వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్ తనకున్న 25 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలను భారతదేశం గౌరవిస్తుంది.. శ్రీ.పీయూష్ గోయల్


పారిస్ లో భారతీయులతో మాట్లాడిన శ్రీ గోయల్

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి, యువత ఆకాంక్షలు నెరవేరేలా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వ కార్యక్రమాలు అమలు. శ్రీ గోయల్

ప్రతి భారతీయుడు దేశ రాయబారిగా వ్యవహరించాలి.. శ్రీ గోయల్

Posted On: 11 APR 2023 1:10PM by PIB Hyderabad

ప్రతి రంగంలో మార్గదర్శకత్వం కోసం ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఫ్రాన్స్ దేశంతో 75 సంవత్సరాల స్నేహ సంబంధాలు, 25 సంవత్సరాల  25 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలను భారతదేశం గౌరవిస్తుందని అన్నారు. రక్షణ, వాణిజ్య, పెట్టుబడి లాంటి రంగాల్లో రెండు దేశాల మధ్య పటిష్ట సంబంధాలు ఉన్నాయని పేర్కొన్న శ్రీ గోయల్ భారతదేశం సాధించిన ప్రగతిలో ఫ్రాన్స్ గణనీయమైన పాత్ర పోషించిందని అన్నారు. ఫ్రాన్సుతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని శ్రీ గోయల్ అన్నారు. ఫ్రాన్స్ లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న భారతీయులు రెండు దేశాల మధ్య  సంబంధాలు పటిష్టం అయ్యేలా చూడడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు,పర్యాటక రంగంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని శ్రీ గోయల్ అన్నారు. 

నిన్న పారిస్ లో శ్రీ గోయల్ ఫ్రాన్స్ లో నివసిస్తున్న భారతీయులతో సమావేశం అయ్యారు. వివిధ రంగాల్లో భారతదేశం సాధించిన ప్రగతిని శ్రీ గోయల్ వివరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో బలీయమైన శక్తిగా అవతరించిందని శ్రీ గోయల్ అన్నారు. 

1947 లో స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ప్రపంచంలో తనకంటూ గుర్తింపు సాధించడానికి  భారతదేశం కృషి ప్రారంభించిందని శ్రీ గోయల్ అన్నారు. ఈ సంవత్సరం ఫ్రాన్స్ తో 25 సంవత్సరాల స్నేహసంబంధాలు, 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను భారతదేశం  జరుపుకుంటుందని ఆయన అన్నారు. 75 సంవత్సరాల కాలంలో సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించడానికి గల అవకాశాలను రెండు దేశాలు గుర్తించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. 

భారతదేశంలో గత 9 సంవత్సరాల కాలంలో చోటు చేసుకున్న మార్పులను ప్రవాస భారతీయులకు శ్రీ గోయల్ వివరించారు. దేశ ప్రజలందరికీ ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో నివసిస్తున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. అందరికీ గృహ వసతి, ఆరోగ్య సంరక్షణ, ఆహారం, వస్త్రాలు సమకూర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని స్థాయిల్లో అమలు జరుగుతున్నాయన్నారు. గిరిజనులకు సాధికారత కల్పించడానికి నాయకులు, ఏకలవ్య విద్యా సంస్థల ద్వారా కృషి చేస్తున్నామన్నారు. 

2014 వరకు మరుగుదొడ్డి లాంటి కనీస సౌకర్యానికి కూడా సగం మంది భారతీయులు దూరంగా ఉన్నారని శ్రీ గోయల్ అన్నారు. ప్రభుత్వాలు వచ్చాయి వెళ్లాయి గాని ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లులు, సోదరీమణులు, పిల్లల ఆత్మ గౌరవం కల్పించడానికి కనీస చర్యలు అమలు జరగలేదన్నారు. మరుగుదొడ్డి లాంటి కనీస సౌకర్యం కల్పించడం ద్వారా ప్రజలకు  గౌరవం కల్పించవచ్చు అన్న అంశాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తించి, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారని శ్రీ గోయల్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం కలిగిందని  ఆడపడుచులు గౌరవంతో జీవిస్తున్నారని శ్రీ గోయల్ అన్నారు. మహిళలకు సాధికారత కల్పించడానికి ప్రభుత్వం దాదాపు ప్రతి ఇంటికి వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చిందన్నారు. దీంతో సాంప్రదాయ పద్దతిలో బొగ్గు, కట్టెలు ఉపయోగించి వంట చేసే చాకిరి నుంచి మహిళలకు విముక్తి కలిగి, వారి ఆరోగ్యం మెరుగుపడిందని శ్రీ గోయల్ అన్నారు.

ప్రజలందరికి ఆరోగ్య సంరక్షణ కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రారంభించిందని శ్రీ గోయల్ తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం గా గుర్తింపు పొందిన  ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సంరక్షణ పథకం కింద దాదాపు 50 కోట్ల మంది ప్రజలు  ప్రయోజనం పొందుతున్నారన్నారు. నూతన విద్యా విధానం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అంకుర సంస్థలకు అందిస్తున్న  ప్రోత్సాహం,జల్ జీవన్ మిషన్ లాంటి కార్యక్రమాల వివరాలను  కూడా శ్రీ గోయల్ భారతీయులకు వివరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలతో భారతదేశం రూపు రేఖలు మారిపోయి దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందిందన్నారు. 

కోవిడ్-19 సమయంలో ప్రజలందరికి ఆహారం, మంచినీళ్లు లాంటి కనీస సౌకర్యాలకు కొరత లేకుండా చూడడానికి ప్రభుత్వం కృషి చేసి విజయం సాధించిందని శ్రీ గోయల్ తెలిపారు. కోవిడ్ సమయంలో అత్యంత కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేసిన భారతదేశం ప్రజలను ఆదుకున్న విధానాన్ని ప్రపంచ దేశాలు ప్రసంసించాయన్నారు. 

గత 9 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధానాలు భారతదేశం రూపురేఖలు మార్చి వేశాయి అని పేర్కొన్న శ్రీ గోయల్ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడి నవ భారతదేశం నిర్మాణానికి సహకరించాయన్నారు. ప్రతి భారతీయుడు పోటీ పడటానికి అవసరమైన నైపుణ్యం సాధించారన్నారు. కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో యువత ప్రపంచంలో వస్తున్న మార్పులు గమనిస్తూ భవిష్యత్తులో అభివృద్ధి సాధించడానికి సిద్ధమవుతున్నారని శ్రీ గోయల్ తెలిపారు. ఉద్యోగాలు చేయడానికి మహిళలు ముందుకు వస్తున్నారని శ్రీ గోయల్ అన్నారు. ఉత్పత్తి, సేవా రంగాల్లో ప్రగతి సాధిస్తున్న భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందడానికి సిద్ధంగా ఉందన్నారు. 

అభివృద్ధి సాధించడానికి భారతదేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని శ్రీ గోయల్ అన్నారు. 2022-23 లో భారతదేశం నుంచి ఎగుమతులు  $ 765 బిలియన్ల మేరకు పెరిగాయని శ్రీ గోయల్ వివరించారు. భారతదేశం శక్తి సామర్థ్యం, భారతదేశం అందిస్తున్న అవకాశాలను ప్రపంచ దేశాలు గుర్తించాయని అన్నారు. ఫ్రాన్స్ లో నివసిస్తున్న ప్రతి భారతీయుడు భారతదేశ రాయబారి అని శ్రీ గోయల్ అన్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేలా చూడడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి ఈ అమృత కాలంలో ఫ్రాన్స్ లో నివసిస్తున్న ప్రతి భారతీయుడు తన సహకారం అందించాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెబుతున్న విధంగా  ప్రపంచంలో భారతదేశం సముచిత స్థానం లభించడానికి సరైన సమయం ఆసన్నమయిందని శ్రీ గోయల్ అన్నారు. 

***


(Release ID: 1915740) Visitor Counter : 220