ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సదస్సులో ప్రధాని ప్రసంగం
“ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ స్తంభించినప్పుడు భారతదేశం వేగంగా కొలుకొని సంక్షోభం నుంచి బైటపడింది”
“2014 తరువాత మా ప్రభుత్వ విధానాలు స్వల్ప కాల ప్రయోజనాలతోబాటు రెండవ, మూడవ దశ ప్రభావాలకూ ప్రాధాన్యమిచ్చాయి”
“దేశంలో మొట్టమొదటిసారిగా పేదలకు భద్రతతోబాటు గౌరవం దక్కింది”
“ గడిచిన తొమ్మిదేళ్లలో దళితులు, అణగారిన వర్గాలు, గిరిజనులు, మహిళలు, నిరుపేదలు, మధ్యతరగతివారు అందరూ మార్పు అనుభూతి చెందుతున్నా రు”
“దేశంలో అతిపెద్ద ప్రజాసమూహానికి రక్షణ కవచంగా నిలిచింది పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన”
“సంక్షోభ సమయంలో భారతదేశం స్వావలంబన మార్గం ఎంచుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన టీకా కార్యక్రమం చేపట్టింది.”
“మార్పు దిశలో గమనం సమకాలీనమే కాదు, భవిష్యత్తు కోసం కూడా”
“ఆవినీతి మీద దాడి కొనసాగుతుంది”
Posted On:
26 APR 2023 9:46PM by PIB Hyderabad
న్యూ ఢిల్లీలోని తాజ్ పాలెస్ హోటల్ లో ఈ రోజు జరిగిన ‘రిపబ్లిక్ సదస్సు’ నుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, వచ్చే నెలకు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రిపబ్లిక్ బృందానికి అభినందనలు తెలియజేశారు. 2019 లో జరిగిన సదస్సులో పాల్గొనటాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అది ప్రజలు వరుసగా రెండోవిడత భారీ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వానికి స్థిరత్వాన్ని ఇచ్చిన సమయమని అన్నారు. భారతదేశానికి ఇదే తగిన సమాయమని దేశం గ్రహించిందనటానికి అది నిదర్శనమన్నారు. ఈ ఏడాది ‘మార్పుకు సమయం’ అనే అంశం మీద జరుపుతున్న సదస్సును దృష్టిలో ఉంచుకొని ఇది నాలుగేళ్లక్రితం తాము ఎంచుకున్న దూరదృష్టిని ప్రతిఫలించిందని, క్షేత్రస్థాయిలో మార్పు చూస్తున్నామని అన్నారు,
దేశం సాగుతున్న దిశను కొలవటానికి అబివృద్ధి వేగమే కొలమానమని ప్రధాని అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ చేరాటానికి 60 ఏళ్ళు పట్టిందని, 2014 లో 2 ట్రిలియన్లకు చేరటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, ఆ విధంగా ఏది దశాబ్దాలలో 2 ట్రిలియన్లకు చేరుకోగలిగామని గుర్తు చేశారు. కానీ కేవలం తొమ్మిదేళ్ళ తరువాత దాదాపు మూడున్నర ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారామన్నారు. ఆ విధంగా భారతదేశం గత తొమ్మిదేళ్లలో 10 వ రాంకు నుంచి ఐదవ రాంకుకు ఎగబాకిందన్నారు. అది కూడా శతాబ్దానికి ఒకసారి వచ్చే సంక్షోభంలో కూడా సాధించగలిగామని చెప్పారు. ఇతర ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు భారతదేశం ఆ సంక్షోభం నుంచి బైటపడటమే కాకుండా వేగంగా ఎదుగుతోందన్నారు.
