ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ 2023-24 సారాంశం
సాధికార… సార్వజనీన ఆర్థిక వ్యవస్థకు నమూనా ప్రణాళికగా అమృతకాల దృక్పథాన్ని ఆవిష్కరించిన కేంద్ర బడ్జెట్ 2023-24
నాలుగు పరివర్తనాత్మక అవకాశాలు చోదకంగా త్రిముఖ దృష్టితో కూడిన అమృతకాల పునాది
మూలధన పెట్టుబడి వ్యయం 33 శాతం పెంపుతో రూ.10 లక్షల కోట్లు
వాస్తవ మూలధన వ్యయం జీడీపీలో 4.5 శాతం
కేంద్ర బడ్జెట్ 2023-24లో ద్రవ్యలోటు జీడీపీలో 5.9 శాతంగా అంచనా
ఆర్థిక సంవత్సరం 2022-23లో వాస్తవ జీడీపీ వృద్ధి 7 శాతంగా అంచనా
ఆర్థిక సంవత్సరం-2023లో ఎగుమతుల వృద్ధి అంచనా 12.5 శాతం
అధిక విలువగల ఉద్యాన పంటల కోసం నాణ్యమైన సాగు సరంజామా లభ్యత పెంపు నిమిత్తం రూ.2200 కోట్లతో స్వయం సమృద్ధి ‘క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్’
దేశవ్యాప్తంగా 157 కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటు
పీఎం ఆవాస్ యోజన వ్యయం 66 శాతం పెంపుతో రూ.79,000 కోట్లు
రైల్వేలకు ఎన్నడూ లేనంత ఎక్కువగా రూ.2.40 లక్షల కోట్ల మూలధన వ్యయం
ప్రాధాన్య రంగాల రుణలోటు ఆధారంగా పట్టణ మౌలిక
సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటుకు నిర్ణయం
‘గోబర్-ధన్ పథకం కింద రూ.10,000 కోట్లతో
500 కొత్త ‘వ్యర్థం నుంచి అర్థం’ ప్లాంట్ల ఏర్పాటు
10,000 బయో-ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటు ద్వారా జాతీయ స్థాయి సూక్ష్మ-ఎరువులు.. పురుగుమందుల అనుసంధాన తయారీ నెట్‌వర్క్ సృష్టి
ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి యోజన 4.0 ప్రారంభానికి నిర్ణయం
వ్యక్తిగత ఆదాయపు పన్నుపై గణనీయ ఊరటనిచ్చిన కేంద్ర బడ్జెట్ 2023-24;
కొత్త పన్ను వ్యవస్థ కింద కొత్త శ్లాబుల ప్రకటన
నివాస భారతీయులకు రూ.7లక్షలదాకా వార్షికాదాయంపై పన్ను మినహాయింపు
కొత్త విధానం కింద వేతన జీవులకు రూ.50వేల ప్రామాణిక తగ్గింపు కూడా లభ్యం
వ్యక్తిగత, హిందూ సమష్టి కుటుంబాలకు కొత్త పన్ను విధానం తప్పనిసరి
ప్రైవేటు ఉద్యోగుల పదవీ విరమణానంతర ఆర్జిత సెలవుల
నగదీకరణకు పన్ను మినహాయింపు పరిమితి రూ.25 లక్షలకు పెంపు
సహకార రంగం అభివృద్ధి కోసం విస్తృత ప్రతిపాదనలు
ఎగుమతులకు ప్రోత్సాహం, దేశీయ తయారీ పెంపు-విలువ జోడింపు మెరుగు, హరిత ఇంధన-రవాణాలకు ప్రోత్సాహం లక్ష్యంగా పరోక్ష పన్ను ప్రతిపాదనలు
వస్త్ర, వ్యవసాయ రంగాలు మినహా వస్తువులపై
ప్రాథమిక కస్టమ్స్ సుంకాల సంఖ్య 21 నుంచి 13కు తగ్గింపు
పీఐబీ ఢిల్లీ ద్వారా 2023 ఫిబ్రవరి 01న మధ్యాహ్నం 1:37 గంటలకు పోస్ట్ చేయబడినది
Posted On:
01 FEB 2023 1:37PM by PIB Hyderabad
భారత స్వాతంత్ర్య 75వ సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచం ‘ఉజ్వల తార’గా గుర్తించింది. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో ప్రపంచవ్యాప్త మందగమనం ప్రస్ఫుటమైంది. ఈ నేపథ్యంలో ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మించి భారత ఆర్థిక వృద్ధి 7 శాతంగా అంచనా వేయబడటమే ఇందుకు కారణం. కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో 2023-24 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ మేరకు ప్రకటించారు. భారత ఆర్థిక వ్యవస్థ సముచిత మార్గంలో కొనసాగుతూ, సవాళ్లు ఎదురైనప్పటికీ ఉజ్వల భవిష్యత్తు దిశగా పయనిస్తోందని ఆమె నొక్కిచెప్పారు.
పార్ట్-ఎ
గత బడ్జెట్ వేసిన పునాదుల ఆధారంగా ముందడుగు వేయగలమని ప్రస్తుత బడ్జెట్ ఆశాభావం ప్రకటిస్తున్నదని శ్రీమతి సీతారామన్ చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు, పౌరులకు… ముఖ్యంగా యువత, మహిళలతోపాటు రైతులు, ఓబీసీలు, షెడ్యూల్డ్ కులాలు/ తెగల ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందించగల సుసంపన్న, సార్వజనీన భారతం దిశగా భారత్@100 లక్ష్యంతో నమూనా ప్రణాళిక రూపొందించబడిందని ఆమె పేర్కొన్నారు.
అనేక సంక్షోభాల నడుమ చెక్కుచెదరని దృఢత్వం
ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ఠ పెరగడానికి అనేక విజయాలు దోహదం చేశాయని ఆర్థిక మంత్రి చెప్పారు. వీటిలో విశిష్ట అంతర్జాతీయ స్థాయి ప్రభుత్వ డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆధార్, కో-విన్, యూపీఐ వంటివి ప్రధానమైనవని ఆమె పేర్కొన్నారు. అలాగే అసాధారణ వేగం-పరిమాణంతో కోవిడ్-19 టీకాల కార్యక్రమం, వాతావరణ సంబంధిత లక్ష్యాల సాధన, మిషన్ లైఫ్, జాతీయ ఉదజని కార్యక్రమం, సరిహద్దు ప్రాంతాల్లో చురుకైన పాత్ర కూడా ఇందుకు తోడ్పడ్డాయని వివరించారు.
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం 28 నెలల పాటు 80 కోట్ల మందికిపైగా ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసిందని ఆమె గుర్తుచేశారు. ఈ పథకం అమలుతో ఏ ఒక్కరూ ఆకలి బాధితులు కాకుండా జాగ్రత్త వహించిందని పేర్కొన్నారు. ఆహారం, పౌష్టికత భద్రతకు హామీకి కట్టుబడిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను మరో ఏడాది పొడిగించిందని గుర్తుచేశారు. ఈ మేరకు 2023 జనవరి 1 నుంచే అన్ని అంత్యోదయ, ప్రాధాన్య కుటుంబాలకు ఉచిత ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకయ్యే దాదాపు రూ.2 లక్షల కోట్ల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆమె చెప్పారు.
