ప్రధాన మంత్రి కార్యాలయం

డెహ్రాడూన్‌-ఢిల్లీ మధ్య వందే భారత్‌ ఎక్స్’ప్రెస్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగం తెలుగు పాఠం

Posted On: 25 MAY 2023 1:57PM by PIB Hyderabad

అందరికీ నమస్కారం!

   త్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ సభ్యులు, ఇతర ప్రముఖులుసహా ఉత్తరాఖండ్‌లోని నా ప్రియతమ సోదర సోదరీమణులు…అందరికీ వందనాలు! రాష్ట్రం నుంచి వందే భారత్ ఎక్స్‌’ప్రెస్ రైలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.

   డెహ్రాడూన్-ఢిల్లీ మధ్య నడిచే ఈ రైలు దేశ రాజధాని ఢిల్లీని దేవభూమితో మరింత వేగంగా అనుసంధానిస్తుంది. ఈ వందే భారత్ రైలు వల్ల ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ రైలు వేగం దానికొక ప్రత్యేకతనిస్తుండగా, ఇందులోని సౌకర్యాలు కూడా ప్రయాణాన్ని ఉల్లాసకరంగా మార్చబోతున్నాయి.

మిత్రులారా!

   మూడు దేశాల పర్యటన ముగించుకుని, కొన్ని గంటల కిందటే నేను తిరిగొచ్చాను. ఇవాళ ప్రపంచం మొత్తం ఎన్నో అంచనాలతో భారతదేశం వైపు దృష్టి మళ్లించింది. భారతీయులు మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన విధానం, పేదరికంపై మనం పోరాటం తీరు మనపై యావత్‌ ప్రపంచం ఇంత నమ్మకం పెట్టుకోవడానికి కారణాలు. మనమంతా కలసికట్టుగా కరోనా విసిరిన సవాలును ఎదుర్కొని విజయం సాధించాం. అయితే, అనేక పెద్ద దేశాలు దానితో నేటికీ పోరాడుతూనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత భారీ టీకాల కార్యక్రమాన్ని మనం ప్రారంభించిన నేపథ్యంలో నేడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గురించి చర్చ సాగుతోంది. మన దేశాన్ని సందర్శించి, మరింత అవగాహన పెంచుకోవాలని ప్రపంచ ప్రజానీకం కోరుకుంటోంది.  ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాఖండ్ వంటి అందమైన రాష్ట్రాలకు ఇదో గొప్ప అవకాశం. దాన్ని సద్వియోగం చేసుకోవడంలో ఈ వందే భారత్ రైలు కూడా ఉత్తరాఖండ్‌కు సాయపడుతుంది.

మిత్రులారా!

   రాష్ట్రం దేవభూమి… నేను కేదారనాథుని దర్శనానికి వెళ్లినపుడు అసంకల్పితంగా లోలోపల నేనేదో అన్నట్లు నాకు అనిపించింది. బహుశా ఆ మాటలు కేదారనాథుని ఆశీస్సులకు కృతజ్ఞతల రూపంలోనివి కావచ్చు. ఇక ఈ దశాబ్దం ఉత్తరాఖండ్ రాష్ట్రానిదేనని నేను ఆనాడు చెప్పాను. తదనుగుణంగా శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ఈ రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతూ ప్రగతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరు అభినందనీయం. ఈ దేవభూమి గుర్తింపును కాపాడుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఎందుకంటే- ఈ దేవభూమి త్వరలోనే యావత్‌ ప్రపంచ ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రం కాగలదని నా ప్రగాఢ విశ్వాసం. ఈ సామర్థ్యానికి తగినట్లు ఉత్తరాఖండ్‌ను అభివృద్ధి చేయడం మన కర్తవ్యం.

