ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి శ్రీకారం స్మారక లోగోను ఆవిష్కరించిన ప్రధాని
“మహర్షి దయానంద సరస్వతి చూపిన మార్గం కోట్లాది ప్రజల్లో ఆశలు నింపింది”;
“మతంతో ముడిపెట్టిన చీకటి కథలను మతం వెలుగుతోనే ఛేదించిన స్వామీజీ”;
“సమాజంలో వేద విజ్ఞాన జ్యోతులను పునరావిష్కరించిన స్వామీజీ”;
“మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి అమృతకాలానికి పవిత్ర ప్రేరణ”;
“మన వారసత్వంపై గర్వించాలని దేశం ఇవాళ విశ్వాసంతో ప్రకటిస్తోంది”;
“మన విషయంలో మతానికి తొలి భాష్యం కర్తవ్య సంబంధితమే”;
“పేద.. వెనుకబడిన.. అణగారినవర్గాల సేవే నేడు దేశానికి తొలి యాగం”
Posted On:
12 FEB 2023 1:19PM by PIB Hyderabad
మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా ఏడాదిపాటు నిర్వహించే వేడుకలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించి, స్మారక లోగోను కూడా ఆవిష్కరించారు. ఈ వేదిక వద్దకు వచ్చేముందు ఆర్యసమాజ్ ప్రత్యక్ష ప్రదర్శనల ప్రదేశాన్ని ప్రధానమంత్రి తిలకించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న యజ్ఞంలో ఆహుతి సమర్పణ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో వెలిగించిన మహర్షి దయానంద సరస్వతి ప్రబోధ జ్యోతిని దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తం చేసేదిశగా యువతరం ప్రతినిధులకు ఆయన ‘ఎల్‌ఇడి దీపాన్ని’ అందజేశారు.
ఆ తర్వాత కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి చరిత్రాత్మకమని అభివర్ణించారు. ఇది యావత్ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చి, భవిష్యత్తును నిర్మించే సందర్భమని పేర్కొన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలనే మహర్షి దయానంద ఆశయాన్ని ప్రస్తావిస్తూ- సర్వత్రా వైరుధ్యం, హింస, అస్థిరతలు అలముకున్న ఈ యుగంలో మహర్షి దయానంద చూపిన మార్గం ఆశావహమైనదని ప్రధాని అన్నారు.
మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి వేడుకల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ శుభ సంకల్పాన్ని రెండేళ్లపాటు కొనసాగిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. మానవాళి సంక్షేమానికి భారత్ నిరంతర కృషిని ప్రస్తావిస్తూ- ఈ దిశగా నిర్వహిస్తున్న యాగంలో ఆహుతి సమర్పణ అవకాశం లభించడంపై ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. స్వామీజీ జన్మించిన గడ్డపై పుట్టడం తన అదృష్టమంటూ, జీవితంలో నిరంతరం మహర్షి దయానంద ఆశయాలపట్ల ఆకర్షితుడనయ్యానని చెప్పారు.
దయానంద సరస్వతి జన్మించిన సమయంలో భారతదేశంలోని స్థితిగతులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. శతాబ్దాల బానిసత్వంలో మగ్గినందువల్ల దేశం తీవ్రంగా దెబ్బతిన్నదని, బాగా బలహీనపడిందని చెప్పారు. ఫలితంగా ఆత్మవిశ్వాసాన్ని, స్వయం ప్రకాశాన్ని కోల్పోతున్నదని ఆయన పేర్కొన్నారు. భారతదేశ ఆదర్శాలు, సంస్కృతి, మూలాల విధ్వంసానికి సాగిన అనేక ప్రయత్నాలను ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ముందడుగు వేసిన స్వామీజీ- దేశ సంప్రదాయాలు, గ్రంథాలలో లోపమేదో ఉన్నదనే అపోహను తుత్తునియలు చేశారని చెప్పారు. అలాగే మనం విస్మరించిన వాటి అసలు అర్థమేమిటో విడమరచి చెప్పారని పేర్కొన్నారు. భారతదేశాన్ని కించపరిచే లక్ష్యంతో వేదాలకు తప్పుడు భాష్యం చెబుతూ సంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్న పరిస్థితుల్లో మహర్షి దయానంద చూపిన చొరవ రక్షణ కవచంగా నిలిచిందని ప్రధాని గుర్తుచేసుకున్నారు. “అంటరానితనం, వివక్ష వంటి సామాజిక రుగ్మతల నిర్మూలనకు స్వామీజీ బలమైన ఉద్యమం చేపట్టారు” అని శ్రీ మోదీ చెప్పారు. మహర్షి తన కాలంలో చేసిన అపార కృషిని వివరిస్తూ- 21వ శతాబ్దంలో కర్తవ్యాన్ని సవాలుగా స్వీకరించడానికి తానిచ్చిన ప్రాధాన్యంపై ప్రతిస్పందనలను ఆయన ఉదాహరించారు. “మతంతో ముడిపెట్టిన చీకటి కథలను మతం వెలుగుతోనే స్వామీజీ ఛేదించారు” అని ప్రధాని వివరించారు. అంటరానితనంపై స్వామీజీ పోరాటం ఆయన అవిరళ కృషికి నిదర్శనమని మహాత్మాగాంధీ కొనియాడినట్లు ప్రధాని గుర్తుచేశారు.
మహిళల విషయంలో సమాజం అనుసరిస్తున్న మూసధోరణులపై మహర్షి దయానంద తార్కిక రీతిలో సమర్థంగా గళమెత్తారని ప్రధానమంత్రి చెప్పారు. మహిళలపై వివక్షను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని, వారి విద్యకోసం ఉద్యమాలు కూడా ప్రారంభించారని, ఇవన్నీ 150 ఏళ్లనాటి వాస్తవాలని నొక్కిచెప్పారు. నేటి యుగంలోనూ మహిళలకు విద్య, గౌరవం పొందే హక్కును హరించే సమాజాలున్నాయని చెప్పారు. అయితే, చివరకు పాశ్చాత్య దేశాల్లో కూడా మహిళలకు సమాన హక్కులు అనే మాటే చాలా విడ్డూరంగా అనిపించిన కాలంలో వారికోసం మహర్షి దయానంద గళమెత్తారని ప్రధాని అన్నారు. మహర్షి దయానంద కృషిని, ఆయన సాధించిన అసాధారణ విజయాల స్వభావాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఆర్యసమాజ్ ఏర్పడిన 150 ఏళ్ల తర్వాత, ఆయన పుట్టిన 200 ఏళ్ల అనంతరం కూడా ప్రజల్లో ఆ స్ఫూర్తి, ఆయనపై గౌరవం దేశ మనుగడలో స్వామీజీకిగల ప్రముఖ స్థానానికి నిదర్శనమని ప్రధాని అన్నారు. “మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి అమృతకాలానికి పవిత్ర ప్రేరణ” అని ఆయన చెప్పారు.
స్వామీజీ బోధనలను దేశం ఎంతో విశ్వాసంతో అనుసరిస్తున్నదని శ్రీ మోదీ అన్నారు. ‘బ్యాక్ టు వేదాస్’ అన్న స్వామీజీ పిలుపును ప్రస్తావిస్తూ- “మన వారసత్వంపై గర్వించాలని దేశం ఇవాళ విశ్వాసంతో ప్రకటిస్తోంది” అని ప్రధాని అన్నారు. అదే సమయంలో సంస్కృతి, సంప్రదాయాలను సుసంపన్నం చేస్తూ ఆధునికతకు బాటలు వేయడంలో దేశ ప్రజల విశ్వాసాన్ని ఆయన ప్రశంసించారు. మతాన్ని ఆచారాలకు అతీతమైనదిగా, సంపూర్ణ జీవన విధానంగా నిర్వచించబడిన భారతదేశంలో దానికిగల విస్తృత భావనను ప్రధానమంత్రి ప్రస్తావించారు. “మన విషయంలో మతానికి తొలి భాష్యం కర్తవ్య సంబంధితమే”నని ప్రధానమంత్రి అన్నారు. జాతి జీవనంలోని అనేక కోణాలకు సంబంధించి నాయకత్వం స్వీకరించిన స్వామీజీ, సార్వజనీన-సమగ్ర విధానాన్ని అనుసరించారని ప్రధానమంత్రి అన్నారు. తత్వశాస్త్రం, యోగా, గణితం, విధానం, దౌత్యం, విజ్ఞానం, వైద్య శాస్త్రంలో భారతీయ రుషిపుంగవులు సాధించిన విజయాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. భారతీయ జీవనంలో రుషులు, సాధువులు పోషించిన పాత్ర విస్తృతమైనదని వివరించారు. ఆ ప్రాచీన సంప్రదాయాల పునరుద్ధరణలో స్వామీజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు.
మహర్షి దయానంద బోధనలను ప్రస్తావిస్తూ- జీవితకాలంలో ఆయన స్థాపించిన వివిధ సంస్థల జాబితాను ప్రధానమంత్రి గుర్తుచేశారు. మహర్షి విప్లవాత్మక భావజాలంతో జీవించినప్పటికీ, తన ఆలోచనలన్నింటినీ క్రమబద్ధంగా అనుసంధానించిన రీతిని వివరించారు. వివిధ రంగాలలో పలు సంస్థలను స్థాపించడంతోపాటు దశాబ్దాలపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను చురుకుగా చేపట్టే వాటిని ఏ విధంగా సంస్థాగతీకరించారో తెలియజేశారు. ఇందులో భాగంగా ‘పరోపకారిణి సభ’ను ఉదాహరిస్తూ- ఈ సంస్థను మహర్షి స్వయంగా స్థాపించారని, అది నేడు గురుకులాలు-ప్రచురణల ద్వారా వైదిక సప్రదాయాలను ప్రచారం చేస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. కురుక్షేత్ర గురుకుల్, స్వామి శ్రద్ధానంద ట్రస్ట్, మహర్షి దయానంద ట్రస్ట్ తదితరాలను కూడా ఆయన ఉదాహరించారు. ఈ సంస్థల ద్వారా అనేకమంది యువకులు తమ జీవితాలను చక్కగా రూపుదిద్దుకున్నారని పేర్కొన్నారు. గుజరాత్‌లో 2001నాటి భూకంపం సమయాన సేవ-రక్షణ కార్యకలాపాల్లో జీవన్ ప్రభాత్ ట్రస్ట్ అందించిన విశేష సహకారాన్ని కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ సంస్థ మహర్షి ఆదర్శాల నుంచి ప్రేరణ పొందిందని గుర్తుచేశారు.
స్వామీజీ ప్రాథమ్యాలు, వివక్షరహిత విధానాలతో దేశం ప్రగతి సాధిస్తోందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. “పేద, వెనుకబడిన, అణగారినవర్గాల సేవే నేడు దేశానికి తొలి యాగం” అన్నారు. దీనికి సంబంధించి గృహనిర్మాణం, వైద్య చికిత్స, మహిళా సాధికారతలను ఆయన ఉదాహరించారు. కొత్త విద్యా విధానం కూడా స్వామీజీ ప్రబోధిత భారతీయతకు ప్రాధాన్యమిస్తూ ఆధునిక విద్యను ప్రోత్సహిస్తుందని చెప్పారు.
ఆత్మసాక్షాత్కారం పొందడమంటే- తాను పొందిన దానికన్నా ఎక్కువ ఇవ్వడమని స్వామీజీ నిర్వచించారని ప్రధాని గుర్తుచేసుకున్నారు. కాబట్టి తాను స్వీకరించిన దానికన్నా సమాజానికి తిరిగి ఇచ్చే వ్యక్తిని ఆత్మ సాక్షాత్కరం పొందినవాడుగా గుర్తించవచ్చునని వివరించారు. పర్యావరణంసహా అనేక రంగాలలో ఈ నిర్వచనానికి ఔచిత్యం ఉందని పేర్కొన్నారు. ఈ వేద జ్ఞానాన్ని స్వామీజీ లోతుగా అర్థం చేసుకున్నారని ప్రధాని అన్నారు. “మహర్షి వేదాభ్యసకులు మాత్రమే కాదు... జ్ఞానమార్గ సాధువు” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సుస్థిర అభివృద్ధి కృషిలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వ వహిస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు ‘మిషన్ లైఫ్’ గురించి ప్రస్తావించారు. పర్యావరణాన్ని జి-20 ప్రత్యేక ఎజెండాగా ముందుకు తెస్తున్నట్లు చెప్పారు. ప్రాచీన జ్ఞాన పునాదులతో ఈ ఆధునిక ఆదర్శాల ప్రచారం ద్వారా ఆర్యసమాజ్ కీలక పాత్ర పోషించగలదని ప్రధానమంత్రి అన్నారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కూడా సూచించినట్లు తెలిపారు. అలాగే ‘శ్రీ అన్న’ కార్యక్రమానికి ఇస్తున్న పాధాన్యం గురించి తెలిపారు.
మహర్షి వ్యక్తిత్వం నుంచి చాలా నేర్చుకోవచ్చునని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ మేరకు మహర్షిని కలవడానికి వచ్చిన ఒక ఆంగ్ల అధికారి, భారతదేశంలో ఆంగ్లేయుల పాలన కొనసాగేలా ప్రార్థించాలని ఆయనను కోరిన ఉదంతాన్ని వివరించారు. దీనిపై మహర్షి స్పందించిన మహర్షి- “స్వాతంత్ర్యం నా ఆత్మ... భారతదేశ గళం” అని నిర్భయంగా బదులిచ్చినట్లు పేర్కొన్నారు. స్వామీజీ నుంచి ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, సంస్థానాధీశులు, దేశభక్తులు స్ఫూర్తి పొందారని చెప్పారు. లోకమాన్య తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కర్, లాలా లజపతిరాయ్, లాలా హరదయాళ్, చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్ తదితర స్వాతంత్య్ర యోధులు ఇందుకు నిదర్శనమని ప్రధాని అన్నారు. అలాగే మహాత్మా హన్సరాజ్, స్వామి శ్రద్ధానంద, భాయ్ పరమానంద తదితర అనేకమంది నాయకులు మహర్షినుంచి స్ఫూర్తి పొందారని గుర్తుచేశారు.
ఆర్యసమాజ్‌కు స్వామీజీ బోధనల వారసత్వం ఉందని, ప్రతి ‘ఆర్యవీర్’ నుంచి దేశంలో ఎంతో ఆశిస్తుందని ప్రధాని అన్నారు. వచ్చే ఏడాది ఆర్యసమాజ్ 150వ ఏడాదిలో ప్రవేశిస్తుందని ఆయన తెలిపారు. చివరగా- ఈ మహత్తర సందర్భంగా వేడుకలపై చక్కని ప్రణాళిక రచించి, ఆచరణాత్మకంగా అమలు చేయడం అభినందనీయమని ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు. “మహర్షి దయానంద కృషి నుంచి ఈ అమృత కాలంలో మనమంతా స్ఫూర్తి పొందుదాం” అని ప్రజలకు పిలుపునిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డితోపాటు ఆ శాఖ సహాయ మంత్రులు శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, శ్రీమతి మీనాక్షి లేఖి, ఢిల్లీ ఆర్య ప్రతినిధి సభ అధ్యక్షుడు శ్రీ దరమ్‌పాల్ ఆర్య, మహామంత్రి వినయ్ ఆర్య, సర్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభ అధ్యక్షుడు శ్రీ సురేష్ చంద్ర ఆర్య తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
సంఘ సంస్కర్త మహర్షి దయానంద సరస్వతి 1824 ఫిబ్రవరి 12న జన్మించారు. ఆనాటి సామాజిక అసమానతలను రూపుమాపడానికి ఆయన 1875లో ఆర్యసమాజ్‌ను ఏర్పాటు చేశారు. విద్యకు, సాంఘిక సంస్కరణలకు ప్రాధాన్యమిస్తూ దేశంలో సామాజిక-సాంస్కృతిక చైతన్యం తేవడంలో ఆర్యసమాజ్ కీలక పాత్ర పోషించింది. అఖిలభారత స్థాయిలో తమ సేవలకు నేటికీ తగిన గుర్తింపు దక్కని సంఘ సంస్కర్తలు, విశిష్ట వ్యక్తులకు సముచిత గౌరవమర్యాదలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని గిరిజన ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించడం నుంచి శ్రీ అరబిందో 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా ప్రధాని పాల్గొన్నారు. ఆ విధంగా ఆయన ఇటువంటి కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు.
(Release ID: 1898671)
Visitor Counter : 208
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam