ప్రధాన మంత్రి కార్యాలయం

విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక 3వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి


సుభాష్‌ చంద్రబోస్‌ విపత్తు నిర్వహణ పురస్కార గ్రహీత సంస్థలకు సత్కారం;

“తుర్కియే.. సిరియాలో భూకంపాల తర్వాత ప్రపంచం
భారత విపత్తు నిర్వహణ కృషి పాత్రను గుర్తించి ప్రశంసించింది”;

“విపత్తు నిర్వహణ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం..మానవ
వనరులను భారత్‌ విస్తరించిన తీరు దేశానికెంతో ఉపయోగపడింది”;

“స్థానిక స్థాయిలో గృహ లేదా పట్టణ ప్రణాళిక నమూనాలను మనం రూపొందించాలి.. అలాగే ఈ రంగాల్లో అధునాతన సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించాలి”;

“విపత్తు నిర్వహణ బలోపేతంలో గుర్తింపు.. సంస్కరణలు రెండు ప్రధాన భాగాలు”;

“స్థానిక భాగస్వామ్యం ద్వారా స్థానిక ప్రతిరోధకత మంత్రం
అనుసరణతో మాత్రమే మీరు విజయం సాధించగలరు”;

“గృహాలు.. డ్రైనేజీల స్థితిగతులు.. విద్యుత్-నీటి సరఫరా మౌలిక వసతుల ప్రతిరోధకత వంటి అంశాలపై అవగాహన మనం ముందస్తు చర్యలు చేపట్టడంలో తోడ్పడుతుంది”;

“భవిష్యత్‌ సంసిద్ధ అంబులెన్స్ నెట్‌వర్క్ కోసం
‘ఎఐ.. 5జి.. ఐఓటి’ల వినియోగాన్ని పరిశీలించండి”;

“సంప్రదాయం.. సాంకేతికత మన బలాలు.. వీటితో మనం దేశం కోసమేగాక
ప్రపంచం కోసం అత్యుత్తమ విపత్తు ప్రతిరోధక నమూనాను సిద్ధం చేయగలం”

Posted On: 10 MAR 2023 6:24PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో “విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక” (ఎన్‌పిడిఆర్ఆర్) 3వ సమావేశాన్ని ప్రారంభించారు. “మారుతున్న వాతావరణంలో స్థానిక ప్రతిరోధకత రూపకల్పన” ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ‘సుభాష్‌ చంద్రబోస్‌ విపత్తు నిర్వహణ పురస్కారం-2023’ గ్రహీతలను ఆయన సత్కరించారు. ఈ గౌరవం పొందిన సంస్థలలో ‘ఒడిషా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ’ (ఒఎస్‌డిఎంఎ), మిజోరంలోని లుంగ్లీ ఫైర్ స్టేషన్ ఉన్నాయి. విపత్తు ముప్పు తగ్గింపు రంగంలో వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలు, ఉపకరణాలు, సాంకేతికత పరిజ్ఞానాల సంబంధిత ప్రదర్శనను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ తదితరులు పాల్గొన్నారు.

   సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ఇటీవ‌ల భూకంప బాధిత తుర్కియే, సిరియా దేశాల్లో భారత రక్షణ-సహాయ బృందం కృషిని ప్ర‌పంచమంతా ప్రశంసించిందని, ఇది ప్ర‌తి భార‌తీయుడూ గ‌ర్వించాల్సిన అంశమని పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం, మానవ

వనరులను భారత్‌ విస్తరించిన తీరు దేశానికెంతో ఉపయోగపడిందని ప్రధాని అన్నారు. విపత్తు నిర్వహణ పురస్కార గ్రహీత సంస్థలను అభినందిస్తూ- ఈ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు తగిన ప్రోత్సాహమిస్తూ ఆరోగ్యకర పోటీకి ప్రేరణ ఇవ్వడానికే ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