జి-20 అధ్యక్షత: సవాళ్ల నడుమ ప్రపంచ ప్రగతికి నేతృత్వం
నేటి ప్రపంచవ్యాప్త సవాళ్ల నడుమ ప్రపంచ ఆర్థిక పయనాన్ని గాడిలో పెట్టడంలో భారత్ తన పాత్రను మరింత బలోపేతం చేసుకోవడానికి జి-20 అధ్యక్ష బాధ్యత ఒక విశిష్ట అవకాశం కల్పించిందని ఆర్థిక మంత్రి చెప్పారు. తదనుగుణంగా ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో ప్రపంచ సమస్యల పరిష్కారానికి, ఆర్థికాభివృద్ధి స్థిరీకరణ సౌలభ్యం కల్పనకు భారతదేశం ప్రతిష్టాత్మక, ప్రజా-ప్రాధాన్య కార్యక్రమాన్ని చేపట్టిందని ఆమె తెలిపారు.
ఏ ఒక్కరూ వెనుకబడకుండా… 2014 నుంచి సాధించిన విజయాలు
దేశ పౌరులందరికీ మెరుగైన జీవన నాణ్యత, ఆత్మగౌరవంతో కూడిన జీవనానికి భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం 2014 నుంచి కృషి చేస్తున్నదని శ్రీమతి సీతారామన్ తెలిపారు. వార్షిక తలసరి ఆదాయం కూడా రెట్టింపై రూ.1.97 లక్షలకు పెరిగిందని చెప్పారు. గడచిన తొమ్మిది సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరుగుతూ ప్రపంచంలో 10వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరిందని వివరించారు. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్ఠంగా రూపొందిందని, ఉద్యోగ భవిష్య నిధిలో చందాదారుల నమోదు రెట్టింపును మించి 27 కోట్లకు చేరడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే 2022లో యూపీఐ ద్వారా 7,400 కోట్ల లావాదేవీలతో రూ.126 లక్షల కోట్ల మేర డిజిటల్ చెల్లింపులు నమోదైనట్లు చెప్పారు.
లక్షిత ప్రయోజనాల సార్వత్రికీకరణతో అనేక పథకాలను సమర్థంగా అమలు చేయడంవల్ల సార్వజనీన అభివృద్ధి సాధ్యమైందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ మేరకు వివిధ పథకాలను ఏకరవు పెడుతూ- స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11.7 కోట్ల గృహ మరుగుదొడ్లు; ఉజ్వల కింద 9.6 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు; 102 కోట్ల మందికి 220 కోట్ల కోవిడ్ టీకా మోతాదులు; 47.8 కోట్ల పీఎం జన్‌ధన్ బ్యాంక్ ఖాతాలు; పీఎం సురక్ష బీమా, పీఎం జీవన్ జ్యోతి యోజన కింద 44.6 కోట్ల మందికి బీమా రక్షణ; పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 11.4 కోట్ల మంది రైతులకు రూ.2.2 లక్షల కోట్ల నగదు బదిలీ వంటివాటిని ఆమె ఉదాహరించారు.
అమృతకాల దృక్పథం – సాధికార.. సార్వజనీన ఆర్థిక వ్యవస్థ
అమృతకాల దృక్పథంలో సాంకేతికత చోదక, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ, బలమైన పబ్లిక్ ఫైనాన్స్‌సహా పటిష్ట ఆర్థిక రంగం భాగంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ‘సబ్ కా సాథ్.. సబ్ కా ప్రయాస్’ సూత్రంతో ప్రజా భాగస్వామ్యం అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ దిశగా ఆర్థిక కార్యక్రమం మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. వీటిలో మొదటిది… పౌరులు- ముఖ్యంగా యువతరం కలల సాకారానికి అపార అవకాశాల కల్పన; రెండోది… వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు బలమైన ప్రోత్సాహంసహా స్థూల ఆర్థిక స్థిరత్వ పటిష్టీకరణ; మూడోది… భారతదేశం@100 వైపు మన పయనంలో నిర్దిష్ట రంగాలకు సేవలందిచేలా అమృతకాలంలో కింది నాలుగు పరివర్తనాత్మక అవకాశాలు దోహదం చేస్తాయని ఆమె చెప్పారు.
- మహిళల ఆర్థిక సాధికారత: గ్రామీణ మహిళలను 81 లక్షల స్వయం సహాయ సంఘాలుగా సమీకృతం చేయడం ద్వారా దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం అద్భుత విజయం సాధించింది. వీటిలో ప్రతి ఒక్కటీ తదుపరి ఆర్థిక సాధికారత దశకు చేరేధంగా భారీ లేదా సమష్టి ఉత్పత్తి సంస్థలుగా ఏర్పడేందుకు మద్దతు ఇవ్వబడుతుంది. వీటన్నిటిలో అనేక వేలమంది సభ్యులు ఉంటారు కాబట్టి అవి వృత్తిపరమైన నైపుణ్యంతో నిర్వహించబడతాయి.
- పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ (పీఎం-వికాస్): సంప్రదాయ కళాకారులు, చేతివృత్తుల వారు శతాబ్దాలుగా చేతి పనిముట్లతో పనిచేస్తూనే భారతదేశానికి ఎనలేని ఖ్యాతి తెచ్చారు. సాధారణ పరిభాషలో వారిని ‘విశ్వకర్మ’గా వ్యవహరిస్తారు. వారు సృష్టించిన కళాత్మక, హస్తకళా ఉత్పత్తులు స్వయం సమృద్ధ భారతం వాస్తవ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి.
వీరికోసం తొలిసారిగా సహాయ కార్యక్రమ ప్యాకేజీకి రూపకల్పన చేస్తున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. వారి ఉత్పత్తుల నాణ్యత, స్థాయి, లభ్యతలను మెరుగుపరచి, వాటిని ‘ఎంఎస్‌ఎంఇ’ విలువ శ్రేణితో అనుసంధానించడానికి కొత్త పథకం వీలు కల్పిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఆర్థిక సహాయం మాత్రమేగాక అధునాతన నైపుణ్య శిక్షణ, ఆధునిక డిజిటల్ పద్ధతులు, పొదుపైన హరిత సాంకేతిక పరిజ్ఞానం, బ్రాండ్ ప్రాచుర్యం, స్థానిక-ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం, డిజిటల్ చెల్లింపులు, సామాజిక భద్రత వంటివన్నీ ఈ పథకంలో అంతర్భాగాలుగా ఉంటాయని వివరించారు. తద్వారా ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు/తెగలు, ఓబీసీలు, మహిళలు, బలహీన వర్గాల ప్రజలు ఎంతో లబ్ధి పొందగలరని పేర్కొన్నారు.
- పర్యాటకం: దేశవిదేశీ పర్యాటకులకు భారతదేశం అనేక ఆకర్షణలను సిద్ధం చేస్తోందని, పర్యాటక రంగంలో అపార అవకాశాలున్నాయని ఆర్థికమంత్రి అన్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలతోపాటు వ్యవస్థాపన దిశగానూ ఈ రంగం అనేక అవకాశాలు కల్పించగలదని పేర్కొన్నారు. రాష్ట్రాల చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలతో పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని ఉద్యమ తరహాలో చేపడతామని ఆమె నొక్కి చెప్పారు.
- హరిత వృద్ధి: హరిత వృద్ధి గురించి మాట్లాడుతూ- భారతదేశం హరిత ఇంధనం, హరిత విద్యుత్తు, హరిత వ్యవసాయం, హరిత రవాణా, హరిత సౌధాలు, హరిత పరికరాలు వగైరాల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆర్థికమంత్రి తెలిపారు. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో శక్తి సమర్థ వినియోగానికి తగిన విధానాలను అమలు చేస్తోందన్నారు. ఆర్థిక వ్యవస్థలో కర్బన తీవ్రత తగ్గింపులో ఈ హరిత వృద్ధి కృషి ఎంతగానో తోడ్పడుతుంది. దాంతోపాటు అపార హరిత ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని ఆమె వివరించారు.
