ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నేషనల్ టెక్నాలజీ దినోత్సవం సందర్భంగా మే 11వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి


రూ.5800 కోట్లకు పైబడిన విలువ గల పలు శాస్ర్తీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

విశాఖపట్టణంలో హోమీ భాభా కేన్సర్ ఆస్పత్రి, పరిశోధనా కేంద్రం భవనం, నవీ ముంబైలో మహిళలు, బాలల కేన్సర్ ఆస్పత్రి భవనం జాతికి అంకితం

నవీ ముంబైలో నేషనల్ హాడ్రాన్ బీమ్ థెరపీ కేంద్రం, రేడియాలజీ పరిశోధనా కేంద్రం జాతికి అంకితం
ముంబైలోని ఫిజన్ మొలిబ్దెనమ్-99 ఉత్పత్తి కేంద్రం, విశాఖపట్టణంలోని రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ ప్లాంట్ జాతికి అంకితం

జట్నిలో హోమీ భాభా కేన్సర్ ఆస్పత్రి, పరిశోధనా కేంద్రం; ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రిలో ప్లాటినం జూబ్లీ బ్లాక్ లకు శంకుస్థాపన

లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్-వేవ్ అబ్జర్వేటరీ ఇండియా (లిగో-ఇండియా) కేంద్రానికి శంకుస్థాపన
25వ నేషనల్ టెక్నాలజీ డే అ సందర్భంగా స్మారక తపాలా స్టాంప్ విడుదల

‘‘భారతదేశం విజయవంతంగా అణుపరీక్ష నిర్వహించిందని అటల్ జీ ప్రకటించిన రోజును నేను ఎన్నడూ మరిచిపోలేను’’

‘‘అటల్ జీ మాటల్లోనే చెప్పాలంటే మనం ఎన్నడూ ప్రయాణం ఆపలేదు, మన బాటలోకి వచ్చిన ఏ సవాలుకు లొంగలేదు’’

‘‘మనం జాతిని వికస

Posted On: 11 MAY 2023 12:57PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలోని ప్రగత మైదాన్   లో నేషనల్  టెక్నాలజీ దినోత్సవం 2023ను పురస్కరించుకుని నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 11 నుంచి 14వ తేదీల మధ్య జరిగే నేషనల్  టెక్నాలజీ దినోత్సవం రజతోత్సవ  సంవత్సరాన్ని పురస్కరించుకుని  కార్యక్రమం నిర్వహించారు. ఈ అద్భుత సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి దేశ శాస్ర్త, సాంకేతిక పురోగమనానికి దోహదపడే రూ.5800  కోట్లకు పైబడిన విలువ గల పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేశారు. దేశంలోని శాస్ర్తీయ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా ఆత్మనిర్భర్  భారత్  సాధించాలన్న ప్రధానమంత్రి విజన్  కు అనుగుణంగా ఈ కార్యక్రమం జరిగింది.

శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టుల్లో హింగోలిలోని లేజర్  ఇంటర్  ఫెరోమీటర్  గ్రావిటేషనల్  వేవ్  అబ్జర్వేటరీ-ఇండియా (లిగో-ఇండియా);  ఒడిశాలోని జట్నిలో హోమీ భాభా కేన్సర్  ఆస్పత్రి, పరిశోధన కేంద్రం;  ముంబైలోని టాటా మెమోరియల్  ఆస్పత్రిలో ప్లాటినం జూబ్లీ  బ్లాక్  ఉన్నాయి.

జాతికి అంకితం చేస్తున్న ప్రాజెక్టుల్లో ముంబైలో ఫిజన్  మోలిబ్దెనమ్-99 ఉత్పత్తి యూనిట్;  విశాఖపట్టణంలో రేర్  ఎర్త్  పర్మనెంట్  మాగ్నెట్  ప్లాంట్; నవీ ముంబైలో నేషనల్  హాడ్రాన్  బీమ్  థెరపీ కేంద్రం;  నవీ ముంబైలో రేడియోలాజికల్  రీసెర్చ్  యూనిట్;  విశాఖపట్టణంలో హోమి భాభా కేన్సర్  ఆస్పత్రి, పరిశోధన కేంద్రం;  నవీ ముంబైలో మహిళలు, బాలల కేన్సర్  ఆస్పత్రి భవనం ఉన్నాయి.

ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి భారతదేశంలో ఇటీవల శాస్ర్తసాంకేతిక రంగాల్లో సాధించిన పురోగతిని తెలియచేసే ప్రదర్శనను కూడా ప్రారంభించడంతో పాటో కొంత సేపు  అంతా తిరిగి దాన్ని తిలకించారు. స్మారక తపాలా స్టాంప్  ను కూడా ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా సభనుద్దేశించి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో మే 11వ తేదీ ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదని ఛెప్పారు. భారత శాస్ర్తవేత్తలు పోఖ్రాన్  లో అణుపరీక్షలు విజవంతంగా నిర్వహించి జాతి మొత్తం గర్వపడేలా చేసిన రోజు ఇదని అన్నారు. ‘‘భారతదేశం అణుపరీక్ష విజయవంతంగా నిర్వహించింది అని అటల్   జీ ప్రకటించిన ఈ రోజును నేను ఎన్నటికీ మరువలేను’’ అన్నారు. పోఖ్రాన్  అణు పరీక్షలు  భారతదేశ సైంటిఫిక్   సామర్థ్యాలను నిరూపించడమే కాదు...ప్రపంచంలో భారతదేశం స్థాయిని కూడా పెంచాయని ఆయన అన్నారు. ‘‘అటల్  జీ మాటల్లోనే చెప్పాలంటే మనం ఎన్నడూ ప్రయాణం ఆపలేదు, మన ముందుకు వచ్చిన ఏ సవాలుకు తల వంచలేదు’’ అని ప్రధానమంత్రి అన్నారు. నేషనల్  టెక్నాలజీ దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్క పౌరునికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియచేశారు.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నేడు ప్రారంభించిన ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ ముంబైలో నేషనల్  హాడ్రాన్  బీమ్  థెరపీ కేంద్రం, రేడియాలాజికల్  పరిశోధనా యూనిట్;  విశాఖపట్టణంలో ఫిజన్  మోలిబ్దెనమ్-99 ప్రొడక్షన్  కేంద్రం, రేర్  ఎర్త్  పర్మనెంట్  మాగ్నెట్  ప్లాంట్  లేదా వివిధ కేన్సర్  పరిశోధనా ఆస్పత్రులు అణు టెక్నాలజీ సహాయంతో భారతదేశ పురోగతిని మరింత సుస్థిరం చేస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.  లిగో-ఇండియా గురించి ప్రస్తావిస్తూ 21వ శతాబ్దికి చెందిన అగ్రగామి సైన్స్  అండ్  టెక్నాలజీ కార్యక్రమాల్లో ఇదొకటి అని ప్రధానమంత్రి అన్నారు. ఈ అబ్జర్వేటరీ విద్యార్థులు, శాస్ర్తవేత్తల పరిశోధనకు కొత్త అవకాశాలు తెరుస్తుందని ఆయన చెప్పారు.

అమృత కాలపు ప్రారంభ కాలంలో 2047 నాటికి మనం సాధించాల్సిన లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ‘‘మనం జాతిని వికసితం, ఆత్మనిర్భరం చేయాలి’’ అని ఆయన నొక్కి చెబుతూ వృద్ధి, ఇన్నోవేషన్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం సమ్మిళిత వాతావరణం సృష్టించాలన్నారు. ప్రతీ ఒక్క అడుగులోనూ టెక్నాలజీ ప్రాధాన్యతను నొక్కి చెబుతూ భారతదేశం ఈ దిశగా సంయక్   దృక్ప‌థంతో, 360 డిగ్రీల వైఖరితో ముందుకు సాగుతున్నదని ఆయన నొక్కి చెప్పారు. ‘‘భారతదేశం టెక్నాలజీని ఆధిపత్యానికి కాకుండా జాతి పురోగతికి ఒక సాధనంగా భావిస్తోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు.

