రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఎన్‌సీసీ గణతంత్ర దినోత్సవం శిబిరాన్ని తొలిసారి సందర్శించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్


యువత సాధికారతలో ఎన్‌సీసీ పాత్రను ప్రశంసించిన జనరల్ అనిల్ చౌహాన్

Posted On: 17 JAN 2023 1:33PM by PIB Hyderabad

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, పీవీఎస్‌ఎం, యువీఎస్‌ఎం, ఏపీఎస్‌ఎం, ఎస్‌ఎం, వీఎస్‌ఎం, 17 జనవరి 2023న, న్యూదిల్లీలోని దిల్లీ కంటోన్మెంట్‌లో జరుగుతున్న ఎన్‌సీసీ గణతంత్ర దినోత్సవ శిబిరం 2023ని సందర్శించారు. ఎన్‌సీసీ గణతంత్ర దినోత్సవ క్యాంపును సీడీఎస్‌ సందర్శించడం ఇదే మొదటిసారి.

సైన్యం, నావికాదళం, వైమానిక దళ విభాగాలతో కూడిన బృందం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌కు "గార్డ్ ఆఫ్ హానర్" పలికింది. ఆ తర్వాత, ఎన్‌సీసీ క్యాడెట్లు చక్కటి బ్యాండ్ ప్రదర్శన చేశారు. వివిధ సామాజిక అవగాహన ఇతివృత్తాలు, సాంస్కృతిక కార్యక్రమాలను వివరిస్తూ ఎన్‌సీసీ క్యాడెట్లు రూపొందించిన ‘ఫ్లాగ్ ఏరియా’ను కూడా సీడీఎస్ సందర్శించారు. తమ రాష్ట్రాల డైరెక్టరేట్ థీమ్‌ల గురించి క్యాడెట్లు వివరించారు.

ఇటీవల పునర్నిర్మించిన 'హాల్ ఆఫ్ ఫేమ్'ను కూడా సీడీఎస్‌ సందర్శించారు. ఎన్‌సీసీ పూర్వ విద్యార్థుల ఛాయాచిత్రాలు, నమూనాలు, ఎన్‌సీసీ మూడు విభాగాలకు సంబంధించిన స్ఫూర్తిదాయక అంశాలతో కూడిన గొప్ప సేకరణలను ఇక్కడ ప్రదర్శించారు.

ఆ తర్వాత, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌తో పాటు ఇతర అతిథులు కూడా ఎన్‌సీసీ ప్రదర్శనశాలలో జరిగిన అద్భుత ‘సాంస్కృతిక కార్యక్రమాన్ని’ వీక్షించారు.

ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మాట్లాడారు. నిరాడంబరమైన ప్రారంభం నుంచి 17 లక్షల మంది క్యాడెట్లతో కూడిన స్వచ్ఛంద సంస్థగా ఎన్‌సీసీ ఎదిగిందని చెప్పారు. "దేశ యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సహృదయత లక్షణాలను పెంపొందించడంలో ఎన్‌సీసీ సహకారం ఆదర్శప్రాయం" అని అన్నారు.

సామాజిక అవగాహన కార్యక్రమాల్లో ఎన్‌సీసీ అందిస్తున్న అపార సహకారం గురించి ప్రస్తావిస్తూ, సముద్ర తీరాలను శుభ్రపరచడం, ప్లాస్టిక్/ఇతర వ్యర్థాలను తొలగించడం, పునర్వినియోగించడం, సాగర తీరాల పరిశుభ్రత ఆవశ్యకత గురించి, ప్లాస్టిక్ కాలుష్యం వల్ల వచ్చే ప్రమాదాల గురించి అవగాహన కల్పించే లక్ష్యాలతో ప్రారంభించిన 'పునీత్ సాగర్ అభియాన్' గురించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మాట్లాడారు.

"ఈ కార్యక్రమం ప్రజల దృష్టిని ఆకర్షించింది. సుమారు 13.5 లక్షల మంది ఎన్‌సీసీ క్యాడెట్లు అభియాన్‌లో పాల్గొని ఇప్పటి వరకు దాదాపు 208 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. వాటిలో 167 టన్నులను పునర్వినియోగం కోసం పంపారు" అని జనరల్ చౌహాన్ చెప్పారు.

75 సంవత్సరాలుగా దేశానికి నిస్వార్థ సేవ చేసినందుకు ఎన్‌సీసీని సీడీఎస్‌ అభినందించారు. వివిధ క్రీడాంశాల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు చూపిన అసాధారణ ప్రదర్శనను ఆయన అభినందించారు.

 

*****


(Release ID: 1891873) Visitor Counter : 155