూడు కీలకాంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు శ్రీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ మేరకు ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నివారణ-సంసిద్ధత-ప్రతిస్పందనసహా సూక్ష్మజీవ నిరోధక సామర్థ్యం, ఒకే ఆరోగ్య చట్రంపై దృష్టి సారిస్తుందన్నారు. అలాగే సురక్షిత, సమర్థ, నాణ్యమైన, సౌలభ్య వైద్య నివారణ (టీకాలు, చికిత్స, రోగనిర్ధారణ) సదుపాయాలపై దృష్టిపెడుతూ ఔషధ రంగ బలోపేతంపై సహకారాన్ని పటిష్టం చేయనుందన్నారు. వీటితోపాటు సార్వత్రిక ఆరోగ్య రక్షణ, ఆరోగ్య సంరక్షణ సేవల ప్రదానం మెరుగు నిమిత్తం డిజిటల్‌ ఆరోగ్య ఆవిష్కరణలు-పరిష్కారాలను ప్రోత్సహించడంపై శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. ఈ ప్రాథమ్యాల దన్నుతో ప్రతి ఆరోగ్య కార్యాచరణ బృందం సమావేశంలో సహ-బ్రాండెడ్, అనుబంధ కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇవి ఆరోగ్య రంగంలో వైద్య పర్యాటకం, ఆరోగ్యంపై వాతావరణ మార్పు ప్రభావం, ఆరోగ్యం రంగంలో నేడు సంప్రదాయ వైద్యవిధానాల ఔచిత్యం-అనుసరణ వంటి భవిష్యత్‌ అంశాలపై ఈ కార్యక్రమాలు దృష్టి సారిస్తాయన్నారు. ఈ మేరకు  ప్రస్తుత 3వ ఆరోగ్య కార్యాచరణ బృంద సమావేశం తన అనుబంధ కార్యక్రమాల్లో భాగంగా పరిశోధన-అభివృద్ధి- ఆవిష్కరణలపై శ్రద్ధ పెడుతుందని తెలిపారు.

   భారత జి-20 అధ్యక్షతన… ముఖ్యంగా దక్షిణార్థ గోళ దేశాల గళం రూపేణా నిర్దేశించుకున్న లక్ష్యాలను శ్రీ లవ్‌ అగర్వాల్‌ విశదీకరించారు. ఇందులో టీకా చికిత్సలు, రోగ నిర్ధారణ, పరిశోధన, తయారీలకు సంబంధించి ప్రాంతీయ నెట్‌వర్కుల ఏర్పాటులో సహకారం, ప్రపంచ వైద్య నియంత్రణ చర్యల సమన్వయ వేదిక సృష్టి అంతర్భాగాలుగా ఉంటాయి. కాగా, భారత్‌ ఇప్పటికే కో-విన్‌, వ్యాక్సిన్‌ మైత్రి వంటి వాటిద్వారా ప్రపంచ అవసరాలను గణనీయంగా తీర్చడంలో తనవంతు పాత్ర పోషించిందని గుర్తుచేశారు. దూర-వైద్యం, కో-విన్ వేదిక, రక్తనిధుల సత్వర గుర్తింపు-సౌలభ్యం ద్వారా చివరి అంచెకు చేరడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతుందని ఆయన అన్నారు. పేదలకు ఆరోగ్య సేవలు సులభంగా లభించేలా ఈ సామూహిక కార్యక్రమాలు భరోసా ఇస్తాయని చెప్పారు. “ప్రతిపాదిత మూడు ప్రాథమ్యాలకు అనుగుణంగా భారతదేశం సూచనప్రాయ ఏకాభిప్రాయం సాధించింది. తదనుగుణంగా చురుకైన, సంకీర్ణ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ రూపకల్పనలో అంతర్జాతీయ ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తుంది” అని శ్రీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. అలాగే “భవిష్యత్తులో అనూహ్య ఆరోగ్య అత్యవసర పరిస్థితులను నిర్వహణ సంబంధిత అంతర్జాతీయ కార్యక్రమాలు సమీకృతం కావాల్సి ఉంది” అని ఆయన నొక్కిచెప్పారు.

   శ్రీ లవ్‌ అగర్వాల్‌ తన వివరణను కొనసాగిస్తూ- రేపటినుంచి ప్రారంభం కానున్న ఆరోగ్య కార్యాచరణ బృందం సమావేశంలో మొత్తం 180 మంది సభ్యులతోపాటు 10 ఆహ్వానిత దేశాలు, 22 అంర్జాతీయ సంస్థల నుంచి ప్రతినిధులు పాల్గొనబోతున్నారని తెలిపారు. ప్రధాన సమావేశంతోపాటు అనుబంధ కార్యక్రమం కింద ప్రపంచవ్యాప్త సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకోగల పరిశోధన-అభివృద్ధి-ఆవిష్కరణ చట్రాల రూపకల్పనపై దృష్టి కేంద్రీకరిస్తారని చెప్పారు. అంతేకాకుండా అంతర్జాతీయ టీకా సహకార సంబంధిత సహ-బ్రాండెడ్ కార్యక్రమంసహా జీనోమ్ వ్యాలీ సందర్శన, పరిశోధన-అభివృద్ధి, ఔషధ తయారీలో భారత నైపుణ్య ప్రదర్శన తదితరాలు భాగంగా ఉంటాయని వెల్లడించారు.

   ఈ విలేకరుల సమావేశంలో పీఐబీ-ఢిల్లీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మనీషా వర్మ, పీఐబీ-హైదరాబాద్‌ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీ బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.

 

*****


(Release ID: 1929723) Visitor Counter : 182