హోం మంత్రిత్వ శాఖ

తుర్కియే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అన్వేషణ-రక్షణ కార్యకలాపాల కోసం రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల మోహరింపు

Posted On: 07 FEB 2023 4:31PM by PIB Hyderabad

   గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు తుర్కియేలో 06.02.2023నాటి భారీ భూకంప విధ్వంసం సంభవించిన ప్రాంతాల్లో అన్వేషణ-రక్షణ కార్యకలాపాల్లో తోడ్పడేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇవాళ 101 మందితో కూడిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) సిబ్బందిసహా ప్రత్యేక శిక్షణ పొందిన శునకదళం, ఇతరత్రా పరికరాలను పంపింది. ఈ సహాయ బృందం భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకుంటుంది. ‘ఎన్డీఆర్‌ఎఫ్‌’ దళం కమాండెంట్ శ్రీ గుర్మీందర్ సింగ్‌ నాయకత్వంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. ఈ బృందాలు అన్నివిధాలా స్వీయ-నియంత్రణతో తమ కర్తవ్యం నిర్వర్తిస్తాయి. అవసరమైన అత్యాధునిక అన్వేషణ-రక్షణ, వ్యక్తిగత భద్రత పరికరాలన్నీ ఈ బృందాల వద్ద ఉన్నాయి. సహాయ-రక్షణ చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం తుర్కియే స్థానిక అధికారులకు తోడ్పడుతుంది.

   గౌరవనీయ ప్రధానమంత్రి నిర్దేశించిన మేరకు భూకంప విలయ సంక్షోభం నుంచి కోలుకోవడంలో తుర్కియే ప్రభుత్వానికి అవసరమైన అన్నిరకాల సహాయం అందించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

*****



(Release ID: 1897131) Visitor Counter : 161