ఈ బడ్జెట్ ప్రాధాన్యతలు
శ్రీమతి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ఏడు ప్రాధాన్యతలను వివరించారు. అవి ఒకదానికొకటి అనుబంధంగా పనిచేస్తాయి. అమృత్ కాల్ లో మనకు మార్గనిర్దేశం చేసే 'సప్తర్షి'గా పనిచేస్తాయి. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి: 1) సమ్మిళిత అభివృద్ధి 2) చివరి మైలురాయిని చేరుకోవడం 3) మౌలిక సదుపాయాలు -పెట్టుబడులు 4) సామర్థ్యాన్ని వెలికితీయడం 5) హరిత వృద్ధి 6) యువ శక్తి 7) ఆర్థిక రంగం
ప్రాధాన్యత 1: సమ్మిళిత అభివృద్ధి
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే ప్రభుత్వ సిద్ధాంతం నిర్దిష్టంగా, రైతులు, మహిళలు, యువత, ఓబీసీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు ,ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, మొత్తంగా అవకాశాలకు దూరంగా ఉన్నవారి (వంచితోన్ కో వరియాటా)
సమ్మిళిత అభివృద్ధిని సులభతరం చేసింది. (వంచితోన్ కో వరియాటా). జమ్ముకశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాలపై కూడా దృష్టి సారించింది. ఆ ప్రయత్నాలపైనే ఈ బడ్జెట్ కు రూపకల్పన జరిగింది.
వ్యవసాయం-సహకారం
వ్యవసాయానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
వ్యవసాయానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఓపెన్ సోర్స్, ఓపెన్ స్టాండర్డ్, ఇంటర్ ఆపరేబుల్ పబ్లిక్ వెల్ఫేర్ గుడ్ గా నిర్మిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. పంటల ప్రణాళిక, ఆరోగ్యం కోసం సంబంధిత సమాచార సేవలు, వ్యవసాయ ఇన్పుట్స్, క్రెడిట్, ఇన్సూరెన్స్ మెరుగైన లభ్యత, పంట అంచనాకు సహాయం, మార్కెట్ ఇంటెలిజెన్స్, అగ్రి-టెక్ పరిశ్రమలు,అంకుర సంస్థల వృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా సమ్మిళిత, రైతు కేంద్రీకృత పరిష్కారాలను ఇది అనుమతిస్తుందని ఆమె అన్నారు.
అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్
గ్రామీణ ప్రాంతాల్లోని యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ద్వారా అగ్రి స్టార్టప్ లను ప్రోత్సహించడానికి అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు, ఇది రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లకు సృజనాత్మక ,సరసమైన పరిష్కారాలను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తుంది. వ్యవసాయ పద్ధతులను మార్చడానికి, ఉత్పాదకతను, లాభదాయకతను పెంచడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురానుంది.
పత్తి పంట ఉత్పాదకత పెంపు
ఎక్స్ ట్రా లాంగ్ స్టేపుల్ పత్తి ఉత్పాదకతను పెంచడానికి, ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) ద్వారా క్లస్టర్ ఆధారిత ,విలువ గొలుసు విధానాన్ని అవలంబిస్తుంది. ఎక్స్ ట్రా లాంగ్ స్టేపుల్ పత్తి ఉత్పాదకతను పెంచడానికి, ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) ద్వారా క్లస్టర్ ఆధారిత ,విలువ గొలుసు విధానాన్ని అవలంబిస్తుంది. దీని అర్థం పెట్టుబడి సరఫరా, విస్తరణ సేవలు ,
మార్కెట్ లింకేజీల కోసం రైతులు, ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సహకారం.
ఆత్మనిర్భర్ హార్టికల్చర్ క్లీన్ ప్లాంట్ కార్యక్రమం
రూ.2,200 కోట్ల వ్యయంతో అధిక విలువ కలిగిన ఉద్యాన పంటలకు వ్యాధి రహిత, నాణ్యమైన ప్లాంటింగ్ సామగ్రి లభ్యతను పెంచడానికి ప్రభుత్వం ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
చిరుధాన్యాల గ్లోబల్ హబ్: 'శ్రీ అన్న'
"చిరుధాన్యాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో భారతదేశం ముందంజలో ఉంది, దీని వినియోగం పోషకాహారం, ఆహార భద్రత ,రైతుల సంక్షేమాన్ని పెంచుతుంది" అని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు. జొన్నలు, రాగులు, సజ్జలు, కుట్టు, రామదాన, కంగ్ని, కుట్కీ, కోడో, చీనా, సామ వంటి అనేక రకాల 'శ్రీ అన్న'లను పండించడం వల్ల ప్రపంచంలోనే 'శ్రీ అన్న' అతిపెద్ద ఉత్పత్తిదారు,రెండవ అతిపెద్ద ఎగుమతిదారు భారతదేశం అని ఆమె అన్నారు.
ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని, శతాబ్దాలుగా మన ఆహారంలో అంతర్భాగంగా ఉన్నాయని, ఈ 'శ్రీ అన్న'లను పెంచడం ద్వారా తోటి పౌరుల ఆరోగ్యానికి దోహదపడటంలో చిన్న రైతులు చేస్తున్న భారీ సేవ గర్వకారణమని ఆమె అన్నారు.
‘శ్రీ అన్న'కు భారతదేశాన్ని గ్లోబల్ హబ్ గా మార్చడానికి, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ పద్ధతులు, పరిశోధన, సాంకేతికతలను పంచుకునేందుకు హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు.
వ్యవసాయ పరపతి
పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, చేపల పెంపకంపై దృష్టి సారించి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
మత్స్యకారులు, చేపల వ్యాపారులు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికి, విలువ గొలుసు సామర్థ్యాలను మెరుగుపరచడానికి, మార్కెట్ ను విస్తరించడానికి ప్రభుత్వం రూ .6,000 కోట్ల లక్ష్యంతో పిఎం మత్స్య సంపద యోజన కు కొత్త ఉప పథకాన్ని ప్రారంభిస్తుందని ఆమె తెలియజేశారు.
సహకారం
రైతుల కోసం, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు, ఇతర అట్టడుగు వర్గాల కోసం, ప్రభుత్వం సహకార ఆధారిత ఆర్థిక అభివృద్ధి నమూనాను ప్రోత్సహిస్తోంది. సహకార్ సే సమృద్ధి' దార్శనికతను సాకారం చేయాలనే ఆదేశంతో కొత్త సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2,516 కోట్ల పెట్టుబడితో 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) కంప్యూటరీకరణకు శ్రీకారం చుట్టింది.
అందరు భాగస్వాములు, రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి బహుళార్థసాధక పీఏసీఎస్ లుగా మార్చేందుకు వీలుగా మోడల్ బైలాస్ రూపొందించారు. సహకార సంఘాల దేశవ్యాప్త మ్యాపింగ్ కోసం జాతీయ సహకార డేటాబేస్ ను సిద్ధం చేస్తున్నారు.
రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి ,తగిన సమయాల్లో విక్రయించడం ద్వారా గిట్టుబాటు ధరను పొందడానికి సహాయపడే భారీ వికేంద్రీకృత నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికను ప్రభుత్వం అమలు చేస్తుందని శ్రీమతి సీతారామన్ చెప్పారు.
