ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిబ్రవరి 6న ప్రధానమంత్రి కర్ణాటక పర్యటన


బెంగళూరులో ‘ఇండియా ఎనర్జీ వీక్-2023’ని ప్రారంభించనున్న ప్రధాని;

ఇథనాల్‌ మిశ్రమ మార్గప్రణాళిక ముందంజ... ‘ఇ20’ ఇంధనానికి ప్రధాని శ్రీకారం;

హరిత ఇంధనాలపై ప్రజావగాహన దిశగా హరిత రవాణా
ప్రదర్శనను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధానమంత్రి;

ఇండియన్‌ ఆయిల్‌ చేపట్టిన ‘అన్‌బాటిల్డ్‌’ కార్యక్రమం కింద యూనిఫారాలను ప్రారంభించనున్న ప్రధాని... ప్రతి యూనిఫాం కోసం 28 ‘పెట్‌’ బాటిళ్ల రీసైకిల్;

ఇండియన్ ఆయిల్ తయారీ ఇన్డోర్ సౌర వంట వ్యవస్థ జంట స్టవ్‌లను
అంకితం చేయనున్న ప్రధాని... ఇది విప్లవాత్మక వంట సదుపాయం...
సౌర-ఇతర సహాయక శక్తి వనరులతో ఏకకాలంలో పని చేయగలదు;

రక్షణ రంగంలో స్వయం సమృద్ధం దిశగా మరో ముందడుగు... తుమకూరులో ‘హెచ్‌ఎఎల్’ హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి;

తుమకూరు పారిశ్రామిక వాడతోపాటు రెండు
జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

Posted On: 04 FEB 2023 11:47AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఫిబ్రవరి 6న కర్ణాటకలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ రోజున ఉదయం 11:30 గంటలకు బెంగళూరులో భారత ఇంధన వారోత్సవాలు-2023 (ఇండియా ఎనర్జీ వీక్)ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు తుమకూరులో ‘హెచ్‌ఎఎల్’ హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తారు. దీంతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన కూడా చేస్తారు.

భారత ఇంధన వారోత్సవాలు-2023

   ప్రధానమంత్రి బెంగళూరులో భారత ఇంధన వారోత్సవాలు-2023 (ఐఇడబ్ల్యు)ని ప్రారంభిస్తారు. ఇంధన మార్పిడిలో ప్రపంచ పరివర్తనాత్మక శక్తిగా ఇనుమడిస్తున్న భారత సామర్థ్యాన్ని చాటిచెప్పడం లక్ష్యంగా ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు ‘ఐఇడబ్ల్యు’  బాధ్యతాయుత ఇంధన పరివర్తన క్రమంలో సవాళ్లు-అవకాశాలపై చర్చించడం కోసం సంప్రదాయ-సంప్రదాయేతర ఇంధన పరిశ్రమ అధిపతులు, ప్రభుత్వ, విద్యాసంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వివిధ దేశాల నుంచి 30 మందికిపైగా మంత్రులతోపాటు 30,000 మంది ప్రతినిధులు, 1,000 మంది ప్రదర్శకులు, 500 మంది వక్తలు ఈ సందర్భంగా భారత ఇంధన భవిష్యత్తు సవాళ్లు-అవకాశాలపైనా చర్చిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌ధానమంత్రి ప్రపంచ చమురు-గ్యాస్‌ సంస్థల ‘సీఈఓ’లతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అలాగే హరిత ఇంధన రంగంలో అనేక కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభిస్తారు.

   ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధనకు ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం ప్రభుత్వ ప్రాధాన్యాంశాల్లో ఒకటిగా ఉంది. తదనుగుణంగా ప్రభుత్వ నిరంతర కృషితో 2013-14 నుంచి ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం ఆరు రెట్లు పెరిగింది. ఇథనాల్ మిశ్రమం, జీవ ఇంధన కార్యక్రమాల కింద గత ఎనిమిదేళ్లలో సాధించిన విజయాలతో భారత ఇంధన భద్రత పెరిగింది. దీంతోపాటు 318 లక్షల టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపు, రూ.54,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదాసహా ఇతరత్రా ప్రయోజనాలు చేకూరాయి. ఇందులో భాగంగా 2014 నుంచి 2022 వరకూ ఇథనాల్ సరఫరాపై సుమారు రూ.81,800 కోట్లు చెల్లించగా, రూ.49,000 కోట్లకుపైగా సొమ్ము రైతుల ఖాతాలకు బదిలీ చేయబడింది.

   ఇథనాల్‌ మిశ్రమ మార్గప్రణాళికకు అనుగుణంగా 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని చమురు విక్రయ కంపెనీలకు చెందిన 84 చిల్లర విక్రయ కేంద్రాల్లో ‘ఇ20’ ఇంధన విక్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది పెట్రోల్‌తో 20 శాతం ఇథనాల్ మిశ్రమం. కాగా, 2025కల్లా దేశమంతటా 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ మేరకు పురోగమన సౌలభ్యం దిశగా చమురు విక్రయ కంపెనీలు 2జి-3జి ఇథనాల్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమాల్లో భాగంగా హరిత రవాణా ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. హరిత ఇంధనాలపై ప్రజల్లో అవగాహన పెంపు దిశగా నిర్వహిస్తున్న ర్యాలీలో హరిత ఇంధనంతో నడిచే వాహనాలు పాల్గొంటాయి.

   ఇండియన్ ఆయిల్‌ సంస్థ చేపట్టిన ‘అన్‌బాటిల్డ్’ కార్యక్రమం కింద రూపొందించిన యూనిఫారాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఒకసారి వాడి-పారవేసే ప్లాస్టిక్‌ నిర్మూలనపై  ప్రధాని దార్శనికతకు అనుగుణంగా రీసైకిల్‌ చేసిన పాలిస్టర్‌ (ఆర్‌పెట్‌), కాటన్‌తో తయారుచేసిన యూనిఫారాలను తమ చిల్లర విక్రయ కేంద్రాల, వంటగ్యాస్‌ సరఫరా సిబ్బంది కోసం ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతి యూనిఫామ్‌ కోసం సుమారు 28 ‘పెట్‌’ బాటిళ్లను రీసైకిల్‌ చేయాల్సి ఉంటుంది. రీసైకిల్ చేసిన పాలిస్టర్‌తో మన్నికగల వస్త్రాల తయారీ దిశగా ‘అన్‌బాటిల్డ్’ బ్రాండ్ను ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ మరింత ముందుకు తీసుకెళ్తోంది. ఈ బ్రాండ్ కింద తమ సంస్థతోపాటు ఇతర చమురు విక్రయ కంపెనీల వినియోగదారు సేవా సిబ్బంది యూనిఫాంలు, సైన్యం కోసం నాన్-కాంబాట్ యూనిఫాంలు, వివిధ సంస్థలకు ఇతర యూనిఫాంలు/దుస్తులు, చిల్లర వినియోగదారులకు విక్రయాలను కూడా చేపట్టాలన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

   ఇండియన్ ఆయిల్ సంస్థ తయారీ ఇన్‌డోర్‌ సౌర వంటవ్యవస్థ జంట స్టవ్‌ నమూనాను జాతికి అంకితం చేయడంతోపాటు వాణిజ్య విక్రయాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సంస్థ ఇంతకుముందు విప్లవాత్మక ఆవిష్కరణలో భాగంగా ఒకే స్టవ్‌తో ఇలాంటి ఉత్పత్తిని తయారుచేసి పేటెంట్‌ కూడా పొందింది. దీనిపై వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా ఇప్పుడు జంట స్టవ్‌ వ్యవస్థను రూపొందించింది. ఇది వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పిస్తుంది. ఈ విప్లవాత్మక వంట సదుపాయం ఇప్పుడు సౌర-ఇతర సహాయక శక్తి వనరులతో ఏకకాలంలో పని చేయగలదు. ఇది భారతదేశానికి నమ్మకమైన వంటింటి  పరిష్కారంగా కాగలదు.

తుమకూరులో ప్రధానమంత్రి

   దేశ రక్షణ రంగంలో మరింత స్వయం సమృద్ధి సాధన దిశగా తుమకూరులో ‘హెచ్‌ఎఎల్‌’ హెలికాప్టర్‌ ఫ్యాక్టరీని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. దీనికి 2016లో ఆయన తన చేతులమీదుగానే శంకుస్థాపన చేశారు. ఇది పూర్తిగా హరితక్షేత్ర హెలికాప్టర్‌ ఫ్యాక్టరీ కాగా, నిర్మాణ పర్యావరణ వ్యవస్థతోపాటు తయారీ సామర్థ్యాన్ని కూడా ఇది పెంచుతుంది. ఇది ఆసియా ఖండంలోననే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం. ఇక్కడ తొలుత లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను (ఎల్‌యుహెచ్‌) తయారు చేస్తారు. ‘ఎల్‌యుహెచ్‌’ దేశీయంగా రూపొందించి, తయారు చేయబడిన 3-టన్నుల తరగతి, ఒకే ఇంజన్ బహుళార్ధసాధక హెలికాప్టర్.

   లైట్ కంబాట్ హెలికాప్టర్ (ఎల్‌సిహెచ్‌)తోపాటు ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్‌హెచ్‌) వంటి ఇతర హెలికాప్టర్లుసహా భవిష్యత్తులో ‘ఎల్‌సిహెచ్‌, ఎల్‌యుహెచ్‌, సివిల్‌ ఎఎల్‌హెచ్‌’ రకాల తయారీతోపాటు ‘ఐఎంఆర్‌హెచ్‌’ మరమ్మతు, పునర్నవీకరణ తదితరాలతో ఫ్యాక్టరీ విస్తరణ చేపడతారు. అలాగే భవిష్యత్తులో సివిల్ ‘ఎల్‌యుహెచ్‌’ల ఎగుమతి అవకాశం కూడా ఉంది. ఈ ఫ్యాక్టరీతో భారత్‌ తన హెలికాప్టర్ల పూర్తి అవసరాలను దేశీయంగానే తీర్చుకోగలదు. అంతేగాక దేశంలో హెలికాప్టర్ రూపకల్పన, అభివృద్ధి, తయారీలో స్వావలంబనతో విశిష్ట స్థానం ఆక్రమించగలదు. ఇక్కడ పారిశ్రామిక విప్లవం 4.0 ప్రమాణాలతో తయారీ జరుగుతుంది. తదనుగుణంగా తుమకూరులో 3-15 టన్నుల తరగతుల్లో రాబోయే 20 ఏళ్లలో 1,000 హెలికాప్టర్ల తయారీని హెచ్‌ఎఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో సుమారు 6,000 మందికి ఉపాధి లభిస్తుంది.

   ప్రధానమంత్రి తుమకూరు పారిశ్రామిక టౌన్‌షిప్‌కు శంకుస్థాపన చేస్తారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద తుమకూరులో మూడు దశల్లో 8,484 ఎకరాల్లో విస్తరించిన ఈ టౌన్‌షిప్ నిర్మాణాన్ని చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా చేపడుతున్నారు.

   తుమకూరులోని టిప్టూరు, చిక్కనాయకనహళ్లిలో రెండు జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇందులో రూ.430 కోట్లతో టిప్టూరు బహుళ గ్రామ తాగునీటి సరఫరా ప్రాజెక్టు నిర్మిస్తారు. అలాగే చిక్కనాయకనహళ్లి తాలూకాలోని 147 ఆవాసాలకు బహుళగ్రామ నీటి సరఫరా పథకం సుమారు రూ.115 కోట్లతో నిర్మితమవుతుంది. ఈ ప్రాజెక్టులతో ఈ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది.


(Release ID: 1896509) Visitor Counter : 174