ప్రధాన మంత్రి కార్యాలయం

కర్ణాటకలోని హుబ్బళ్ళి-ధార్వాడ్ లో అభివృద్ధి పథకాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ధార్వాడ్ ఐఐటీ జాతికి అంకితం


ప్రపంచంలో అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫామ్ శ్రీ సిద్ధరూధ స్వామీజీ హుబ్బళ్ళి స్టేషన్ లో జాతికి అంకితం

హంపి శిలలను ప్రతిబింబించే పునరభివృద్ధి చేసిన హోసపేట్ స్టేషన్ జాతికి అంకితం

ధార్వాడ్ బహుళ గ్రామ నీటి సరఫరా పథకానికి శంకుస్థాపన

హుబ్బళ్ళి -ధార్వాడ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు

“రాష్ట్రంలోని ప్రతి జిల్లా, గ్రామం సంపూర్ణ అభివృద్ధికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం అత్యంత నిజాయితీతో కృషి చేస్తోంది “

“ధార్వాడ్ ప్రత్యేకం. భారత సాంస్కృతిక ఉత్తేజానికి ఇది ప్రతిబింబం”

“ధార్వాడ్ లోని కొత్త ఐఐటీ కాంపస్ నాణ్యమైన విద్యనందిస్తుంది. మెరుగైన భవిష్యత్ కోసం యువ మస్తిష్కాలను తీర్చిదిద్దుతుంది.”

“ ప్రాజెక్టుల శంకుస్థాపనాలు మొదలు ప్రారంభోత్సవాల దాకా డబుల్ ఇంజన్ ప్రభుత్వం అదే వేగంతో పనిచేస్తుంది”

“మంచి విద్య అందరికీ అందాలి. నాణ్యమైన విద్యాసంస్థలు పెద్ద సంఖ్యలో ఉంటే ఎక్కువమందికి మంచి విద్య అందుతుంది”

“టెక్నాలజీ, మౌలిక వసతులు, స్మార్ట్ గవర్నెన్స్ హుబ్బళ్ళి -ధార్వాడ్ ప్రాంతాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుంది”

“ఈరోజు మనం యువతకు అన్నీ వనరులూ అందించి వచ్చే 25 ఏళ్ల కలలు సాకారం చేసుకోమంటున్నాం “

“నేడు భారతదేశం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థలలో ఒకటైంది.”

“భారత ప్రజాస్వామ్య మూలాలు వందల ఏళ్ళనాటి చరిత్రనుంచి పుట్టినవి. భారత ప్రజాస్వామ్య మూలాలను ఏ శక్తీ దెబ్బతీయలేదు”

“భారతదేశానికి హైటెక్ ఇంజన్ కర్ణాటక”

Posted On: 12 MAR 2023 6:19PM by PIB Hyderabad

కర్ణాటకలోని హుబ్బళ్ళి-ధార్వాడ్  లో అభివృద్ధి పథకాలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు  శంకుస్థాపనలు,  ప్రారంభోత్సవాలు చేశారు. ఆ ప్రాజెక్టులలో ధార్వాడ్ ఐఐటీ ప్రారంభోత్సవం కూడా ఉంది. దీని శంకుస్థాపన కూడా 2019 ఫిబ్రవరిలో  ప్రధాని చేతుల మీదుగానే జరిగింది. అదే విధంగా 1507 మీటర్ల పొడవుతో  ప్రపంచంలోనే అతిపొడవైన ప్లాట్ ఫామ్ గా గిన్నీస్ బుక్ లో రికార్డు సొంతం చేసుకున్న  సిద్ధ రూధ స్వామీజీ హుబ్బళ్ళి  స్టేషన్ ను, హోసపేట – హుబ్బళ్ళి – తినైఘాట్ సెక్షన్ విద్యుదీకరణ,  ఈ ప్రాంతంలో అనుసంధానత పెంచేలా   హోసపేట స్టేషన్ స్థాయి పెంపు లాంటి కార్యక్రమాలు ప్రారంభించారు. హుబ్బళ్ళి -ధార్వాడ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు ప్రధాని  శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు కూడా చేశారు. జయదేవ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు, ధార్వాడ్ బహుళ గ్రామ నీటి సరఫరా పథకానికి, తిప్పరిహళ్ళ  వరద నష్ట నియంత్రణ పథకానికి కూడా ప్రధానిం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, ఈ ఏడాది ప్రారంభంలోనే ఒకసారి హుబ్బళ్ళి  సందర్శించే అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో  తనకు స్వాగతం పలికి ఆశీర్వదించిన విషయం ప్రస్తావించారు. బెంగళూరు మొదలు బెలాగావి దాకా, కలబురగి నుంచి శివమొగ్గ దాకా, మైసూరు నుంచి తుముకూరు దాకా   గడిచిన కొద్ది సంవత్సరాలలో తన కర్ణాటక పర్యటనలను ప్రధాని గుర్తు చేసుకున్నారు.  కన్నడిగులు తన పట్ల చూపిన ఆపారమైన ప్రేమాభిమానాలను మరువలేనని చెబుతూ ప్రభుత్వం ఇక్కడి ప్రజల అవసరాలు తీర్చడానికి కృషి చేస్తుందని,  యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటం ద్వారా, మహిళాల సాధికారత పెంచటం ద్వారా వాళ్ళ జీవితాలను సుఖమయం చేస్తుందని హామీ ఇచ్చారు.  కర్ణాటక ప్రభుత్వపు డబుల్ ఇంజన్, రాష్ట్రంలోని  ప్రతి జిల్లాను, గ్రామాన్ని అత్యంత నిజాయితీగా అభివృద్ధి చేస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు.

