ప్రధాన మంత్రి కార్యాలయం

కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి


స్మారక నాణెం.. తపాలాబిళ్లను ఆవిష్కరించిన ప్రధానమంత్రి;

“కొత్త పార్లమెంటు 140 కోట్లమంది భారతీయుల ఆశలు.. ఆకాంక్షలకు ప్రతీక”;

“ఇది ప్రపంచానికి భారతదేశ సంకల్పాన్నిచాటే ప్రజాస్వామ్య దేవాలయం”;

“భారతదేశం ముందడుగు వేస్తే ప్రపంచం కూడా ముందుకెళ్తుంది”;

“పవిత్ర రాజదండం గౌరవపునరుద్ధరణ మనకు దక్కినఅదృష్టం... సభా కార్యకలాపాల నిర్వహణలో ఈ దండం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది”;

“మన ప్రజాస్వామ్యమే మనకు స్ఫూర్తి... మన రాజ్యాంగమే మన సంకల్పం”;

“అమృత కాలమంటే మన వారసత్వ పరిరక్షణసహాఅభివృద్ధికి కొత్త కోణాలు జోడించే సమయం”;

“నేటి భారతం బానిస మనస్తత్వాన్నివీడి- ఆనాటి ప్రాచీన కళా వైభవాన్ని స్వీకరిస్తోంది... ఈ కొత్త పార్లమెంటు భవనమే అందుకు సజీవ తార్కాణం”;

“ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ స్ఫూర్తి ఈ భవనంలో అణువణువునా కనిపిస్తుంది”;

“ఈ కొత్త భవనంలో నిర్మాణ కార్మికుల పాత్ర చిరస్థాయిగానిలవడం ఇదే తొలిసారి”;

“భవంతిలోనిప్రతి ఇటుక, ప్రతి గోడ, ప్రతి అణువూ పేదల సంక్షేమానికే అంకితం”;

“140 కోట్ల మంది పౌరుల సంకల్పమే కొత్త పార్లమెంటుకు పవిత్రతకు చిహ్నం”

Posted On: 28 MAY 2023 2:25PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ కొత్త పార్ల‌మెంటు భవనాన్ని జాతికి అంకితం చేశారు. దీనికిముందు ఈ భవనంలోని తూర్పు-పశ్చిమ ముఖద్వారం ఎగువన నందిముద్రతో కూడిన రాజదండం (సెంగోల్‌)ను ఆయన ప్రతిష్టించారు. తర్వాత జ్యోతి వెలిగించి, రాజదండానికి పుష్పాంజలి ఘటించి, స‌భ‌నుద్దేశించి ప్రసంగించారు. ప్ర‌తి దేశ చ‌రిత్ర‌లో చిర‌స్మరణీయ సంఘటన‌లు కొన్ని మాత్రమే ఉంటాయని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ మేరకు కాలభ్రమణంలో కొన్ని తేదీలు శాశ్వతంగా నిలిచిపోతాయని, 2023 మే 28 అటువంటి రోజులలో ఒకటని ఆయన వివరించారు. “భారత పౌరులు అమృత మహోత్సవం నేపథ్యంలో తమకుతాము ఈ రూపంలో ఒక బహుమతి ఇచ్చుకున్నారు” అని పేర్కొన్నారు. ఈ ఉజ్వల ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రధాని ప్రజలందరికీ అభినందనలు తెలిపారు.

ది కేవలం ఒక భవనం కాదని.. 140 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలు, ఆశలకు ప్రతిరూపమైన ప్రజాస్వామ్య సౌధమని ప్రధాని అన్నారు. “ఇది ప్రపంచానికి భారతదేశ సంకల్పాన్ని చాటే మన ప్రజాస్వామ్య దేవాలయం” అని ఆయన వ్యాఖ్యానించారు. “ప్రణాళికతో వాస్తవికతను; విధానాలతో కార్యాచరణను; మనోబలంతో కర్తవ్యాన్ని; సంకల్పంతో సాక్షాత్కారాన్ని ఈ కొత్త పార్లమెంటు భవనం అనుసంధానిస్తుంది” అని ఆయన అభివర్ణించారు. స్వాతంత్ర్య సమరయోధుల కలల సాకారానికి ఇదొక మాధ్యమం కాగలదన్నారు. అలాగే స్వయం సమృద్ధ భారతం ఆవిర్భావానికి, తద్వారా వికసిత భారత సాక్షాత్కారానికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త భవనం ప్రాచీన-ఆధునికతల సహజీవనానికి ఇదొక ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు.