   కార్యక్రమం ఇతివృత్తం “మారుతున్న వాతావరణంలో స్థానిక ప్రతిరోధకత రూపకల్పన” భారతీయ సంప్రదాయానికి సుపరిచితమైనదేనని ప్రధాని ఉటంకించారు. బావుల నిర్మాణం, వాస్తుశిల్పం, ప్రాచీన నగరాలలో ఇది ప్రస్ఫుటం అవుతుందని ఆయన చెప్పారు. భారతదేశంలో విపత్తు నిర్వహణ వ్యవస్థ, పరిష్కారాలు-వ్యూహం సదా స్థానిక ప్రాతిపదికనే ఉంటాయని తెలిపారు. కచ్‌లోని భుంగా గృహాలు భూకంప తీవ్రతను చాలావరకూ తట్టుకోగలగడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ గృహ నిర్మాణం, పట్టణ ప్రణాళికల స్థానిక నమూనాలను రూపొందించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. “ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థానిక సాంకేతికతను, సామగ్రిని సమర్థంగా మేళవించడం నేటి తక్షణావసరం. స్థానిక ప్రతిరోధకత ఉదాహరణలను భవిష్యత్‌ సాంకేతికతతో జోడిస్తేనే మనం మెరుగైన విపత్తు ప్రతిరోధకత దిశగా మెరుగైన రీతిలో సాగడం సాధ్యం” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

   కనాటి జీవనశైలి చాలా సౌకర్యవంతంగా ఉండేదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కరువు, వరదలు, ఎడతెగని వర్షాలవంటి ప్రకృతి వైపరీత్యాలను ఏ విధంగా ఎదుర్కోవాలో అనుభవమే మనకు నేర్పిందని నొక్కిచెప్పారు. విపత్తు సహాయక బాధ్యతను గత ప్రభుత్వాలు వ్యవసాయ శాఖకు అప్పగించడాన్ని సహజ పరిణామంగా ఆయన వివరించారు. భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే స్థానిక వనరుల తోడ్పాటుతో స్థానికంగానే పరిష్కరించామని గుర్తుచేశారు. అయితే, ఇవాళ్టి మన ప్రపంచం చాలా చిన్నదని, అనుభవాలు-ప్రయోగాల నుంచి పరస్పరం నేర్చుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా మారిందని అన్నారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాల సంఖ్య కూడా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు గ్రామంలో ప్రజలందరికీ ఒకే వైద్యుడు ఉండేవారని పేర్కొంటూ- నేటి యుగంలో ప్రతి వ్యాధికీ చికిత్స చేయగల వైద్య నిపుణులు మనకున్నారనే వాస్తవాన్ని ప్రధాని ఉటంకించారు. అదే తరహాలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనగల చురుకైన వ్యవస్థను తయారు చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. గత శతాబ్దపు ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం ద్వారా వాటిపై కచ్చితమైన అంచనాలు వేయడంతోపాటు విపత్తు నిర్వహణ వ్యవస్థను లేదా సామగ్రిని తగు సమయంలో నవీకరించాల్సిన ఆవశ్యకతను కూడా ప్రధాని విశదీకరించారు.

   “విపత్తు నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడంతో గుర్తింపు, సంస్కరణలు రెండు ప్రధాన భాగాలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల ముప్పును గుర్తించడం, భవిష్యత్తులో అదెప్పుడు దాడి చేస్తుందో అంచనా వేయడంలో గుర్తింపు తోడ్పడుతుందని చెప్పారు. అయితే,  సంస్కరణ అన్నది రాబోయే ప్రకృతి వైపరీత్యాల ముప్పును తగ్గించే వ్యవస్థ అని ఆయన వివరించారు. నిర్దిష్ట కాలావధిలో మరింత సామర్థ్యంతో ఈ వ్యవస్థను మెరుగుపరచాలని ఆయన సూచించారు. అదే సమయంలో ఆపద్ధర్మ పద్ధతులకు బదులు దీర్ఘకాలిక ఆలోచన విధానం అవశ్యమని స్పష్టం చేశారు. గత సంవత్సరాల్లో పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలను కుదిపేసిన తుఫానుల వల్ల అపార ప్రాణనష్టం వాటిల్లిందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. అయితే, భారతదేశం నేడు మారిన కాలానికి అనుగుణంగా వ్యూహాల్లో మార్పులతో తుఫానులను సమర్థంగా ఎదుర్కొనగలదని చెప్పారు. తద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలు తక్కువ స్థాయికి పరిమితం కాగలవని తెలిపారు. “ప్రకృతి వైపరీత్యాలను మనం ఆపలేం... కానీ, మెరుగైన వ్యూహాలు, వ్యవస్థలతో వాటి దుష్ప్రభావాలను కచ్చితంగా తగ్గించగలం” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రతిస్పందనకన్నా, ముందుచూపుతో వ్యవహరించే విధానం అనుసరించడం ముఖ్యమని స్పష్టం చేశారు.