రాజకీయాల ప్రభావం గురించి మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకునే ఏ విధానపరమైన నిర్ణయమైనా, ప్రధానంగా స్వల్పకాలంలో కనబడుతుందని, అయితే రెండవ, మూడవ స్థాయి ప్రభావం కనబడటానికి కొంత సమయం పడుతుందని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం తరువాత అనుసరించిన విధానాల వలన ప్రభుత్వం ఒక నియంత్రణ సంస్థగానూ, పోటీదారుగాను తయారై ప్రైవేట్ రంగాన్ని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఎడగనివ్వలేదని ప్రధాని వ్యాఖ్యానించారు. మొదటి దశ ఫలితాలే వెనుకబాటుతనానికి దారితీయగా, రెండో దశ మరింత ప్రమాదకారిగా తయారైందన్నారు. ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు భారతదేశపు వినియఈగపు ఎదుగుదల కుంచించుకు పోయిందన్నారు. తయారీరంగం బలహీనపడి మనం పెట్టుబడులకు అనేక అవకాశాలు కోల్పోయామన్నారు. నవకల్పనల పర్యావరణ వ్యవస్థ లేకపోవటంతో కొత్త సంస్థలు నామమాత్రంగా పుట్టుకొచ్చి ఉద్యోగాలు సైతం తగినన్ని కల్పించలేకపోవటాన్ని ప్రధాని ప్రస్తావించారు. యువత కేవలం ప్రభుత్వోద్యోగల మీద ఆధారపడటం, మేథోవలస పెరగటం జరిగిపోయాయన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం 2014 తరువాత రూపొందించిన విధానాలు ప్రాథమిక ప్రయోజనాలతోబాటు రెండవ, మూడవ దశ ప్రభావాల మీద దృష్టిసారించిందని ప్రధాని చెప్పారు. పి ఎం ఆవాస్ యోజన కింద ప్రజల చేతికి అందజేసిన గృహాల సంఖ్య గత నాలుగేళ్లలో 1.5 కోట్ల నుంచి 3.75 కోట్లకు పెరిగిందన్నారు. పైగా, వీటి యాజమాన్యం మహిళలకే ఇచ్చామన్నారు. నిర్మాణానికి లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఈ ఇళ్ళు సొంతం కావటంతో మహిళలు లక్షాధిపతులయ్యారని ప్రధాని గుర్తు చేశారు. అదే సమయంలో ఈ పథకం వలన అనేక ఉపాధి అవకాశాలు కూడా కలిగాయన్నారు. నిరుపేద, బడుగు వర్గాల ప్రజల ఆత్మ విశ్వాసాన్ని పిఎం ఆవాస్ యోజన ఎంతగానో పెంచిందన్నారు.
సూక్ష్మ, చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించే ముద్ర యోజన గురించి మాట్లాడుతూ, ఈ పథకానికి ఎనిమిదేళ్ళు పూర్తయ్యాయని, దీనికింద 40 కోట్ల రుణాల పంపిణీ జరగగా, అందులో 70 శాతం మంది మహిళలు ఉన్నారని చెప్పారు. ఈ పథకం తొలి ప్రభావం ఉపాధిని, స్వయం ఉపాధిని పెంచటమని అన్నారు. మహిళల పేర్ల మీద జన్ ధన్ ఖాతాలు ప్రారంభించటం కావచ్చు, స్వయం సహాయక బృందాలకు ప్రోత్సాహకాలు ఇవ్వటం కావచ్చు... వీటి వలన కుటుంబంలో మహిళల మాట ఎక్కువగా చెల్లుబాటయ్యే పరిస్థితి కల్పించామన్నారు. దేశ మహిళలు దేశ ఆర్థిక వ్యవస్థ ను బలోపేతం చేస్తున్నారని, ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదిగారని చెప్పారు.
పి ఎం స్వామిత్వ పథకం వలన కలిగిన ప్రయోజనాలను కూడా ప్రధాని వివరించారు. టెక్నాలజీ సాయంతో ఆస్తి కార్డులు ఇవ్వటం ద్వారా ఆస్తికి భద్రత కల్పించామన్నారు. మరో ప్రభావమేంటంటే, దీనివల్ల డ్రోన్ రంగం బాగా విస్తరించింది. ఆస్తి కార్డుల వలన ఆస్తి వివాదాలు బాగా తగ్గిపోయి పోలీసులమీద, న్యాయ వ్యవస్థ మీద వత్తిడి తగ్గింది. పైగా, డాక్యుమెంట్ల అందుబాటు కారణంగా గ్రామాల్లో బాంకుల నుంచి అప్పు తీసుకునే అవకాశం పెరిగింది.
