బొగ్గు మంత్రిత్వ శాఖ

ఒడిశాలో చక్కటి ఎకో-పార్క్ & కోల్ మ్యూజియం నిర్మించిన మహానది కోల్‌ఫీల్ట్స్‌

Posted On: 28 JAN 2023 11:17AM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ప్రధాన సీపీఎస్‌ఈ అయిన 'మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్' (ఎంసీఎల్‌), పర్యావరణ అనుకూల & స్థిర తవ్వకం పద్ధతుల ద్వారా బొగ్గు ఉత్పత్తి, ఆఫ్-టేక్‌లో నిరంతరం కొత్త రికార్డులు సాధిస్తోంది. ఇదే బాటలో, ఒడిశాలోని ఝార్సుగూడలోని ఎల్‌బి వ్యాలీ కోల్‌ఫీల్డ్స్‌లో ఓరియంట్ ఏరియాకు చెందిన 4వ నంబర్‌ గని వద్ద 'చంద్రశేఖర్ ఆజాద్ ఎకో పార్క్ అండ్‌ కోల్ మ్యూజియం'ను ఇటీవలే నిర్మించింది. ఝర్సుగూడ-రాయ్‌గఢ్ జాతీయ రహదారి 49 పక్కన ఉన్న గండ్ఘోరా గ్రామంలో ఎకో-పార్క్ ఉంది.

2017లో 4వ నంబర్‌ బొగ్గులో ఉత్పత్తిని నిలిపేశారు. ఎంసీఎల్‌ ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించింది. పచ్చని చెట్లు, బొగ్గు కేఫ్, పిల్లల పార్కుతో కూడిన చక్కటి పర్యావరణ సంరక్షణ ఉద్యానవనాన్ని రికార్డు సమయంలో నిర్మించింది. కేంద్ర బొగ్గు, గనులు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి 2021లో ఈ పార్కుకు పునాది రాయి వేశారు. భూగర్భ గనిలోకి వెళ్లి ప్రత్యక్ష అనుభవాన్ని పొందే అవకాశాన్ని కూడా సందర్శకులకు ఈ పార్కు అందిస్తోంది.

భారతదేశంలోని బొగ్గు తవ్వకం చరిత్ర, వారసత్వం గురించి పార్క్ లోపల ఉన్న కోల్ మ్యూజియం వివరిస్తుంది. భూగర్భ, ఉపరితల గనుల్లో ఉపయోగించే వివిధ యంత్రాలు, వాహనాల నమూనాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఉపరితల మైనర్‌, డంపర్, క్రేన్, టిప్పర్, డోజర్, బెల్ట్ కన్వేయర్, బొగ్గు కట్టింగ్ మెషిన్, డ్రిల్ మెషిన్, బ్యాక్‌హో వంటివి బొగ్గు గనుల పరికరాలు/యంత్రాల ప్రదర్శనలో ఉన్నాయి.

ఒడిశాలోని సుందర్‌ఘర్, ఝార్సుగూడ, అంగుల్ జిల్లాల్లో బొగ్గు గనుల కార్యకలాపాలను ఎంసీఎల్‌ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు పూర్తిగా వినియోగించిన కనీసం 2000 హెక్టార్ల భూమిని తిరిగి ఇసుకతో నింపి, పునరుద్ధరించింది. స్థిర తవ్వకం పద్ధతుల్లో భాగంగా.. వర్షపు నీటి సంరక్షణ కోసం అనేక క్వారీలను నీటి వనరులుగా అభివృద్ధి చేసింది.

 

*****



(Release ID: 1894320) Visitor Counter : 177