   చార్‌ ధామ్‌ (నాలుగు పుణ్యక్షేత్రాల) యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా కొత్త రికార్డు సృష్టిస్తూనే ఉంది. ప్రస్తుతం కేదారనాథుని దర్శనం కోసం భక్తులు పోటెత్తడాన్ని మనం చూస్తున్నాం. ఇక హరిద్వార్‌లో కుంభ, అర్ధకుంభ మేళా వేడుకలకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది భక్తులు తరలివస్తారు. అలాగే ఏటా కన్వర్‌ యాత్ర సమయంలో లక్షలాది ప్రజలు ఉత్తరాఖండ్‌కు వస్తుంటారు. దేశంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇంత పెద్ద సంఖ్యలో తీర్థయాత్రకు వచ్చే భక్తులను ఆకర్షిస్తాయి. ఇంత భారీ సంఖ్యలో యాత్రికుల సందర్శన మనకొక వరమైతే, వారందరినీ సంతృప్తితో తిరిగి పంపించడం మన బృహత్తర బాధ్యత. ఈ కార్యభారాన్ని సునాయాసంగా నిర్వర్తించడంలో రెండు ఇంజన్ల ప్రభుత్వం రెట్టింపు శక్తి, ఇనుమడించిన వేగంతో పనిచేస్తోంది.

   రాష్ట్రంలో ప్రగతి నవరత్నాలపై బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇందులో మొదటిది- రూ.1300 కోట్లతో కేదార్‌నాథ్-బద్రీనాథ్ క్షేత్ర పునర్నిర్మాణం; రెండోది- రూ.2500 కోట్లతో గౌరీకుండ్-కేదార్‌నాథ్, గోవింద్‌ఘాట్-హేమకుండ్‌ సాహిబ్‌ మధ్య రోప్‌వేల నిర్మాణం; మూడోది- కుమావ్‌లోని ప్రాచీన ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దే మానస్‌ఖండ్ మందిర్ మాల కార్యక్రమం; నాలుగోది- రాష్ట్రవ్యాప్తంగా గృహ బస (హోమ్ స్టే) సౌకర్య కల్పనకు ప్రోత్సాహం; దీనికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటిదాకా 4000కుపైగా ఈ సౌకర్యాలు  నమోదయ్యాయని నాకు సమాచారం అందింది. ఐదోది- రాష్ట్రంలోని 16 పర్యావరణ-పర్యాటక ప్రదేశాల అభివృద్ధి; ఆరోది- ఉత్తరాఖండ్‌లో ఆరోగ్య సేవల విస్తరణ; ఇందులో భాగంగా ఉధమ్ సింగ్ నగర్‌లో ‘ఎయిమ్స్‌’ అనుబంధ కేంద్రం ఇప్పటికే నిర్మాణంలో ఉంది. డోది- దాదాపు రూ.2,000 కోట్లతో తెహ్రీ సరస్సు అభివృద్ధి పథకం; ఎనిమిదోది- రిషీకేశ్‌-హరిద్వార్‌ను సాహస క్రీడా పర్యాటక-యోగా రాజధానిగా రూపుదిద్దడం; తొమ్మిదోది: తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గం నిర్మించడం. కాగా, ఈ రైలుమార్గం పనులు త్వరలో ప్రారంభమవుతాయి.

   కొత్త సొబగులు దిద్దడం- అనే మాట మీరు వినే ఉంటారు. ఆ మేరకు ముఖ్యమంత్రి శ్రీ ధామి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నవరత్నాలను మౌలిక సదుపాయాల కల్పనతో గుదిగుచ్చి మనోహరమైన హారాన్ని తయారుచేస్తోంది. మొత్తంమీద రూ.12,000 కోట్ల వ్యయంతో చార్‌ ధామ్‌ మహా పథకం పనులన్నీ వేగంగా సాగుతున్నాయి. ఢిల్లీ-డెహ్రాడూన్‌ ఎక్స్‌’ప్రెస్ వే పనులు పూర్తయిన నేపథ్యంలో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం సులుభమవుతుంది. ఉత్తరాఖండ్‌లోని రహదారుల సంధానంతోపాటు రోప్‌ వేల ద్వారా అనుసంధానం కూడా భారీ స్థాయిలో చురుగ్గా సాగుతోంది. ఇక పర్వతమాల పథకం ఉత్తరాఖండ్‌ భవిష్యత్తును ఉజ్వలం చేయగలదు. ఈ అనుసంధానం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాఖండ్‌ ప్రజల ఆకాంక్ష త్వరలోనే నెరవేరుతుంది.

మిత్రులారా!