శతాబ్దాల తరబడి మలేనాడు, బయలు సీమ ప్రాంతాలకు  ధార్వాడ్ ముఖద్వారంగా ఉందని, అందరినీ విశాల హృదయంతో ఆహ్వానించి అందరినుంచీ నేర్చుకుంటూ తనకు తాను సుసంపన్నమైందని అన్నారు. అందుకే ధార్వాడ్ కేవలం ముఖ ద్వారంగా ఉండిపోకుండా  కర్ణాటక, భారతదేశపు ఉత్తేజానికి ప్రతీకగా మారిందని అభివర్ణించారు.  సంగీత సాహిత్యాలతో కర్ణాటక సాంస్కృతిక రాజధానిగా  ధార్వాడ్ పేరుపొందిందని అన్నారు. ధార్వాడ్ కు చెందిన సాంస్కృతిక సారధులకు ప్రధాని ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.

ఆ రోజు  ఉదయం తన మాండ్యా పర్యటనను ప్రధాని ప్రస్తావించారు. బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ వే కచ్చితంగా సాఫ్ట్ వేర్ రంగంలో కర్ణాటకకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందన్నారు.  బెలాగావి లో కూడా ప్రధాని అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. శివమొగ్గ కువెంపు విమానాశ్రయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులన్నీ కర్ణాటక కొత్త అభివృద్ధి  చరిత్రను రాస్తున్నాయని అభివర్ణించారు.  

ధార్వాడ్ కొత్త ఐఐటీ కాంపస్ నాణ్యమైన విద్యనందించటానికి పాటుపడుతుందని,  యువ మస్తిష్కాలను మెరుగైన భవిష్యత్తుకు సిద్ధం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక అభివృద్ధి చరిత్రలో ఈ కొత్త ఐఐటీ కాంపస్ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు.  ధార్వాడ్ ఐఐటీ కాంపస్ లో ఉన్న హై టెక్  సౌకర్యాలవల్ల అది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో  స్ఫూర్తి నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.   ఈ కాంపస్ ప్రభుత్వ స్ఫూర్తికి చిహ్నమైన ‘సంకల్ప్  సే సిద్ధి’ ( పట్టుదలతో సాధన) కు నిదర్శనమని అన్నారు.  2019 లో శంకుస్థాపన చేయటాన్ని ప్రధాని గుర్తు చేసుకుంటూ, కరోనా సంక్షోభం వంటివి అవరోధాలుగా నిలిచినా నాలుగేళ్లలో పూర్తి కావటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.  శంకుస్థాపనలు  మొదలు ప్రారంభోత్సవాల దాకా డబుల్ ఇంజన్ ప్రభుత్వం అదే వేగంతో పనిచేస్తోందని, శంకుస్థాపన  చేసిన ప్రతి ప్రాజెక్టు ప్రారంభించటంలో తమకు నమ్మకముందని ప్రధాని చెప్పారు.   

నాణ్యమైన విద్యనందించే సంస్థలను విస్తరిస్తే వాటి నాణ్యత తగ్గిపోతుందనే భావన గత ప్రభుత్వానికి ఉండటం  దురదృష్టకరమని ప్రధాని వ్యాఖ్యానించారు. దీనివలన దేశ యువతకు, నవ భారతావనికి  భారీ నష్టం వాటిల్లిందన్నారు. మంచి విద్య  ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలన్నదే తమ అభిప్రాయమని, అందరికీ నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో  9 ఏళ్ళుగా విద్యాసంస్థలు పెంచుతున్నామని చెప్పారు. ఎయిమ్స్ సంఖ్య మూడు రెట్లు పెరిగిందని, గత ఏడు దశాబ్దాల కాలంలో 380 వైద్య కళాశాలలు పెడితే గత 9 ఏళ్లలోనే 250 వైద్య కళాశాలలు పెట్టామని అన్నారు.  9 ఏళ్లలో ఎన్నో ఐఐటీలు, ఐఐఎం లు స్థాపించామని కూడా ప్రధాని గుర్తు చేశారు.

21 వ శతాబ్దపు భారతదేశం తమ నగరాలను ఆధునీకరించుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. హుబ్బళ్ళి -ధార్వాడ్ ను స్మార్ట్ సిటీస్ జాబితాలో చేర్చటంతో ఈ రోజు ఎన్నో ప్రాజెక్టులు అంకితం చేశామన్నారు. టెక్నాలజీ, మౌలికసదుపాయాలు, స్మార్ట్ గవర్నెన్స్ వలన హుబ్బళ్ళి- ధార్వాడ్ కొత్త శిఖరాలను అధిరోహిస్తుందన్నారు.

బెంగళూరు, మైసూరు, కలబురిగిలో సేవలందిస్తున్న శ్రీ జయదేవ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియో వాస్క్యులార్ సైన్సెస్ అండ్ రీసెర్చ్  సంస్థ మీద కర్ణాటక  ప్రజలకున్న నమ్మకాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈరోజు హుబ్బళ్ళి లో  కొత్త శాఖకు ప్రధాని శంకుస్థాపన చేశారు.  ధార్వాడ్ కు, దాని పరిసర ప్రాంతాలకు స్వచ్ఛమైన త్రాగు నీరు అందించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయని చెబుతూ, జల్ జీవన్ మిషన్ కింద 1000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.ఈ ప్రాజెక్ట్ కింద  రేణుకాసాగర్ రిజర్వాయర్ నుంచి, మలప్రభ నది నుంచి నీటిని తెచ్చి లక్షా 25 వేల ఇళ్ళకు కుళాయిల ద్వారా అందిస్తారు. ధార్వాడ్ లో కొత్త నీటి శుద్ధి ప్లాట్ సిద్ధం కాగానే మొత్తం జిల్లా ప్రజలందరికీ దాని ప్రయోజనాలు అందుతాయన్నారు. ఈ రోజు శంకుస్థాపన చేసిన తుప్పరిహళ్ళ వరద నష్ట నియంత్రణ ప్రాజెక్టు గురించి కూడా ప్రధాని చెప్పారు. దీనివలన ఈ ప్రాంతంలో వరద నష్టం తగ్గుతుందన్నారు.

సిద్ధరూఢ స్వామీజీ స్టేషన్  లో ఇప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైన ప్లాట్ ఫామ్ ఉండట ద్వారా అనుసంధానతలో కర్ణాటక సరికొత్త మైలురాయి చేరుకుందన్నారు. అది కేవలం ప్లాట్ ఫామ్ విస్తరణకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, మౌలిక వసతుల కల్పనకు ఇస్తున్న ప్రాధాన్యంలో భాగమని ఆయన గుర్తు చేశారు. హోసపేట- హుబ్బళ్ళి-తినాయ్ ఘాట్ సెక్షన్ విద్యుదీకరణ, హోసపేట స్టేషన్ స్థాయి పెంపు ఈ దార్శనికతకు నిదర్శనమన్నారు.  ఈ మార్గం గుండా పరిశ్రమలకు పెద్ద ఎత్తున బొగ్గు రవాణా జరుగుతుందని, విద్యుదీకరణ జరిగిన తరువాత డీజిల్ మీద ఆధారపడటం తగ్గి,  పర్యావరణాన్ని కాపాడినట్టవుతుందని అన్నారు. ఈ ప్రక్రియ వల్ల ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి పెరిగి పర్యాటక రంగానికి కూడా ప్రోత్సాహం  లభిస్తుందన్నారు.

“మెరుగైన, ఆధునిక మౌలికసదుపాయాలు చూడటానికి బాగుండటమే కాకుండా ప్రజల జీవితాలను సుఖమయం చేస్తాయి ” అన్నారు.  మెరుగైన రోడ్లు, ఆస్పత్రులవంటి సౌకర్యాలు సరిగా లేకపోవటం వలన అన్ని  వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడు ఆధునిక మౌలిక సదుపాయాల ఫలాలను దేశంలోని ప్రజలందరూ అనుభవించగలుగుతున్నారన్నారు. విద్యార్థులు, రైతులు, మధ్యతరగతి ప్రజలను ఆయన ఉదహరించారు. తమ గమ్యస్థానాలను వారు సులువుగా చేరుకోగలుగుతున్నారన్నారు. మౌలికసదుపాయాల ఆధునీకరణకు చేసిన పనులకు ప్రస్తావిస్తూ, పిఎం సడక్  యోజన ద్వారా గ్రామీణ  రహదారులు రెట్టింపయ్యాయని, జాతీయ రహదారులు 55% పెరిగాయని అన్నారు.  గత 9 ఏళ్లలో దేశంలో  విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయిందని కూడా గుర్తు చేశారు.

