రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

దిల్లీ కంటోన్మెంట్‌లో 710 మంది బాలికలు సహా 2,155 మంది క్యాడెట్‌లతో ఎన్‌సీసీ గణతంత్ర దినోత్సవ శిబిరం 2023 ప్రారంభం

Posted On: 02 JAN 2023 12:45PM by PIB Hyderabad

దిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) గణతంత్ర దినోత్సవ (ఆర్‌డీ) క్యాంప్ 2023 జనవరి 02, 2023న ప్రారంభమైంది. మొత్తం 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 710 మంది బాలికలు సహా మొత్తం 2,155 మంది క్యాడెట్‌లు దాదాపు ఈ నెల మొత్తం జరిగే శిబిరంలో పాల్గొంటున్నారు. వీరిలో, జే&కే నుంచి 114 మంది, ఈశాన్య ప్రాంతం నుంచి మరో 120 మంది క్యాడెట్‌లు కూడా ఉన్నారు. జనవరి 28న, ప్రధానమంత్రి పాల్గొనే ర్యాలీతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.

క్యాంప్‌లో భాగంగా సాంస్కృతిక పోటీలు, జాతీయ సమైక్యత అవగాహన కార్యక్రమాలు, సంస్థాగత శిక్షణతో సహా అనేక కార్యక్రమాల్లో క్యాడెట్లు పాల్గొంటారు. భారత ఉప రాష్ట్రపతి, రక్ష మంత్రి, రక్షణ శాఖ మంత్రి, దిల్లీ ముఖ్యమంత్రి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సర్వీస్ చీఫ్‌లు సహా అనేక మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో భాగం కానున్నారు.

క్యాంప్‌ ప్రారంభోత్సవం సందర్భంగా క్యాడెట్లను ఉద్దేశించి ఎన్‌సీసీ డీజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్ మాట్లాడారు. అందరూ హృదయపూర్వకంగా పాల్గొని, ప్రతి అంశం నుంచి గరిష్ట ప్రయోజనాలను పొందాలని సూచించారు. యువతలో మారుతున్న ఆకాంక్షలు, సమాజం అంచనాలకు అనుగుణంగా శిక్షణ విధానాలను మెరుగు పరిచినట్లు చెప్పారు. వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, బృందంగా పని చేసే నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించి, వారిని భవిష్యత్ దిశగా సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

దిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవానికి ముందస్తు సన్నాహాలుగా, భారత దేశ గొప్ప సంస్కృతి & సంప్రదాయాలను చాటి చెప్పడం ఆర్‌డీ క్యాంప్‌ లక్ష్యం. దీంతోపాటు, క్యాడెట్‌ల వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడం, వారిలో నైతిక విలువలను బలోపేతం చేయడం కూడా ఈ కార్యక్రమం ఉద్దేశం.

 

****



(Release ID: 1888185) Visitor Counter : 148