   రిషీకేశ్‌-కర్ణప్రయాగ్‌ రైలు మార్గం పథకం రెండుమూడేళ్లలో పూర్తవుతుంది. ఈ పనుల కోసం రూ.16 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. ఇది పూర్తికాగానే ఉత్తరాఖండ్‌లో అధికశాతం రాష్ట్ర ప్రజలకు, పర్యాటకులకు అందుబాటులోకి వస్తుంది. తద్వా ఇక్కడ పెట్టుబడులకు, పరిశ్రమల అభివృద్ధికి, ఉపాధికి కొత్త అవకాశాలు కలిసివస్తాయి. దేవభూమి అభివృద్ధికి సంబంధించిన ఈ భారీ కార్యక్రమాల నడుమ వందే భారత్ రైలు కూడా ఉత్తరాఖండ్ ప్రజలకు గొప్ప కానుక అవుతుంది. ఈ రాష్ట్రం నేడు శరవేగంతో పర్యాటక కూడలిగా రూపొందుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కృషితో సినిమాల చిత్రీకరణకు, పెళ్లిళ్లకు అనువైన వేదికగా ఉత్తరాఖండ్‌ మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పర్యాటక కూడళ్లు దేశవిదేశాల పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. వారందరికీ వందేభారత్‌ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేడు దేశంలోని ప్రతి మూల నుంచీ వందేభారత్‌ రైళ్లు ప్రారంభమయ్యాయి. కుటుంబసమేతంగా దూర ప్రయాణానికి ప్రజలు ముందుగా రైళ్లనే ఎంచుకుంటారు. అందువల్ల దేశంలోని సామాన్య కుటుంబాలకూ వందేభారత్‌ రైళ్లు త్వరలోనే మొదటి ఎంపిక కానున్నాయి.

సోదరసోదరీమణులారా!

   మౌలిక సదుపాయాల ఆధునికీకరణ ద్వారా ఈ 21వ శతాబ్దపు భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. ఇప్పటిదాకా సుదీర్ఘ కాలం అధికారం చలాయించిన పార్టీలు దేశ ప్రగతికి మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో అర్థం చేసుకోలేదు. ఆ పార్టీలు అవినీతి, కుంభకోణాలు, బంధుప్రీతికే పరిమితమయ్యాయి. ముఖ్యంగా బంధుప్రీతి నుంచి బయటపడే శక్తి వారికి లేదు. దేశంలో హైస్పీడ్ రైళ్ల గురించి కూడా గత ప్రభుత్వాలు లేనిపోని గొప్పలు చెబుతూ వచ్చాయి. కానీ, హై స్పీడ్ రైళ్ల మాట అటుంచితే ఏళ్లకు ఏళ్లు గడిచినా కనీసం రైళ్ల నెట్‌వర్క్లో మానవరహిత లెవెల్ క్రాసింగ్‌లను కూడా తొలగించలేకపోయాయి.

   ఇక రైల్వే విద్యుదీకరణ ఎంత ఘోరమో చెప్పనక్కర్లేదు. దేశంలో 2014 నాటికి రైళ్ల నెట్‌వర్కులో కేవలం మూడోవంతు మాత్రమే విద్యుదీకరణ పూర్తయింది. ఇలాంటి పరిస్థితుల నడుమ వేగవంతమైన రైళ్లను నడపడమన్నది ఊహల్లోనైనా అసాధ్యమే. ఈ దుస్థితిని తొలగించే దిశగా 2014 తర్వాత రైల్వేల సర్వతోముఖాభివృద్ధికి మేం కృషి చేయడం ప్రారంభించాం. ఒకవైపు దేశంలో తొలి హైస్పీడ్ రైలు కల సాకారానికి ముందడుగు వేస్తూ మరోవైపు సెమీ-హైస్పీడ్ రైళ్లు నడిపేందుకు దేశమంతాటా సదుపాయాల కల్పన చేపట్టాం. ఆ మేరకు రైలు మార్గాల విద్యుదీకరణను వేగిరపరచి ఏటా 6,000 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేస్తున్నాం. కాగా, 2014కు ముందు ఇది ఏటా సగటున 600 కిలోమీటర్లకు పరిమితంగా ఉండేది. సంవత్సరానికి 600 కి.మీ., 6000 కి.మీ.ల మధ్య ఎంత భారీ వ్యత్యాసం ఉందో దీన్నిబట్టి మీకే అర్థమవుతుంది. తదనుగుణంగా దేశంలోని రైల్వే నెట్‌వర్కులో 90 శాతానికి పైగా విద్యుదీకరణ పూర్తికాగా, ఉత్తరాఖండ్‌లో 100 శాతం పూర్తయింది.

సోదరసోదరీమణులారా!

   దేశ ప్రగతి, విధానాలు, ప్రజా విశ్వాసంపై మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇదంతా సాధ్యమైంది. రైల్వేలకు బడ్జెట్‌లో కేటాయింపులు మునుపటితో పోలిస్తే భారీగా పెరగడం కూడా ఉత్తరాఖండ్‌కు లాభించింది. అంటే- 2014కు ముందు ఐదేళ్లలో ఉత్తరాఖండ్‌కు సగటున రూ.200 కోట్ల లోపే కేటాయించినట్లు మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ గారు ఇప్పుడే చెప్పారు. ఇంత మారుమూల కొండ ప్రాంతానికి రైల్వే సదుపాయం కోసం కేటాయింపులు కేవలం రూ.200 కోట్ల రూపాయల లోపే! ఈ నేపథ్యంలో తాజా కేంద్ర బడ్జెట్‌లో ఉత్తరాఖండ్లో రైల్వే సదుపాయాలకు రూ.5,000 కోట్లు అంటే- 25 రెట్లు అధికంగా కేటాయించబడ్డాయ. దీంతో రాష్ట్రంలో రైలు మార్గాలు నేడు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో రైల్వేలే కాదు... ఆధునిక రహదారులు కూడా అద్భుతంగా విస్తరిస్తున్నాయి. ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంతాలకు ఈ అనుసంధానం ఎంత ముఖ్యమో ఇవాళ మనకు తెలిసివస్తోంది. గతంలో అనుసంధాన కరవై గ్రామాలు నిర్మానుష్యంగా మారడం వెనుక ఎంత బాధాకరమైన పరిస్థితులున్నాయో అర్థమైంది. అందువల్ల రాబోయే తరాన్ని ఆ బాధ నుంచి కాపాడాలని ఆకాంక్షిద్దాం. పర్యాటకం, వ్యవసాయం, పరిశ్రమల ద్వారా ఉత్తరాఖండ్‌లోనే ఉపాధి అవకాశాల సృష్టికి మేము శ్రమిస్తున్నాం. ఈ ఆధునిక అనుసంధానం మన సరిహద్దులకు సులభంగా చేరడానికి, దేశ రక్షణలో నిమగ్నమైన మన సైనికుల సౌలభ్యం కోసం కూడా అత్యంత ప్రయోజనకరం.

సోదరసోదరీమణులారా!

   త్తరాఖండ్‌ ప్రగతికి మా రెండు ఇంజన్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. రాష్ట్రంలో ప్రగతి వేగం భారతదేశం శరవేగంగా పురోగమించడానికీ తోడ్పడుతుంది. పుంజుకుంటున్న ఈ అభివృద్ధి వేగాన్ని దేశం వదులుకోదు... ఇకపై వందేభారత్ వేగంతో దూసుకెళ్తూ ముందడుగు వేస్తుంది. రాష్ట్రానికి తొలి వందే భారత్‌ రైలు సౌకర్యం లభించడంపై మరోసారి ఉత్తరాఖండ్ ప్రజలందరికీ అనేక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇప్పుడు దేశం నలుమూలల నుంచి యాత్రికుల కేదారనాథుణ్ని, బద్రీ విశాలాక్షిని, యమునోత్రి-గంగోత్రిలను సందర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ ప్రారంభమైన వందే భారత్ ఎక్స్‌’ప్రెస్ వారందరికీ ఎంతో ఆనందానుభూతినిస్తుంది. ఈ సందర్భంగా నేను మరోసారి కేదారనాథుని పాదాలకు, ఈ దేవభూమికి నమస్కరిస్తూ మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు!

 

బాధ్యత నిరాకరణ ప్రకటన: ప్రధానమంత్రి ప్రసంగం హిందీ భాషలో సాగింది... ఇది దానికి స్వేచ్ఛానువాదం మాత్రమే.

 

*****



(Release ID: 1927409) Visitor Counter : 163