‘‘పాఠశాల నుంచి స్టార్టప్  లకు-నవ్య ఆవిష్కరణల దిశగా యువ మనసుల ఉత్తేజం’’ అనే నేటి కార్యక్రమం థీమ్  గురించి మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్  గతిని యువకులు, బాలలే నిర్ణయిస్తారని ప్రధానమంత్రి అన్నారు. బాలలు, యువత అభిరుచి, శక్తి, సామర్థ్యాలు నేడు భారతదేశానికి పెద్ద బలం అని చెప్పారు.  డాక్టర్  ఎ.పి.జె.అబ్దుల్  కలాం  మాటలను ఉటంకిస్తూ భారతదేశం మేథో సమాజంగా మారుతున్న వాతావరణంలో జ్ఞాన ప్రాధాన్యతతోనే జ్ఞానాన్ని గుర్తించాలని, నేడు భారతదేశం అదే స్ఫూర్తితో కృషి చేస్తున్నదని ప్రధానమంత్రి నొక్కి వక్కాణించారు.  అందుకే యువ మనస్సులను ఉత్తేజితం చేయడానికి గత 9 సంవత్సరాల కాలంలో బలమైన పునాది వేసినట్టు ఆయన వివరించారు.

దేశంలోని 700 జిల్లాల్లో పని చేస్తున్న 10 వేలకు పైగా అటల్  టింకరింగ్  లాబ్  లు ఇన్నోవేషన్  కు నర్సరీలుగా మారాయని ప్రధానమంత్రి చెప్పారు. వీటిలో 60 శాతం  ప్రభుత్వ, గ్రామీణ పాఠశాలల్లోనే ఉండడం గుర్తించదగిన అంశమని ఆయన అన్నారు. అటల్   టింకరింగ్  లాబ్  లలో నేడు 75 లక్షల మంది విద్యార్థులు 12 లక్షల ఇన్నోవేషన్  ప్రాజెక్టులపై శ్రమించి పని చేస్తున్నారని ఆయన చెప్పారు.  యువ శాస్ర్తవేత్తలు నేరుగా పాఠశాలల నుంచే బయటకు వచ్చి దేశంలోని భిన్న ప్రాంతాలకు విస్తరిస్తున్నారనేందుకు ఇది ఒక ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు. ప్రతిభను మరింత పెంచుకోవడానికి వీలుగా  వారిని చేయి పట్టుకుని నడిపించడం, వారు తమ ఆలోచనలు ఆచరణలోకి తేవడానికి అవసరమైన సహాయం అందించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని చెప్పారు. అటల్  ఇన్నోవేషన్  కేంద్రాల్లో (ఎఐసి) వందలాది స్టార్టప్  లను ఇంక్యుబేట్  చేస్తున్నారని, అవి ‘‘నవ భారత్’’ కు కొత్త ప్రయోగశాలలుగా మారాయని ప్రధానమంత్రి అన్నారు. ‘‘భారతదేశానికి చెందిన టింకర్-ప్రెన్యూర్లు ప్రపంచంలోని అగ్రగామి ఎంటర్  ప్రెన్యూర్లుగా నిలుస్తారు’’ అని ప్రధానమంత్రి చెప్పారు.

