రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

మాజీ సైనికులకు సంక్షేమం, పునరావాసంతో పాటు మరింత భరోసా కల్పించేందుకు రక్షణ మంత్రి అధ్యక్షతన న్యూఢిల్లీలో 31వ కేంద్రీయ సైనిక్ బోర్డు సమావేశం


అనుభవజ్ఞుల గొప్ప అనుభవాన్ని దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి కొత్త మార్గాలను రూపొందించాలని రాష్ట్రాలు/యుటిలకు విజ్ఞప్తి

మాజీ సైనికులు జాతీయ ఆస్తులు; వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

కేంద్రీయ సైనిక్ బోర్డు వివిధ సంక్షేమ పథకాల కింద గత మూడేళ్లలో మూడు లక్షల మంది లబ్ధిదారులకు రూ.800 కోట్ల ఆర్థిక సహాయం అందించింది.

Posted On: 11 APR 2023 2:04PM by PIB Hyderabad

ఏప్రిల్ 11, 2023న న్యూఢిల్లీలో జరిగిన కేంద్రీయ సైనిక్ బోర్డు (కెఎస్‌బి) 31వ సమావేశానికి రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. కెఎస్‌బి అనేది మాజీ సైనికులకు సంక్షేమం మరియు పునరావాసం (ఈఎస్‌ఎం) కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల (యూటీలు) అపెక్స్ బాడీ.మాజీ సైనికుల సంక్షేమం మరియు పునరావాసాన్ని మరింతగా నిర్ధారించడానికి విధానపరమైన చర్యల ద్వారా ఈఎస్‌ఎం సోదరులను చేరుకోవడానికి గల మార్గాలు సమావేశంలో చర్చించబడ్డాయి.

కార్యక్రమంలో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యోపన్యాసం చేస్తూ మాజీ సైనికులను జాతీయ ఆస్తులుగా అభివర్ణించారు. రాష్ట్రాలు/యుటిలు వారి గొప్ప మరియు ఆచరణాత్మక అనుభవాన్ని దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి కొత్త మార్గాలను రూపొందించాలని కోరారు. పలు రాష్ట్రాల్లో మాజీ సైనికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయని, వీటిని పూర్తిగా అనుసరించి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

సైనికుల సంక్షేమం కోసం కేంద్రం మరియు రాష్ట్రాలు/యుటిలు ఎల్లప్పుడూ కలిసి పనిచేస్తున్నాయని రక్షణ మంత్రి ప్రశంసించారు. కెఎస్‌బి చేపడుతున్న పనులను సహకార సమాఖ్య విధానానికి ప్రకాశవంతమైన ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. ‘‘రాష్ట్రాలు లేదా రాజకీయ పార్టీల మధ్య చాలా విషయాల్లో విభేదాలు ఉన్నాయి. ఇదంతా ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ, మన సైనికులు & అనుభవజ్ఞుల సంక్షేమం విషయానికి వస్తే అందరూ ఒకే వేదిక మీదకు వస్తారు. మన సైనికుల విషయంలో సామాజిక, రాజకీయ ఏకాభిప్రాయం ఎప్పుడూ ఉంటుంది. సాయుధ దళాలు మొత్తం దేశాన్ని సమానంగా రక్షించినట్లే మన సైనికులు పదవీ విరమణ చేసి తిరిగి సమాజానికి తిరిగి వచ్చినప్పుడు వారు గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని నిర్ధారించుకోవడం మన జాతీయ మరియు సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు.

సాయుధ దళాలను యవ్వనంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో పెద్ద సంఖ్యలో సైనికులు 35-40 సంవత్సరాల వయస్సులో గౌరవప్రదంగా విడుదల చేయబడతారు. దీని ఫలితంగా ప్రస్తుతం ఉన్న 34 లక్షల మంది మాజీ సైనికులకు ప్రతి సంవత్సరం 60,000 మంది సైనికులు అదనంగా చేరుతున్నారు. ఈ క్రమంలో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈఎస్‌ఎం సోదరుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన సంకల్పాన్ని వినిపించారు. వారి శ్రేయస్సు మరియు అభివృద్ధికి రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న అనేక చర్యలను వివరించారు. “గత మూడేళ్లలో కెఎస్‌బి ఆధ్వర్యంలో వివిధ సంక్షేమ పథకాల కింద సుమారు 3.16 లక్షల మంది లబ్ధిదారులకు సుమారు 800 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించబడింది. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష మంది లబ్ధిదారులకు సుమారు రూ.240 కోట్లు పంపిణీ చేశారు. అవసరమైన మేరకు బడ్జెట్‌ను ప్రభుత్వం సమకూరుస్తోంది’’ అని చెప్పారు.

ఇందులో భాగంగా కిర్కీలోని దివ్యాంగుల పునరావాస కేంద్రంతో పాటు మొహాలీలోని చెషైర్ హోమ్  మరియు డెహ్రాడూన్, లక్నో మరియు ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా 36 వార్ మెమోరియల్ హాస్పిటల్స్‌కు సంస్థాగత గ్రాంట్లు ఇవ్వబడ్డాయి. ఈఎస్‌ఎం సోదరుల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యత అని మరియు ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసిహెచ్‌ఎస్) సౌకర్యాలను క్రమ పద్ధతిలో సమీక్షిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.

ప్రస్తుతం 30 ప్రాంతీయ కేంద్రాలు మరియు 427 పాలీక్లినిక్‌లు పనిచేస్తున్నాయి. 75 టైప్ సి&డి పాలిక్లినిక్‌లకు ఇప్పటికే ఆమోదం అందించబడింది మరియు రీచ్‌ను పెంచడానికి వీడియో ప్లాట్‌ఫారమ్ సెహత్ ఓపిడి ప్రారంభించబడింది. వివిధ ప్రదేశాలలో టాటా మెమోరియల్ హాస్పిటల్స్ వంటి కొత్త నాణ్యమైన ఆసుపత్రుల ఎంప్యానెల్‌మెంట్ జరుగుతోంది. లబ్ధిదారులకు మందులు అందుబాటులో ఉండేలా మందుల కొనుగోళ్లను సులభతరం చేస్తున్నారు.

ఈఎస్‌ఎం సోదర వర్గాన్ని చేరుకోవడానికి నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన మరియు ఔట్రీచ్ కార్యక్రమాలను కూడా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ హైలైట్ చేశారు. అనుభవజ్ఞుల సంక్షేమం మరియు పునరావాసం కోసం సమిష్టి కృషిలో పౌరులు మరియు కార్పొరేట్ రంగాన్ని చేర్చడానికి ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. అన్ని పథకాల్లో దరఖాస్తు నుంచి పంపిణీ వరకు ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్‌గా ఉంటుందని తెలిపారు.

ప్రత్యేకించి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సరిహద్దు భద్రతను నిర్ధారించి దేశానికి అవసరమైనప్పుడు సేవలందిస్తున్నందుకు సాయుధ బలగాలను రక్షణ మంత్రి ప్రశంసించారు. లాంఛనంగా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మాతృభూమికి సేవ చేసే ఆ జ్యోతిని వెలిగించిన మాజీ సైనికులను కొనియాడారు. ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారిపై దేశం చేస్తున్న పోరాటంలో అనుభవజ్ఞులు చేసిన విలువైన సహకారాన్ని ఆయన అనేక సందర్భాల్లో హైలైట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరుపేదలకు మందులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఇతర సహాయ సామగ్రిని అందించడం ద్వారా మాజీ సైనికులు ప్రభుత్వ ప్రయత్నాలకు సహకరించారు.

సమావేశ ఎజెండా పాయింట్లు సాయుధ దళాల అనుభవజ్ఞుల దినోత్సవ వేడుకల పరిధిని విస్తరించే మార్గాలను కలిగి ఉన్నాయి; వాటిలో ఈఎస్‌ఎం సంఘంలో గౌరవాన్ని పెంపొందించడం; సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ కింద గ్రాంట్ల పెంపు; సాయుధ దళాల సిబ్బందికి అందించబడిన రాష్ట్ర ప్రయోజనాలు/గ్రాంట్లలో ఏకరూపత; ఆయా రాష్ట్రాల్లో ఈఎస్‌ఎం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం మరియు ఉత్తమ పనితీరు కనబరిచిన రాజ్య సైనిక్ బోర్డు కోసం అవార్డును ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. మాజీ సైనికులు ఎదుర్కొంటున్న పెన్షన్ సమస్యలను పరిష్కరించడంలో సిస్టం ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష (స్పర్ష్) ఎంతగానో దోహదపడుతుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు.మాజీ సైనికులతో పాటు సేవలందిస్తున్న సిబ్బంది భూ వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఈ సదస్సులోని చర్చల్లో వివిధ రాష్ట్రాల మంత్రులు; చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్; నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్; ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే; కార్యదర్శి (మాజీ సైనికుల సంక్షేమం) శ్రీ విజయ్ కుమార్ సింగ్; కార్యదర్శి, కెఎస్‌బి కమోడోర్ హెచ్‌పి సింగ్; రాష్ట్రాలు/యుటిల ప్రతినిధులు మరియు ఇతర సీనియర్ సివిల్ & మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.


 

*****



(Release ID: 1915623) Visitor Counter : 202