యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఢిల్లీ వెలుపల మొదటి మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసి ) సమావేశాన్ని నిర్వహించిన క్రీడా మంత్రిత్వ శాఖ
Posted On:
22 JAN 2023 3:56PM by PIB Hyderabad
క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జనవరి 19, 20 తేదీల్లో మొదటి మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసి ) సమావేశాన్ని నిర్వహించింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరుగుతున్న హాకీ ప్రపంచ కప్ సందర్భంగా క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తొలిసారిగా ఢిల్లీ వెలుపల మిషన్ ఒలింపిక్ సెల్ (MOC) సమావేశాన్ని నిర్వహించింది.
15 రోజులకు ఒకసారి జరిగే సమావేశంలో మిషన్ ఒలింపిక్ సెల్ సభ్యులు ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించి, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కోసం క్రీడాకారుల ఎంపిక చేస్తారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో సమావేశం అయిన మిషన్ ఒలింపిక్ సెల్ సభ్యులు భారత పురుషుల హాకీ జట్టు చివరి ఆటను కూడా చూశారు. వేల్స్ జట్టుతో గ్రూప్ స్థాయిలో భారత పురుషుల హాకీ జట్టు పోటీ పడింది.
ఆటను ప్రత్యక్షంగా వీక్షించిన తర్వాత మాట్లాడిన మాజీ భారత లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్ " ప్రత్యక్షంగా (ప్రపంచ కప్ మ్యాచ్)చూసి ఒక పోటీ సమయంలో ఆటగాళ్ల ప్రదర్శనను చూసేందుకు మంచి అవకాశం లభించింది. దీనివల్ల ఆటగాళ్ల ప్రతిభను సరిగ్గా అంచనా వేయడానికి అవకాశం కలిగింది. తదుపరి సమావేశంలో ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని లోపాలు గుర్తించి మరింత మెరుగైన పద్ధతిలో అంచనా వేయడానికి వీలవుతుంది. ఇది ఒక గొప్ప అవకాశం. అవకాశం దొరికినప్పుడల్లా హాకీ మాత్రమే కాకుండా ఇతర క్రీడలతో పాటు మరెన్నో మ్యాచ్‌లను చూడాలనుకుంటున్నాను." అన్నారు.
భారత పురుషులు, మహిళల హాకీ జట్లు మాత్రమే క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న టాప్స్ పథకం కింద నిధులు పొందుతున్నాయి.శిక్షణ మరియు పోటీల కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించి అమలు చేస్తున్న వార్షిక క్యాలెండర్ పథకం కింద 24 కోట్ల రూపాయలు రెండు జట్లకు విడుదల అవుతున్నాయి. .
ఆటగాళ్లకు ముఖ్యంగా హాకీ జట్టుకు టాప్స్ పథకం ప్రయోజనం కలిగిస్తుందని భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ విరెన్ రస్కిన్హా అన్నారు. "గత కొన్ని సంవత్సరాలుగా మిషన్ ఒలింపిక్ సెల్, టాప్స్ పథకం భారత క్రీడాకారులు , హాకీ జట్లకు సహకారం అందిస్తున్నాయి. దీనివల్ల ఆశించిన ఫలితాలు కలుగుతున్నాయి. క్రీడాకారులు ముఖ్యంగా పురుషుల హాకీ జట్టు రాణిస్తోంది. 41 సంవత్సరాల తర్వాత భారత జట్టు ఒలింపిక్ పతకాన్ని సాధించింది. ఒలింపిక్ పతకం సాధించిన ఉత్సాహంతో ప్రపంచ కప్ సాధించడానికి కృషి చేస్తోంది. జట్టుకు సహకారం కొనసాగించాలి." అని విరెన్ రస్కిన్హా అన్నారు
దేశం వివిధ ప్రాంతాలకు చెందిన వారు మిషన్ ఒలింపిక్ సెల్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా టాప్స్ తదితర అంశాలను చర్చించడానికి మిషన్ ఒలింపిక్ సెల్ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో మిషన్ ఒలింపిక్ సెల్ సమావేశాలు వర్చువల్ విధానంలో జరిగాయి. ఆలస్యం కారణంగా క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడడానికి సమావేశాలు వర్చువల్ విధానంలో జరిగాయి. లాక్ డౌన్ తర్వాత హైబ్రిడ్ విధానంలో సమావేశాలు జరుగుతున్నాయి. నెలలో ఒక సమావేశాన్ని వర్చువల్ విధానంలో రెండో సమావేశాన్ని బౌతికంగా నిర్వహిస్తున్నారు.
***
(Release ID: 1892893)
Visitor Counter : 203