ఆయుష్
"హోమియో పరివార్ - సర్వజన్ స్వాస్త్య, ఒక ఆరోగ్యం, ఒక కుటుంబం" అనే ఇతివృత్తంతో ప్రపంచ హోమియోపతి దినోత్సవం జరిగింది.
ఆరోగ్య సంరక్షణకు సమగ్రమైన, సమీకృత విధానం కావాలి - భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంఖర్
వైద్య వ్యవస్థల్లో పరిశోధన, అభివృద్ధిని మరింత సాక్ష్యాల ఆధారంగా, ప్రభావవంతంగా చేయడానికి మంత్రిత్వ శాఖ ప్రోత్సహించింది - శ్రీ సర్బానంద సోనోవాల్
"ప్రపంచ హోమియోపతి దినోత్సవం" రోజున నిర్వహించిన శాస్త్రీయ సదస్సు, "మొత్తం కుటుంబం యొక్క ఆరోగ్యం, శ్రేయస్సు కోసం సాక్ష్యం-ఆధారిత హోమియోపతి చికిత్సను ప్రోత్సహించడం" అనే అంశాన్ని లక్ష్యంగా పెట్టుకుంది
Posted On:
10 APR 2023 1:51PM by PIB Hyderabad
ఈ రోజు న్యూఢిల్లీలో ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి ఒక రోజు శాస్త్రీయ సదస్సు నిర్వహించింది. “హోమియో పరివార్ – సర్వజన్ స్వాస్థ్య, ఒక ఆరోగ్యం, ఒక కుటుంబం” అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. మొత్తం కుటుంబం యొక్క ఆరోగ్యం, శ్రేయస్సు కోసం సాక్ష్యం-ఆధారిత హోమియోపతి చికిత్సను ప్రోత్సహించడం, హోమియోపతి వైద్యుల సామర్థ్యాన్ని పెంపొందించడం, హోమియోపతిని మొదటి వరుస చికిత్సగా అందించడంతో పాటు, గృహాలలో హోమియోపతిని ఎంపిక చేసే చికిత్సగా ప్రోత్సహించడం" అనే అంశాలను ఈ సదస్సు లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌ఖర్ ప్రసంగిస్తూ, “మన ఆరోగ్య సంరక్షణకు సమగ్రమైన, సమీకృత విధానం అవసరం. భారతీయ కుటుంబాల్లో ఆచరించే సమగ్ర ఆరోగ్యం పట్ల కొత్త చొరవకు ఈ సదస్సు నాంది పలుకుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ సదస్సు ఇతివృత్తం - హోమియో పరివార్, భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ యొక్క ముఖ్య లక్షణం అయిన వైద్య బహుత్వానికి అనుగుణంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. హోమియోపతి వైద్య విధానం ప్రకృతికి అనుసంధానమై ఉంది. ఇది రెండవ అతిపెద్ద, వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న వైద్య వ్యవస్థగా నిలిచింది." అని పేర్కొన్నారు.
