ప్రధాన మంత్రి కార్యాలయం

కర్ణాటకలోనిహుబ్బళ్లిలో 26వ జాతీయయువజనోత్సవాలకు ప్రధానమంత్రిశ్రీకారం


“మేం సాధించగలం’ అనే మన యువశక్తి స్ఫూర్తి అందరికీ ప్రేరణ”;

“అమృతకాలంలోదేశం ముందంజ వేయడంలో మనకర్తవ్యాలకుప్రాధాన్యంతోపాటు వాటిని అర్థం చేసుకోవాలి”;“భారతప్రగతి పయనానికి యవతరమే చోదక శక్తి..దేశ నిర్మాణంలో రానున్న 25 ఏళ్లు చాలా కీలకం”;“యవ్వనంగాఉండటమంటే.. మనం చురుగ్గా కృషిచేయడమే;

యవ్వనంగాఉండటమంటే... మన విశాల దృక్పథమే;యవ్వనంగా ఉండటమంటే... ఆచరణాత్మకం కావడమే!”;“ఇది భారతదేశ శతాబ్దమని ప్రపంచం అంటోంది..ఇది మీ శతాబ్దమే..భారత యువతరం శతాబ్దమే”;“యువతఆకాంక్షలను నెరవేర్చడానికి సానుకూల ఆవిష్కరణలుతేవడంతోపాటు అగ్ర దేశాలకన్నాముందుండటం అత్యవసరం”;

“స్వామివివేకానంద జంట సందేశం- ‘సంస్థాపన..ఆవిష్కరణ’ ప్రతియువకుడి జీవితంలో భాగం కావాలి”;“వికసితభారతం.. సాధికార భారతం నేడు జాతి లక్ష్యం కావాలి”

Posted On: 12 JAN 2023 6:56PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ర్ణాట‌క‌లోని హుబ్బ‌ళ్లిలో ఇవాళ 26వ జాతీయ యువ‌జన ఉత్స‌వాలను ప్రారంభించారు. స్వామి వివేకానంద ఆశయాలు, ప్రబోధాలు, సేవలను గౌరవిస్తూ ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈసారి “వికసిత యువతరం - వికసిత భారతం” ఇతివృత్తంగా వేడుకలను నిర్వహించారు. దేశంలోని అన్ని ప్రాంతాల విభిన్న సంస్కృతులను ఒకే వేదికపైకి తెచ్చే ఈ వేడుకలు అందరిలోనూ ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ స్ఫూర్తిని నింపుతాయి.

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- క‌ర్ణాట‌క‌లోని హుబ్బ‌ళ్లి ప్రాంతం తనదైన సంస్కృతి-సంప్రదాయాలు, విజ్ఞానానికి ప్రసిద్ధి చెందిందని గుర్తుచేశారు. ఇక్కడి మహానుభావులెందరో జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్నారని పేర్కొన్నారు. పండిట్ కుమార్ గంధర్వ్, పండిట్ బస్వరాజ్ రాజ్‌గురు, పండిట్ మల్లికార్జున్ మన్సూర్, భారతరత్న శ్రీ భీమ్‌సేన్ జోషి, పండిత గంగూబాయి హంగల్ వంటి ఎందరో గొప్ప సంగీత విద్వాంసులు ఈ గడ్డపై జన్మించారంటూ వారందరికీ నివాళి అర్పించారు.

ప్రస్తుత జాతీయ యువజన దినోత్సవం-2023, స్వాతంత్ర్య అమృత మహోత్సవం ఏకకాలంలో జరుగుతుండటం ఈ ఏడాది ప్రత్యేకతలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “లేవండి.. మేల్కొనండి.. లక్ష్యం చేరేదాకా ఆగకండి” అన్న స్వామి వివేకానంద ప్రబోధాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఇది భారత యువతరానికి జీవన మంత్రమని, ప్రస్తుత అమృత కాలంలో దేశం ముందంజ దిశగా మన కర్తవ్యాలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు వాటిని అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కృషిలో స్వామి వివేకానంద ప్రబోధాలు యువ‌త‌రానికి స్ఫూర్తినిస్తాయని ప్ర‌ధానమంత్రి నొక్కిచెప్పారు. “ఈ ప్రత్యేక సందర్భంలో స్వామి వివేకానంద పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కన్నుమూసిన శ్రీ సిద్ధేశ్వర స్వామికి కూడా ప్రధాని నివాళి అర్పించారు.

