ఆర్థిక మంత్రిత్వ శాఖ

2014 నుంచి సాధించిన విజయాలు: ఎవరి చేయీ వదల్లేదు


పౌరులంతా గౌరవంగా జీవించేలా నాణ్యమైన జీవన ప్రమాణాలను 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం అందించింది - శ్రీమతి నిర్మల సీతారామన్

Posted On: 01 FEB 2023 1:28PM by PIB Hyderabad

2014 నుంచి, పౌరులందరికీ గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం అందించిందని, తలసరి ఆదాయం రెండింతలకు పైగా పెరిగి ₹1.97 లక్షలకు చేరుకుందని, కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ఇవాళ పార్లమెంటులో చెప్పారు. ఈ 9 సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 10వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకిందని, ప్రపంచ సూచీల్లో సుపరిపాలిత, ఆవిష్కరణల దేశంగా, వ్యాపార అనుకూలమైన వాతావరణం కల్పించిన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందిందని చెప్పారు. చాలా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో గణనీయమైన పురోగతిని మనం సాధించామని వెల్లడించారు.

2022లో ఈపీఎఫ్‌వో సభ్యత్వం రెట్టింపై 27 కోట్లకు చేరడం, 7,400 కోట్ల యూపీఐ లావాదేవీల ద్వారా ₹126 లక్షల కోట్ల డిజిటల్‌ పేమెంట్లతో ఆర్థిక వ్యవస్థలో వృద్ధి స్పష్టంగా ప్రతిబింబించిందని ఆర్థిక మంత్రి చెప్పారు. లక్ష్యాల సార్వత్రికీకరణ వల్ల అనేక పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని ఆమె వెల్లడించారు, అవి:

  • స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11.7 కోట్ల గృహ మరుగుదొడ్లు
  • ఉజ్వల పథకం కింద 9.6 కోట్ల వంట గ్యాస్‌ కనెక్షన్లు
  • 102 కోట్ల మందికి 220 కోట్ల కొవిడ్ టీకాలు
  • 47.8 కోట్ల పీఎం జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు
  • ప్రధానమంత్రి సురక్ష బీమా, పీఎం జీవన్ జ్యోతి యోజన కింద 44.6 కోట్ల మందికి బీమా రక్షణ
  • పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 11.4 కోట్ల మంది రైతులకు ₹2.2 లక్షల కోట్ల నగదు బదిలీ

 

 

***(Release ID: 1895590) Visitor Counter : 331