ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అన్ని అరుదైన వ్యాధుల చికిత్సల్లో వ్యక్తిగతంగా ఉపయోగించుకునేందుకు దిగుమతి చేసుకునే అన్ని రకాల మందులు & ఆహారంపై కస్టమ్స్ సుంకం రద్దు

Posted On: 30 MAR 2023 10:20AM by PIB Hyderabad

అన్ని అరుదైన వ్యాధుల చికిత్సల్లో వ్యక్తిగతంగా ఉపయోగించుకునేందుకు దిగుమతి చేసుకునే అన్ని రకాల మందులు & ఆహారంపై విధించే ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తి మినహాయింపును ప్రకటించింది. 'అరుదైన వ్యాధుల కోసం జాతీయ విధానం 2021' కింద ఈ మినహాయింపును ఇచ్చింది.

ఈ మినహాయింపును పొందేందుకు, వ్యక్తిగత దిగుమతిదారు కేంద్ర లేదా రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారి లేదా జిల్లా వైద్యాధికారి లేదా జిల్లాలోని సివిల్ సర్జన్ నుంచి ధృవపత్రం తీసుకువచ్చి సమర్పించాలి. సాధారణంగా, మందులు/ఔషధాలపై 10% ప్రాథమిక కస్టమ్స్ సుంకం చెల్లించాలి. కొన్ని రకాల ప్రాణ రక్షణ మందులు/టీకాలపై రాయితీ కింద 5% లేదా అసలు సుంకం ఉండదు.

వెన్నెముక కండరాల క్షీణత చికిత్స కోసం ఉపయోగించే ఔషధాలకు ఇప్పటికే మినహాయింపులు అందించింది. ఇతర అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకం మినహాయింపు కోరుతూ ప్రభుత్వానికి చాలా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు లేదా ప్రత్యేక ఆహారాలు ఖరీదైనవి, దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. 10 కిలోల బరువున్న పిల్లల విషయంలో, కొన్ని అరుదైన వ్యాధుల చికిత్సకు ఏడాది ఖర్చు ₹ 10 లక్షల నుంచి ₹ 1 కోటి వరకు ఉండవచ్చు. జీవిత కాల చికిత్స అవసరం పడవచ్చు, పిల్లల వయస్సు, బరువుతో పాటే వ్యయం పెరుగుతుందని అంచనా.

ఈ మినహాయింపు వల్ల వ్యయంలో గణనీయంగా ఆదా అవుతుంది, రోగులకు చాలా ఉపశమనం లభిస్తుంది.

వివిధ రకాల క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగించే పెంబ్రోలిజుమాబ్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది.

గెజిట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

****


(Release ID: 1912189) Visitor Counter : 208