డీబీటీ పథకం గురించి, విద్యుత్, నీటి సౌకర్యాల గురించు చెబుతూ, అవి క్షేత్ర స్థాయిలో తీసుకు వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల గురించి ప్రస్తావించారు. “దేశంలో మొట్టమొదటిసారిగా పేదలకు భద్రతతోబాటు గౌరవం దక్కింది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఒక్కప్పుడు భారంగా పరిగణించబడినవారే ఇప్పుడు దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని గుర్తుచేశారు. ఈ పథకాలే వికసిత భారత్ కు ప్రాతిపదిక అయ్యాయన్నారు.
పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గురించి మాట్లాడుతూ, “ ఇది దేశంలో అతిపెద్ద ప్రజాసమూహానికి రక్షణ కవచంగా నిలిచింది” అన్నారు. దీనివల్ల కరోనా సంక్షోభ సమయంలో ఏ కుటుంబమూ ఆకలితో నిద్రపోయే పరిస్థితి రాకుండా చూడగలిగామన్నారు. ప్రభుత్వం అన్న యోజన పథకం మీద నాలుగు లక్షల కోట్లు వెచ్చించిందన్నారు. పేదలకు ప్రభుత్వం నుంచి వారికి అండాల్సిన వాటా అందినప్పుడే నిజమైన సామాజిక న్యాయమని ప్రధాని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఇటీవల ప్రచురించిన వర్కింగ్ పేపర్ ప్రకారం భారత ప్రభుత్వ విధానాల వలన అత్యంత పేదరికం అనే భావన తొలగిపోతున్నదని, కరోనా సమయంలో సైతం అదే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడుతూ, 2014 కు ముందు ఎన్నో అవకతవకలు జరిగాయని, శాశ్వత ఆస్తుల సృష్టి జరగలేదని చెప్పారు. ఇప్పుడు డబ్బు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడటం వలన పారదర్శకత వచ్చిందని, గ్రామాలలో ఇళ్ళు, కాలువలు, చెరువులు లాంటి వనరులు సృష్టించగలుగుతున్నామని ప్రధాని చెప్పారు. ఎక్కువ భాగం చెల్లింపులు 115 రోజుల్లోపే జరుగుతున్నాయని, ఆధార్ కార్డుల అనుసంధానం వల్ల దాదాపు 40 కోట్ల రూపాయల జాబ్ కార్డుల స్కామ్ లు తగ్గిపోయాయని గుర్తు చేశారు.
“మార్పు దిశలో గమనం సమకాలీనమే కాదు, భవిష్యత్తు కోసం కూడా” అని ప్రధాని స్పష్టం చేశారు. గతంలో కొత్త టెక్నాలజీ రావటానికి చాలా సంవత్సరాలు, దశాబ్దాలు పట్టేదని, భారతదేశం గత తొమ్మిదేళ్లలో ఈ ధోరణిని మార్చటానికి చర్యలు తీసుకున్నదన్నారు. టెక్నాలజీ సంబంధ రంగాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తం చేసి దేశ అవసరాలకు తగినట్టు, భవిష్యత్తు కోసం టెక్నాలజీ రూపొందించాలని కోరామన్నారు. 5 జి టెక్నాలజీ గురుంచి ప్రవమచం చర్చించుకుంటూ ఉండగానే భారతదేశం చూపిన వేగాన్ని ఆయన ఉదాహరించారు.
కరోనా సంక్షోభ సమయాన్ని గుర్తు చేస్తూ, భారతదేశం సంక్షోభ సమయంలోనూ ఆత్మ నిర్భర భారత్ మార్గాన్ని ఎంచుకున్నదన్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అతి స్వల్ప కాలంలో సమర్థవంతమైన టీకాలు తయారుచేయటాన్ని ప్రస్తావించారు. అదే విధంగా, అతి తక్కువ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. కొంతమంది భారతదేశంలో తయారైన టీకాల పట్ల విముఖత వ్యక్తం చేస్తూ విదేశీ టీకాలపట్ల మొగ్గు చూపుతుండగా జరిగిందన్నారు.
