వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెమీకండక్టర్ సరఫరా గొలుసు & ఆవిష్కరణల భాగస్వామ్యంపై భారత్-అమెరికా మధ్య అవగాహన ఒప్పందం


సెమీకండక్టర్ సరఫరా గొలుసు స్థితిస్థాపకత, వైవిధ్యం కోసం ఒక సహకార యంత్రాంగం ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందం

Posted On: 10 MAR 2023 12:23PM by PIB Hyderabad

ఈ రోజు న్యూదిల్లీలో జరిగిన వాణిజ్య చర్చలు 2023 తర్వాత, భారత్-అమెరికా వాణిజ్య చర్చల విధివిధానాల కింద సెమీకండక్టర్ సరఫరా గొలుసు & ఆవిష్కరణల భాగస్వామ్యం ఏర్పాటు చేయడంపై రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.

కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఆహ్వానం మేరకు అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి గినా రైమోండో భారత పర్యటకు వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా, రెండు దేశాల మధ్య నూతన వాణిజ్యం, పెట్టుబడి అవకాశాల అన్వేషణపై సహకారం కోసం చర్చించడానికి చర్చలను ఈ రోజు పునఃప్రారంభించారు.

అమెరికాకు చెందిన చిప్స్‌ అండ్‌ సైన్స్ చట్టం, భారత్‌కు చెందిన సెమీకండక్టర్ మిషన్‌ను దృష్టిలో ఉంచుకుని, సెమీకండక్టర్ సరఫరా గొలుసు స్థితిస్థాపకత, వైవిధ్యం కోసం రెండు ప్రభుత్వాల మధ్య ఒక సహకార యంత్రాంగాన్ని ఈ అవగాహన ఒప్పందం ఏర్పాటు చేస్తుంది.

సెమీకండక్టర్ విలువ గొలుసులోని వివిధ అంశాలపై చర్చల ద్వారా రెండు దేశాల బలాలు, వాణిజ్య అవకాశాలను పెంచడం, సెమీకండక్టర్ ఆవిష్కరణ వ్యవస్థల అభివృద్ధిని సులభతరం చేయడం ఈ అవగాహన ఒప్పందం లక్ష్యం. పరస్పర ప్రయోజనకారిగా ఉండే ఆర్‌&డీ, ప్రతిభ, నైపుణ్యాభివృద్ధిని సాధించడం ఈ అవగాహన ఒప్పందం ఉద్దేశం.

 

******


(Release ID: 1905723) Visitor Counter : 234