ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అవయవ దాన విధానాన్ని సమీక్షించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అవయవ దాన విధానంలో మార్పులు తేవాలి.. డాక్టర్ మాండవీయ
దీర్ఘకాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని విధానంలో మార్పులు దేశంలో మూడు రెట్లు పెరిగిన అవయవదానం
5000 ( 2013) నుంచి 15,000కి (2022) పెరిగిన అవయవ దానాలు
Posted On:
03 MAY 2023 12:38PM by PIB Hyderabad
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అవయవ దాన విధానంలో సమూల సమగ్ర మార్పులు తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. అవయవ దానం విధానం అమలు జరుగుతున్న తీరును మంత్రి ఈరోజు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. అవయవ దానం, అవయవ మార్పిడి రంగాల్లో సమూల మార్పులు తీసుకు రావడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని డాక్టర్ మాండవీయ సమావేశంలో ఆదేశాలు జారీచేశారు.
అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చి తోటి మానవుల ప్రాణాలు రక్షించడానికి కృషి చేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 99వ సారి నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకు ప్రజలు సానుకూలంగా స్పందించడంతో అవయవదానానికి కొత్త ఊపు వచ్చింది. దేశంలో అవయవ దానాల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. దేశంలో 2013లో 5000 కంటే తక్కువ సంఖ్యలో అవయవ దానాలు జరిగాయి. 2022 లో అవయవ దానాల సంఖ్య 15000 కు మించి ఉంది. జాతీయ , ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న అవయవ మార్పిడి సంస్థల ఆర్గాన్, టిష్యూస్ నెట్‌వర్క్ మధ్య సమన్వయం పెరగడంతో మరణించిన దాతకి చెందిన ఎక్కువ అవయవాలు ఉపయోగించబడుతున్నాయి.2016 లో మరణించిన 930 మంది దాతల నుంచి సేకరించిన 2265 అవయవాలు అవసరం ఉన్నవారికి అందించారు. 2022 లో మరణించిన 904 మంది దాతల నుంచి సేకరించిన 2765 అవయవాలను ఉపయోగించారు.
ఆసుపత్రుల్లో అవయవ దానం, మార్పిడి కార్యక్రమం అమలు కోసం దశల వారీగా ట్రాన్స్‌ప్లాంట్ మార్గదర్శకాలు రూపొందించే అంశంపై జాతీయ అవయవ దాన సంస్థ పనిచేస్తోంది. ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్ల శిక్షణ కోసం ప్రామాణిక కోర్సు ప్రారంభించే ప్రతిపాదన సంస్థ పరిశీలనలో ఉంది. ఈ రెండు అంశాలకు సంబంధించిన వివరాలు త్వరలో విడుదల చేయనున్నారు. కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడానికి సమన్వయం, ఐఈసీ, శిక్షణ మరియు మానవ వనరులు అభివృద్ధి కోసం నాలుగు కార్యక్రమాలు సిద్ధం అయ్యాయి. మరొక వ్యక్తి కి అవయవ దానం చేసిన ఉద్యోగులకు 42 రోజుల వరకు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యేక సంక్షేమ చర్యగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
డాక్టర్ మాండవీయ మార్గదర్శకత్వంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశంలో అవయవ దానం మరియు మార్పిడిని పెంపొందించడానికి తదుపరి విధాన పరమైన సంస్కరణలు అమలు చేయడం కోసం అంతర్జాతీయ ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
****
(Release ID: 1921673)
Visitor Counter : 237