వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల ఫిర్యాదులపై 2023 ఏప్రిల్ 18న ముంబై లో రియల్ ఎస్టేట్ రంగం వర్గాలు, వినియోగదారుల సంఘాలతో తొలిసారిగా సమావేశం నిర్వహించనున్న కేంద్రం


వినియోగదారుల సంఘాలకు అందుతున్న ఫిర్యాదుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఫిర్యాదులు 10% వరకు ఉన్నాయి

Posted On: 17 APR 2023 1:38PM by PIB Hyderabad

రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.  వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి గతంలో చేసిన ప్రయత్నాలు విజయవంతం కావడంతో రియల్ ఎస్టేట్ రంగం ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగా 2023 ఏప్రిల్ 18న ముంబై లో ' రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు' అనే అంశంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్ణయించింది.  మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ రౌండ్  టేబుల్ సమావేశం జరుగుతుంది. 

వినియోగదారుల సంఘాలకు అందుతున్న మొత్తం ఫిర్యాదుల్లో 10% వరకు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఫిర్యాదులు ఉంటున్నాయి.  వివిధ వినియోగదారుల సంఘాలలో ఇంతవరకు 2,30,517 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 1,76,895 ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయి. వివిధ సంఘాల వద్ద  523,622 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. గృహ నిర్మాణ రంగానికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి రేరా, ఎన్ సి ఎల్ టీ లాంటి ట్రిబునళ్లు పనిచేస్తున్నప్పటికీ వినియోగదారుల కమిషన్ల వద్ద కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 

రియల్ ఎస్టేట్ రంగంలో ఫిర్యాదుల పరిష్కారానికి తొలిసారిగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

గృహ నిర్మాణ రంగంలో వివాదాల సంఖ్య తగ్గించడానికి సహకరించే విధాన నిర్ణయం రూపకల్పనపై సమావేశం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. దీనికోసం వినియోగదారుల సంఘాలకు అందిన ఫిర్యాదులను సమగ్రంగా విశ్లేషిస్తారు. ఫిర్యాదుల దాఖలకు దారితీస్తున్న ప్రధాన కారణాలను  గుర్తించడం జరుగుతుంది. 

గృహ నిర్మాణ రంగానికి సంబంధించిన కేసుల పరిష్కారానికి  రేరా లాంటి సంస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ  వినియోగదారుల సంఘాలను వినియోగదారులు ఎందుకు ఆశ్రయిస్తున్నారు అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తారు. దీనితో పాటు గృహ నిర్మాణ రంగానికి సంబంధించిన ఫిర్యాదులను వేగంగా సమర్ధంగా పరిష్కరించడానికి అమలు చేయాల్సిన చర్యలపై కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చిస్తారు.  

జాతీయ లోక్ అదాలత్ 12.11.2022 న రాష్ట్ర/జిల్లా వినియోదారుల సంఘాల సహకారంతో నిర్వహించిన  జాతీయ లోక్ అదాలత్ లో పెండింగ్ లో ఉన్న అనేక కేసులు పరిష్కారం అయ్యాయి. గతంలో వినియోగదారుల సంఘాల ఎదుట పెండింగ్ లో ఉన్న బీమా, వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. 

ముంబై రౌండ్ టేబుల్ సమావేశం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరుగుతుంది. సమావేశంలో జాతీయ సంఘం సభ్యులు, మహారాష్ట్ర, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల వినియోగదారుల సంఘాల అధ్యక్షులు,  రేరా  అప్పిలేట్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర అధ్యక్షుడు, ఢిల్లీ, మహారాష్ట్ర రేరా  చైర్మన్లు, ఢిల్లీ, బెంగళూరు, థానే, పూణే, రాయగఢ్, చండీగఢ్  జిల్లా వినియోగదారుల సంఘాల  అధ్యక్షులు, కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రేరా, ఐబిబిఐ, మహారాష్ట్ర ప్రభుత్వం,ఏఎస్సీఐ, బిల్డర్ల సంఘం ప్రతినిధులు పాల్గొంటారు. 

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల వ్యవహారాల శాఖ కృషి చేస్తూ వినియోగదారుల హక్కుల చట్టం 2019 నిబంధనల అమలు కోసం కృషి చేస్తోంది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం, పెండింగ్ కేసుల పరిష్కారం కోసం గతంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహించింది.  

 

***


(Release ID: 1917377) Visitor Counter : 165