సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
' 2047 లో భారతదేశం ఎలా ఉండాలి అన్న అంశాన్ని 2023 నాటి యువత నిర్ధారించాలి' కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
శాంతి స్థాపన సయోధ్య సాధన; యుద్ధాలకు తావు లేని భవిష్యత్తు అనే అంశంపై ఏర్పాటైన యూత్ 20 సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
19 APR 2023 1:28PM by PIB Hyderabad
' 2047 లో భారతదేశం ఎలా ఉండాలి అన్న అంశాన్ని 2023 నాటి యువత నిర్ధారించాలి' అని కేంద్ర శాస్త్ర సాంకేతిక( స్వతంత్ర బాధ్యత), భూ శాస్త్ర ( స్వతంత్ర బాధ్యత), పీఎంవో లో సహాయ మంత్రి, సిబ్బంది వ్యవహారాలు , ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణుశాస్త్రం, అంతరిక్ష వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ రోజు జమ్మూ విశ్వవిద్యాలయంలో శాంతి స్థాపన సయోధ్య సాధన; యుద్ధాలకు తావు లేని భవిష్యత్తు అనే అంశంపై ఏర్పాటైన యూత్ 20 సదస్సులో డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'దేశానికి స్వాతంత్ర్యం సాధించిన తర్వాత మూడు తరాలు గడిచిపోయాయి. దేశంలో శక్తి సామర్ధ్యాలను కొరత లేదు. వాటిని సద్వినియోగం చేసుకోవడం ఒక సమస్యగా మారింది. అయితే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. తమలో దాగివున్న శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించే అవకాశం యువతకి లభించింది. భారతదేశం @ 2047 నిర్మాణంలో నేటి యువత కీలకం గా ఉంటారు.నేడు ముప్పై ఏళ్లు నిండిన వారు ప్రధాన పౌరులు అవుతారు' అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
జీ-20 అధ్యక్ష పదవి చేపట్టిన భారతదేశానికి 2023 ఒక ముఖ్యమైన సంవత్సరం అని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశానికి సుస్థిర ప్రభుత్వాన్ని అందించారని పేర్కొన్న డాక్టర్ జితేంద్ర సింగ్ దేశంలో ప్రతి సవాలును సమర్థంగా ఎదుర్కొంటూ దేశ భవిష్యత్తు నిర్మాణానికి కృషి చేస్తున్న పాలన సాగుతుందన్నారు. 2023 నాటి మోదీ పాలనకు 2023 యువతకు మధ్య ఉన్న పరస్పర సంబంధం ఏమిటో ఈరోజు సమావేశం దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 లో బాధ్యతలు చేపట్టిన సమయంలో ప్రభుత్వం పేదల అభ్యున్నతి, మహిళా సాధికారత, యువత అభ్యున్నతికి కృషి చేయాలని నిర్ణయించిందని మంత్రి తెలిపారు. 2014కు ముందు దేశంలో నిరాశ, నిస్పృహ పరిస్థితి నెలకొని ఉందని మంత్రి అన్నారు. 2014 మే 26న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోదీ ఇకపై దేశం నిరాశావాదం నుంచి ఆశావాదం వైపు ప్రయాణం సాగిస్తుందని ప్రకటించి తమ ప్రభుత్వ విధానాన్ని ప్రకటించారని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. తమ ప్రభుత్వం యువతకు ప్రాధాన్యత ఇస్తుందని శ్రీ మోడీ చేసిన ప్రకటన పట్ల అనేక మంది విశ్వసించలేదు అని మంత్రి అన్నారు. 9 సంవత్సరాల పాలనలో శ్రీ నరేంద్ర మోదీ చెప్పిన మాటకు కట్టుబడి పాలన సాగించి దేశానికి మాటల ప్రభుత్వాన్ని కాకుండా చేతల ప్రభుత్వాన్ని అందించారని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.