రాబోయే ఐదేళ్లలో పంచాయతీలు, గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలు, ప్రైమరీ ఫిషరీస్ సొసైటీలు, డెయిరీ కోఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది.
ఆరోగ్యం, విద్య , నైపుణ్యం
మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజీలు
2014 నుంచి ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన 157 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా కొత్తగా నూట యాభై ఏడు నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
2047 నాటికి సికిల్ సెల్ రక్తహీనతను నిర్మూలించే మిషన్ ను ప్రారంభిస్తామని, దీనిలో అవగాహన కల్పించడం, ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో 0-40 సంవత్సరాల మధ్య వయస్సు గల 7 కోట్ల మందికి సార్వత్రిక స్క్రీనింగ్ , కేంద్ర మంత్రిత్వ శాఖలు ,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కౌన్సిలింగ్ ఉంటుందని ఆమె తెలియజేశారు.
వైద్య పరిశోధనపై ఆమె మాట్లాడుతూ, సహకార పరిశోధన ,ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ,ప్రైవేట్ వైద్య కళాశాల అధ్యాపకులు, ప్రైవేట్ రంగ ఆర్ అండ్ డి బృందాల పరిశోధన కోసం ఎంపిక చేసిన ఐసిఎంఆర్ ల్యాబ్ లలో సౌకర్యాలను అందుబాటులో ఉంచుతామని ఆమె చెప్పారు.
ఫార్మా ఇన్నోవేషన్ అంశంపై ప్రస్తావిస్తూ, ఫార్మాస్యూటికల్స్ లో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి తెలియజేశారు. నిర్దిష్ట ప్రాధాన్య రంగాలలో పరిశోధన ,అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆమె చెప్పారు.
ఉపాధ్యాయుల శిక్షణ
సృజనాత్మక బోధన, పాఠ్యప్రణాళిక లావాదేవీలు, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి, డిప్ స్టిక్ సర్వేలు , ఐసిటి అమలు ద్వారా ఉపాధ్యాయుల శిక్షణను పునఃసమీక్షించనున్నట్లు శ్రీమతి సీతారామన్ చెప్పారు. ఇందుకోసం డిస్ట్రిక్ట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ను వైబ్రెంట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
భౌగోళిక, భాషలు, కళా ప్రక్రియలు, స్థాయిలలో నాణ్యమైన పుస్తకాల లభ్యత, పరికర అజ్ఞాత ప్రాప్యతను సులభతరం చేయడానికి పిల్లలు మరియు కౌమారదశల కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలియజేశారు. భౌగోళికాలు, భాషలు, శైలులు ,స్థాయిలలో నాణ్యమైన పుస్తకాల, పరికరాల లభ్యతను సులభతరం చేయడానికి పిల్లలు ,కౌమారదశల కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలియ చేశారు.
పంచాయతీ, వార్డు స్థాయిల్లో ఫిజికల్ లైబ్రరీలను ఏర్పాటు చేయడానికి, నేషనల్ డిజిటల్ లైబ్రరీ వనరులను యాక్సెస్ చేసుకునేలా మౌలిక సదుపాయాలు కల్పించడానికి రాష్ట్రాలను ప్రోత్సహిస్తారు.
అదనంగా, పఠన సంస్కృతిని అభివృద్ధి చేయడానికి,మహమ్మారి-సమయ అభ్యాస నష్టాన్ని భర్తీ చేయడానికి, నేషనల్ బుక్ ట్రస్ట్, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ ,ఇతర వనరులు ఈ భౌతిక గ్రంథాలయాలకు ప్రాంతీయ భాషలు ,ఆంగ్లంలో పాఠ్యేతర శీర్షికలను అందించడానికి ప్రోత్సహించబడతాయి.
ప్రాధాన్యత 2: చివరి మైలును చేరుకోవడం
మాజీ ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను, ఈశాన్య ప్రాంత అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసి చివరి మైలుకు చేరుకోవాలనే లక్ష్యానికి పదును పెట్టిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఆయుష్, మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ, నైపుణ్యాభివృద్ధి, జలశక్తి, సహకార మంత్రిత్వ శాఖలను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
ఆకాంక్షాత్మక జిల్లాలు - బ్లాకుల కార్యక్రమం
ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ విజయాన్ని పురస్కరించుకుని, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, నీటి వనరులు, ఆర్థిక సమ్మిళితం, నైపుణ్యాభివృద్ధి ,మౌలిక సదుపాయాలు వంటి బహుళ రంగాలలో అవసరమైన ప్రభుత్వ సేవలను సంతృప్తం చేయడానికి 500 బ్లాకులను కవర్ చేసే ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ ను ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిందని శ్రీమతి సీతారామన్ తెలియజేశారు.
ప్రధాన మంత్రి పివిటిజి అభివృద్ధి మిషన్
ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాల (పివిటిజి) సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి, ప్రధాన మంత్రి పివిటిజి అభివృద్ధి మిషన్ ను ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు.
ఇది పివిటిజి కుటుంబాలు ,ఆవాసాలకు సురక్షితమైన గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు ,పారిశుధ్యం, మెరుగైన విద్య, ఆరోగ్యం ,పోషకాహారం, రహదారి ,టెలికాం కనెక్టివిటీ ,స్థిరమైన జీవనోపాధి అవకాశాలు వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తుంది. షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక కింద వచ్చే మూడేళ్లలో మిషన్ అమలుకు రూ.15,000 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు సేవలందిస్తున్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు వచ్చే మూడేళ్లలో 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని నియమించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కరవు పీడిత ప్రాంతానికి నీరు
కరవు పీడిత ప్రాంతమైన కర్ణాటకలో సుస్థిర సూక్ష్మ సేద్యం అందించడానికి, తాగునీటి కోసం ఉపరితల చెరువులను నింపడానికి ఎగువ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల కేంద్ర సహాయం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
పీఎం ఆవాస్ యోజన
పీఎం ఆవాస్ యోజనకు కేటాయింపులను 66 శాతం పెంచి రూ.79,000 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియంలో 'భారత్ షేర్డ్ రిపాజిటరీ ఆఫ్ ఇన్సెప్షన్స్'ను ఏర్పాటు చేస్తామని, తొలి దశలో లక్ష పురాతన శాసనాలను డిజిటలైజేషన్ చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
ప్రాధాన్యత 3: మౌలిక సదుపాయాలు & పెట్టుబడి
మౌలిక సదుపాయాల కల్పన మరియు ఉత్పాదక సామర్థ్యంలో పెట్టుబడులు వృద్ధి మరియు ఉపాధిపై పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపుతాయని, ఈ దృష్ట్యా మూలధన పెట్టుబడి వ్యయాన్ని వరుసగా మూడో సంవత్సరం 33 శాతం నుంచి రూ. 10 లక్షల కోట్లకు పెంచుతున్నామని శ్రీమతి సీతారామన్ చెప్పారు. ఇది జిడిపిలో 3.3 శాతం. 2019-20లో కంటే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుందని ఆమె చెప్పారు. కేంద్రం యొక్క ‘సమర్థవంతమైన మూలధన వ్యయం’ 13.7 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ చేయబడింది, ఇది జిడిపిలో 4.5 శాతం.
మూలధన పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు
మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి మరియు పరిపూరకరమైన విధాన చర్యల కోసం వారిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాన్ని ప్రోత్సాహాన్ని గణనీయంగా పెరిగిన1.3 లక్షల కోట్ల రూపాయల వ్యయం మరో సంవత్సరం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి తెలియజేశారు.
