రక్షణ మంత్రిత్వ శాఖ
'ఏరో ఇండియా 2023'లో వివిధ దేశాల రక్షణ శాఖల ప్రతినిధులతో భారత రక్షణ కార్యదర్శి చర్చలు
Posted On:
15 FEB 2023 9:02AM by PIB Hyderabad
బెంగళూరులో జరుగుతున్న 'ఏరో ఇండియా 2023' సందర్భంగా, 2023 ఫిబ్రవరి 14న, భారత రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమణే వివిధ దేశాల రక్షణ శాఖల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మతార్ సలేమ్ అలీ మర్రాన్ అల్దాహేరీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ద్వైపాక్షిక సమావేశం జరిగింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న రక్షణ సహకార అంశాలపై రెండు వర్గాలు చర్చించాయి, కొనసాగుతున్న సైనిక సంబంధాలపై సంతృప్తి వ్యక్తం చేశాయి.
లెఫ్టినెంట్ జనరల్ కన్ మైంత్ థాన్ నేతృత్వంలోని మయన్మార్ ప్రతినిధి బృందాన్ని కూడా భారత రక్షణ శాఖ కార్యదర్శి కలిశారు. ప్రస్తుతం కొనసాగుతున్న రక్షణ సహకార అంశాలపై చర్చించారు.
బ్రెజిల్‌తోనూ ద్వైపాక్షిక సమావేశం జరిగింది. బ్రెజిల్ ప్రతినిధి బృందానికి ఆ దేశ రక్షణ ఉత్పత్తుల విభాగం అధిపతి మేజ్ బ్రిగ్ రుయ్ చగాస్ మెస్క్వితా నేతృత్వం వహించారు. రక్షణ పారిశ్రామిక ఉత్పత్తులపై పరిస్పర సహకారం, భవిష్యత్‌లోనూ దానిని కొనసాగించడంపై భారత్-బ్రెజిల్ అధికారులు చర్చించారు.
కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జనరల్ యున్ మిన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో భారత రక్షణ కార్యదర్శి సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుత సహకారాన్ని సమీక్షించిన ఇరువురు అధికారులు, రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించారు.
రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా రక్షణ శాఖ ఉప మంత్రి శ్రీమతి కాటెరినా గ్రామటికోవాతోనూ శ్రీ గిరిధర్ సమావేశం అయ్యారు. రక్షణ పారిశ్రామిక ఉత్పత్తుల సహకారానికి సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించారు.
మారిషస్ ప్రధానమంత్రి కార్యాలయం శాశ్వత కార్యదర్శి శ్రీ కెచన్ బాల్గోబిన్ నేతృత్వంలోని మారిషస్ ప్రతినిధి బృందం శ్రీ గిరిధర్ అరమణేని కలిసింది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న, భవిష్యత్ రక్షణ సహకార విషయాలపై రెండు వర్గాలు సమీక్షించాయి. ముఖ్యమైన అంశాలపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నాయి.
***
(Release ID: 1899350)
Visitor Counter : 255