ర్ణాటక గడ్డతో స్వామి వివేకానందకు ప్రత్యేక అనుబంధం ఉన్నదని శ్రీ మోదీ చెప్పారు. స్వామీజీ చాలాసార్లు కర్ణాటకను సందర్శించారని, ఆయన షికాగో పర్యటనకు సహకరించిన ముఖ్యమైన వ్యక్తులలో మైసూరు మహారాజా ఒకరని గుర్తుచేశారు. “స్వామీజీ భారత పర్యటన దేశ చైతన్యం, ఐక్యతలకు నిదర్శనం.. ఒకే భారతం-శ్రేష్ఠ భారతం స్ఫూర్తికి ఇదొక శాశ్వత నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద మాటలను ఉటంకిస్తూ- “పొంగులువారే యువశక్తితోనే దేశాభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు సాధ్యం” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. దేశం పట్ల తమ కర్తవ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి, అతి చిన్న వయసులోనే అసాధారణ విజయాలు సాధించిన ఎందరో వ్యక్తులను కర్ణాటక గడ్డ భారతదేశానికి బహుమతిగా ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన కిత్తూరు మహారాణి చెన్నమ్మ, సంగొల్లి రాయన్నల ధైర్యసాహసాలను ప్రధాని ప్రస్తుతించారు. అలాగే 14 ఏళ్ల చిరుప్రాయంలోనే దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన నారాయణ మహాదేవ్ దోని గురించి ప్రస్తావించారు. సియాచిన్‌లో రక్తాన్ని గడ్డకట్టించే మైనస్‌ 55 డిగ్రీల సెల్సియస్ శీతల పరిస్థితుల నుంచి బతికి బయటపడ్డ లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ దృఢదీక్షను కూడా ప్రధాని గుర్తుచేశారు. దేశం యువత బహుముఖ ప్రతిభను వివరిస్తూ భారత యువశక్తి ప్రతి రంగంలోనూ కొత్త పుంతలు తొక్కుతున్నదని ప్రధాని ప్రశంసించారు.

కాలానుగుణంగా మారుతున్న జాతీయ లక్ష్యాల స్వభావాన్ని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ 21వ శతాబ్దం మనకెంతో కీలకమైదని, నేడు భారత్‌ భారీ యువ జనాభాతో యువ దేశంగా పరిగణనలో ఉందని పేర్కొన్నారు. “భారత ప్రగతి ప్రయాణానికి యువతరమే చోదక శక్తి” అని ప్రధాని స్పష్టం చేశారు. “దేశ నిర్మాణానికి రానున్న 25 ఏళ్లు చాలా ముఖ్యమైనవి. యువశక్తి ఆశలు, ఆకాంక్షలే దేశానికి దిశను, గమ్యాన్ని నిర్ణయిస్తాయి. దేశానికి మార్గదర్శనం చేయగల యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలంటే మన ఆలోచనలలో, మన ప్రయత్నాల్లో మనం యవ్వనంగా ఉండాలి! యవ్వనంగా ఉండటమంటే మన కృషి చైతన్యవంతంగా ఉండాలి… యవ్వనంగా ఉండటమంటే మనకు విశాల దృక్పథం ఉండాలి.. యవ్వనంగా ఉండటమంటే ఆచరణాత్మకంగా ఉండటమే!” అని ప్రధాని విశదీకరించారు. ప్రపంచం పరిష్కారాల కోసం మనవైపు చూస్తున్నదంటే- మన ‘అమృత’ తరం అంకితభావమే అందుకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్‌ నేడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది… “ఈ జాబితాలో మన దేశాన్ని 3వ స్థానానికి చేర్చడమే ఇప్పుడు మన లక్ష్యం” అని ప్రధాని అన్నారు. వ్యవసాయ, క్రీడా రంగాలలో అందివస్తున్న అవకాశాల గురించి పునరుద్ఘాటిస్తూ- ఈ విప్లవానికి దోహదం చేసింది యువశక్తేనని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ప్రస్తుత కాలం ప్రాముఖ్యాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు. ఈ మేరకు ఆర్థిక, విద్యా, క్రీడలు, అంకుర సంస్థల రంగాల్లో బలమైన పునాదులు పడుతున్నాయని తెలిపారు. “మీ టేకాఫ్ కోసం రన్‌వే సిద్ధంగా ఉంది! ఇవాళ భారత్‌పైనా, దేశ యువతరం మీద ప్రపంచం ఎంతో ఆశాభావంతో ఉంది. ఇదంతా మీ వల్లనే… మీ కోసమే! ఈ శతాబ్దం భారతదేశానికి చెందినదని నేడు ప్రపంచమంతా అంటోంది.. అవును- ఇది చరిత్రాత్మక సమయం- ఆశావాదం, అవకాశాలు కలగలసినప్పుడు ఇది మీ శతాబ్దం.. భారత యువతరం శతాబ్దమే!” అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ శక్తిసామర్థ్యాలను సజీవంగా ఉంచడంలో మహిళా శక్తి పాత్ర కీలకమని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ మేరకు సాయుధ దళాలు, అంతరిక్షం-అంతరిక్ష సాంకేతికత, క్రీడలలో మహిళలు విశేషంగా రాణిస్తుండటాన్ని ఉదాహరించారు.

21వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా రూపొందించడంలో భవిష్యత్ దృక్పథం, విధానాల ప్రాముఖ్యాన్ని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. “యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి మనం సానుకూల ఆవిష్కరణలు తేవాలి… అలాగే అగ్ర దేశాలకన్నా ముందంజలో ఉండటం కూడా అత్యవసరం” అని ఆయన అన్నారు. అత్యాధునిక రంగాల గురించి ప్రస్తావిస్తూ, ఈనాడు ఊహలకైనా అందని వివధ రకాల ఉద్యోగాలు భవిష్యత్తులో మన యువతకు ప్రధాన ఉపాధి కారకాలు కాగలవని ప్రధాని పేర్కొన్నారు. అందువల్ల మన యువత భవిష్యత్ నైపుణ్య సముపార్జనకు సిద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమైందని అప్రమత్తం చేశారు. కొత్త విద్యా విధానంతో అందివస్తున్న ఆచరణాత్మక, భవిష్యత్‌ దార్శనిక విద్యా వ్యవస్థ గురించి ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో స్వామి వివేకానంద ప్రబోధించిన “సంస్థాపన-ఆవిష్కరణ” జంట సందేశం ప్రతి యువకుడి జీవితంలో ఒక భాగం కావాలని ప్రధాని నొక్కిచెప్పారు. మన ఆలోచ‌న‌ను విస్త‌రింపజేసుకుంటూ జట్టు స్ఫూర్తితో శ్రమిస్తేనే ఒక సంస్థ‌ రూపొందుతుంద‌ని శ్రీ మోదీ పేర్కొన్నారు. అదేవిధంగా నేటి యువ‌త‌రంలో ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌క్తిగ‌త విజ‌యాన్ని జట్టు విజయంగా మార్చుకోవడంపై దృష్టి సారించాలన్నారు. “వికసిత భారతాన్ని ‘టీమ్ ఇండియా’గా ముందుకు తీసుకెళ్లేది ఈ జట్టు స్ఫూర్తే”నని ప్రధానమంత్రి అన్నారు.

విష్కరణలపై స్వామి వివేకానంద దార్శనికతను ప్రస్తావిస్తూ- ప్రతి పనిలోనూ మనం ‘అపహాస్యం, అసహనం, అంగీకారం’ అనే మూడు దశలను అధిగమించాల్సి ఉంటుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘డిజిటల్ చెల్లింపులు, స్వచ్ఛ భారత్ అభియాన్, జన్‌ధన్‌ యోజన, స్వదేశీ కోవిడ్ టీకాలు’ ఇందుకు నిదర్శనమని ఆయన ఉదాహరించారు. వీటిని ప్రవేశపెట్టిన తొలినాళ్లలో అపహాస్యం చేశారని గుర్తుచేశారు. ఇవాళ డిజిటల్ చెల్లింపులలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్నారు. అలాగే జన్‌ధన్‌ ఖాతాలు మన ఆర్థిక వ్యవస్థకు ఎనలేని శక్తిగా మారాయని తెలిపారు. టీకాల రంగంలో భారత్‌ సాధించిన విజయం ప్రపంచవ్యాప్త చర్చనీయాంశమైందని పేర్కొన్నారు. “మీరు ఏదైనా కొత్త ఆలోచనను పంచుకుంటే- మీకు అపహాస్యం ఎదురుకావచ్చు.. వ్యతిరేకత వ్యక్తం కావచ్చు… కానీ, మీ ఆలోచనపై మీకు దృఢ విశ్వాసం ఉంటే దానికి కట్టుబడండి… దానిపై నమ్మకం ఉంచండి” అని ప్రధానమంత్రి యువతకు పిలుపునిచ్చారు.

యువతరం సాహచర్యంలో దేశవ్యాప్తంగా అనేక కొత్త ప్రయత్నాలు, ప్రయోగాలు చోటు చేసుకుంటున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. స్పర్థాత్మక, సహకారాత్మక సమాఖ్య తత్వాల సారూప్యాన్ని వివరిస్తూ- జాతీయ యువజనోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ పోటీల్లో దేశంలోని పలు రాష్ట్రాల యువత పాల్గొంటున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఎవరు గెలిచినా.. అది భారతదేశ విజయమేనని వ్యాఖ్యానించారు. ఆ మేరకు ఇక్కడి పోటీల్లో యువత పరస్పరం పోటీపడడమే కాకుండా భవిష్యత్తు విషయంలో సహకరించుకోవాలని సూచించారు. ఈ స్పర్థ, సహకారాల స్ఫూర్తిని ముందుకు తెచ్చి, మన విజయాన్ని దేశానికి విజయంగా మలచాలనే ఆలోచనను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. చివరగా “వికసిత భారతం.. సాధికార భారతం నేడు జాతి లక్ష్యం కావాలి” అని ప్రబోధిస్తూ- అభివృద్ధి చెందిన భారతదేశ స్వప్నం సాకారమయ్యేదాకా నిర్విరామంగా శ్రమించాలని స్పష్టం చేశారు. దేశంలోని యువతరమంతా దీన్ని తమ సొంత కలగా పరిగణించి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకోగలరన్న విశ్వాసం తనకుందంటూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్‌ శ్రీ థావర్ చంద్ గెహ్లాత్‌, ముఖ్యమంత్రి శ్రీ బస్వరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రులు శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, శ్రీ నిసిత్ ప్రామాణిక్, కర్ణాటక రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైన మన యువతకు గుర్తింపు ఇవ్వడంతోపాటు దేశ నిర్మాణంవైపు వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా జాతీయ యువజనోత్సవాలు నిర్వహించబడతాయి. దేశంలోని అన్ని ప్రాంతాల విభిన్న సంస్కృతులను ఈ వేడుకలు ఒకే వేదికపైకి తెచ్చి, ‘ఒకే భారతం - శ్రేష్ఠ భారతం’ ఐక్యతా స్ఫూర్తిని యువతలో నింపుతాయి. ఈ మేరకు జనవరి 12 నుంచి 16వరకు ‘వికసిత యువతరం - వికసిత భారతం’ ఇతివృత్తంగా ఈ ఉత్సవాలు కర్ణాటకలోని హుబ్బళ్లి-ధార్వాడ్‌లో నిర్వహించబడుతున్నాయి.

యువతరం సమ్మేళనానికి ఈ ఉత్సవాలు వేదికగా నిలుస్తాయి. ఈ మేరకు ‘జి-20’ సంబంధిత ‘వై-20’ (యువతరం-20) కార్యక్రమాలలో భాగంగా “ఉపాధి, పరిశ్రమ, ఆవిష్కరణలు, 21వ శతాబ్దపు నైపుణ్యాలు; వాతావరణ మార్పు-విపత్తు ముప్పు తగ్గింపు; శాంతి-సయోధ్యలకు కృషి; ప్రజాస్వామ్యం, పాలనలో యువత భాగస్వామ్యం-భవిష్యత్తు; ఆరోగ్యం-శ్రేయస్సు” అనే ఐదు ఇతివృత్తాలపై చర్చాగోష్ఠులు జరుగుతాయి. ఈ సమ్మేళనంలో 60 మందికిపైగా ప్రముఖ నిపుణులు పాల్గొంటారు. దీంతోపాటు అనేక పోటీలు, పోటీయేతర కార్యక్రమాలుంటాయి… ముఖ్యంగా స్థానిక సంస్కృతి-సంప్రదాయాలకు ప్రోత్సాహం ప్రధానంగా జానపద సంగీత-నృత్య పోటీలు నిర్వహిస్తారు. పోటీయేతర కార్యక్రమం కింద నిర్వహించే ‘యోగథాన్’లో దాదాపు 10 లక్షల మందితో యోగాభ్యాస ప్రదర్శన లక్ష్యంగా ఉంది. మరోవైపు జాతీయ స్థాయిగల నిపుణులతో 8 స్వదేశీ క్రీడలు, యుద్ధ కళల ప్రదర్శన కూడా ఉంటుంది. ఇతర ఆకర్షణలలో ఆహారోత్సవం, యువ చిత్రకారుల శిబిరం, సాహస క్రీడలు-కార్యకలాపాలు, ప్రత్యేక కార్యక్రమంగా ‘మీ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ గురించి తెలుసుకోండి’ తదితరాలు నిర్వహిస్తారు.

 

******



(Release ID: 1890938) Visitor Counter : 239