పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా ఏర్పాటు కానున్న 21 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు, 11 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు ప్రారంభం

Posted On: 13 MAR 2023 3:13PM by PIB Hyderabad

బిహార్‌ సహా దేశవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలు, విధానాలు, దశలను అందించే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ పాలసీ-2008ని భారత ప్రభుత్వం రూపొందించింది, జీఏఎఫ్‌ పాలసీ ప్రకారం,
ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు, అంటే విమానాశ్రయ అభివృద్ధిదారు లేదా గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సముఖంగా ఉన్న సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత నమూనాలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనను పంపవలసి ఉంటుంది. ఈ ప్రతిపాదనకు రెండు దశల్లో, అంటే 'భూమి అనుమతి' ఆ తర్వాత 'సూత్రప్రాయ ఆమోదం' పొందాల్సి ఉంటుంది.

జీఏఎఫ్‌ విధానం ప్రకారం, దేశవ్యాప్తంగా 21 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు భారత ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. అవి గోవాలోని మోపా, మహారాష్ట్రలోని నవీ ముంబై, షిర్డీ, సింధుదుర్గ్, కర్ణాటకలోని కలబుర్గి, విజయపుర, హాసన్, శివమొగ్గ, మధ్యప్రదేశ్‌లోని దాబ్రా (గ్వాలియర్‌), ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్, నోయిడా (జెవర్), గుజరాత్‌లోని ధోలేరా, హిరాసర్, పుదుచ్చేరిలోని కారైకల్, ఆంధ్రప్రదేశ్‌లోని దగదర్తి, భోగాపురం, ఓర్వకల్లు (కర్నూలు), పశ్చిమ బంగాల్‌లోని దుర్గాపూర్, సిక్కింలోని పాక్యాంగ్, కేరళలోని కన్నూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇటానగర్‌.

వీటిలో 11 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు దుర్గాపూర్, షిర్డీ, కన్నూర్, పాక్యాంగ్, కలబుర్గి, ఓర్వకల్లు (కర్నూలు), సింధుదుర్గ్, ఖుషీనగర్, ఇటానగర్, మోపా, శివమొగ్గలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

రాజస్థాన్‌లోని అల్వార్, మధ్యప్రదేశ్‌లోని సింగ్‌రౌలీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో మూడు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి భారత ప్రభుత్వం మొదటి దశ అనుమతిని, అంటే భూ అనుమతిని కూడా మంజూరు చేసింది.

ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుకోవడం సహా విమానాశ్రయ ప్రాజెక్టుల అమలు బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు విమానాశ్రయ అభివృద్ధిదారుపై (ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు అయితే) ఉంటుంది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె.సింగ్ (విశ్రాంత), ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు.

 

*****


(Release ID: 1906778) Visitor Counter : 294