రైల్వేలు
రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని అందించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు, ఇది ఇప్పటివరకు అత్యధికంగా మరియు 2013-14లో చేసిన వ్యయం కంటే 9 రెట్లు.
ఓడరేవులు, బొగ్గు, ఉక్కు, ఎరువులు మరియు ఆహార ధాన్యాల రంగాలకు చివరి మరియు మొదటి మైలు కనెక్టివిటీ కోసం వంద కీలకమైన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించామని వాటిని రూ. 75,000 కోట్ల పెట్టుబడితో 15,000 కోట్లు ప్రైవేటు వనరుల ద్వారా ప్రాధాన్యతతో చేపట్టనున్నట్లు ఆమె తెలియజేశారు.
ప్రాంతీయ వాయు రవాణా కనెక్టివిటీని మెరుగుపరచడానికి యాభై అదనపు విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, వాటర్ ఏరోడ్రోమ్‌లు మరియు అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌లను పునరుద్ధరించనున్నట్లు శ్రీమతి సీతారామన్ చెప్పారు.
ప్రాధాన్యతా రంగ రుణాల కొరతను ఉపయోగించడం ద్వారా అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (UIDF) ఏర్పాటు చేయబడుతుందని, దీనిని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిర్వహిస్తుందని, వీటిని 2 మరియు 3 శ్రేణి నగరాలలో పట్టణ మౌలిక సదుపాయాలను సృష్టించడానికి పబ్లిక్ ఏజెన్సీలు ఉపయోగిస్తాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు. యుఐడిఎఫ్‌ని స్వీకరించడానికి తగిన వినియోగదారు ఛార్జీలను వసూలు చేసి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, అలాగే ఇప్పటికే ఉన్న పథకాల నుండి వనరులను ఉపయోగించుకునేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని ఆమె చెప్పారు.
ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి 10,000 కోట్ల రూపాయలను అందుబాటులో ఉంచుతుందని శ్రీమతి సీతారామన్ చెప్పారు.
ప్రాధాన్యత 4: సంభావ్యతను వెలికితీయడం
సులభతర వ్యాపారం ను పెంపొందించడం కోసం 39,000 కంటే ఎక్కువ కంప్లైన్స్లను తగ్గించామని, 3,400 కంటే ఎక్కువ చట్టపరమైన నిబంధనలను నేరరహితం చేశామని ఆర్థిక మంత్రి తెలిపారు. విశ్వాసం నమ్మకం ఆధారిత పాలనను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, 42 కేంద్ర చట్టాలను సవరించేందుకు ప్రభుత్వం జన్ విశ్వాస్ బిల్లును ప్రవేశపెట్టిందని ఆమె తెలిపారు.
కృత్రిమ మేధ కోసం ఎక్సలెన్స్ కేంద్రాలు
“మేక్ ఏ-ఐ ఇన్ ఇండియా మరియు మేక్ ఏ-ఐ వర్క్ ఫర్ ఇండియా” అనే విజన్‌ను సాకారం చేయడం కోసం, అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మూడు ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రముఖ పరిశ్రమనేతలు వ్యవసాయం, ఆరోగ్యం మరియు స్థిరమైన నగరాల రంగాలలో అనుబంధ పరిశోధనలు, అత్యాధునిక అప్లికేషన్‌లు మరియు విస్తృతం కాగల సమస్య పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు అవుతారు, ఇది సమర్థవంతమైన కృత్రిమ మేధ పర్యావరణ వ్యవస్థను మరియు ఈ రంగంలో నాణ్యమైన మానవ వనరులను పెంపొందిస్తుంది.
జాతీయ సమాచార పాలన విధానం
స్టార్టప్‌లు మరియు విద్యాసంస్థల ద్వారా ఆవిష్కరణలు మరియు పరిశోధనలను ఆవిష్కరించడానికి, జాతీయ సమాచార పాలన విధానాన్ని తీసుకురానున్నట్లు, ఇది అనామక సమాచారానికి ప్రాప్యతను అనుమతిస్తుంది.
వివిధ అధికారులు, రెగ్యులేటర్లు, బ్యాంకులు మరియు ఇతర వ్యాపార సంస్థలతో అవసరమైనప్పుడు పత్రాలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా నిల్వ చేయడానికి మరియు భాగస్వామ్యం చేయడానికి ఎం ఎస్ ఎం ఈ లు, పెద్ద వ్యాపారాలు మరియు ఛారిటబుల్ ట్రస్ట్‌ల ఉపయోగం కోసం ఒక ఎంటిటీ డిజిలాకర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.
5జీ సేవలపై, కొత్త తరహా అవకాశాలు, వ్యాపార నమూనాలు మరియు ఉపాధి అవకాశాలను గ్రహించడానికి 5జీ సేవలను ఉపయోగించి అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికి వంద ల్యాబ్‌లను ఇంజనీరింగ్ సంస్థలలో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ల్యాబ్‌లు స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఖచ్చితత్వ వ్యవసాయం, ఇంటెలిజెంట్ రవాణా వ్యవస్థలు మరియు వైద్య ఆరోగ్య అప్లికేషన్‌ల వంటి అప్లికేషన్‌లను తయారు చేస్తాయి.
ప్రాధాన్యత 5: హరిత వృద్ధి
పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి "లైఫ్" లేదా పర్యావరణం అనుకూల జీవనశైలి కోసం ఒక దృక్కోణం ఇచ్చారని శ్రీమతి సీతారామన్ అన్నారు. హరిత పారిశ్రామిక మరియు ఆర్థిక పరివర్తనకు నాంది పలికేందుకు 2070 నాటికి 'పంచామృతం' మరియు నికర-సున్నా కర్బన ఉద్గారాల కోసం భారతదేశం దృఢంగా ముందుకు సాగుతోంది.
ఈ బడ్జెట్ హరిత వృద్ధిపై దృష్టి సారిస్తుందని ఆమె అన్నారు. ఇటీవల ప్రారంభించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, రూ. 19,700 కోట్లతో, ఆర్థిక వ్యవస్థను తక్కువ కార్బన్ తీవ్రతకు మార్చడానికి, శిలాజ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు ఈ సూర్యోదయ రంగంలో దేశం సాంకేతికత మరియు మార్కెట్ నాయకత్వాన్ని పొందేలా చేస్తుంది. 2030 నాటికి 5 ఎం ఎం టీ వార్షిక ఉత్పత్తిని చేరుకోవడం లక్ష్యం.
పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ ద్వారా ఇంధన పరివర్తన మరియు నికర శూన్య లక్ష్యాలు మరియు ఇంధన భద్రత కోసం ప్రాధాన్యత మూలధన పెట్టుబడుల కోసం బడ్జెట్ రూ.35,000 కోట్లు అందిస్తుంది.
ఆర్థిక వ్యవస్థను స్థిరమైన అభివృద్ధి బాటలో నడిపించేందుకు, 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్‌కు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ తోడ్పడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
లడఖ్ నుండి 13 జీ డబ్ల్యూ పునరుత్పాదక ఇంధనం తరలింపు మరియు గ్రిడ్ ఇంటిగ్రేషన్ కోసం ఇంటర్-స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ రూ. 20,700 కోట్ల పెట్టుబడితో సహా రూ. 8,300 కోట్ల కేంద్ర మద్దతుతో నిర్మించబడుతుందని ఆమె తెలియజేసారు.
గోబర్ధన్ పథకం
వలయ ఆర్థిక వ్యవస్థని ప్రోత్సహించేందుకు గోబర్ధన్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-అగ్రో రిసోర్సెస్ ధన్) పథకం కింద 500 కొత్త ‘చెత్త నుంచి సంపద ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటిలో 200 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లు, పట్టణ ప్రాంతాల్లో 75 ప్లాంట్లు మరియు మొత్తం 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 300 కమ్యూనిటీ లేదా క్లస్టర్ ఆధారిత ప్లాంట్లు ఉంటాయి.
సహజ మరియు బయో గ్యాస్‌ను మార్కెటింగ్ చేసే అన్ని సంస్థలకు తగిన సమయంలో 5 శాతం కంప్రెస్డ్ బయోగ్యాస్ తప్పనిసరి చేయబడుతుందని మరియు బయో మాస్ సేకరణ మరియు బయో-ఎరువు పంపిణీకి తగిన ఆర్థిక సహాయం అందించబడుతుందని ఆమె చెప్పారు.
భారతీయ ప్రకృతి వ్యవసాయ జీవ ముడి వనరుల కేంద్రాలు
వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులు సహజ వ్యవసాయం చేసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందుకోసం 10,000 జీవ ముడి వనరుల కేంద్రాలను ఏర్పాటు చేసి, సూక్ష్మ ఎరువులు మరియు పురుగుమందుల తయారీ జాతీయ స్థాయిలో పంపిణీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు.
2021-22 బడ్జెట్‌లో పేర్కొన్న వాహన స్క్రాపింగ్ విధానానికి అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వ పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి తగిన నిధులను కేటాయించామని, పాత వాహనాలు మరియు అంబులెన్స్‌లను మార్చడంలో రాష్ట్రాలు కూడా మద్దతు ఇస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు.
ప్రాధాన్యత 6: యువశక్తి
యువతకు సాధికారత కల్పించేందుకు, వారి కలలను సాకారం చేసేందుకు ‘అమృత్ పీఠి’కి సహాయపడేందుకు ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిందని, నైపుణ్యంపై దృష్టి సారించి, ఉపాధి కల్పనకు దోహదపడే ఆర్థిక విధానాలను అవలంబించి, వ్యాపార అవకాశాలకు మద్దతునిచ్చిందని ఆర్థిక మంత్రి చెప్పారు.
వచ్చే మూడేళ్లలో లక్షలాది మంది యువతకు నైపుణ్యం కల్పించేందుకు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ప్రారంభించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఉద్యోగ శిక్షణ, పరిశ్రమ భాగస్వామ్యం మరియు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కోడింగ్, ఏ ఐ, రోబోటిక్స్, మెకాట్రానిక్స్, ఐ ఓ టీ, 3డీ ప్రింటింగ్, డ్రోన్లు మరియు సాఫ్ట్ స్కిల్స్ వంటి ఇండస్ట్రీ 4.0 కోసం కొత్త తరం కోర్సులను కూడా ఈ పథకం ప్రవేశ పెడుతుంది.
యువతకు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.
నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్
మూడు సంవత్సరాలలో 47 లక్షల మంది యువతకు స్టైఫండ్ మద్దతును అందించడానికి, పాన్-ఇండియా నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌ను ప్రారంభించనున్నట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ చెప్పారు.
యూనిటీ మాల్
రాష్ట్రాలు ఒక జిల్లా, ఒక ఉత్పత్తి (ODOP) పధకం కింద తమ సొంత జీ ఐ ఉత్పత్తులు మరియు ఇతర హస్తకళా ఉత్పత్తుల ప్రచారం మరియు విక్రయం కోసం మరియు అన్ని ఇతర రాష్ట్రాల ఉత్పత్తులకు స్థలం అందించడం ద్వారా తమ రాష్ట్ర రాజధాని లేదా అత్యంత ప్రముఖ పర్యాటక కేంద్రం లేదా ఆర్థిక రాజధానిలో యూనిటీ మాల్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని ఎఫ్ ఎం తెలిపారు. .
ప్రాధాన్యత 7: ఆర్థిక రంగం
ఎం ఎస్ ఎం ఈ లకు రుణ భరోసా
ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, గత సంవత్సరం, ఎం ఎస్ ఎం ఈ ల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను పునరుద్ధరించాలని ఆమె ప్రతిపాదించారు మరియు కార్పస్‌లో రూ. 9,000 కోట్ల ఇన్ఫ్యూషన్ ద్వారా పునరుద్ధరించబడిన పథకం 1 ఏప్రిల్ 2023 నుండి అమలులోకి వస్తుందని సంతోషంగా ప్రకటించారు. ఇది రూ. 2 లక్షల కోట్ల అదనపు పూచీకత్తు రహిత గ్యారంటీ క్రెడిట్‌ని అనుమతిస్తుంది. ఇంకా, రుణ ఖర్చు దాదాపు 1 శాతం తగ్గుతుంది.
ఆర్థిక మరియు అనుబంధ సమాచార కేంద్ర రిపోజిటరీగా పనిచేయడానికి నేషనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తామని శ్రీమతి సీతారామన్ చెప్పారు. ఇది సమర్థవంతమైన రుణ ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది, ఆర్థిక సహాయం అందుబాటు ను ప్రోత్సహిస్తుంది మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ క్రెడిట్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కొత్త శాసన ఫ్రేమ్‌వర్క్ నియంత్రిస్తుంది. ఇది ఆర్ బీ ఐ తో సంప్రదించి రూపొందించబడుతుంది.
కంపెనీల చట్టం ప్రకారం ఫీల్డ్ ఆఫీస్‌లో దాఖలు చేసిన వివిధ ఫారమ్‌లను కేంద్రీకృతంగా నిర్వహించడం ద్వారా కంపెనీలకు వేగవంతమైన ప్రతిస్పందన కోసం సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థం, ఒకే సారి కొత్త చిన్న మొత్తం పొదుపు పథకం, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, మార్చి 2025 వరకు రెండేళ్ల కాలానికి అందుబాటులో ఉంచబడుతుంది. ఇది మహిళల పేరు మీద రూ. 2 లక్షల వరకు డిపాజిట్ సదుపాయాన్ని లేదా పాక్షిక ఉపసంహరణ ఎంపికతో 7.5 శాతం స్థిర వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలవ్యవధి తో అందిస్తుంది.
సీనియర్ సిటిజన్లు
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గరిష్ట డిపాజిట్ పరిమితిని రూ .15 లక్షల నుంచి రూ .30 లక్షల వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
నెలవారీ ఆదాయ ఖాతా పథకం గరిష్ట డిపాజిట్ పరిమితిని సింగిల్ ఖాతాకు రూ .4.5 లక్షల నుంచి 9 లక్షల రూపాయల వరకు, ఉమ్మడి ఖాతాకు 9 లక్షల రూపాయల నుంచి 15 లక్షలకు పెంచారు.
ఆర్థిక నిర్వహణ
రాష్ట్రాలకు యాభై ఏళ్ల వడ్డీలేని రుణం
రాష్ట్రాలకు ఇచ్చిన యాభై ఏళ్ల రుణం మొత్తాన్ని 2023-24 లో మూలధన వ్యయం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం రాష్ట్రాల విచక్షణ పై ఆధారపడి ఉంటుంది. కానీ కొంత భాగం రాష్ట్రాలు తమ వాస్తవ మూలధన వ్యయాన్ని పెంచుకోవాలన్న షరతులతో మంజూరు అవుతుంది. పాత ప్రభుత్వ వాహనాలను తొలగించడం, పట్టణ ప్రణాళిక సంస్కరణలు,చర్యలు అమలు చేయడం, పట్టణ స్థానిక సంస్థల్లో ఆర్థిక సంస్కరణలు అమలు చేసి స్థానిక సంస్థల మున్సిపల్ బాండ్ల ద్వారా పొందే రుణ పరపతి మెరుగు పరచడం, పోలీస్ స్టేషన్ పైన లేదా భాగంలో పోలీసు సిబ్బందికి గృహనిర్మాణం, యూనిటీ మాల్స్, పిల్లలు , కౌమారదశ గ్రంథాలయాలు, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన కోసం, కేంద్ర పథకాల మూలధన వ్యయంలో రాష్ట్ర వాటా వంటి కార్యక్రమాలకు ఈ నిధుల కేటాయింపు జరుగుతుంది.
సవరించిన అంచనా ప్రకారం రుణాలు కాకుండా ఇతర మొత్తం రాబడుల 24.3 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటాయి. ఇందులో నికర పన్ను రాబడి 20.9 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది . మొత్తం వ్యయం సవరించిన అంచనా రూ.41.9 లక్షల కోట్లు కాగా, ఇందులో మూలధన వ్యయం రూ.7.3 లక్షల కోట్ల వరకు ఉంది. అదేవిధంగా బడ్జెట్ అంచనా మేరకు ద్రవ్యలోటు సవరించిన అంచనా జీడీపీలో 6.4 శాతం ఉంటుంది.
2023-24 బడ్జెట్ అంచనాలు
సాధారణ బడ్జెట్ పార్ట్-1 ను ముగించిన నిర్మలా సీతారామన్ అప్పులు, మొత్తం ఖర్చులు మినహా మొత్తం రాబడులు వరుసగా రూ.27.2 లక్షల కోట్లు, రూ.45 లక్షల కోట్లుగా అంచనా వేశామని వెల్లడించారు. నికర పన్ను రాబడి అంచనా రూ.23.3 లక్షల కోట్లుగా ఉంది.
జీడీపీలో ద్రవ్యలోటు 5.9 శాతం గా ఉంటుందని అంచనా.
2025-26 నాటికి ద్రవ్యలోటు 4.5 శాతం కంటే తక్కువ కు చేరుకుంటుందని, ఆర్థిక స్థిరీకరణ మార్గాన్ని కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది అంటూ తన 2021-22 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న అంశాన్ని శ్రీమతి సీతారామన్ గుర్తు చేశారు. ఈ విధానానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం 2025-26 నాటికి ద్రవ్యలోటును జీడీపీ లో 4.5 శాతానికి దిగువకు తీసుకు వస్తుందని స్పష్టం చేశారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును భర్తీ చేయడానికి డేటెడ్ సెక్యూరిటీల రూపంలో రూ .11.8 లక్షల కోట్లు వరకు నికర మార్కెట్ రుణాలు అవసరం ఉంటాయని అంచనా వేసినట్టు శ్రీమతి సీతారామన్ తెలిపారు. మిగిలిన నిధులు చిన్న పొదుపు, ఇతర మార్గాల నుంచి మకూరుతాయని భావిస్తున్నారు. స్థూల మార్కెట్ రుణాలు రూ.15.4 లక్షల కోట్లు వరకు ఉంటాయని అంచనా వేశారు.
పార్ట్-బి
వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు నిర్మలా సీతారామన్ భారీ ఊరట అందించారు. ఎగుమతులను ప్రోత్సహించడం, దేశీయ విలువ జోడింపు, గ్రీన్ ఎనర్జీ, మొబిలిటీని ప్రోత్సహించడం లక్ష్యంగా బడ్జెట్ లో పరోక్ష పన్ను ప్రతిపాదనలు ప్రతిపాదించారు.
వ్యక్తిగత ఆదాయపు పన్ను
వ్యక్తిగత ఆదాయపు పన్ను కు సంబంధించి శ్రీమతి సీతారామన్ 5 ప్రధాన విధానాలు ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో రిబేట్ పరిమితిని రూ .7 లక్షలకు పెంచారు. అంటే కొత్త పన్ను విధానంలో రూ .7 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. శ్లాబుల సంఖ్య ఐదుకు తగ్గించారు. పన్ను మినహాయింపు పరిమితిని .3 లక్షల రూపాయలకు పెంచారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పన్ను చెల్లిస్తున్న వారందరికీ భారీ ఊరట లభిస్తుంది.
కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని ఉద్యోగులు, కుటుంబ పెన్షన్ పొందుతున్న వారితో సహా పెన్షనర్లకు వర్తిస్తుంది. ఈ ప్రతిపాదన ప్రకారం ఉద్యోగులకు రూ.50,000, పెన్షనర్లకు రూ.15,000 స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. 15.5 లక్షల రూపాయలు లేదా అంతకు మించి ఆదాయం ఉన్న ప్రతి ఉద్యోగి నూతన ప్రతిపాదనల ద్వారా రూ.52,500 వరకు ప్రయోజనం పొందుతారు.
రూ.2 కోట్లకు పైగా ఉన్న వ్యక్తిగత ఆదాయంపై విధిస్తున్న అత్యధిక సర్ ఛార్జ్ రేటును నూతన కొత్త పన్ను విధానంలో 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. దీంతో వ్యక్తిగత ఆదాయపు పన్ను గరిష్ట పన్ను రేటు 42.74 శాతం నుంచి 39 శాతానికి తగ్గుతుంది.
ప్రభుత్వేతర వేతన ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత పొందే లీవ్ ఎన్ కాష్ మెంట్ పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు.
కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని డిఫాల్ట్ ట్యాక్స్ విధానంగా మార్చారు. అయితే, పౌరులు పాత పన్ను విధానం ప్రయోజనాలు పొందే అవకాశం కొనసాగుతుంది.
పరోక్ష పన్ను ప్రతిపాదనలు
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పలు పరోక్ష పన్ను ప్రతిపాదనలు ప్రకటించారు. సమ్మతి భారాన్ని తగ్గించడానికి, పన్నుల వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి తక్కువ పన్ను రేట్లతో పన్ను విధానాన్ని సరళీకరించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.జౌళి, వ్యవసాయం మినహా ఇతర వస్తువులపై బేసిక్ కస్టమ్స్ సుంకం రేట్లను 21 నుంచి 13 కు తగ్గించారు. బొమ్మలు, సైకిళ్లు, ఆటోమొబైల్స్, నాఫ్తా వంటి వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ, సెస్, సర్ ఛార్జీల్లో స్వల్ప మార్పులు చేశారు.
బ్లెండెడ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ పై పన్నుల భారం పడకుండా ఉండేందుకు అందులో ఉన్న జీఎస్టీ పెయిడ్ కంప్రెస్డ్ బయో గ్యాస్ పై ఎక్సైజ్ డ్యూటీని మినహాయించారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల కోసం లిథియం-అయాన్ సెల్స్ తయారీకి అవసరమైన ముడి సరుకులు, యంత్రాల దిగుమతిపై కల్పిస్తున్న కస్టమ్స్ సుంకం మినహాయింపు ను పొడిగించారు.
మొబైల్ ఫోన్ల తయారీలో దేశీయ విలువ జోడించడానికి కెమెరా లెన్స్ వంటి కొన్ని భాగాలు, ముడి పరికరాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. బ్యాటరీల కోసం ఉపయోగించే లిథియం అయాన్ సెల్స్ పై రాయితీ సుంకం మరో ఏడాది పాటు కొనసాగుతుంది. టీవీ ప్యానెళ్ల ఓపెన్ సెల్స్ భాగాలపై విధిస్తున్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ని 2.5 శాతానికి తగ్గించారు.ఎలక్ట్రికల్ కిచెన్ చిమ్నీల తయారీని ప్రోత్సహించేందుకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ లో మార్పులు చేయాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు.
డినాట్రేటెడ్ ఇథైల్ ఆల్కహాల్ ను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించారు. యాసిడ్ గ్రేడ్ ఫ్లోరైడ్, క్రూడ్ గ్లిజరిన్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ని తగ్గించారు. దేశీయంగా రొయ్యల దాణా తయారీకి అవసరమైన వస్తువులపై సుంకాలు తగ్గిస్తున్నారు. ల్యాబ్ లలో తయారు చేసే డైమండ్స్ తయారీలో ఉపయోగించే విత్తనాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ని కూడా తగ్గించారు. బంగారం, ప్లాటినం తో సమానంగా వెండి దోరలు, కడ్డీలు, వస్తువులపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని పెంచారు. కాంపౌండెడ్ రబ్బర్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ రేటు పెరిగింది. గుర్తించిన సిగరెట్లపై విధిస్తున్న జాతీయ విపత్తు కంటింజెంట్ డ్యూటీని 16% వరకు సవరించారు. ఎపికోలోర్హైడ్రిన్ తయారీలో ఉపయోగించే ముడి గ్లిజరిన్ పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు.
ఉమ్మడి ఐటీ రిటర్న్ ఫారం
పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం తదుపరి తరం కామన్ ఐటీ రిటర్న్ ఫారాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది. ప్రత్యక్ష పన్నుల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేసే ప్రణాళికను కూడా నిర్దేశించింది. ప్రత్యక్ష పన్ను వ్యవహారాల్లో చిన్న అప్పీళ్ల పరిష్కారానికి 100 మంది జాయింట్ కమిషనర్లను నియమిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటికే వచ్చిన రిటర్నుల పరిశీలన కోసం కేసులను చేపట్టడంలో ఆ శాఖ మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని ఆమె చెప్పారు.
పన్ను రాయితీల మెరుగైన లక్ష్యం
పన్ను రాయితీలు, మినహాయింపుల కోసం నివాస గృహాలపై పెట్టే పెట్టుబడులపై మూలధన లాభాల్లో మినహాయింపు ను రూ.10 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. . అధిక విలువ కలిగిన బీమా పాలసీల ఆదాయం నుంచి ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి ఉంటుంది. కేంద్ర బడ్జెట్ లో ప్రత్యక్ష పన్నుల హేతుబద్ధీకరణ, సరళీకరణకు సంబంధించి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి.
ఐఎఫ్ఎస్సీ, గిఫ్ట్ సిటీకి అందించే నిధులకు అందిస్తున్న పన్ను ప్రయోజనాల వ్యవధిని 31.03.2025 వరకు పొడిగించాలని ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 276 ఏ కింద కేసుల నమోదు, ఐడీబీఐ బ్యాంక్ సహా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ వల్ల వచ్చిన నష్టాలను కొనసాగించడానికి అనుమతించడం, అగ్నివీర్ నిధికి ఈఈఈ హోదా కల్పించడం లాంటి ప్రతిపాదనలు ఉన్నాయి.
ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ప్రతిపాదనలు
ఎంఎస్ఎంఈలను మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి యంత్రాలుగా బడ్జెట్ పేర్కొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సూక్ష్మ సంస్థలు, కొంతమంది నిపుణులు పన్నుల ప్రయోజనాన్ని పొందడానికి పరిమితులను పెంచాలని ప్రతిపాదించింది. ఎంఎస్ఎంఈలకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడడానికి వాస్తవంగా చెల్లింపులు చేసినప్పుడు మాత్రమే వారికి చేసిన చెల్లింపులపై చేసిన ఖర్చుకు మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్ ప్రతిపాదించింది.
సహకారం
సహకార రంగానికి బడ్జెట్ లో అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి 31 వరకు తయారీ కార్యకలాపాలు ప్రారంభించే కొత్త సహకార సంఘాలు 15% తక్కువ పన్ను రేటు ప్రయోజనం పొందుతాయి. చెరకు రైతులకు 2016-17 మదింపు సంవత్సరానికి ముందు చేసిన చెల్లింపులను ఖర్చుగా చూపించి తిరిగి పొందడానికి చక్కెర సహకార సంఘాలకు బడ్జెట్ అవకాశం కల్పిస్తుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రాథమిక సహకార వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకుల నగదు డిపాజిట్లు, రుణాలకు ఒకో సభ్యుడికి రూ.2 లక్షల గరిష్ట పరిమితిగా నిర్ణయించారు. సహకార సంఘాల నగదు ఉపసంహరణపై విధిస్తున్న టీడీఎస్ కు రూ.3 కోట్ల గరిష్ట పరిమితి ని బడ్జెట్ లో ప్రతిపాదించారు.
స్టార్టప్ లు:
స్టార్టప్ లకు ఆదాయపు పన్ను ప్రయోజనాల కోసం విలీన తేదీని 31.03.2023 నుంచి 31.03.2024 వరకు పొడిగించాలని బడ్జెట్ ప్రతిపాదించింది. స్టార్టప్ ల షేర్ హోల్డింగ్ ను 7 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు పొడిగించిన ప్రభుత్వం నష్టాలను ముందుకు తీసుకెళ్లే ప్రయోజనాన్ని అందిస్తుంది.
సీజీఎస్ టీ చట్టంలో సవరణలు
వస్తు, సేవల సరఫరా లేదా రెండింటినీ సరఫరా చేయకుండా ఇన్ వాయిస్ లు జారీ చేసిన నేరం మినహా సీజీఎస్ టీ కింద చర్యలు ప్రారంభించడానికి పన్ను మొత్తం కనీస పరిమితిని రూ .1 కోటి నుంచి రూ .2 కోట్లకు పెంచే విధంగా సీజీఎస్ టీ చట్టాన్ని సవరించడానికి బడ్జెట్ వీలు కల్పిస్తుంది. కాంపౌండింగ్ మొత్తాన్ని పన్ను మొత్తంలో ప్రస్తుతం ఉన్న 50 నుంచి 150 శాతం నుంచి 25 నుంచి 100 శాతం వరకు తగ్గిస్తారు. ఏ అధికారి నైనా విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం, అడ్డుకోవడం, ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాధారాలను తారుమారు చేయడం, సమాచారాన్ని అందించడం లో విఫలం కావడం వంటి చట్టంలోని కొన్ని అంశాలను కూడా ఇది నేరంగా పరిగణిస్తుంది.
పన్ను మార్పుల పర్యవసానాలు:
ప్రత్యక్ష, పరోక్ష పన్ను విధానంలో మార్పులు ప్రకటించిన ఆర్థిక మంత్రి ఈ ప్రతిపాదనల ఫలితంగా సుమారు రూ.38,000 కోట్ల ఆదాయం కోల్పోవలసి వస్తుందని తెలిపారు. అదనంగా రూ.3,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది అని చెప్పారు. ఈ ప్రతిపాదనల వల్ల ఏటా రూ.35,000 కోట్ల ఆదాయం తగ్గుతుందని చెప్పారు.
***
(Release ID: 1895490)
Visitor Counter : 7352