రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

కుప్పకూలిన మిగ్‌-21 యుద్ధ విమానం

Posted On: 08 MAY 2023 12:25PM by PIB Hyderabad

భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన మిగ్-21 యుద్ధ విమానం ఈ రోజు ఉదయం 09:45 గంటలకు కూలిపోయింది. రోజువారీ శిక్షణలో భాగంగా, సూరత్‌గఢ్‌లోని వైమానిక దళ స్థావరం నుంచి ఈ విమానం బయలు దేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే, విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించాడు. ఆ లోపాన్ని సరిచేయడానికి అన్ని విధాలా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో ఎజెక్షన్‌ ద్వారా విమానం నుంచి దూకేశాడు, అతనికి స్వల్ప గాయాలయ్యాయి. సూరత్‌గఢ్ స్థావరానికి ఈశాన్య 25 కిలోమీటర్ల దూరంలో పైలట్‌ని అధికారులు గుర్తించారు.

హనుమాన్‌గఢ్ జిల్లాలోని బహ్లోల్ నగర్‌లోని ఓ ఇంటిపై విమాన శకలాలు పడి దురదృష్టవశాత్తు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణనష్టం పట్ల ఐఏఎఫ్‌ విచారం వ్యక్తం చేసింది, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.  ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ కమిటీని నియమించారు.

 

***

***(Release ID: 1922513) Visitor Counter : 143