2014లో అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల తర్వాత సర్టిఫికెట్లను గెజిటెడ్ అధికారులు ధృవీకరించే విధానానికి స్వస్తి పలికిన అంశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత దేశంలో ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు చేస్తునట్టు ప్రకటించి శ్రీ మోదీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు. ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా దేశంలో పెన్షన్ చెల్లించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపిన శ్రీ జితేంద్ర సింగ్ దీనివల్ల వృద్ధ పౌరులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉండదని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఆన్‌లైన్ విధానంలో పారదర్శకత, జవాబుదారీతనంప్రజల భాగస్వామ్యంతో అమలు జరుగుతున్నాయని తెలిపారు. మానవ ప్రమేయం కనీస స్థాయికి తగ్గిందన్నారు. యువతను విశ్వసించే ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న వాస్తవాన్ని ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు తెలియజేస్తున్నాయన్నారు.
ఫిర్యాదుల పరిష్కారం కోసం దేశంలో అమలు జరుగుతున్న కార్యక్రమాల వివరాలను డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని సీపీ గ్రామ్స్ విధానం అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాకముందు ప్రతి సంవత్సరం కేవలం 2 లక్షల ఫిర్యాదులు అందుతుండగా, ఈ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం 20 లక్షల ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. కాలపరిమితితో కూడిన పరిష్కార విధానం అమలు చేస్తున్న ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
యువతకు త్వరలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కొన్ని నెలల క్రితం దేశానికి వాగ్దానం చేసిన ప్రధాని మోదీ తన వాగ్దానం నిలబెట్టుకుని తాను చెప్పినట్టే చేస్తానని మరియు ప్రతి దాన్ని “ముమ్కిన్” (సాధ్యం) చేయగల సామర్థ్యం తనకు ఉందని రుజువు చేశారు అని మంత్రి అన్నారు.
ప్రధాని మోడీ మొదటి నుంచి యువతకు సంబంధించిన సమస్యలు, ఆందోళనలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. యువతకు జీవనోపాధి, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన , ఆదాయం కోసం కొత్త మార్గాలు, అవకాశాలు కల్పించడానికి ప్రధాని నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
అవినీతి నిరోధక చట్టం, 1988 ను తన ప్రసంగంలో ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్ 30 సంవత్సరాల తర్వాత 2018లో ప్రభుత్వం చట్టాన్ని సవరించి లంచం తీసుకోవడంతోపాటు లంచం ఇవ్వడాన్ని కూడా నేరంగా పరిగణించడంతో పాటు అనేక కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టిందన్నారు. వ్యక్తులు కార్పొరేట్ సంస్థలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా సవరణలు సహకరిస్తాయన్నారు.
2015 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీయే “స్టార్ట్‌అప్ ఇండియా స్టాండ్‌అప్ ఇండియా” అంటూ ఇచ్చిన పిలుపును గుర్తు చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్ దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారిందన్నారు. ప్రధానమంత్రి పిలుపుతో భారతదేశంలో స్టార్టప్‌ల సంఖ్య 2014లో 300 నుండి 400 కి పెరిగి నేడు 75,000కు పైగా పెరిగిందన్నారు. స్టార్టప్ రంగంలో భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని ఆయన తెలిపారు. అంతేకాకుండా, 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అందించిన సహకారం, కల్పించిన వసతుల వల్ల దేశంలో బయోటెక్ స్టార్టప్‌ల సంఖ్య గత 8 సంవత్సరాలలో 50 నుంచి 5,000కు పెరిగిందన్నారు. 2025 నాటికి వీటి సంఖ్య 10,000 చేరే అవకాశం ఉందన్నారు. 2014 నాటికి కేవలం 10 బిలియన్ డాలర్లుగా ఉన్న బయో ఎకానమీ నేడు 80 బిలియన్ డాలర్ల స్థాయికి చేరిందని, 2025 నాటికి 100 బిలియన్ డాలర్లు చేరాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
ఉత్తరాఖండ్‌తో సహా హిమాలయ రాష్ట్రాలు సుగంధ స్టార్టప్‌లకు కేంద్రంగా మారాయని మంత్రి అన్నారు. , "పర్పుల్ రివల్యూషన్" లేదా "అరోమా మిషన్ " ద్వారా జమ్మూ,కాశ్మీర్ స్టార్ట్‌అప్ ఇండియాకు సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. అరోమా మిషన్ దేశవ్యాప్తంగా స్టార్టప్‌లు, వ్యవసాయదారులను ఆకర్షిస్తోంది అని అన్నారు. ఈ రంగంలో 44,000 మందికి పైగా శిక్షణ పొందారని, అనేక కోట్ల మంది రైతుల ఆదాయం పెరిగిందని మంత్రి తెలిపారు.
ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 100 ఏళ్ల నాటి భారతీయ అటవీ చట్టం పరిధి నుంచి ఇంట్లో పండించే వెదురును మినహాయించాలని శ్రీ మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. వెదురు రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడంలో ప్రభుత్వ నిర్ణయం సహాయ పడిందన్నారు. విస్తారమైన సముద్ర వనరులు అన్వేషించడానికి గత ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని డాక్టర్ జితేంద్ర సింగ్ ఆరోపించారు. శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా సముద్ర వనరులు అన్వేషణ, వినియోగం కోసం ప్రణాళిక రూపొందించారని మంత్రి తెలిపారు. దేశంలో నీలి ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి సాంప్రదాయిక విద్యా రంగంలో వచ్చిన మార్పులను డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 2014 ప్రారంభంలో దేశంలో 725 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రతి వారం 1 కొత్త విశ్వవిద్యాలయం చొప్పున ప్రారంభించిన ప్రభుత్వం గత 9 సంవత్సరాల కాలంలో దేశంలో కొత్తగా 300 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. 2004 నుంచి 2014 మధ్య దేశంలో 145 వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. రోజుకు 1 వైద్య కళాశాల , రోజుకు 2 డిగ్రీ కళాశాల చొప్పున 260 కి పైగా వైద్య కళాశాలలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉంది అని మంత్రి అన్నారు. సౌకర్యాలు అందుబాటులో లేనందున ఎవరూ విద్యకు దూరం కాకూడదు అన్నది తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు.
జమ్మూ సెంట్రల్ యూనివర్శిటీ ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి అంతరిక్ష బోధన విభాగాన్ని ప్రారంభించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.విద్య నుంచి డిగ్రీని డి-లింకింగ్ చేయడం నూతన జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలలో ఒకటి అని చెప్పిన మంత్రి డిగ్రీని విద్య తో అనుసంధానించడం వల్ల మన విద్యా వ్యవస్థ,సమాజం నష్టపోయాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.విద్యా విధానం వల్ల చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచంలో భారతదేశం ఒక భాగంగా మారిపోయిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి, ప్రపంచ సవాళ్లు ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉండాలన్నారు. వాతావరణ మార్పు, క్లీన్ ఎనర్జీ మొదలైన ప్రపంచ సమస్యల పరిష్కారానికి చర్యలు అవసరమన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తించి దీనికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. సమీప భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ప్రధాన ఎగుమతిదారుల్లో భారతదేశం ఒకటిగా ఉంటుందన్నారు. .
జీ-20 కింద ఏర్పాటైన ఎనిమిది అధికారిక ఎంగేజ్‌మెంట్ గ్రూపులలో యూత్20 ఒకటని మంత్రి తెలిపారు. జీ-20 ప్రభుత్వాలు, ఆయా దేశాల్లో నివసిస్తున్న యువత మధ్య సంబంధాలు మెరుగు పరచడానికి యూత్-20 కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. 2023 లో భారతదేశం నిర్వహించే వై-20 ఇండియా సదస్సు భారతదేశం అమలు చేస్తున్న యువత-కేంద్రీకృత చర్యలు వివరిస్తుందన్నారు.సదస్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు భారతదేశం విలువలు, విధానపరమైన చర్యలు తెలుసుకోవడానికి సదస్సు అవకాశం కల్పిస్తుందన్నారు.
భారతదేశ భవిష్యత్తులో తమ పాత్ర ఏ విధంగా ఉండాలి అన్న అంశాన్ని యువత తమకు తాము నిర్ణయించుకుని లక్ష్య సాధన కోసం కృషి చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. దేశ భవిష్యత్తు కోసం తమ శక్తి సామర్ధ్యాలు పూర్తిగా ఉపయోగపడేలా యువత తమను తాము రూపొందించుకుని "నేను భారతదేశానికి@100 రూపశిల్పిని " అని గుర్తించి ముందుకు సాగాలని మంత్రి కోరారు.
***
(Release ID: 1918094)
Visitor Counter : 231