కష్టించి పని చేయడం ప్రాధాన్యత గురించి మహర్షి పతంజలి మాటలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ 2014 తర్వాత తీసుకున్న చర్యలు సైన్స్, టెక్నాలజీ రంగంలో పెద్ద మార్పునకు దారి తీశాయని ప్రధానమంత్రి అన్నారు. నేడు సైన్స్  పుస్తకాల నుంచి వెలుపలికి వచ్చిందని, పరిశోధనల ద్వారా పేటెంట్లుగా మారుతున్నదని నొక్కి చెబుతూ ‘‘స్టార్టప్  ఇండియా కార్యక్రమం, డిజిటల్  ఇండియా, జాతీయ విద్యా విధానం వంటివి శాస్ర్త  రంగంలో భారతదేశం కొత్త శిఖరాలు అధిరోహించేందుకు సహాయపడతాయి’’ శ్రీ మోదీ చెప్పారు. ‘‘దేశంలో పేటెంట్ల సంఖ్య 10 సంవత్సరాల క్రితం ఏడాదికి 4000 స్థాయి నుంచి నేడు 30,000 దాటిపోయాయి. ఇదే కాలంలో డిజైన్ల నమోదు 10,000 నుంచి 15,000కి పెరిగింది. ట్రేడ్  మార్కుల సంఖ్య 70,000 నుంచి 2,50,000 లక్షలు దాటిపోయింది’’ అని ప్రధానమంత్రి తెలిపారు.

‘‘నేడు భారతదేశం టెక్నాలజీ లీడర్  కావడానికి అవసరమైన అన్ని దిశల్లోనూ ముందుకు సాగుతోంది’’ అని శ్రీ మోదీ చెప్పారు. దేశంలో టెక్నాలజీ ఇంక్యుబేషన్  కేంద్రాల సంఖ్య 2014లో 150 నుంచి నేడు 650 దాటినట్టు ఆయన తెలిపారు. యువత సొంతంగా ప్రారంభిస్తున్న డిజిటల్  వెంచర్లు, స్టార్టప్  ల మద్దతుతో నేడు గ్లోబల్  ఇన్నోవేషన్ ఇండెక్స్  ర్యాంకింగ్స్  లో 81వ స్థానం నుంచి 40వ స్థానానికి చేరిందని ప్రధానమంత్రి చెప్పారు. 2014 నాటికి దేశంలో సుమారుగా 100 స్టార్టప్  లుండగా నేడు వాటి సంఖ్య లక్ష దాటిందని, ప్రపంచంలోనే స్టార్టప్   లలో మూడో పెద్ద వ్యవస్థగా భారత్  ను నిలిపాయని ఆయన అన్నారు. భారతదేశ సమర్థతలు, ప్రతిభ కారణంగానే  ప్రపంచం యావత్తు ఆర్థిక అస్థిరత ఎదుర్కొన్న వాతావరణంలో కూడా నేడు భారతదేశంలో వృద్ధి  చోటు చేసుకుంటున్నదని ప్రధానమంత్రి చెప్పారు. విధానకర్తలు, శాస్ర్తవేత్తలు, దేశం అంతటా విస్తరించి ఉన్న పరిశోధనా ల్యాబ్  లు, ప్రైవేటు రంగానికి అత్యంత అమూల్యమైన క్షణం ఇది అన్నారు. పాఠశాల నుంచి స్టార్టప్  లకు ప్రయాణాన్ని స్వయంగా విద్యార్థులే ముందుకు నడిపినా అన్ని సందర్బాల్లోనూ వారిని ప్రోత్సహించి మార్గదర్శకం చేయడం ఆ కార్యక్రమంలో భాగస్వాములయ్యే వారందరి విధి అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దానికి ప్రధానమంత్రి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సామాజిక కోణంలో మనం టెక్నాలజీని ముందుకు నడిపినట్టయితే అది సాధికారతకు పెద్ద ఉపకరణంగా మారుతుందని ప్రధానమంత్ర అన్నారు. సమాజంలో అసమానతలు తొలగించి, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించే పనిముట్టుగా మారుతుందని చెప్పారు. టెక్నాలజీ సగటు మానవునికి అందని ఫలంగా ఉన్న కాలం గురించి గుర్తు చేస్తూ డెబిట్  కార్డులు, క్రెడిట్  కార్డులు ఒకప్పుడు హోదా చిహ్నలుగా ఉండేవన్నారు. కాని నేడు యుపిఐ సరళత కారణంగా కొత్త వినియోగ సాధనంగా మారిందని చెప్పారు. నేడు భారతదేశం అత్యధిక డేటా వినియోగ దేశంగా మారిందన్నారు. గ్రామీణ ఇంటర్నెట్   వినియోగదారుల సంఖ్య కూడా పట్టణ వినియోగదారుల సంఖ్యను దాటిపోయిందని తెలిపారు. జామ్  ట్రినిటీ, జెమ్   పోర్టల్, కోవిన్ పోర్టల్, ఇ-నామ్ వంటివన్ని సమ్మిళితత్వానికి టెక్నాలజీని ఒక సాధనంగా మార్చాయని చెప్పారు.

టెక్నాలజీని సరైన దిశలో వినియోగించినట్టయితే అది సమాజానికి బలం అందిస్తుందని, నేడు ప్రభుత్వం జీవితంలో ప్రతీ ఒక్క దశలోనూ సేవలందించడానికి టెక్నాలజీని ఒక సాధనంగా చేసుకుంటున్నదని ప్రధానమంత్రి చెప్పారు.  ఆన్  లైన్  లో జనన సర్టిఫికెట్ల జాచీ, ఇ-పాఠశాల, ఇ-లెర్నింగ్  వేదిక దీక్ష, ఉద్యోగ కాలంలో యూనివర్సల్  యాక్సెస్  నంబర్, వైద్య చికిత్సలకు ఇ-సంజీవిని, వృద్ధులకు జీవన్  ప్రమాణ్  సర్టిఫికెట్లు వంటివి ప్రతీ ఒక్క దశలోనూ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి.  సరళంగా పాస్   పోర్టుల జారీ, డిజియాత్ర, డిజిలాకర్  సదుపాయాలు కూడా సామాజిక న్యాయానికి, జీవన సరళతను పెంచడానికి చక్కని ఉదాహరణలని ఆయన అన్నారు.

టెక్  ప్రపంచంలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పుల గురించి ప్రస్తావిస్తూ ఈ వేగాన్ని అందుకోవడానికి, అధిగమించడానికి యువత సహాయపడగలదన్న విశ్వాసం ఆయన ప్రకటించారు. ఎఐ ఉపకరణాలు టెక్నాలజీ దిశను మార్చి వేగవంతమైన మార్పులకు మార్గంగా నిలిచాయని, ఆరోగ్య రంగంలో అపరిమిత అవకాశాలకు ద్వారాలు తెరిచాయని అన్నారు.  డ్రోన్  టెక్నాలజీలు, థెరప్యూటిక్స్  రంగాల్లో నవకల్పనలు వస్తున్నాయంటూ ఇలాంటి విప్లవాత్మక టెక్నాలజీల్లో భారతదేశం నాయకత్వ స్థానం చేపట్టాలని ఆయన సూచించారు. రక్షణ రంగంలో స్వయం-సమృద్ధి సాధించాలన్న భారతదేశ లక్ష్యం గురించి మాట్లాడుతూ ఆ రంగంలోని ఐడెక్స్  (ఇన్నోవేషన్  ఫర్ డిఫెన్స్  ఎక్సలెన్స్) గురించి ప్రస్తావిస్తూ ఐడెక్స్  ద్వారా రక్షణ రంగం రూ.350 కోట్ల విలువకు పైబడిన 14 ఇన్నోవేషన్ల కొనుగోలు చేసిందని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే ఐ-క్రియేట్, డిఆర్  డిఓ యువ శాస్ర్తవేత్తల లాబ్  లు వంటి ప్రయత్నాలన్నీ కొత్త దిశను కల్పించాయన్నారు. అంతరిక్ష రంగంలో కొత్త సంస్కరణల గురించి కూడా ప్రస్తావిస్తూ అవి దేశాన్ని ప్రపంచ స్థాయిలో మార్పునకు సూచిలుగా నిలుస్తున్నట్టు చెప్పారు. ఎస్ఎస్ఎల్  వి, పిఎస్ఎల్  వి ఆర్బిటల్   వేదికలు వంటి టెక్నాలజీల గురించి నొక్కి చెప్పారు. అంతరిక్ష రంగంలో యువతకు, స్టార్టప్  లకు కొత్త అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదని శ్రీ మోదీ అన్నారు. కోడింగ్, గేమింగ్, ప్రోగ్రామింగ్ విభాగాల్లో కూడా మనం నాయకత్వ స్థానం సాధించవలసి ఉన్నదని చెప్పారు. భారతదేశం సెమీ కండక్టర్ల వంటి రంగాల్లో తన అస్తిత్వాన్ని పెంచుకుంటున్న సమయంలో విధానపరమైన స్థాయిలో తీసుకున్న పిఎల్ఐ వంటి విధానపరమైన చొరవల గురించి కూడా ఆయన వివరించారు.

ఇన్నోవేషన్, సెక్యూరిటీ విభాగాల్లో హ్యాకథాన్ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. దేశంలో హ్యాకథాన్   సంస్కృతిని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, వాటి ద్వారా విద్యార్థులు కొత్త సవాళ్లను స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారు.  ఈ విషయంలో వారిని చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అటల్  టింకరింగ్  లాబ్స్  నుంచి వెలుపలికి వస్తున్న యువకుల అవసరాలు తీర్చేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. ‘‘సారథ్యాన్ని యువతకు అప్పగించదగిన విభిన్న రంగాల్లోని 100 లాబ్  లను మనం గుర్తించగలమా?’’ అని ప్రధానమంత్రి ప్రశ్నించారు. స్వచ్ఛ ఇంధనం,  ప్రకృతి వ్యవసాయం వంటి విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ అవకాశాలన్నింటినీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడంతో జాతీయ టెక్నాలజీ వారోత్సవం కీలక పాత్ర పోషించగలదన్న విశ్వాసం ప్రకటిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

కేంద్ర రక్షణ శాఖ మంతి శ్రీ రాజ్  నాథ్  సింగ్;  సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయమంత్రి శ్రీ జితేంద్ర సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూర్వాప‌రాలు

మహారాష్ర్టలోని హింగోలిలో ఏర్పాటు చేస్తున్న లిగో-ఇండియా ప్రపంచంలోని అతి కొద్ది లేజర్  ఇంటర్   ఫెరో మీటర్  గ్రావిటేషనల్  వేవ్ అబ్జర్వేటరీలలో ఒకటి. ఖగోళంలో ఏర్పడే రంధ్రాలు, న్యూట్రాన్  స్టార్స్  కలిసే సమయంలో ఏర్పడే గ్రావిటేషనల్  తరంగాలను గుర్తించగల 4 కిలోమీటర్ల నిడివి గల  అత్యంత సునిశితమైన ఇంటర్  ఫెరోమీటర్ ఇది. అమెరికాలో వాషింగ్టన్  లోని హాన్  ఫోర్డ్,  లూసియానాలోని లివింగ్  సన్  లోని రెండు అబ్జర్వేటరీలతో కలిసి లిగో-ఇండియా పని చేస్తుంది.

రేర్  ఎర్త్  పర్మనెంట్  మాగ్నట్లు సాధారణంగా వర్థమాన దేశాల్లో ఏర్పడతాయి. విశాఖపట్టణంలోని భాభా అణు పరిశోధన కేంద్రం క్యాంపస్   లో రేర్ ఎర్త్  పర్మనెంట్  మాగ్నెట్  ఉత్పత్తి కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. పూర్తిగా దేశీయ టెక్నాలజీతో, దేశంలోనే ఉత్పత్తి అయిన వనరుల నుంచి వెలికి తీసిన దేశీయ రేర్  ఎర్త్  ఖనిజాలతో దీన్ని ఏర్పాటు చేశారు. దీని ఏర్పాటుతో రేర్  ఎర్త్  పర్మనెంట్  మాగ్నెట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ఎంపిక చేసిన ప్రపంచ దేశాల సరసన భారతదేశం చేరుతుంది.

