సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఆల్ ఇండియా రేడియో నెట్‌వర్క్ కు మరో 2 కోట్ల మంది శ్రోతలు చేరువయ్యే విధంగా 91 కొత్త 100 వాట్ల ఎఫ్.ఎం. ట్రాన్స్‌మిటర్లను ప్రారంభించిన - ప్రధానమంత్రి
18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభమైన - 91 కొత్త 100 వాట్ల ట్రాన్స్‌మిటర్లు
సాంకేతికత ప్రజాస్వామ్యీకరణ కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది: శ్రీ నరేంద్ర మోదీ
దేశంలోనే అతిపెద్ద ఎఫ్.ఎం. నెట్‌వర్క్ కలిగిన ఆకాశవాణి, నూతన భారత దేశ వృద్ధి కథనాన్ని దేశం నలుమూలలకు తీసుకువెళుతుంది: శ్రీ అనురాగ్ ఠాకూర్
63 అదనపు ట్రాన్స్‌మిటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన - ప్రభుత్వం
Posted On:
28 APR 2023 12:37PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు 91 ప్రదేశాల్లో, 100 వాట్ల సామర్ధ్యం ఉన్న లోపవర్ ఎఫ్.ఎమ్. ట్రాన్స్‌మిటర్లను ప్రారంభించారు. 20 రాష్ట్రాలలోని 84 జిల్లాల్లో ఈ ట్రాన్స్‌మిటర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆల్ ఇండియా రేడియోలో ట్రాన్స్‌మిటర్ల సంఖ్య 524 నుంచి 615 కి పెరిగింది. అదేవిధంగా, దేశ జనాభాలో అదనంగా మరో 73.5 శాతం మందికి ఆకాశవాణి ప్రసారాలు అందుబాటులోకి వస్తాయి.
ఈ ట్రాన్స్‌మిటర్ల సంస్థాపనలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, ఆకాంక్ష జిల్లాలతో పాటు, దేశ సరిహద్దు ప్రాంతాలకు ప్రాధాన్యతనివ్వడం జరిగింది.
స్పష్టమైన శబ్ద నాణ్యతతో పాటు, ఎఫ్.ఎం. రిసీవర్లతో కూడిన మొబైల్ ఫోన్లు సులభంగా అందుబాటులో ఉండడంతో దేశంలో ఎఫ్.ఎం. రేడియో ప్రసారాలకు డిమాండ్ పెరిగింది. ఈ డిమాండును చేరుకోవడంతో పాటు, సంస్థ సామర్థ్యాన్ని పెంపొందించే దిశలో భాగంగా, దేశంలో మరో 63 ఎఫ్.ఎం. ట్రాన్స్‌మిటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆల్ ఇండియా రేడియోని అభినందించారు. ఈరోజు ఈ అదనపు ట్రాన్స్‌మిటర్ల ప్రారంభం ప్రాముఖ్యత గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆల్ ఇండియా రేడియో ఆల్ ఇండియా ఎఫ్.ఎమ్. గా మారే దిశలో భాగంగా ఎఫ్.ఎమ్. సేవల విస్తరణ ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఆల్ ఇండియా రేడియో ద్వారా 91 ఎఫ్.ఎం. ట్రాన్స్‌మిటర్ల ప్రారంభం 85 జిల్లాలకు, 2 కోట్ల మంది దేశ ప్రజలకు ఒక అమూల్యమైన కానుక లాంటిదని ఆయన నొక్కి చెప్పారు.
సాంకేతికత ప్రజాస్వామ్యీకరణ కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. “భారతదేశం తన పూర్తి సామర్థ్యానికి ఎదగాలంటే, ఏ భారతీయుడూ అవకాశాల కొరతను అనుభవించకుండా ఉండడం చాలా ముఖ్యం”, అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సరసమైనదిగా చేయడం దీనికి కీలకం. అన్ని గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ తో పాటు, సమాచార లభ్యతను సులభతరం చేసిన చౌకైన డేటా ధర గురించి కూడా ఆయన వివరించారు. దీనివల్ల గ్రామాల్లో డిజిటల్ వ్యవస్థాపకతకు కొత్త ప్రోత్సాహం వచ్చిందన్నారు. అదేవిధంగా, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు బ్యాంకింగ్ సేవలను పొందడంలో యు.పి.ఐ. సహాయపడింది.
రేడియోతో తన తరానికి ఉన్న భావోద్వేగ సంబంధాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. మన్-కీ-బాత్ రానున్న వందో సంచికను ప్రస్తావిస్తూ, “రేడియోతో నాకు హోస్ట్‌గా కూడా సంబంధం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది” అని ప్రధానమంత్రి అన్నారు. దేశ ప్రజలతో ఈ రకమైన భావోద్వేగ అనుబంధం కేవలం రేడియో ద్వారానే సాధ్యమైంది. దీని ద్వారా, నేను దేశానికి ఉన్న బలం, దేశ ప్రజల మధ్య కర్తవ్యం అనే సామూహిక శక్తి తో నేను అనుసంధానమై ఉన్నాను. మన్-కీ-బాత్ ద్వారా ప్రజల ఉద్యమంగా మారిన స్వచ్ఛ్ భారత్, బేటీ బచావో బేటీ పఢావో, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలలో ఈ కార్యక్రమం పాత్రకు ఉదాహరణలను ఇస్తూ ఈ అంశాన్ని ఆయన వివరించారు. "అందుకే, ఒక విధంగా, మీ ఆల్ ఇండియా రేడియో బృందంలో నేనూ ఒక భాగస్వామినే" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఈ సదుపాయాన్ని కోల్పోయిన నిరుపేదలకు ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వ విధానాలను ఈ 91 ఎఫ్.ఎం. ట్రాన్స్‌మిటర్ల ప్రారంభోత్సవం ముందుకు తీసుకువెళుతుందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. "దూరంగా ఉన్నామని భావించే వారికి ఇప్పుడు గొప్ప స్థాయిలో దగ్గరయ్యే అవకాశం లభిస్తుంది", అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎఫ్.ఎం. ట్రాన్స్‌మిటర్ల ప్రయోజనాల గురించి వివరిస్తూ, ముఖ్యమైన సమాచారాన్ని సమయానికి ప్రసారం చేయడం, మెరుగైన సమాజ నిర్మాణ ప్రయత్నాలు, వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన తాజా సమాచారం, రైతులకు ఆహారం, కూరగాయల ధరలపై సమాచారం, వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి చర్చలు, వ్యవసాయం కోసం అధునాతన యంత్రాలను ఒకరిద్దరు కలిసి ఉపయోగించుకోవడం, కొత్త మార్కెట్ పద్ధతుల గురించి మహిళా స్వయం సహాయక బృందాలకు తెలియజేయడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మొత్తం సమాజానికి సహాయం చేయడం. మొదలైన సేవలు అందుబాటులో ఉంటాయని ప్రధానమంత్రి తెలియజేశారు. ఎఫ్.ఎం. అందజేసే సమాచారంతో కూడిన వినోదం గురించి కూడా ఆయన చెప్పారు.
భాషా వైవిధ్యం కోణాన్ని ప్రధానమంత్రి స్పృశించారు, అన్ని భాషలల్లో, ముఖ్యంగా 27 మాండలికాలు ఉన్న ప్రాంతాలలో ఎఫ్.ఎం. ప్రసారాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. “ఈ అనుసంధానత అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనాలను లింక్ చేయడం మాత్రమే కాదు, ఇది ప్రజలను కూడా కలుపుతుంది. ఇది ఈ ప్రభుత్వ పని సంస్కృతికి అద్దం పడుతోంది”, అని, భౌతిక అనుసంధానతను ప్రోత్సహించడంతో పాటు సామాజిక అనుసంధానానికి ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. అన్నారు.
ఆల్ ఇండియా రేడియో వంటి అన్ని కమ్యూనికేషన్ ఛానెళ్ళ దార్శనికత, లక్ష్యాన్ని గురించి నొక్కి చెప్పిన ప్రధాన మంత్రి, అనుసంధానత ఏ రూపంలోనైనా సరే, దేశాన్ని, దేశంలోని 140 కోట్ల మంది పౌరులను అనుసంధానం చేయడమే దీని ఉద్దేశమని చెప్పారు. ఈ దృక్పథంతో భాగస్వాములందరూ ముందుకు సాగుతారనీ, దీని ఫలితంగా నిరంతర చర్చల ద్వారా దేశం బలోపేతం అవుతుందనీ, ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ లేహ్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సభనుద్దేశించి ప్రసంగించారు. సాధించిన విజయాల గురించి మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాల గురించిన సమాచారంతో పాటు, వినోదభరిత కార్యక్రమాలను దేశం నలుమూలలకు తీసుకెళ్లడానికి ఈ ట్రాన్స్‌మిటర్లు ఒక మార్గంగా పనిచేస్తాయని చెప్పారు.
భారతదేశంలో రేడియో అనుసంధానత విస్తరణకు కృషి చేసిన ఘనత ప్రధానమంత్రి మోదీ కే దక్కుతుందని, మంత్రి స్పష్టం చేశారు. రేడియో ప్రాముఖ్యత పెరగడానికి ప్రధానమంత్రి మన్-కీ-బాత్ కార్యక్రమం దోహదపడిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఐ.ఐ.ఎం. రోహ్‌తక్ ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా ఇదే విషయం తేటతెల్లమయ్యిందని ఆయన చెప్పారు.
నేడు భారతదేశంలోనే అతిపెద్ద ఎఫ్.ఎం. నెట్‌వర్క్ కలిగిన ఆకాశవాణి, నూతన భారతదేశ వృద్ధి కథనాన్ని దేశం నలుమూలలకు తీసుకువెళుతుందని మంత్రి నొక్కి చెప్పారు.
నేపథ్యం
దేశంలో ఎఫ్.ఎం. అనుసంధానత పెంపొందించాలనే ప్రభుత్వ నిబద్ధత లో భాగంగా, 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 84 జిల్లాల్లో 91 కొత్త 100 వాట్ల ఎఫ్.ఎం. ట్రాన్స్‌మిటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విస్తరణలో ఆకాంక్ష జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఎఫ్.ఎం. కవరేజీని మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఈరోజు 91 కొత్త 100 వాట్ల ఎఫ్.ఎం. ట్రాన్స్‌మిటర్లు ప్రారంభమైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లడఖ్, అండమాన్ & నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ విస్తరణతో, ఆకాశవాణి ప్రసారాలు అందుబాటులో లేని మరో 2 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ఎఫ్.ఎం. రేడియో కార్యక్రమాలు వినడానికి అవకాశం కలుగుతుంది. దీంతో, దాదాపు మరో 35,000 చ.కి.మీ మేర ఎఫ్.ఎం.రేడియో ప్రసారాలు విస్తరిస్తాయి.
*****
(Release ID: 1920923)
Visitor Counter : 177