బొగ్గు మంత్రిత్వ శాఖ
తవ్విన 30 బొగ్గు గనుల ప్రాంతాలను ఎకో టూరిజం ప్రదేశాలుగా మార్చనున్న కోల్ ఇండియా సంస్థ 1610 హెక్టార్లకు పచ్చదనం విస్తరింపు
Posted On:
21 FEB 2023 12:49PM by PIB Hyderabad
బొగ్గు తవ్వకం పూర్తయ్యాక వదిలేసిన 30 గనులను ఎకో పార్కులుగా మార్చి ఎకో టూరిజం ప్రదేశాలుగా మార్చాలని కోల్ ఇండియా లిమిటెడ్ ( సి ఐ ఎల్) కృషిచేస్తోంది. వీటి వలన స్థానికులకు జీవనోపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే అలాంటి 30 పార్కులు ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నాయి. మరిన్ని పార్కులను తీర్చిదిద్దటంతోబాటు తవ్వకాలు జరిగిన ప్రదేశాలను పునరుద్ధరించే పనులు కూడా సాగుతున్నాయి.
అలా బొగ్గు గనుల పర్యాటకాన్ని పెంపొందించే అవకాశాలున్న ప్రదేశాలలో గుంజం పార్క్, ఈసీఎల్, గోకుల్ ఎకో కల్చరల్ పార్క్, బీసీసీఎల్, కెనపారా ఏకో టూరిజం సైట్, అనన్య వాటిక, ఎస్ఈసీఎల్, కృష్ణ శిల పర్యావరణ పునరుద్ధరణ ప్రదేశం, ముద్వాని ఎకో పార్క్, అనంత ఔషధ వనం, బాల గంగాధర తిలక్ ఎకో పార్క్, డబ్ల్యూసిఎల్, చంద్ర శేఖర్ ఆజాద్ ఎకో పార్క్, సీసీ ఎల్ ఉన్నాయి.
“తవ్వి వదిలేసిన బొగ్గు గనులను ఇలా జనంతో కిటకిటలాడే పర్యాటకల ప్రదేశంగా మార్చవచ్చునని ఎవరూ ఊహించలేదు. ఇక్కడ నీళ్ళలో బోటింగ్ సౌకర్యాన్ని ఆస్వాదిస్తున్నాం. పరుచుకున్న పచ్చదనం ఆహ్లాదకరంగా ఉంది. తేలియాడే రెస్టారెంట్ లో భోంచేస్తున్నాం.” అంటూ కెనపారా ఎకో టూరిజం సైట్ లో ఒక పర్యాటకుడు అంటున్నారు. దీన్ని ఛత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లాలో ఎస్ ఈ సీ ఎల్ అభివృద్ధి పరచింది. కెనపారా మరింత మంది పర్యాటకులను ఆకర్షించే అవశకాముందని పర్యాటకులే చెబుతున్నారు. ఇది స్థానిక గిరిజనులకు ఆదాయవనరుగా మారుతోంది.
కెనపారా లోని బిశ్రం పూర్ ఓపెన్ కాస్ట్ లో వదిలేసిన ఆరో నంబర్ గనిని జలక్రీడలు, తేలియాడే రెస్టారెంట్ గా మార్చిన ఎస్ ఈ సీ ఎల్
అదే విధంగా ఇటీవలే మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి ఉన్న జయంత్ ప్రాంతాన్ని ఎన్ సి ఎల్ సంస్థ ముద్వాని ఎకో పార్క్ గా అభివృద్ధి చేసింది. దీనికి జలాశయంతోబాటు చుట్టూ నడకదారి ఉన్నాయి. చూడటానికి ఎలాంటి ప్రత్యేకతలూ లేని సింగ్రౌలి లాంటి చోట ముద్వాని ఎకో పార్క్ వలన సందర్శకుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇక్కడి ఆహ్లాదకరమైన ప్రదేశం, ఉల్లాసభరితమైన ఏర్పాట్లే అందుకు కారణమని సందర్శకులు అంటున్నారు.
మధ్య ప్రదేశ్ సింగ్రౌలి లోని జయంత్ ప్రాంతంలో ఎన్ సి ఎల్ అభివృద్ధి పరచిన ముద్వాని ఎకో పార్క్
ఇవే కాకుండా, 2022-23 లో 1510 హెక్టార్లలో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలన్న లక్ష్యాన్ని అధిగమించిన సీఐఎల్ 1610 హెక్టార్లలో మొక్కలు నాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ 30 లక్షల మొక్కలు నాటింది. గడిచిన ఐదేళ్లకాలంలో, అంటే 2022 ఆర్థిక సంవత్సరానికి ముందు దాకా 4392 హెక్టార్ల గనుల లోపలి ప్రాంతాన్ని పచ్చదనంతో నింపింది.
విత్తన బంతులు విసరటం, ద్రోణల ద్వారా విత్తనాలు చల్లటం, మియావాకీ మొక్కల నాటు లాంటి కొత్త పద్ధతులలో పచ్చదనం పెంపు కోసం సీ ఐ ఎల్ ఇప్పటికే కృషి చేస్తోంది. బొగ్గు తవ్వి వదిలేసిన ప్రాంతాలు, బాగా పెరిగి పోయిన డంప్ లు, కూడా చురుగ్గా త్రవ్వకాలు జరిగే ప్రాంతాల నుంచి వేరు చేసి వాటిని ఆహ్లాదకరప్రదేశాలుగా మారుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర నిపుణుల సాయంతో నేలను పునరుద్ధరించటానికి కృషి జరుగుతోంది. ఇందుకోసం రిమోట్ సెన్సింగ్ సాయం తీసుకుంటున్నారు. ఇప్పటికే 33% ప్రదేశాన్ని పచ్చదనంతో నింపగలిగారు.
***
(Release ID: 1901292)
Visitor Counter : 182