ఆర్థిక మంత్రిత్వ శాఖ
అమెరికా, యూరప్‌లలో బ్యాంకింగ్ వ్యవస్థల్లో నెలకొన్న ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంసిద్ధతను ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి. నిర్మలా సీతారామన్
ప్రమాద తీవ్రత ఎదుర్కోవడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేయాల్సిన చర్యలు, నియంత్రణ వ్యవస్థ కు అనుగుణంగా డిపాజిట్ల నిర్వహణ, ఆస్తుల నిర్వహణ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిన సమావేశం
Posted On:
25 MAR 2023 4:32PM by PIB Hyderabad
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి, పని తీరుపై ఈ రోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సమీక్షించారు. అమెరికా, యూరప్ దేశాలలో కొన్ని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకులు మూతపడడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక సవాళ్లు ఎదుర్కోవడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏమేరకు సిద్ధంగా ఉన్నాయన్న అంశం ప్రధానంగా సమావేశంలో చర్చకు వచ్చింది.
సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు కరాడ్, కేంద్ర ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి డాక్టర్ వివేక్ జోషి, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీలు, సీఈఓలు హాజరయ్యారు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ వైఫల్యం, రుణ పరపతి రంగంలో ఏర్పడిన సంక్షోభం అంశాలపై ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీలు, సీఈఓ లతో శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా చర్చించారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభుత్వ రంగ బ్యాంకులపై దీర్ఘ కాలం, స్వల్ప కాలంలో ఏమేరకు ప్రభావం చూపిస్తుంది అన్న అంశాన్ని శ్రీమతి సీతారామన్ సమీక్షించారు.
నియంత్రణ వ్యవస్థను సమర్థంగా అమలు చేసి, డిపాజిట్లు, ఆస్తుల అంశాలపై దృష్టి సారించి పరిస్థితిని ఎదుర్కోవడానికి తగిన చర్యలతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు శ్రీమతి సీతారామన్ సూచించారు.
ఒకే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు వీటి వల్లక ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలతో సహా ఒత్తిడి కలిగించే అంశాలను గుర్తించడానికి బ్యాంకులు వ్యాపార నమూనాలను నిశితంగా పరిశీలించాలని ఆర్థిక మంత్రి సూచించారు. సంక్షోభ నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యూహాలను రూపొందించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని శ్రీమతి సీతారామన్ అన్నారు.
బ్యాంకుల్లో అత్యుత్తమ కార్పొరేట్ పరిపాలన విధానాలు అమలు చేస్తున్నామని మంత్రి కి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీలు, సీఈఓలు వివరించారు. నియంత్రణ విధానాల అమలు చేయడం,పటిష్ట ద్రవ్య విధానాలు, ప్రేమ తీవ్రత ఎదుర్కోవడానికి తగిన చర్యలు అమలు చేస్తున్నామన్నారు అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. బ్యాంకుల ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంది అని వివిధ ఆర్థిక ప్రమాణాలు వెల్లడించాయి.
తాజా పరిస్థితిని సుదీర్ఘంగా సమీక్షించిన అనంతరం వడ్డీ రేటు పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఒత్తిడి కలిగించే అంశాలను గమనించాలని శ్రీమతి సీతారామన్ సూచించారు.గుజరాత్ గిఫ్ట్ సిటీ లో అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించటానికి శాఖలు నెలకొల్పి అంతర్జాతీయ అవకాశాలు సాధించాలని బ్యాంకులకు శ్రీమతి సీతారామన్ సలహా ఇచ్చారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల అవసరాలు గుర్తించాలని అన్నారు.
దేశంలో సాధారణ బ్యాంకింగ్ పరిస్థితిపై సమావేశం చర్చించింది. పనితీరు మెరుగు పరుచుకోవడానికి బ్యాంకులకు ఆర్థిక మంత్రి పలు సూచనలు చేశారు.
కొన్ని రుణ సాధనాల్లో పన్ను మధ్యవర్తిత్వాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను బట్టి డిపాజిట్లను ఆకర్షించడానికి దృష్టి కేంద్రీకరించిన చర్యలు తీసుకోవాలని శ్రీమతి సీతారామన్ సూచించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా రుణ పరపతి అందించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. జాతీయ సగటు కంటే రుణ మంజూరు శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలు ముఖ్యంగా ఈశాన్య మరియు తూర్పు ప్రాంతాలలో రుణాలు ఎక్కువగా మంజూరు చేయాలని మంత్రి సూచించారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, ఈ-నామ్, డ్రోన్ ఉత్పత్తి వంటి రంగాలలో వ్యాపార అవకాశాలు మెరుగు పరుచుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచించిన మంత్రి సరిహద్దు, తీర ప్రాంతాల్లో ఇటుక, మోర్టార్ రంగాల్లో బ్యాంకింగ్ కార్యక్రమాలు ఎక్కువ చేయాలని అన్నారు. ప్రత్యేక కార్యక్రమాలు, ప్రచారాల ద్వారా 2023-24 బడ్జెట్‌లో ప్రకటించిన మహిళా సమ్మాన్ బచత్ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని బ్యాంకులకు శ్రీమతి సీతారామన్ సూచించారు.
***
(Release ID: 1910919)
Visitor Counter : 168