ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రహ్మకుమారీలచే జల్ , జన్ అభియాన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో సందేశానికి తెలుగు సంక్షిప్త అనువాదం.
Posted On:
16 FEB 2023 2:22PM by PIB Hyderabad
ప్రముఖ రాజయోగిని, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన దాది రతన్ మోహిని జి, నా కేబినెట్ సహచరుడు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్‌జి, బ్రహ్మకుమారీ సంస్థల సభ్యులందరికి, ఇతర ప్రముఖులు, సోదర, సోదరీమణులారా, బ్రహ్మ కుమరీ లు ప్రారంభించిన జల్ `జీవన్ కార్యక్రమంలో ఇక్కడ మీతో ముచ్చటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ మధ్యకు వచ్చి మీ నుంచి నేర్చుకోవడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమైనదే. దివంగత రాజయోగిని దాది జానకీ జీ దీవెనలు నేను పొందగలగడం నాకు దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తాను. దాది ప్రకాశ్ మణి జీ మరణానంతరం నేను వారికి అబూ రోడ్ లో నివాళులర్పించిన విషయం నాకు గుర్తుంది. బ్రహ్మకుమారీ సోదరీమణులు పలు సందర్భాలలో నన్ను పలు కార్యక్రమాలకు వారు హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఈ ఆథ్యాత్మిక కుటుంబంలో ఒకడిగా మీ మధ్య ఉండేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను.
2011 లో జరిగిన శక్తి భవిష్యత్తు కార్యక్రమానికి కానీ లేదా సంస్థ ఏర్పడి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా 2013లో జరిగిన సంగం తీర్ధం , 2017 లో జరిగిన బ్రహ్మకుమారీ సంస్థాన్ 80 వ వ్యవస్థాపక దినోత్సవం లేదా గత సంవత్సరం జరిగిన అమృతోత్సవం సందర్భంగా నేను ఎప్పుడు మీ మధ్యకు వచ్చినా ,నా పట్ల మీరు చూపిన ప్రేమ, అభిమానం తిరుగులేనివి. బ్రహ్మకుమారీ సంస్థతో నా బంధం ప్రత్యేకమైనది. ఎందుకంటే మీరు మీ గురించి ఆలోచించుకోవడం కాక, మీరందరూ సమాజం కోసం అంకితం కావడమే ఆధ్యాత్మిక మార్గంగా ఎంచుకున్నారు.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా నీటి కొరతను భవిష్యత్ సంక్షోభంగా పరిగణిస్తున్న దశలో జల్ ` జన్ అభియాన్ ప్రారంభమవుతున్నది. భూమిపై పరిమిత స్థాయిలో గల జలవనరుల పరిస్థితి తీవ్రతను 21 వ శతాబ్దపు ప్రపంచం గ్రహిస్తున్నది. జనాభా ఎక్కువగా ఉన్నందున నీటి భద్రత ఇండియాకు సైతం కీలకమైన బాధ్యత. అందువల్ల స్వాతంత్య్ర అమృత కాలంలో, ఇవాళ దేశం ఒక నినాదంతో ముందుకు వెళుతున్నది. జలం ఉంటే భవిష్యత్తు ఉంటుంది అని. అంటే నీరు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. అందువల్ల మనం ఇందుకు సంబంధించి ఇవాళ్టినుంచే
తగిన కృషి చేయాలి.
దేశం ఇవాళ నీటిపొదుపును ఒక ప్రజాఉద్యమంగా ముందుకు తీసుకువెళుతుండడం నాకు సంతృప్తినిస్తోంది. బ్రహ్మకుమారీల జల్ `జన్ అభియాన్ ఈ విషయంలో ప్రజల భాగస్వామ్య కృషికి మరింత బలం చేకూరుస్తుంది. ఇది నీటి సంరక్షణ ప్రచారాన్ని మరింత విస్తృతస్థాయికి తీసుకువెళ్లడమే కాకుండా , దీని ప్రభావం కూడా పెరుగుతుంది. బ్రహ్మకుమారీ సంస్థతో సంబంధం ఉన్న పెద్దలందరినీ, బ్రహ్మకుమారీ సంంస్థకు లక్షలలో గల అనుయాయులను ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
వేల సంవత్సరాల క్రితం భారతదేశపు రుషులు ప్రకృతి, పర్యావరణం, నీటికి సంబంధించి సమతుల్యత, సంయమనం తో కూడిన సున్నిత వ్యవస్థను ఏర్పాటు చేశారు.మన దేశంలో ఒక నానుడి ఉంది. మనం నీటిని వృధా చేయకూడదు, దానిని పొదుపు చేయాలని ఇది వేల సంవత్సరాలుగా మన మతంలో , ఆథ్యాత్మికతలో భాగంగా ఉంటూ వచ్చింది. ఇది మన సమాజ సంస్కృతికి, మన సమాజ ఆలోచనకు కేంద్ర బిందువు. అందుకే మనం నీటిని భగవత్ స్వరూపంగా భావిస్తాం. నదులను నదీమ తల్లి అని అంటాం. సమాజం ఇలా ప్రకృతితో మమేకమైతే సుస్థిరాభివృద్ధి అనేది దాని జీవన విధానం అవుతుంది.అందువల్ల భవిష్యత్ సవాళ్లకు పరిష్కారాలను వెతకడంలో మనం మన గత చైతన్యాన్ని పునరుత్తేజితం చేయాల్సి ఉంది. నీటి సంరక్షణలో మనం దేశ ప్రజలలో ఇదే తరహా విలువలను ప్రోది చేయాల్సి ఉంది. నీటి సంరక్షణను దారి తప్పించి కాలుష్యానికి కారణమయ్యే వాటినన్నింటినీ మనం తొలగించాల్సి ఉంది. ఈ దిశగా బ్రహ్మకుమారీలవంటి దేశంలోని ఆధ్యాత్మిక సంస్థలు కీలక పాత్ర వహిస్తాయి.