“కొత్త పుంతలు తొక్కితేనే కొత్త నమూనాలను సృష్టించగలం” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆ మేరకు నవ భారతం తనవైన కొత్త బాటలు వేసుకుంటూ సరికొత్త లక్ష్యాలను సాధిస్తున్నదని నొక్కిచెప్పారు. “కొత్త శక్తి, కొత్త ఉత్సాహం, కొత్త ఉత్తేజం, కొత్త ఆలోచన, కొత్త ప్రయాణం ఇందులో భాగంగా ఉన్నాయి. కొత్త దార్శనికతలు, కొత్త దిశలు, కొత్త సంకల్పాలు, సరికొత్త విశ్వాసం నిండుగా కనిపిస్తున్నాయి” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. భారత దృఢ సంకల్పం, పౌరుల శక్తి, దేశంలోని జనశక్తి ప్రభావం వైపు ప్రపంచం ఎంతో గౌరవంతో, ఆశతో చూస్తోందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశం ముందడుగు వేస్తే ప్రపంచం కూడా ముందుకళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మన కొత్త పార్ల‌మెంట్ భవనం దేశాభివృద్ధి ద్వారా ప్ర‌పంచ ప్రగతికి ప్రేరణనిస్తుందని ప్ర‌ధాని నొక్కిచెప్పారు.

భవనంలో పవిత్ర రాజదండం ప్రతిష్టాపన గురించి ప్రస్తావిస్తూ- ఒకనాటి సముజ్వల చోళ సామ్రాజ్యంలో సేవా మార్గం, కర్తవ్య నిబద్ధతలకు ఈ దండం ఒక చిహ్నంగా పరిగణించబడిందని ప్రధాని పేర్కొన్నారు. రాజాజీ, ఆధీనం మఠం మార్గదర్శకత్వంలో ఈ రాజదండం అధికార మార్పిడికి పవిత్ర చిహ్నంగా మారిందని ఆయన అన్నారు. ఈ మేరకు ఉద‌యం ఆశీస్సులు అందించేందుకు కార్య‌క్ర‌మానికి హాజరైన ఆధీనం సాధువుల‌కు ప్ర‌ధానమంత్రి మ‌రోసారి ప్ర‌ణమిల్లారు. “ఈ పవిత్ర రాజదండం గౌరవ పునరుద్ధరణ మనకు దక్కిన అదృష్టం. సభా కార్యకలాపాలలో ఈ దండం మనకు సదా స్ఫూర్తినిస్తూంటుంది” అని ఆయన అన్నారు.

“భారత్‌ ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు... ప్రజాస్వామ్యానికి ఇది పుట్టినిల్లు” అని ప్రధానమంత్రి సగర్వంగా ప్రకటించారు. అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యానికి మన దేశం పునాదిరాయి వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం భారతదేశం అనుసరిస్తున్న వ్యవస్థ మాత్రమే కాదని, అదొక సంస్కృతి-సదాలోచన-సత్సంప్రదాయమని ఆయన నొక్కి చెప్పారు. వేదాలను ప్రస్తావిస్తూ- ప్రజాస్వామిక చట్టసభలు, సంఘాల అవి మనకు బోధిస్తాయని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. గణతంత్ర వ్యవస్థ ఎలాంటిదో మహాభారతం మనకు వివరిస్తుందని ఆయన వివరించారు. భారతదేశం వైశాలిలో ప్రజాస్వామ్యమే ఊపిరిగా జీవించిందని అన్నారు. “భగవాన్‌ బసవేశ్వరుని అనుభవ మంటపం మనందరికీ గర్వకారణం” అని శ్రీ మోదీ అన్నారు. తమిళనాడులో క్రీస్తుశకం 900నాటి శాసనాలను ఉటంకిస్తూ- నేటి కాలంలో కూడా ఇది అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొన్నారు.

“మన ప్రజాస్వామ్యమే మనకు స్ఫూర్తి; మన రాజ్యాంగమే మన సంకల్పం” శ్రీ మోదీ అన్నారు. ఈ సంకల్పానికి అతిగొప్ప ప్రతినిధి భారత పార్లమెంటు అని అభివర్ణించారు. ఈ సందర్భంగా ఒక శ్లోకాన్ని ఉటంకిస్తూ- ముందడుగు వేయడానికి విముఖత చూపేవారికి అదృష్టం ముఖం చాటేస్తుందని, మున్ముందుకు వెళ్లేవారి భవిష్యత్తుకు సదా బాటలు పరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇన్నేళ్ల బానిసత్వంవల్ల ఎంతో నష్టపోయిన తర్వాత భారతదేశం తిరిగి తన ప్రగతి పయనం ప్రారంభించి, అమృత కాలానికి చేరిందని ప్రధానమంత్రి అన్నారు. “అమృత కాలమంటే మన వారసత్వ పరిరక్షణసహా అభివృద్ధికి కొత్త కోణాలు జోడించే సమయం. ఇది దేశానికి కొత్త దిశను నిర్దేశించేది ఈ అమృత కాలమే. ఇది మన అనేకానేక ఆకాంక్షలను నెరవేర్చే అమృత కాలం” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరులూదాల్సిన ఆవశ్యకతను ఒక పద్యం ద్వారా వివరిస్తూ- ప్రజాస్వామ్య కార్యస్థానం... అంటే- పార్లమెంటు కూడా సరికొత్తదిగా, ఆధునికమైనదిగా ఉండాలి” అని ప్రధాని అన్నారు.

సుసంపన్న భారతదేశంలో వాస్తుశిల్ప స్వర్ణయుగాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. అయితే, శతాబ్దాల బానిసత్వం మన ఈ వైభవాన్ని దోచుకుపోయిందని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుత 21వ శతాబ్దపు భారతదేశంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నదని అన్నారు. “నేటి భారతం బానిస మనస్తత్వాన్ని వీడి, ఆనాటి ప్రాచీన కళా వైభవాన్ని తిరిగి సంతరించుకుంటున్నది. ఆ కృషికి ఈ కొత్త పార్లమెంటు భవనమే సజీవ తార్కాణం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ మేరకు కొత్త భవనంలో రాజ్యాంగ నిర్దేశాలతోపాటు వారసత్వం, వాస్తుశిల్పం, కళా ప్రతిభ, అద్భుత నైపుణ్యం, ఉజ్వల సంస్కృతి ఉట్టిపడుతున్నాయి” అని వివరించారు. అంతేకాకుండా ఈ భవనంలోని లోక్‌సభ లోపలి భాగాలు మన జాతీయ విహంగం నెమలి ఇతివృత్తంగానూ, రాజ్యసభ అంతర్భాగం జాతీయ పుష్పం కమలం రూపంలోనూ రూపొందించబడ్డాయని పేర్కొన్నారు. ఇక పార్లమెంటు ప్రాంగణం మన జాతీయ వృక్షం మర్రిచెట్టును పోలి ఉంటుందని వివరించారు. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల విశిష్టతలను ఈ కొత్త భవనం పుణికిపుచ్చుకున్నదని తెలిపారు. రాజస్థాన్‌ గ్రానైట్‌, మహారాష్ట్ర కలపతోపాటు భదోయి కళాకారులు తయారుచేసే తివాచీలు వంటి కొన్ని ప్రత్యేకతలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మొత్తంమీద “ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ స్ఫూర్తి ఈ భవనంలో అణువణువునా కనిపిస్తుంది” అని ఆయన చెప్పారు.