కోవిడ్-19ని ఎదుర్కోవడంలో హోమియోపతి పాత్రను ఉపరాష్ట్రపతి మరింతగా ఉదాహరిస్తూ, "మహమ్మారిని ఎదుర్కోవడంలో హోమియోపతి ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతదేశం 'ఫార్మసీ-ఆఫ్-ది-వరల్డ్' గా పేరు తెచ్చుకుంది. ఆ గొప్పదనం భారతదేశ నాణ్యత హామీ నిబద్ధతకు దక్కుతుంది." అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, ఆయుష్ ఔషధాల వ్యవస్థను ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా వివరించారు. అదేవిధంగా, వాటిని మరింత సాక్ష్యాల ఆధారంగా, ప్రభావవంతంగా చేయడానికి వైద్య వ్యవస్థల్లో పరిశోధన, అభివృద్ధిని కూడా మంత్రిత్వ శాఖ ప్రోత్సహించిందని ఆయన చెప్పారు. హోమియోపతిలో నాణ్యమైన పరిశోధనకు మద్దతుగా, ఆయుష్ మంత్రిత్వ శాఖ తన బడ్జెట్ కేటాయింపులు పెంచింది. ప్రజారోగ్యం, అంటువ్యాధులు, ఔట్ పేషెంట్ల ఆధారిత పరిశోధన లేదా ఆసుపత్రి ఆధారిత సంరక్షణ పరిశోధనల్లో సి.సి.ఆర్.హెచ్. చేసిన కృషికి ఆయన సంతృప్తిని వ్యక్తం చేసింది. క్లినికల్ ప్రాక్టీస్, బోధన లేదా పరిశోధన ద్వారా హోమియోపతిని ప్రోత్సహించి, పెంపొందించడానికి కృషి కొనసాగించాలని హోమియోపతి సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆయుష్, డబ్ల్యూ.సి.డి. శాఖల సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ మాట్లాడుతూ, "నివారణ సంరక్షణతో పాటు అనారోగ్యాల ప్రారంభంలో రోగ నిర్ధారణ, చికిత్స ప్రాముఖ్యతను మనం గ్రహించాలి. సంవత్సరాలుగా సి.సి.ఆర్.హెచ్. కార్యకలాపాలు, విజయాలు వివిధ ప్రజా ప్రచార కార్యకలాపాల ద్వారా దేశ నిర్మాణానికి దోహదపడ్డాయి." అని చెప్పారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా నిర్వహణలో శ్రీ సర్బానంద సోనోవాల్, డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ అధ్యక్షతన ‘హోమియోపతి అభివృద్ధిలో విధాన అంశాలు’ అనే విషయంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయుష్ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి శ్రీ అజిత్ ఎం. శరణ్; ఆయుష్ మంత్రిత్వ శాఖ, జాయింట్ సెక్రటరీ, శ్రీ రాహుల్ శర్మ; ఆయుష్ మంత్రిత్వ శాఖ. సలహాదారు (హోమియోపతి), డాక్టర్ సంగీత దుగ్గల్ ప్రసంగించారు. "హోమియోపతి పరిశోధన, విద్య, అభ్యాసాన్ని వ్యూహరచన చేయడం", "ప్రజారోగ్యంలో హోమియోపతి", "ఫార్మకో-విజిలెన్స్" వంటి అంశాలపై కూడా వారు ప్రసంగించారు.
కోవిడ్-19 చికిత్సలో "ఆర్సెనికమ్ ఆల్బమ్" యొక్క రోగనిరోధక ప్రతిస్పందనలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం కోసం కేరళ ప్రభుత్వ హోమియోపతి విభాగంతో సి.సి.ఆర్.హెచ్., ఒక ఒప్పందం చేసుకుంది. హోమియోపతీ వైద్య విద్యా రంగానికి పెద్దపీట వేయడంతో పాటు విద్యను పరిశోధనతో అనుసంధానించడానికి తగిన ప్రోత్సాహాన్ని అందించడం కోసం, సి.సి.ఆర్.హెచ్. 70 రాష్ట్ర / జాతీయ హోమియోపతి వైద్య కళాశాలలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. అనంతరం, హోమియోపతి (ఎస్.టి.ఎస్.హెచ్) లో 134 సి.సి.ఆర్.హెచ్. స్వల్పకాలిక స్టూడెంట్‌షిప్‌లతో పాటు 07 ఎం.డి. స్కాలర్‌షిప్ విజేతలను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 9 సి.సి.ఆర్.హెచ్. ప్రచురణలను భారత ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. రెండు డాక్యుమెంటరీలు, ఒక వెబ్ పోర్టల్ 'సి.సి.ఆర్.హెచ్. ఈ-లైబ్రరీ కన్సార్టియం' కూడా విడుదలయ్యాయి. హోమియోపతి అభివృద్ధిలో విధానపరమైన అంశాలు, హోమియోపతి అభివృద్ధికి వ్యూహాత్మక ముసాయిదా, హోమియోపతిలో పరిశోధన ఆధారాలు, హోమియోపతి ప్రాక్టీస్ లో నైపుణ్యం, అనుభవం అనే అంశాలపై ఈ శాస్త్రీయ సదస్సులో విడివిడిగా చర్చలు జరిగాయి.
*****
(Release ID: 1915460)
Visitor Counter : 200