ప్రధాన మంత్రి కార్యాలయం

ఏప్రిల్‌ 1న భోపాల్‌ సందర్శించనున్న ప్రధానమంత్రి


కమాండర్ల సంయుక్త సదస్సు-2023కు హాజరు కానున్న ప్రధానమంత్రి;

భోపాల్‌-న్యూఢిల్లీ ‘వందేభారత్‌’ ఎక్స్'ప్రెస్’ను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధానమంత్రి

Posted On: 30 MAR 2023 11:34AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఏప్రిల్ 1న భోపాల్‌లో పర్యటిస్తారు. ఆ రోజున ఉదయం 10 గంటల ప్రాంతంలో నగరంలోని కుశభావ్‌ ఠాక్రే హాల్‌లో నిర్వహించే కమాండర్ల సంయుక్త సదస్సు-2023కు ఆయన హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:15 గంటలకు భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో భోపాల్-న్యూఢిల్లీ మధ్య ‘వందేభారత్ ఎక్స్‌’ప్రెస్ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు.

కమాండర్ల సంయుక్త సదస్సు-2023

   భోపాల్‌లో 'సంసిద్ధత-సముద్ధరిత-సముచిత బలగాలు’ ఇతివృత్తంగా సాయుధ బలగాల కమాండర్ల సదస్సు 2023 మార్చి 30 నుంచి ఏప్రిల్ 1దాకా మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ సందర్భంగా, సాయుధ దళాలలో సంయుక్త, ఉమ్మడి పద్ధతులలో కర్తవ్యవ నిర్వహణసహా జాతీయ భద్రత సంబంధిత వివిధ రకాల అంశాలపై చర్చలు సాగుతాయి. ‘స్వయం సమృద్ధి’ సాధన దిశగా సాయుధ బలగాల సన్నద్ధతతోపాటు రక్షణ పర్యావరణ వ్యవస్థలో పురోగతిని కూడా సమీక్షిస్తారు. ఈ సదస్సులో త్రివిధ సాయుధ దళాల కమాండర్లు, రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొంటారు. అలాగే చర్చల్లో భాగస్వాములయ్యే  సైనికులు, నావికులు, వైమానిక దళ సిబ్బంది మధ్య సార్వజనీన, సాధారణ పరస్పర చర్చలు కూడా కొనసాగుతాయి.

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌

   దేశంలో ప్రజల ప్రయాణానుభవాన్ని ‘వందేభారత్’ ఎక్స్‌’ప్రెస్ పూర్తిగా పునర్నిర్వచించింది. ఈ నేపథ్యంలో భోపాల్‌ నగరంలోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి న్యూఢిల్లీ స్టేషన్‌ మధ్య ప్రవేశపెట్టిన కొత్త రైలు దేశంలో 11వ ‘వందేభారత్’ రైలు అవుతుంది. దేశీయంగా రూపొందించిన ఈ రైలులో అత్యాధునిక ప్రయాణిక సౌకర్యాలున్నాయి. ఇది ప్రయాణికులకు వేగవంతం, సౌకర్యవంతం, సుఖవంతమైన ప్రయాణ అనుభవం కల్పిస్తుంది. అలాగే పర్యాటకాన్ని పెంచడంతోపాటు ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది.

***



(Release ID: 1912217) Visitor Counter : 132