బసవేశ్వరస్వామి పాత్రను ప్రస్తావిస్తూ, అనుభవ మండపం ఏర్పాటు చేయటాన్ని  గుర్తు చేశారు. ఈ  తరహా ప్రజాస్వామిక వ్యవస్థను ప్రపంచమంతటా అధ్యయనం చేస్తున్నారన్నారు. లండన్ లో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించటం గుర్తు చేసుకున్నారు. అయితే, లండన్ లోనే భారత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించటం దురదృష్టకరమన్నారు. భారత ప్రజాస్వామ్య మూలాలు శతాబ్దాలనాటి మన చరిత్ర నుంచి స్వీకరించాం. ప్రపంచంలోని ఏ  శక్తీ మన ప్రజాస్వామ్యానికి హాని చేయలేదు” అన్నారు. అయినప్పటికీ కొంతమంది ఏదో రకంగా భారత ప్రజాస్వామ్యానికి  తప్పులు ఆపాదిస్తున్నారని వారు బసవేశ్వరుణ్ణి అవమానిస్తున్నట్టేనని అభివర్ణించారు. అలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని కర్ణాటక ప్రజలను కోరారు.

ప్రధాని తన ప్రసంగం ముగిస్తూ, భారతదేశ టెక్నాలజీ భవిష్యత్తుగా ఉన్న కర్ణాటకను హైటెక్ భారత్ దేశపు ఇంజన్ గా అభివర్ణించారు. ఈ హై  టెక్ ఇంజన్ కు శక్తి సమకూర్చాలని డబుల్ ఇంజన్ కర్ణాటక రాష్ట్ర  ప్రభుత్వాన్ని కోరారు.

కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మయ్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి శ్రీ ప్రహ్లాద జోషీ, కర్ణాటక రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  .

నేపథ్యం  

ప్రధానమంత్రి ధార్వాడ్ ఐఐటీని జాతికి అంకితం చేశారు, దానికి 2019 ఫిబ్రవరిలో ఆయనే శంకుస్థాపన కూడా చేశారు. దీని నిర్మాణానికి రూ.850 కోట్లు ఖర్చయింది. ఇందులో ప్రస్తుతం 4 సంవత్సరాల బీటెక్ తో బాటు ఐదేళ్ళ బీఎస్-ఎం ఎస్ , ఎం టెక్ ,  పిహెచ్ డి   ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ తో శ్రీ శిద్ధరూఢ స్వామీజీ హుబ్బళ్ళి రైల్వే స్టేషన్ ను ప్రధాని  జాతికి అంకితం చేశారు..1507 మీటర్ల పొడవుమమ ఈ ప్లాట్ ఫామ్ నిర్మాణానికి రూ.20 కోట్లు ఖర్చయింది. ఈ రికార్డు పీడవును ఈ మధ్యనే గిన్నీస్ బుక్ గుర్తించింది.

హోసపేట -హుబ్బళ్ళి – తినయ్ ఘాట్ మార్గం విద్యుదీకరణ, హోసపేట స్టేషన్  స్థాయి పెంపు  వలన ఈ ప్రాంతంలో అనుసంధానత పెరుగుతుంది. 530 కోట్ల రూపాయలతో విద్యుదీకరణ చేపట్టటం వలన రైల్ రాకపోకలు నిరంతరాయంగా సాగుతాయి.  హోసపేట స్టేషన్ లో ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలు కల్పించారు. దీన్ని హంపీ శిల్పకళాశైలిలో నిర్మించారు.   

హుబ్బళ్ళి-ధార్వాడ్ స్మార్ట్ సిటీ లో కూడా అనేక ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ. 520 కోట్లు. వీటి వలన ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన జీవితం అందుబాటులోకి వస్తుంది. పట్టణం మొత్తం భవిష్యత్తుకు తగిన కేంద్రంగా తయారవుతుంది.

జయదేవ ఆస్పత్రి, పరిశోధనాకేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. దీన్ని 250 కోట్లతో అభివృద్ధి చేస్తారు.ఈ ప్రాంతంలో నీటి సరఫరాను మరింత పెంచటానికి ధార్వాడ్ బహుళ గ్రామ నీటి సరఫరా పథకం చేపట్టగా ప్రధాని శంకుస్థాపన చేశారు. దీనికి 1040 కోట్లు వెచ్చిస్తారు.  అదే విధంగా తుప్పరిహళ్ళ వరద నష్ట నియంత్రణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికి రూ.150 కోట్లు ఖర్చవుతుంది. రిటెయినింగ్ వాల్స్,  కరకట్టల నిర్మాణం ద్వారా వరద నివారణ కు చర్యలు తీసుకుంటారు. 

 

 

***

DS/TS



(Release ID: 1911088) Visitor Counter : 117