ఆర్థిక మంత్రిత్వ శాఖ

2023-24 మదింపు సంవత్సరం కోసం ఆదాయపు పన్ను రిటర్న్‌ల ఫారాలను ముందుగానే నోటిఫై చేసిన సీబీడీటీ

Posted On: 15 FEB 2023 12:57PM by PIB Hyderabad

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) 10.02.2023 & 14.02.2023 తేదీల్లో జారీ చేసిన నంబర్ 04 & నంబర్‌ 05, 2023 నోటిఫికేషన్ల ద్వారా 2023-24 మదింపు సంవత్సరం కోసం ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్‌ ఫారాలు) పత్రాలను నోటిఫై చేసింది. ఈ ఐటీఆర్‌ పత్రాలు 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. సీబీడీటీ ఎప్పుడూ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆదాయపు పన్ను పత్రాన్ని నోటిఫై చేస్తుంటుంది, ఈసారి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే నోటిఫై చేసింది.

పన్ను చెల్లింపుదార్లకు సులభంగా ఉండడానికి, పత్రాలు దాఖలు చేసే సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు గత సంవత్సరం ఐటీఆర్‌ ఫారాలతో పోలిస్తే ఈసారి ఐటీఆర్‌ పత్రాల్లో పెద్దగా మార్పులు చేయలేదు. ఆదాయపు పన్ను చట్టం, 1961లో చేసిన సవరణల కారణంగా అవసరమైన కనీస మార్పులు మాత్రమే చేసింది.

పెద్ద సంఖ్యలో ఉన్న చిన్న, మధ్య స్థాయి పన్ను చెల్లింపుదార్లకు అందించే సరళమైన ఫారాలు ఐటీఆర్‌ ఫారం 1 (సహజ్), ఐటీఆర్‌ ఫారం 4 (సుగమ్). రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన నివాసిత వ్యక్తి, జీతం, ఇంటి ఆస్తి, ఇతర వనరులు (వడ్డీ వంటివి) రూ.5 వేల వరకు వ్యవసాయ ఆదాయం పొందే వ్యక్తి సహజ్‌ను దాఖలు చేయవచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు), సంస్థలు (పరిమిత బాధ్యత గత భాగస్వామ్యాలు (ఎల్‌ఎల్‌పీలు) కానివి) 44ఏడీ, 44ఏడీఏ లేదా 44ఏఈ ప్రకారం మొత్తం ఆదాయం రూ.50 లక్షల వరకు ఉన్న వర్గాలు, వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే ఆదాయం కలిగిన నివాసితులు సుగమ్‌ను దాఖలు చేయవచ్చు.

వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం లేని వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు (సహజ్‌ను దాఖలు చేయడానికి అర్హత లేని వర్గాలు) ఐటీఆర్‌ ఫారం 2ను దాఖలు చేయాలి. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం ఉన్నవారు ఐటీఆర్‌ ఫారం 3ని దాఖలు చేయాలి. వ్యక్తులు, HUFలు, కంపెనీలు కాకుండా ఇతరులు అంటే భాగస్వామ్య సంస్థలు, ల్‌ఎల్‌పీలు వంటివి ఐటీఆర్‌ ఫారం 5ను దాఖలు చేయాలి. సెక్షన్ 11 కింద మినహాయింపును క్లెయిమ్ చేసే కంపెనీలు కాకుండా ఇతర కంపెనీలు ఐటీఆర్‌ ఫారం 6ను దాఖలు చేయాలి. చట్టం కింద మినహాయింపు పొందిన ఆదాయాన్ని క్లెయిమ్ చేసే ట్రస్టులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు మొదలైనవి ఐటీఆర్‌ ఫారం 7ను దాఖలు చేయాలి.

ఐటీఆర్‌ ఫైలింగ్ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడానికి, ఈ సంవత్సరం అన్ని ఐటీఆర్‌ పత్రాలను సకాలంలో నోటిఫై కాకుండా, గత సంవత్సరంతో పోలిస్తే ఐటీఆర్‌ ఫారాల దాఖలు పద్ధతిలో ఎటువంటి మార్పులు చేయలేదు. నోటిఫై చేసిన ఐటీఆర్‌ ఫారాలు డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ www.incometaxindia.gov.inలో అందుబాటులో ఉంటాయి.

 

****



(Release ID: 1899688) Visitor Counter : 162