యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఈ రోజు కర్ణాటకలోని ధార్వాడ్‌ లో జరిగిన 26వ జాతీయ యువజనోత్సవం ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన - శ్రీ అనురాగ్ ఠాకూర్


స్వచ్ఛమైన, అందమైన, సాధికారత కలిగిన దేశాన్ని నిర్మించేందుకు యువత ముందుకు రావాలని కోరిన - కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్


జాతీయ యువజనోత్సవం ఐక్యత, సమగ్రతను సూచిస్తుంది, ఇది అక్షరాలా భారత దేశ సూక్ష్మ రూపాన్ని సృష్టిస్తుంది: శ్రీ అనురాగ్ ఠాకూర్

Posted On: 16 JAN 2023 6:05PM by PIB Hyderabad

ఈ రోజు కర్ణాటకలోని ధార్వాడ్‌లో జరిగిన 26వ జాతీయ యువజనోత్సవం ముగింపు కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రసంగించారు.  ఐదు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు.

వై-20 టాక్స్ (చర్చలు), వై-20 వాక్స్‌ (నడక) లో చేరాలనీ, జి-20 నాయకుల కోసం వివిధ ముఖ్యమైన సమస్యలపై పరిష్కారాలను సూచించే పత్రాలను సిద్ధం చేయాలని, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ యువతను ఆహ్వానించారు.

 

స్వచ్ఛమైన, అందమైన, సాధికారత కలిగిన దేశాన్ని నిర్మించేందుకు యువత ప్రభుత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని మంత్రి కోరారు.  నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన వివిధ యువజన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ, దేశ నిర్మాణంలో వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ కోరారు.

 

హుబ్లీ-ధార్వాడ్ లో హరిత మహోత్సవంగా జరుపుకున్న ఈ జాతీయ యువజనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.  స్వచ్ఛ భారత్‌ను నిర్మించేందుకు జీవితంలో వ్యర్థాలను తగ్గించే కార్యక్రమాల ఆవశ్యకతను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.  ఈ విషయంలో యువత ప్రతిజ్ఞ చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

 

శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ యువజనోత్సవం ఐక్యత, సమగ్రతను సూచిస్తుందని, ఇది అక్షరాలా భారతదేశ సూక్ష్మ రూపాన్ని సృష్టిస్తుందని, వ్యాఖ్యానించారు.   యువజనోత్సవం నుంచి తాము గ్రహించిన సందేశాలను ఇతరులతో పంచుకోవాలని మంత్రి యువజన ప్రతినిధులను కోరారు.

 

దాదాపు అన్ని రంగాల్లో దేశం అపూర్వమైన అభివృద్ధిని, ప్రగతిని సాధించిందని ఆయన పేర్కొన్నారు.  ఈ సందర్భంగా వివిధ రంగాలలో అద్భుతమైన పని, సహకారం అందించిన 19 మంది వ్యక్తులకు, ఆరు సంస్థలకు 2019-20 జాతీయ యువజన అవార్డులను ప్రదానం చేశారు. 

 

కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్‌చంద్ గెహ్లాట్,  కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై, కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, ఎన్నికైన పలువురు ప్రజాప్రతినిధులతో పాటు, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

 

 

*****



(Release ID: 1891775) Visitor Counter : 151