పాత భవనంలో తమ బాధ్యతల నిర్వహణలో పార్లమెంటు సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని ఎత్తిచూపారు. అలాగే సాంకేతిక సౌకర్యాల కొరత, సభలో సీట్ల కొరత వంటి సవాళ్లను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో కొత్త భవనం అవసరంపై దశాబ్దాలుగా సాగుతున్న చర్చను వెంటనే కార్యరూపంలోకి తేవాల్సిన ఆవశ్యకతను గుర్తించామని ప్రధాని తెలిపారు. తదనుగుణంగా కొత్త పార్లమెంటు భవనాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దడమేగాక సమావేశం మందిరాలను సూర్యరశ్మితో దేదీప్యమానం అయ్యేవిధం నిర్మించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ భవన నిర్మాణంలో శ్రమించిన కార్మికులతో తాను స్వయంగా ముచ్చటించడాన్ని గుర్తుచేసుకుంటూ- ఈ సౌధం నిర్మించే పనుల్లో 60,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించామని, ఈ మేరకు వారి పాత్రను స్ఫురింపజేస్తూ సభలో కొత్త గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ విధంగా “ఈ కొత్త భవనంలో నిర్మాణ కార్మికుల పాత్ర చిరస్థాయిగా నిలవడం ఇదే తొలిసారి” అని ఆయన వ్యాఖ్యానించారు.

దేశంలో గడచిన 9 సంవత్సరాల గురించి ప్రస్తావిస్తూ- ఈ కాలాన్ని ఏ నిపుణుడైనా పునర్నిర్మాణ, పేదల సంక్షేమ సంవత్సరాలుగా పరిగణిస్తారని ప్రధానమంత్రి అన్నారు. ఈ కొత్త భవనం గర్వకారణంగా నిలుస్తున్న నేపథ్యంలో పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించగలగడం ఎంతో సంతృప్తినిస్తోందని చెప్పారు. అలాగే 11 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామాల అనుసంధానానికి 4 లక్షల కిలోమీటర్లకుపైగా రహదారులు, 50 వేలకుపైగా అమృత సరోవరాలు, 30 వేలకుపైగా కొత్త పంచాయతీ భవనాలు వంటివి పూర్తిచేయడంపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. “పంచాయతీలకు సొంత భవనాల నుంచి పార్లమెంటుదాకా మాకు ప్రేరణనిచ్చిన ఒకే ఒక అంశం దేశం-పౌరుల అభివృద్ధే”నని ఆయన పునరుద్ఘాటించారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి తన ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ- ప్రతి దేశ చరిత్రలో ఆ దేశ చైతన్యం మేల్కొనే సమయం ఒకటి తప్పక వస్తుందని ప్రధాని అన్నారు. ఆ మేరకు దాస్య విముక్తికి 25 ఏళ్లముందు గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమం యావద్దేశంలో ఒక విశ్వాసాన్ని నింపిందని పేర్కొన్నారు. సరిగ్గా నేటి భారతంలో అలాంటి సమయం మన ముందున్నదని నొక్కిచెప్పారు. “ఆనాడు గాంధీజీ ప్రతి భారతీయుడినీ స్వరాజ్య సాధన సంకల్పంతో అనుసంధానించారు. ఆ మేరకు ప్రతి పౌరుడూ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమయమది. దాని ఫలితంగానే 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది” అని ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. నేటి స్వతంత్ర భారతంలో 25 ఏళ్ల స్వాతంత్ర్య అమృత కాలాన్ని ఆనాటి చారిత్రక శకంతో పోల్చవచ్చునని శ్రీ మోదీ అన్నారు. ఎందుకంటే- భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి అప్పటికి 100 ఏళ్లు పూర్తవుతాయని, కాబట్టే రాబోయే 25 ఏళ్ల సమయం ‘అమృత కాలం’ కాగలదని అని ఆయన పేర్కొన్నారు.

దేశంలోని ప్రతి పౌరుడి సహకారంతో ఈ 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దాల్సిన అవసరాన్ని ప్రధాని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. “భారతీయుల ఆత్మ విశ్వాసం దేశానికి మాత్రమే పరిమితం కాదనడానికి చరిత్రే సాక్షి. మన స్వాతంత్య్ర పోరాటం ఆ సమయంలో అనేక దేశాల్లోనూ ఓ కొత్త చైతన్యాన్ని రగిల్చింది” అని ప్రధాని పేర్కొన్నారు. “భారత్‌ వంటి వైవిధ్యభరిత, వివిధ సవాళ్లను ఎదుర్కొనే భారీ జనాభాగల దేశం ఒక దృఢ నమ్మకంతో ముందడుగు వేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలకు అది స్ఫూర్తినిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అదేతీరున రాబోయే రోజుల్లో భారతదేశం సాధించే ప్రతి విజయం ప్రపంచంలోని అనేక దేశాలు, వివిధ ప్రాంతాలకు ఒక విజయంగా మారుతుంది” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పురోగమనంపై భారత్‌ దృఢ సంకల్పం దేశానికి ఒక బాధ్యతగా రూపొంది, అనేక ఇతర దేశాలకూ బలాన్నిస్తుందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.

భారత్‌ సాధించబోయే విజయంపై జాతికిగల నమ్మకాన్ని కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నం మరింత ప‌టిష్టం చేస్తుంద‌ని, వికసిత భారతం సాధనవైపు ప్ర‌తి ఒక్క‌రికీ ప్రేరణనిస్తుందని ప్ర‌ధానమంత్రి అన్నారు. “దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో మనం ముందంజ వేయాలి. కర్తవ్య నిర్వహణకు అన్నిటికన్నా అగ్రప్రాధాన్యం ఇవ్వాలి. మనల్ని మనం నిరంతరం మెరుగుపరుచకుంటూ మన నడవడికతో అందరికీ ఆదర్శప్రాయులుగా ఉండాలి. ఆ మేరకు మన ప్రగతి పథాన్ని మనమే నిర్మించుకుంటూ ముందుకు సాగాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్యమైన మన దేశానికి ఈ కొత్త పార్ల‌మెంటు భవనం సరికొత్త శక్తిని, బలాన్ని ఇస్తుందని ప్ర‌ధానమంత్రి అన్నారు. శ్రమజీవులైన మన కార్మికులు ఈ సౌధాన్ని ఎంతో ఘనంగా రూపొందించారని, అదేవిధంగా అంకితభావంతో దీన్ని దివ్యమైనదిగా తీర్చిదిద్దే బాధ్యత పార్లమెంటు సభ్యులపై ఉందని ఉద్బోధించారు. ఆ మేరకు పార్లమెంటు ప్రాముఖ్యాన్ని నొక్కిచెబుతూ- దేశంలోని 140 కోట్ల మంది పౌరుల సంకల్పమే కొత్త సౌధం పవిత్రతకు చిహ్నమని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే శతాబ్దాలను ప్రభావితం చేస్తూ, భవిష్యత్తరాలను బలోపేతం చేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ మేరకు పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, వికలాంగులుసహా సమాజంలో ప్రతి అణగారిన కుటుంబంతోపాటు అణగారిన వర్గాలవారి ప్రగతికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. తదనుగుణంగా వారికి సాధికారత కల్పించే మార్గం ఈ పార్లమెంటు మీదుగానే వెళ్తుందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. “ఈ అధునాతన భవనంలోని ప్రతి ఇటుక, ప్రతి గోడ, ప్రతి అణువూ పేదల సంక్షేమానికే అంకితం” అని శ్రీ మోదీ అభివర్ణించారు. రానున్న 25 ఏళ్లలో ఈ కొత్త పార్లమెంటు భవనంలో రూపుదిద్దుకునే కొత్త చట్టాలు భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాయని, పేదరిక నిర్మూలనలో తోడ్పడటమేగాక యువతరంతోపాటు మహిళలకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు.

చివరగా- సరికొత్త, సుసంపన్న, దృఢమైన, అభివృద్ధి చెందిన భారతదేశ సృష్టికి ఈ కొత్త పార్లమెంటు భవనం పునాదిగా మారుతుందని ప్రధాని విశ్వాసం వెలిబుచ్చారు. ఆ మేరకు “భారతదేశం విధాన, న్యాయ, సత్య, సగౌరవ, కర్తవ్య పథంలో ముందుకు సాగుతూ మరింత పటిష్టంగా రూపొందుతుంది” అని ఆయన తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో

లోక్‌సభ స్పీకర్‌ శ్రీ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

*****

DS/TS



(Release ID: 1928113) Visitor Counter : 211