   స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా విపత్తు నిర్వహణ వ్యవస్థ అధ్వానంగా ఉండటం గురించి ప్రధాని ప్రస్తావించారు. ఈ మేరకు ఐదు దశాబ్దాల కాలంలో విపత్తు నిర్వహణకు సంబంధించి ఎలాంటి చట్టమూ రూపొందలేదని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల నడుమ దేశంలోనే తొలిసారిగా 2001లో రాష్ట్రస్థాయి విపత్తు నిర్వహణ చట్టాన్ని గుజరాత్‌ అమలులోకి తెచ్చిందని ప్రధాని గుర్తుచేశారు. ఈ చట్టం ప్రాతిపదికగానే ఆనాటి కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో విపత్తు నిర్వహణ చట్టం రూపొందించగా, ఆ తర్వాత జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డిఎంఎ) ఏర్పాటైందని ఆయన వివరించారు.

   స్థానిక సంస్థల్లో విపత్తు నిర్వహణ విధానాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ఈ మేరకు “మనం ప్రణాళికలను సంస్థాగతం చేయడంతోపాటు స్థానిక ప్రణాళికలను సమీక్షించాలి” అని స్పష్టం చేశారు. వ్యవస్థను పూర్తిస్థాయిలో పునర్నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ- ఇందుకోసం రెండు స్థాయులలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొట్టమొదటగా విపత్తు నిర్వహణ నిపుణులు ప్రజా భాగస్వామ్యంపై మరింత ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. భూకంపాలు, తుఫానులు, అగ్నిప్రమాదాలు తదితర విపత్తుల ముప్పుపై ప్రజలకు అవగాహన కల్పించే నిరంతర ప్రక్రియ అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో సరైన ప్రక్రియ, కసరత్తు, నిబంధనలపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని చెప్పారు. “స్థానిక భాగస్వామ్యం ద్వారా స్థానిక ప్రతిరోధకత మంత్రం అనుసరణతో మాత్రమే మీరు విజయం సాధించగలరు” అని ఆయన గుర్తుచేశారు. గ్రామీణ, పొరుగు స్థాయులలో “యువ మండళ్లు, సఖి మండళ్ల” ఏర్పాటు చేసుకోవాలని భాగస్వామ్య వ్యవస్థలను ప్రధాని కోరారు. ‘విపత్తు మిత్ర’,  ఎన్‌ఎస్‌ఎస్-ఎన్‌సిసి, మాజీ సైనిక వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలని సూచించారు. రక్షణ-సహాయ కార్యక్రమాలను సకాలంలో ప్రారంభిస్తే పెద్దసంఖ్యలో ప్రజల ప్రాణరక్షణ సాధ్యం కాగలదని వివరించారు. అలాగే తక్షణ స్పందనకు అవసరమైన రక్షణ, సహాయ సామగ్రి సామాజిక కేంద్రాల్లో సిద్ధంగా ఉండేలా చూడాలని ఆయన కోరారు.

   క రెండోస్థాయిలో- సాంకేతిక పరిజ్ఞానం సాయంతో తక్షణ నమోదు-పర్యవేక్షణ వ్యవస్థ అవసరమని ప్రధాని అన్నారు. “గృహాలు-డ్రైనేజీల స్థితిగతులతోపాటు విద్యుత్-నీటి సరఫరా వంటి మౌలిక వసతుల ప్రతిరోధకత అంశాలపై అవగాహన ఉంటే, మనం ముందస్తు చర్యలు చేపట్టడంలో అది తోడ్పడుతుంది” అని ఆయన అన్నారు. రానున్న వేసవిలో వడగాడ్పుడలపై తాను నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆస్పత్రులలో అగ్నిప్రమాద సంఘటనలపై చర్చ జరిగిందని ప్రధాని చెప్పారు. ఆస్పత్రులలో అగ్నిమాపక సంసిద్ధతను క్రమం తప్పకుండా సమీక్షించడం ద్వారా ప్రజల ప్రాణాలను రక్షించవచ్చునని ప్రధాని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత అధికంగా ఉండే ఆస్పత్రులు, ఫ్యాక్టరీలు, హోటళ్లు లేదా బహుళ అంతస్తుల నివాస భవనాలు వగైరాల్లో... వేసవి ఉష్ణోగ్రతల పెరుగుదలతో కొన్నేళ్లుగా అగ్నిప్రమాద సంఘటనలు పెరగడాన్ని ఆయన ప్రస్తావించారు. జన సంచారం ఎక్కువగా ఉండే ఆ ప్రాంతాలకు అగ్నిమాపక వాహనాలు వెళ్లడం చాలా కష్టమని ప్రధాని పేర్కొన్నారు. అటువంటప్పుడు ఆయా ప్రాంతాల్లో క్రమపద్ధతిలో పనిచేయాలంటే ఎదురయ్యే సవాళ్లను ప్రస్తావిస్తూ- ఈ సమస్యకు పరిష్కారం అన్వేషించాలని నొక్కిచెప్పారు. ఎత్తయిన భవనాలలో మంటలు ఆర్పడంలో మన అగ్నిమాపక సిబ్బంది నిరంతరం తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని ప్రధాని నొక్కిచెప్పారు, అలాగే పారిశ్రామిక ప్రాంతాల్లో మంటలు ఆర్పడానికి తగినన్ని వనరులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

   స్థానిక నైపుణ్యాలు, ఉపకరణాల నిరంతర ఆధునికీకరణ ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. వంటచెరకును జీవ ఇంధనంగా మార్చే పరికరాలను స్వయం సహాయ సంఘాల మహిళలకు సమకూర్చడం ద్వారా వారి ఆదాయం పెంపుతోపాటు అగ్నిప్రమాదాలను తగ్గించే అవకాశాలను అన్వేషించాలని ఆయన కోరారు. గ్యాస్ లీకేజీ అధికంగా ఉండే పరిశ్రమలు, ఆస్పత్రుల కోసం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడంపైనా ప్రధాని మాట్లాడారు. అలాగే భవిష్యత్‌ సంసిద్ధ  అంబులెన్స్‌ నెట్‌వర్క్‌ రూపకల్పన అవసరాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందుకోసం ‘కృత్రిమ మేధస్సు (ఎఐ), 5జి మొబైల్‌ నెట్‌వర్క్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’ (ఐఓటి)ల వినియోగాన్ని పరిశీలించాలని ప్రధాని సూచించారు. అంతేకాకుండా డ్రోన్లు, ఆధునిక పరికరాలతో అప్రమత్తత హెచ్చరికల జారీ అవకాశాలను అన్వేషించాలని భాగస్వామ్య వ్యవస్థలను కోరారు. ఇందులో భాగంగా భవనాలు కూలినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కనుగొనే వ్యక్తిగత పరికరాల రూపకల్పనపై యోచించాలని కోరారు. కొత్త వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాలను సృష్టిస్తున్న ప్రపంచ సామాజిక సంస్థల పనితీరును అధ్యయనం చేసి, ఉత్తమ పద్ధతులను అనుసరించాల్సిందిగా ఆయన నిపుణులను కోరారు.

   చివరగా- ప్రపంచంలో ఎక్కడ విపత్తులు సంభవించినా భారత్‌ సత్వరం స్పందిస్తుందని ప్రధానమంత్రి  గుర్తుచేశారు. అంతేకాకుండా విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాల కల్పనపైనా స్పందించి, చొరవ చూపుతుందని నొక్కిచెప్పారు. భారత్‌ నాయకత్వంలో ఏర్పడిన విపత్తు ప్రతిరోధక మౌలిక సదుపాయాల కూటమి(సిడిఆర్‌ఐ)లో ప్రపంచంలోని 100కుపైగా దేశాలు సభ్యత్వం స్వీకరించాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నేటి చర్చల్లో అనేక సూచనలు-పరిష్కారాలు ఆవిష్కృతం కాగలవని, తద్వారా భవిష్యత్ ఆచరణాత్మక అంశాలు వెలుగు చూడగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు “సంప్రదాయం, సాంకేతికత మన బలాలు.. వీటి తోడ్పాటు ద్వారా మనం భారతదేశం కోసమేగాక యావత్‌ ప్రపంచం కోసం అత్యుత్తమ విపత్తు ప్రతిరోధక నమూనాను సిద్ధం చేయగలం” అంటూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

   “విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక” (ఎన్‌పిడిఆర్ఆర్) అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ బహుళ భాగస్వామ్య సంస్థల వేదిక. విపత్తు ముప్పుల తగ్గింపు రంగంలో చర్చలు, అనుభవాలు, అభిప్రాయాలు, ఆలోచనల కలబోతతోపాటు కార్యాచరణ-ఆధారిత పరిశోధన అవకాశాల అన్వేషణకు ఇది కృషి చేస్తుంది.

 

 

***

DS/TS



(Release ID: 1905834) Visitor Counter : 234