డిజిటల్ ఇండియా ప్రచారోద్యమాన్ని పట్టాలు తప్పించటానికి ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ, అవరోధాలు సృష్టించినప్పటికీ ఇప్పుడు అందరూ దాని గురించే మాట్లాడుకునే పరిస్థితి తెచ్చామన్నారు. సూడో మేధావులు డిజిటల్ చెల్లింపులను అపహాస్యం చేశారని కూడా గుర్తు చేసుకున్నారు. ఈ రోజు దేశంలో అత్యధిక డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయన్నారు.
తన పట్ల తన వ్యతిరేకులు వ్యక్తం చేస్తున్న అసంతృప్తి మీద కూడా ప్రధాని స్పందించారు. వాళ్ళకు నల్లధనం అందే వనరులు నిలిచిపోవటమే ఇలాంటి విమర్శలకు కారణమన్నారు. అయినా సరే, అవినీతి మీద పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పుడు సమీకృత, సంస్థాగత వైఖరి అవలంబిస్తున్నామని, దీనికి కట్టుబడి ఉన్నామని అన్నారు. పది కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను ఏరి వేశామని చెబుతూ, అది ఢిల్లీ, పంజాబ్, హర్యానా జనాభా కంటే ఎక్కువన్నారు. వ్యవస్థ నుంచి ఈ పది కోట్ల నకిలీ లబ్ధిదారులను తొలగించకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని అన్నారు. అందుకే ఆధార్ కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 45 కోట్లకుపైగా జన్ ధన్ ఖాతాలు తెరవటానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యక్ష నగదు బదలీ కింద కోట్లాది మంది లబ్ధిదారులకు ఇప్పటిదాకా రూ.28 లక్షల కోట్లను బదలీ చేశామని చెప్పారు. “ప్రత్యక్ష నగదు బదలీ అంటే కమిషన్లకు ఆస్కారం లేని వ్యవస్థ. దీనివల్ల డజనలకొద్దీ పథకాలలో పారదర్శకత వచ్చింది” అన్నారు.
దేశంలో ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ విధానం కూడా అవినీతికి వనరుగా తయారైన స్థితిలో జెమ్ పోర్టల్ రావటంతో మొత్తం పరిస్థితి మారిపోయిందని ప్రధాని వ్యాఖ్యానించారు. నేరుగా రానక్కరలేని పన్ను విధానం, జీఎస్టీ వలన అవినీతి విధానాలకు అడ్డుకట్టపడినట్టయిందని అన్నారు. అలాంటి నిజాయితీ వ్యవస్థ నెలకొన్నప్పుడు ఆవినీతిపరులకు అసౌకర్యంగా ఉంటుందని, అలాంటివారు నిజాయితీతో కూడుకున్న వ్యవస్థని ధ్వంసం చేయటానికి ప్రయత్నిస్తారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇది కేవలం మోడీకి వ్యతిరేకమే అయితే, వాళ్ళు విజయం సాధించే వారేమో. కానీ ఇది సామాన్య ప్రజలను ఎదుర్కోవాల్సి రావటమే వాళ్ళు పలాయనం చిత్తగించటానికి కారణం. ఇలాంటి అవినీతి పరులు ఎంత పెద్ద శక్తిమంతులైనా సరే, అవినీతి మీద పోరు కొనసాగుతుంది” అని ప్రధాని స్పష్టం చేశారు.
“అమృత కాలంలో ‘సబ్ కా ప్రయాస్’ ప్రధానం. ప్రతి భారతీయుడూ శక్తి మేర కష్టపడితే మనం త్వరలోనే మన ‘వీక్షిత భారత్’ కలను సాకారం చేసుకోగలుగుతాం” అంటూ ప్రధాని తన ప్రసంగం ముగించారు..
***
(Release ID: 1920582)
Visitor Counter : 157
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam