గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

రేపు మణిపూర్‌లో “మార్కెటింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ డెవలప్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ట్రైబల్‌ ప్రొడక్ట్స్‌ ఫ్రమ్‌ నార్త్‌-ఈస్ట్రన్‌ రీజియన్‌ (పీటీపీ-ఎన్‌ఈఆర్‌)" పథకాన్ని ప్రారంభించనున్న శ్రీ అర్జున్ ముండా


గిరిజన హస్తకళాకారుల జీవనోపాధి అవకాశాలను బలోపేతం చేయడం ద్వారా ఈశాన్య ప్రాంతంలో గిరిజన జీవనాన్ని మెరుగుపరచడం ఈ పథకం ఉద్దేశం

Posted On: 17 APR 2023 6:02PM by PIB Hyderabad

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఈశాన్య ప్రాంతంలోని షెడ్యూల్డ్ తెగల ప్రజల ప్రయోజనాల కోసం “మార్కెటింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ డెవలప్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ట్రైబల్‌ ప్రొడక్ట్స్‌ ఫ్రమ్‌ నార్త్‌-ఈస్ట్రన్‌ రీజియన్‌ (పీటీపీ-ఎన్‌ఈఆర్‌)" అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి గిరిజన ఉత్పత్తుల సేకరణ, లాజిస్టిక్స్, మార్కెటింగ్‌ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా గిరిజన చేతివృత్తుల ప్రజలకు జీవనోపాధి అవకాశాలను బలోపేతం చేయడం ఈ పథకం లక్ష్యం.  అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు ఈ పథకం వర్తిస్తుంది.

18.04.2023న, మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ఉన్న ఎంఎస్‌ఎఫ్‌డీఎస్‌ ఆడిటోరియంలో ఈ పథకాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా ప్రారంభిస్తారు. మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.బీరెన్ సింగ్, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.

గిరిజన హస్తకళాకారులకు అంకుర మద్దతు, సమీకరణ, నైపుణ్యం & వ్యవస్థాపత అభివృద్ధి, సేకరణ, మార్కెటింగ్, రవాణా, ప్రచారం వంటి కార్యక్రమాల ద్వారా అన్ని రకాల సాయం అందించి, తద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను వృద్ధి చేసుకునేందుకు పీటీపీ-ఎన్‌ఈఆర్‌ పథకం వీలు కల్పిస్తుంది. పథకంలో భాగంగా, ఏప్రిల్-మే 2023 కాలంలో, 18.04.2023 నుంచి ఈశాన్య ప్రాంతంలోని వివిధ జిల్లాల్లో 68 గిరిజన హస్తకళాకారుల మేళాలను (TAMs) నిర్వహిస్తారు.

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నోడల్ ఏజెన్సీ అయిన ట్రైఫెడ్‌, గిరిజన ప్రజల వారసత్వ సంప్రదాయాలను కాపాడుతూనే వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రయత్నాలను కొనసాగిస్తోంది.

***



(Release ID: 1917637) Visitor Counter : 134