గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నగరాల్లో చెత్త కుప్పలను తొలగించడం ద్వారా పురోగమిస్తున్న - నగర సుందరీకరణ
Posted On:
04 MAY 2023 2:51PM by PIB Hyderabad
పట్టణ ప్రకృతి దృశ్యాన్ని తీర్చిదిద్ది, అందంగా మార్చే ప్రక్రియలో భాగంగా చెత్త కుప్పలు, బహిరంగ చెత్త కుప్పల ప్రదేశాలు వేగంగా రూపాంతరం చెందుతున్నాయి. స్వచ్ఛ్ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి పట్టణ ప్రాంతాల్లో చెత్త కుప్పలను మార్చవలసిన అవసరాన్ని గుర్తించడం జరిగింది. అనేక రాష్ట్రాలు పట్టణ ప్రాంతాల్లో ఈ చెత్త కుప్పలను మార్చడానికి, ఆ ప్రదేశాలను అందంగా తీర్చిదిద్దడానికి, సృజనాత్మక చర్యలు చేపట్టడం జరుగుతోంది. వీటివల్ల స్థిరమైన అభివృద్ధికి, ఆరోగ్యకరమైన, పచ్చని భవిష్యత్తుకు అవకాశం ఉంటుంది. ఈ చర్యలు వ్యర్థాల తగ్గింపు, రీసైక్లింగ్, పునర్వినియోగం కోసం మార్గాలను సృష్టించి, వనరుల స్థిరమైన ఉపయోగంలో సహాయపడతాయి.
భోపాల్ లో అమలుచేస్తున్న "డంప్-సైట్-రెమెడియేషన్" విధానం పట్టణ ప్రాంతాల పరివర్తనకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన భోపాల్ - ఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు భోపాల్ లోని గ్రీన్-జోన్ గా మారిన డంప్-సైట్ మీదుగా ప్రయాణించింది. 37 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని సుందరంగా తీర్చిదిద్దారు.
పట్టణాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను ఉపయోగించుకుంటున్న - నవీ ముంబయి
నవీ ముంబై పురపాలక సంఘం (ఎన్.ఎం.ఎం.సి) వంతెనలు / ఫ్లైఓవర్ల కింద ఉన్న ప్రాంతాలను కమ్యూనిటీ వినోద కేంద్రాలుగా మార్చడానికి ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను అమలు చేయడానికి ఒక వినూత్నమైన విధానాన్ని చేపట్టింది. ముంబై లోని సంపద ఫ్లైఓవర్ కింద నిర్మించిన "పబ్లిక్-స్పోర్ట్స్-కాంప్లెక్స్" దీనికి ఉదాహరణ. వంతెన ఎత్తుకు అనుగుణంగా ఒక క్రీడా సముదాయాన్ని సృష్టించడం జరిగింది. ఇక్కడ బాస్కెట్ బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, బాక్స్-క్రికెట్-జోన్, స్కేటింగ్ రింక్ మొదలైనవన్నీ, శక్తివంతమైన రంగులలో పెయింట్ చేయబడ్డాయి. ఇవి దృశ్యపరంగా ఆకర్షణీయమైన స్థలాన్ని సృష్టించాయి. క్రీడాకారుల భద్రత కోసం కాంప్లెక్స్‌లో భద్రతా వలయాన్ని కూడా అమర్చారు.
సంపద ఫ్లైఓవర్ ప్రాజెక్టు విజయం కావడంతో, నవీ ముంబై లో భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని ప్రాజెక్టులను రూపొందించి అమలు చేయడానికి ప్రోత్సాహం లభించింది. ఘన్సోలి-తలవలి వంతెన పెయింటింగ్‌లు, లైటింగుతో గత ఏడాది కొత్త రూపురేఖలు సంతరించుకుంది. కాగా, ఈ ఏడాది ఈ ప్రాంతాన్ని ఉద్యానవనంగా, పారిశ్రామిక కార్మికులు కూర్చుని సేదతీరే ప్రాంతంగా మార్చనున్నారు. రెండవ దశలో సంపద వంతెన సుందరీకరణ ప్రాజెక్టు లో యోగా కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రదేశాలు, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న కార్యకలాపాల కేంద్రాలుగా మారాయి. ప్రజల్లో సామాజిక పరస్పర చర్యలతో పాటు, ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించాయి. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను పునరుద్ధరించడం తో పాటు, ఈ కార్యక్రమాలు పౌరుల ఆరోగ్యం,శ్రేయస్సును కూడా మెరుగు పరిచాయి.
చెత్త కుప్పలను తొలగించడంలో - సూరత్ సృజనాత్మకత
సూరత్ లో చెత్త కుప్పలు ఉండే ప్రాంతాలను ప్రజలు కూర్చుని సేదతీరే ప్రదేశాలుగా మార్చడం ఒక గొప్ప మార్పు. సూరత్ పురపాలక సంఘం (ఎస్.ఎం.సి) అనేక చెత్త కుప్పలను తొలగించి, ఆ ప్రదేశాలను ప్రజలు కూర్చోడానికి అనువైన ప్రాంతాలుగా మార్చింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా, ఎస్.ఎం.సి. అనేక చెత్త కుప్పలను గుర్తించింది. ఆ ప్రదేశాల్లో చెత్త కుప్పలను తొలగించి, వాటి స్థానంలో చెత్త డబ్బాలు ఏర్పాటు చేయడం జరిగింది. బెంచీలు, లైట్లతో అక్కడ వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చడం జరిగింది. అక్కడ పచ్చని వాతావరణాన్ని సృష్టించడానికి, జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి వీలుగా పొదలు, మొక్కలు కూడా నాటారు. 'సంజయ్ నగర్ సర్కిల్' ఈ పరివర్తన కి ఒక ఉదాహరణ. ఇక్కడ చెత్త కుప్పలు ఉన్న ప్రాంతాలను, కూర్చోడానికి అనువైన అందమైన ప్రదేశంగా ఎస్.ఎం.సి. తీర్చిదిద్దింది. 100 శాతం వ్యర్థాలను సేకరించాలనే లక్ష్యంతో పరిసర ప్రాంతాలలోని ఇంటింటి నుంచి ప్రతీరోజూ చెత్తను సేకరించే కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టింది.
చెత్త కుప్పల ప్రాంతాలను హరిత ప్రదేశాలుగా మార్చడంలో - పాట్నా అనుసరిస్తున్న స్వచ్ఛతా ప్రయాణం
పాట్నా చాలా కాలంగా పెరుగుతున్న చెత్త కుప్పలతో పోరాడుతోంది. ఈ చెత్త కుప్పల ప్రాంతాలను హరిత ప్రదేశాలుగా మార్చడానికి, స్థిరమైన వాతావరణాన్ని ప్రోత్సహించడానికి చేపట్టిన కృషిలో భాగంగా, పాట్నా పురపాలక సంఘం (పి.ఎం.సి) చెత్త కుప్పలా ప్రదేశాల రూపురేఖలను మార్చే భారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నగరవ్యాప్తంగా ఉన్న మొత్తం 630 చెత్త కుప్పల ప్రదేశాలను పి.ఎం.సి. సుందరమైన ప్రాంతాలుగా మార్చింది. పెద్ద సంఖ్యలో చెత్త కుప్పల తొలగింపు కార్యక్రమం నగరంలో భారీ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.
పి.ఎం.సి. అధికార పరిధిలోని 19 మండలాల్లో ప్రతి మండలం నుంచి 19 వార్డుల చొప్పున 4 దశల్లో పరివర్తన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పౌరులను కోరుతూ, పి.ఎం.సి. అధికారులు ప్రతి వార్డులో సంగీత వాయిద్యాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గుర్తించిన ప్రదేశాల్లో చెత్త కుప్పలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పి.ఎం.సి. పరిధిలోని ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేశారు. అలా తమ విజప్తిని పాటించని పౌరులను డిస్పోజబుల్ కప్పులు, సీసాలు, రేపర్లు, వంటగది వ్యర్థాలతో తయారు చేసిన పుష్పగుచ్ఛాలు, దండలతో సత్కరించారు.
రూపాంతరం చెందిన - 630 చెత్త కుప్పలు
అటువంటి ప్రదేశాలను గ్రీన్ జోన్లు గా మార్చడం ద్వారా, పాట్నా మున్సిపల్ కార్పొరేషన్, చెత్త కుప్పల పరివర్తన డ్రైవ్ ను ప్రారంభించింది. శుభ్రపరిచిన స్థలాల్లో మొక్కలు నాటడం, పెయింటింగ్స్ తో పాటు, రబ్బరు ట్యూబులు, టైర్లు, టిన్నులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులతో తయారు చేసిన బెంచీలను ఉంచడం ద్వారా ఆయా ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దారు.
చాలా చెత్త కుప్పలు కూడా, ఇప్పుడు సెల్ఫీలు తీసుకునే సుందరమైన ప్రదేశాలుగా మారాయి. రూపాంతరం చెందిన ఈ చెత్త కుప్పల వద్ద, నూతన సంవత్సరం సందర్భంగా లిట్టి చోఖా కార్యక్రమం, మకర సంక్రాంతి రోజున దహి-చురా కార్యక్రమం, గాలిపటాల పండుగతో సహా పాట్నా మున్సిపల్ కార్పొరేషన్ వివిధ పండుగలు, కార్యక్రమాలను నిర్వహించింది.
నగరాల్లో పర్యావరణ, సామాజిక సమస్యలను పరిష్కరించడానికి వినూత్న ఆలోచనలు, సామాజిక కార్యక్రమాలు ఏ విధంగా సహాయపడతాయో చెప్పడానికి, చెత్త కుప్పలను అందమైన పట్టణ ప్రదేశాలుగా మార్చడం అనేది, ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ ప్రక్రియ స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా, అందరికీ స్థిరమైన, హరిత వాతావరణాన్ని సృష్టిస్తుంది.
*****
(Release ID: 1922223)
Visitor Counter : 183