ముంబైలోని టాటా మెమోరియల్  సెంటర్  లో ఏర్పాటు చేస్తున్  జాతీయ హాడ్రాన్  బీమ్  థెరపీ కేంద్రం చుట్టుపక్కల కణాలపై అతి తక్కువ ప్రభావం చూపే విధంగా ట్యూమర్లకు రేడియేషన్  ఇస్తుంది. ప్రభావిత టిష్యూకి రేడియేషన్   థెరపీ ఇచ్చే సమయంలో ముందస్తుగా లేదా ఆలస్యంగా వచ్చే సైడ్  ఎఫెక్స్ట్  ని అది తగ్గిస్తుంది.

భాభా ఆటమిక్   కేంద్రం ట్రాంబే క్యాంపస్  లో ఫిజన్  మొలిబ్దెనమ్-99 ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఈ మొలిబ్దెనమ్-99 కేన్సర్, గుండె జబ్బులను ముందస్తుగా గుర్తించడానికి ఉపయోగించే 85% ఇమేజింగ్  విధానాల్లో ఉపయోగించే టెక్నీషియం-99ఎం మాతృ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏడాదికి 9 నుంచి 10 లక్షల స్కాన్లు చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ కేంద్రానికి శంకుస్థాపన చేయడంతో పాటు పలు కేన్సర్   ఆస్పత్రులను జాతికి అంకితం చేయడం వల్ల దేశంలోని భిన్న ప్రాంతాల్లో ప్రపంచ నాణ్యత గల కేన్సర్  చికిత్స వసతులు అందుబాటులోకి వస్తాయి.

అటల్ ఇన్నోవేషన్  మిషన్, ఇతర భాగాలు

నేషనల్  టెక్నాలజీ దినోత్సవం 2023లో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు, వేడుకల్లో అటల్  ఇన్నోవేషన్   కేంద్రాలపై (ఎఐఎం) ప్రత్యేక ఫోకస్  పెట్టారు. ఈ ఏడాది నేషనల్   టెక్నాలజీ దినోత్సవం థీమ్  లో భాగంగా ఏర్పాటు చేసిన ఎఐఎం పెవిలియన్  దేశంలో అభివృద్ధి చేసిన పలు ఇన్నోవేటివ్  ప్రాజెక్టులను ప్రదర్శిస్తుంది. టింకరింగ్  సెషన్లు, టింకరింగ్  కార్యక్రమాలను;  స్టార్టప్   లు  ఉత్పత్తి చేసే అత్యాధునిక ఇన్నోవేషన్లు, ఉత్పత్తులను ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలు కలుగుతుంది. వాటిలో ఎఆర్/  విఆర్, డిఫెన్స్  టెక్నాలజీ, డిజియాత్ర, టెక్స్  టైల్, లైఫ్ సైన్సెస్  ఉత్పత్తులున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలో ఇటీవల కాలంలో శాస్ర్త, సాంకేతిక పురోగతిని ప్రదర్శించే ఒక ఎక్స్  పోను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఆయన ఒక స్మారక తపాలా బిళ్ల, ఒక నాణెం కూడా విడుదల చేశారు.

భారతీయ శాస్ర్తవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు భారత శాస్ర్త సాంకేతిక రంగాల పురోగతి కోసం చేసిన కృషికి, 1998 మేలో పోఖ్రాన్  అణు పరీక్షల విజయానికి గుర్తింపుగా నేషనల్  టెక్నాలజీ దినోత్సవాన్ని మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్  బిహారీ వాజ్  పేయి  1999లో ప్రారంభించారు. అప్పటి నుంచి మే 11వ తేదీన నేషనల్  టెక్నాలజీ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ప్రతీ ఏడాది ఒక కొత్త థీమ్  తో ఈ దినోత్సవం నిర్వహిస్తారు. అందుకు అనుగుణంగానే ‘‘పాఠశాల నుంచి స్టార్టప్  లకు- ఇన్నోవేషన్  లకు అనుకూలంగా యువ మనసుల ఉత్తేజం’’  థీమ్  తో దీన్ని నిర్వహించారు. 


(Release ID: 1923948) Visitor Counter : 162