మిత్రులారా,
గడచిన దశాబ్దాలలో దేశంలో ఒక రకమైన వ్యతిరేక వాతావరణం ఉండేది.జల సంరక్షణ, పర్యావరణం వంటివి సమస్యాత్మకమైనవని భావించి వాటిని పట్టించుకోవడం మనివేయడం జరిగింది. వీటిని అమలు చేయలేనంతటి సవాళ్లని కొందరు భావించారు. అయితే దేశం ఈ రకమైన ఆలోచనా ధోరణిని గత 8`9 సంవత్సరాలలో మార్చింది. దీనితో పరిస్థితి కూడా మారింది. ఇందుకు నమామి గంగే గొప్ప ఉదాహరణ.కేవలం గంగ మాత్రమే కాక దాని ఉపనదులన్నింటినీ పరిశుభ్రపరచడం జరుగుతోంది. గంగా తీర ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ప్రచారాన్ని చేపట్టడం జరిగింది. నమామి గంగే ప్రచారం , దేశంలోని పలు రాష్ట్రాలకు ఒక నమూనాగా మారింది.
మిత్రులారా,
నీటి కాలుష్యం లాగే, నానాటికీ తరిగిపోతున్న భూగర్భజలాల అంశం కూడా దేశానికి పెద్ద సవాలుగా మారింది. ఇందుకు సంబంధించి దేశం వర్షపునీటిని ఒడిసిపట్టే ఉద్యమాన్ని చేపట్టి గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. దేశంలోని వేలాది గ్రామ పంచాయితీలలో అటల్ భూ జల్ యోజన కింద నీటి సంరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడం జరుగుతోంది. ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాల నిర్మాణానికి ప్రచారం జల సంరక్షణలో పెద్ద ముందడుగుగా చెప్పుకోవచ్చు.
మిత్రులారా,
జల సంరక్షణ వంటి ప్రధాన అంశాల విషయంలో సంప్రదాయికంగా మన దేశ మహిళలు మార్గనిర్దేశకులుగా ఉంటుంటారు. ఇవాళ దేశంలో మహిళలు గ్రామ పంచాయితీలలో జల్ జీవన్ మిషన్ వంటి కీలక పథకాలను పానీ సమితుల ద్వారా ( జల కమిటీలు) నిర్వహిస్తున్నారు. మన బ్రహ్మకుమారీ సోదరీమణులు, దేశంలోనూ అంతర్జాతీయంగా ఇదే పాత్రను పోషించగలరని కోరుకుంటున్నాను. జల సంరక్షణతో పాటు, పర్యావరణానికి సంబంధించిన పలు అంశాలను ఇదే స్ఫూర్తితో చేపట్టవలసి ఉంది. వ్యవసాయ రంగంలో నీటిని పొదుపుగా వాడేలా చేసేందుకు దేశం బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) వటి వాటిని ప్రోత్సహిస్తున్నది. దీనిని అనుసరించేలా మీరు రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించవచ్చు. భారతదేశ చొరవతో ప్రపంచం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని జరుపుకుంటోంది. సజ్జలు, జొన్నల వంటివి శతాబ్దాలుగా మన ఆహారంలో, మన సాగులో భాగంగా ఉంటూ వచ్చాయి. చిరుధాన్యాలలో అత్యధ్బుతమైన పోషకాలు ఉన్నాయి. వీటి సాగుకు తక్కువ నీరు అవసరమవుతుంది. అందువల్ల మీరు ప్రజలు తమ ఆహారంలో మరిన్ని ముతకధాన్యాలను చేర్చుకునేలా ప్రేరణ కలిగించినట్టయితే, ఈ ప్రచారం మరింత బలపడి, జల సంరక్షణ ప్రచారం కూడా బలపడుతుంది.
మన ఉమ్మడి కృషి తో జల్ `జన్ అభియాన్ విజయవంతమవుతుందన్న విశ్వాసం నాకు ఉంది. మనం మెరుగైన భారతదేశాన్ని , మెరుగైన భవిష్యత్తును నిర్మిద్దాం. మీ అందరికీ మరోసారి శుభాభినందనలు. ఓం శాంతి.
గమనిక : ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి సంక్షిప్త అనువాదం
***
(Release ID: 1900527)
Visitor Counter : 181
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam