ప్రధాన మంత్రి కార్యాలయం
జైపూర్ మహాఖేల్ నుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని
“శిక్షణ సక్రమంగా ఉన్నప్పుడు విజయం సాధ్యం”
“దేశ రక్షణ విషయానికొస్తే రాజస్థాన్ యువత ఎప్పుడూ ముందుంటుంది”
“జైపూర్ మహాఖేల్ విజయవంతంగా నిర్వహించటమే భారత కృషికి తదుపరి అడుగు”
“అమృత కాలంలో దేశం కొత్త అడుగులు వేస్తోంది”
“2014 తరువాత దేశ క్రీడల బడ్జెట్ దాదాపు మూడు రెట్లు పెరిగింది”
“దేశంలో క్రీడా విశ్వవిద్యాలయాలు నెలకొల్పుతున్నాం, ఖేల్ మహాకుంభ్ లాంటి పెద్ద కార్యక్రమాలు వృత్తినైపుణ్యంతో నిర్వహిస్తున్నాం”
“డబ్బు లేక యువత ఎవరూ వెనుకబడకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది”
“మీరు ఫిట్ గా ఉంటేనే సూపర్ హిట్ అవుతారు”
“రాజస్థాన్ లో పండే శ్రీ అన్న సజ్జలు, శ్రీ అన్న జొన్నలు ఈ ప్రదేశానికి గుర్తింపు”
“నేటి యువత తమ బహుముఖ ప్రతిభ కారణంగా కేవలం ఒక రంగానికే పరిమితం కావాలనుకోవటం లేదు”
“క్రీడలు కేవలం ఒక రంగం కాదు, అదొక పరిశ్రమ”
“మనఃపూర్వకంగా కృషి చేస్తే ఫలితాలు అవే వస్తాయి”
“దేశానికి ఈసారి స్వర్ణ, రజత పతకాలు తెచ్చేవారు మీనుంచే వస్తారు”
Posted On:
05 FEB 2023 3:30PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు జైపూర్ మహాఖేల్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఒక కబడ్డీ మాచ్ కూడా తిలకించారు. జైపూర్ రూరల్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2017 నుంచి జైపూర్ మహాఖేల్ నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, ఆటగాళ్లను, కోచ్ లను, ఈ మెగా పోటీలో పతకాలు సాధించిన వారి కుటుంబాలను అభినందించారు. క్రీడా రంగాన్ని ఎంచుకున్న వారు కేవలం పాల్గొనటానికి కాదని, గెలిచి నేర్చుకోవటానికేనని ప్రధాని వ్యాఖ్యానించారు. “శిక్షణ ఉన్నచోట గెలుపు ఖాయమవుతుంది” అన్నారు. ఏ ఆటగాడూ ఆటస్థలం నుంచి వట్టి చేతులతో వెళ్ళటానికి ఇష్టపడడన్నారు.
దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనటం గమనించిన ప్రధాని ఆసియా క్రీడల పతాక విజేత రామ్ సింగ్, పారా అథ్లెట్ దేవేంద్ర జఝారియా, ధ్యాన చంద్ ఖేల్ రత్న పురస్కార గ్రహీత సాక్షి కుమారి, అర్జున అవార్డు గ్రహీతలు, సీనియర్ క్రీడాకారుల పేర్లు ప్రస్తావించారు. ఈ పేరు మోసిన క్రీడా ప్రముఖులు ముందుకొచ్చి యువ క్రీడాకారులను జైపూర్ మహాఖేల్ లో ప్రోత్సహించటం సంతోషదాయకమన్నారు.
దేశ వ్యాప్తంగా జరుగుతున్న అనేక ఆటల పోటీలు, ఖేల్ మహాకుంభ్ లు దేశంలో వస్తున్న పెనుమార్పుకు నిదర్శనమన్నారు. రాజస్థాన్ యువత వీరత్వానికి చిహ్నమని ఈ నేలతల్లి బిడ్డలు తమ వీరత్వంతో యుద్ధభూమిని సైతం ఆటస్థలంగా మార్చుకున్న చరిత్ర ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశ భద్రత విషయంలో మిగలిన వారందరికంటే ముందుండేది రాజస్థాన్ యువతేనని చెబుతూ, రాజస్థాన్ వారి క్రీడా సంప్రదాయం ఈ ప్రాంత యువత మానసిక, శారీరక సామర్థ్యాన్ని తీర్చిదిద్దందన్నారు. వందల ఏళ్ళుగా మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించే దాదా, సితోలియా, రుమాల్ జపట్టా లాంటి సంప్రదాయ క్రీడలను ఆయన ఉదహరించారు.
క్రీడారంగానికి సేవచేసి త్రివర్ణ పతాకాన్ని శిఖరాలకు చేర్చిన అనేకమంది రాజస్థాన్ క్రీడాకారులను గుర్తు చేస్తూ, జైపూర్ ప్రజలు ఒక ఒలంపిక్ పతక గ్రహీతను పార్లమెంటుకు పంపారని అన్నారు. పార్లమెంట్ సభ్యుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సమాజానికి తిరిగి ఇస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహించటాన్ని ప్రధాని అభినందించారు. అలాంటి చొరవ వల్లనే జైపూర్ ఇలాంటి క్రీడలకు వేదికగా మారిందన్నారు. జైపూర్ మహాఖేల్ విజయవంతం కావటాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఏడాది పోటీల్లో 600 జట్లు, 6,500 మంది యువత పాల్గొనటం, అందులో 125 బాలికల జట్లు ఉండటం అభినందించదగ్గ విషయమన్నారు.
“భారత స్వాతంత్ర్య అమృత కాలంలో దేశం కొత్త పుంతలు తొక్కుతోందని ప్రధాని అన్నారు. ఎట్టకేలకు క్రీడలను రాజకీయ కోణంలో కాకుండా, క్రీడాకారుల కోణంలో చూడటం మొదలైందని, యువత లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగటం వలన ఏదీ అసాధ్యం కాదనే అభిప్రాయానికొచ్చారన్నారు. ఆత్మ గౌరవం, స్వావలంబన, సౌకర్యాలు, వనరులు, సామర్థ్యాలు కలగలిసి ముందుకు నడుపుతున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం నుంచి అలాంటి వైఖరిని ఈ బడ్జెట్ లో కూడా చూడవచ్చునన్నారు. క్రీడా మంత్రిత్వశాఖకు ఈ ఏడాది రూ. 2500 కోట్లు కేటాయించగా, 2014 కు ముందు ఏడాదికి రూ.800-850 కోట్లు మాత్రమే ఉండేదని, ఇప్పుడు మూడు రెట్లు పెరిగిందని గుర్తు చేశారు. అదే విధంగా ఖేలో ఇండియాకు 1000 కోట్లకు పైగా కేటాయించటం ద్వారా క్రీడా వసతులు పెంచటానికి వీలు కలుగుతోందన్నారు.
భారత యువతలో క్రీడల పట్ల ఆసక్తికి, ప్రతిభకు ఎంతమాత్రమూ లోటు లేదని వనరులు, తగిన అండ లేకపోవటం వల్లనే అవరోధాలు ఏర్పడ్డాయని అన్నారు. ఇప్పుడు క్రీడాకారులకు ఎదురయ్యే అలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతోందని చెబుతూ, ఐదారేళ్ళుగా జరుగుతున్న జైపూర్ మహాఖేల్ ను ఉదహరించారు. దేశమంతటా ఖేల్ మహాకుంభ్ లు జరుగుతున్నాయని, వేలాది మంది క్రీడాకారుల ప్రతిభ వెలుగు చూస్తోందని అన్నారు.
జిల్లా, ప్రాంతీయ స్థాయిలలో కూడా క్రీడా సౌకర్యాలు మెరుగుపడటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని ప్రధాని అన్నారు. దేశంలో వందలాది జిల్లాలో లక్షలాది యువత కోసం క్రీడల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశామని చెబుతూ, రాజస్థాన్ లోని అనేక నగరాలలో ఇదే అభివృద్ధి జరిగిందని, ఈరోజు దేశమంతటా క్రీడా విశ్వవిద్యాలయాలు నెలకొల్పుతున్నామని, ఖేల్ మహా కుంభ్ లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించగలుగు తున్నామని అన్నారు. ఈ సంవత్సరం జాతీయ క్రీడా విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించటాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. క్రీడల నిర్వహణ, క్రీడల సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరచటం ద్వారా యువత ఈ రంగాన్ని ఎంచుకొని ప్రతిభను మెరుగుపరచుకోవటానికి అవకాశం కలుగుతోందన్నారు.
“కేవలం డబ్బు లేక యువత వెనుకబడకూడదన్నదే ప్రభుత్వ ఆలోచన” అన్నారు ప్రధాని. ఉత్తమ ప్రతిభ కనబరచిన ఆటగాళ్లకు ఏటా రూ. 5 లక్షల దాకా ఇస్తున్న విషయం ప్రధాని ప్రస్తావించారు. ప్రధాన క్రీడల అవార్డుల మొత్తాన్ని కూడా దాదాపు మూడు రెట్లు పెంచైనా సంగతి కూడా చెప్పారు. ఒలంపిక్స్ లాంటి అంతర్జాతీయ క్రీడలకు సిద్ధమయ్యేవారికి ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి కూడా ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కేవలం క్రీడాలలోనే కాకుండా రోజువారీ జీవితంలో కూడా ఫిట్ నెస్ ప్రాధాన్యాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఫిట్ గా ఉన్నప్పుడు మాత్రమే సూపర్ హిట్ అవుతారనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా లాంటి ప్రచారోద్యమాలతోబాటు ఫిట్ నెస్ లో పోషకాహారం ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. ఐక్య రాజ్య సమితి 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించటం గురించి చెబుతూ, సంప్రదాయ చిరుధాన్యాలకు రాజస్థాన్ నిలయమన్నారు. రాజస్థాన్ రాష్ట్రపు శ్రీ అన్న సజ్జలు, శ్రీ అన్న జొన్నలు పేరు సంపాదించి పెట్టాయంటూ, అక్కడి వంటకాలైన జొన్న సంగటి, చూర్మా గురించి ప్రస్తావించారు. యువత కేవలం శ్రీ అన్న తమ ఆహారంగా చేసుకోవటానికే పరిమితం కాకుండా, ఆ ఆహారానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు.
“ క్రీడలు కేవలం ఒక రంగం కాదు, ఇదొక పరిశ్రమ” అన్నారు. క్రీడలకు సంబంధించిన ఉత్పత్తులు తయారుచేసే ఎంఎస్ ఎంఈ ల ద్వారా చాలామంది ఉపాధి పొందగలుగుతున్నారని, ఏం ఎస్ ఏం ఈ లను బలోపేతం చేయటానికి ఈ బడ్జెట్లో అనేక కీలక ప్రకటనలు చేశామన్నారు. పిఎం విశ్వ కర్మ కౌశల సమ్మాన్ ను ఆయన ఉదహరించారు. చేతి వృత్తి నిపుణుల నైపుణ్యం మెరుగు పరచుకోవటానికి, పనిముట్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పిఎం విశ్వకర్మ యోజన ద్వారా యువతకు ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందుతుందన్నారు.
ప్రధాని తన ప్రసంగం ముగిస్తూ, మనఃపూర్వకంగా కృషి చేస్తే ఫలితాలు కచ్చితంగా వస్తాయన్నారు. టోక్యో ఒలంపిక్స్ సమయంలోనూ, కామన్వెల్త్ గేమ్స్ లోనూ దేశం చేసిన కృషిని, ఫలితాలను గుర్తు చేస్తూ, ఇప్పుడు జైపూర్ మహాఖేల్ కూడా భవిష్యత్తులో అద్భుత ఫలితాలనిస్తుందన్నారు. “ఈసారి దేశానికి వచ్చే స్వర్ణ, రజత పతకాలు మీ నుంచే వస్తాయి. మీరు పట్టుదలతో ఉంటే ఒలంపిక్స్ లో త్రివర్ణ పతాకం ఔన్నత్యాన్ని పెంచుతారు. ఎక్కడకి వెళ్ళినా దేశానికి పేరు తెస్తే దేశం ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది” అన్నారు.
జైపూర్ రూరల్ లోక్ సభ ఎంపీ శ్రీ రాజ్య వర్ధన్ సింగ్ రాథోడ్ సహ పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ఈసారి కబడ్డీ మీద ప్రత్యేక దృష్టి సారించిన మహాఖేల్ 2023 జనవరి 12 న జాతీయ యువజనోత్సవం నాడు మొదలైంది. జైపూర్ రూరల్ లోక్ సభ స్థానం పరిధిలోని మొత్తం 8 శాసనసభ స్థానాలలో ఉన్న 450 గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, వార్డులకు చెందిన 6400 మంది యువత, క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. ఈ మహాఖేల్ నిర్వహణ వలన జైపూర్ యువత తమ ప్రతిభ చాటుకోవటానికి, క్రీడలను ఒక కెరీర్ గా మలుచుకోవటానికి వీలు కలిగింది.
(Release ID: 1896513)
Visitor Counter : 209
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam