Posted On:
18 DEC 2022 3:19PM by PIB Hyderabad
మేఘాలయ గవర్నర్ బ్రిగేడియర్ బి.డి.మిశ్రా జీ, మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మాజీ, నా కాబినెట్ సహచరులు శ్రీ బిట్ భాయ్ షా జీ , శ్రీ శర్బానంద సోనోవాల్ జీ, శ్రీ కిరెన్ రిజిజూజీ, శ్రీ జి.కిషన్ రెడ్డిజీ, శ్రీ బి.ఎల్.వర్మాజీ, మణిపూర్, మిజోరాం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, సిక్కిం ముఖమంత్రులు, మేఘాలయకు చెందిన సోదర సోదరీమణులారా
ఖుబ్లీ శిబాన్ (ఖాసి, జైన్తియాలలో అభినందనలు), నమెంగ్ అమాల్ (గారోలో అభినందనలు). మేఘాలయా ఎంతో విలువైన సహజ వనరులు, సంస్కృతి గల రాష్ట్రం. మీ ఆతిథ్యంలో కూడా ఈ గొప్పదనం కనిపిస్తుంది. మేఘాలయ అభివృద్ధి ప్రయాణ విజయాలను నిర్వహించుకోవడానికి జరుపుతున్న ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యే అవకాశం మరో సారి వచ్చింది. అనుసంధానత, విద్య, నైపుణ్యాలు, ఉపాధికి చెందిన పలు ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నందుకు హృదయపూర్వక అభినందనలు.
సోదర సోదరీమణులారా,
యాదృచ్చికంగా నేడు ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతోంది. ఫుట్ బల్ ప్రేమికుల మధ్య ఫుట్ బాల్ మైదానంలో నేనున్నాను. ఫుట్ బాల్ మాచ్ అక్కడ జరుగుతోంది. అదే సమయంలో ఇక్కడ ఫుట్ బాల్ మైదానంలో అభివృద్ధిలో మనం పోటీ పడుతున్నాం. అక్కడ కతార్ లో మ్యాచ్ జరుగుతోంది. అయినా ఇక్కడ ఉత్సాహం, ఉత్సుకత తక్కువేమీ లేదు. మిత్రులారా, నేను ఇప్పుడు ఫుట్ బాల్ మైదానంలో ఫుట్ బాల్ ఫీవర్ అంతటా కనిపిస్తోంది. మనం ఫుట్ బాల్ పరిభాషలోనే ఎందుకు మాట్లాడుకోకూడదు? మనం ఫుట్ బాల్ పరిణామ క్రమాన్ని పరిశీలిద్దాం. ఫుట్ బాల్ క్రీడలో ఈ రూల్ గురించి మనందరికీ తెలుసు. ఎవరైనా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే రెడ్ కార్డు చూపి అతన్ని బయటకు పంపుతారు. అలాగే గత 8 సంవత్సరాలుగా ఈశాన్యంలో పలు అభివృద్ధి అవరోధాలకు మనం రెడ్ కార్డులు చూపించాం. అవినీతి, వివక్ష, ఆశ్రీత పక్షపాతం, దౌర్జన్యకాండ రూపు మేపేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం. నిలిచిపోయిన ప్రాజెక్టులు, ఓటు బ్యాంకు రాజకీయాలను వ్యతిరేకించాం. ఈ వ్యాధులు ఎంత లోతుగా పాతుకుపోయాయో దేశం యావత్తును తెలుసు. ఈ సమస్యలను నిర్ములించేందుకు మనం కలసికట్టుగా కృషి చేయాలి. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడానికి, వాటిని సమర్థవంతం చేయడానికి జరిపిన ప్రయత్నాల సానుకూల ఫలితాలు మనం చూస్తున్నాం. అంతే కాదు, కేంద్రప్రభుత్వం నేడు క్రీడల విభాగంలో కొత్త వైఖరితో ముందుకు సాగుతున్నాం. దీనితో ఈశాన్యం ప్రత్యేకించి ఈశాన్యంలోని నా సైనికులు, కుమారులు, కుమార్తెలు ప్రయోజనం పొందారు. దేశంలోని తొలి క్రీడా విశ్వవిద్యాలయం ఈశాన్యంలోనే ఉంది. నేడు ఈశాన్యంలో బహుళార్థ సాధక హాలు, ఫుట్ బాల్ మైదానం, అథ్లెటిక్ ట్రాక్ సహా 90 ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. ఈ షిల్లాంగ్ నుంచి నేను ఒక విషయం చెబుదామనుకుంటున్నాను. మనందరి కళ్ళు కతర్ లో విదేశీ టీమ్ లు ఆడుతున్న గేమ్ పైనే ఉన్నప్పటికీ నా దేశ యువశక్తిపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అందుకే మనం కూడా భారతదేశంలో ఇలాంటి వేడుక చేసుకుని త్రివర్ణ పతాకానికి జేజేలు కొట్టే రోజు ఏంటో దూరంలో లేదని నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను.
సోదర సోదరీమణులారా,
అభివృద్ధి బడ్జెట్, టెండర్, పునాది రాళ్లు వేయడం, ప్రారంభోత్సవ కార్యక్రమాలు వంటి వేడుకలకు పరిమితం కాదు. 2014 సంవత్సరానికి ముందు ఇదే ధోరణి ఉండేది. ప్రజలు కూడా రిబ్బన్ కటింగ్ లు, నాయకులకు పూల మాలలు వేయడం, జిందాబాద్ నినాదాలు చేయడానికి వెళ్ళడానికే ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. మరి వాటిలో ఏది మారింది ? మన ఉద్దేశాల్లో, సంకల్పాల్లో, ప్రాధాన్యాల్లో, పని సంస్కృతిలో, విధానాల్లో, ఫలితాల్లో మార్పు వచ్చింది. ఆధునిక మౌలిక వసతులు, ఆధునిక అనుసంధానతతో నవ భారతాన్ని నిర్మించడం మన సంకల్పం. ప్రతి ప్రాంతాన్ని అనుసంధానం చేయడం సంకల్పం. వేగవంతమైన అభివృద్ధి పథంలో ప్రతి వర్గం ముందుకు సాగడం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయడం మన సంకల్పాలు. నిరాకరణను తొలగించడం, దూరాలు తగ్గించడం, సామర్థ్యాల నిర్మాణాన్ని ప్రోత్సహించడం, యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడం మన ప్రాధాన్యతలు. పని సంస్కృతి మారడం అంటే ప్రతి ఒక్క ప్రాజెక్టు, ప్రతి ఒక్క కార్యక్రమం సకాలంలో పూర్తి చేయడం.
మిత్రులారా,
కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్లో మార్పు రావడం వల్ల సానుకూల ఫలితాలు నేడు దేశంలో కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలోనే రూ.7 లక్షల కోట్లు మౌలిక వసతులపై ఖర్చు చేస్తోంది. మేఘాలయ, యావత్ ఈశాన్యానికి చెందిన సోదర సోదరీమణులారా, ఈ రూ.7 లక్షల కోట్ల గురించి గుర్తుంచుకోండి. 8 సంవత్సరాల క్రితం ఈ వ్యయం రూ.2 లక్షల కోట్ల కన్నా తక్కువే. చివరికి దేశం స్వాతంత్య్రం పొందిన 7 దశాబ్దాల తర్వాత ఈ వ్యయం రూ.2 లక్షల కోట్ల చేరింది. కానీ గత 8 సంవత్సరాల కాలంలో ఈ వ్యయం 4 రేట్లు పెరిగింది. నేడు వివిధ రాష్ట్రాలు కూడా మౌలిక వసతుల అభివృద్ధి అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. అభివృద్ధి కోసం పోటీ నెలకొంది. ఈ మార్పులన్నింటి ద్వారా అధికంగా లబ్ది పొందింది నా ఈశాన్యమే. షిల్లాంగ్ సహా ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నింటినీ రైల్ నెట్ వర్క్ తో అనుసంధానం చేసే కృషి వేగంగా సాగుతోంది. 2014 సంవత్సరానికి ముందు వారానికి కేవలం 900 విమాన సర్వీసులు నడిచేవి. నేడు అవి 1900కి చేరాయి. ఉడాన్ పథకం కింద నేడు మేఘాలయాలో 16 రూట్లలో విమాన సర్వీసులు నడుస్తున్నాయి. దీని వల్ల సరసమైన ధరల విమాన సర్వీసుల ప్రయోజనం మేఘాలయ ప్రజలు పొందుతున్నారు. ఈశాన్యానికి చెందిన రైతులు కూడా మెరుగైన విమాన సర్వీసుల ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ కృషి ఉడాన్ పథకం సహాయంతో ఇక్కడ నుంచి పళ్ళు, కూరగాయలు దేశ విదేశాల్లోని విభిన్న మార్కెట్లకు తేలిగ్గా చేరుతున్నాయి.
మిత్రులారా,
నేడు ప్రారంభిస్తున్న లేదా శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టులతో మేఘాలయ కనెక్టివిటీ మరింత శక్తివంతం అవుతుంది. గత 8 సంవత్సరాల కాలంలో మేఘాలయలో జాతీయ రహదారుల నిర్మాణంపై రూ.5000 కోట్లు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి సడక్ యోజన కింద గత 8 సంవత్సరాల కాలంలో మేఘాలయలో నిర్మించిన గ్రామీణ రోడ్ల నిడివి గత 20 సంవత్సరాల్లో నిర్మించన రోడ్లతో పోల్చుకుంటే 7 రెట్లు అధికంగా ఉంది.
సోదరసోదరీమణులారా,
డిజిటల్ అనుసంధానత ఈశాన్య ప్రాంతాల యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి తెస్తోంది. డిజిటల్ అనుసంధానత కమ్యూనికేషన్ రంగానికి ప్రయోజనాలు కలిగించడమే కాదు, టూరిజం, టెక్నాలజీ, విద్య, ఆరోగ్య సంరక్షణ విభాగాల్లో సదుపాయాలు, అవకాశాలు పెరిగేందుకు కూడా దోహదపడుతుంది. దీనికి తోడు వేగవంతంగా విస్తరిస్తున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం కూడా పెరుగుతుంది. 2014 సంవత్సరంతో పోల్చితే ఈశాన్యంలో ఆప్టికల్ ఫైబర్ అనుసంధానత 4 రెట్లు పెరిగింది. మేఘాలయలో అయితే 5 రెట్లు పెరిగింది. మెరుగైన అనుసంధానత కోసం 6,000 మొబైల్ టవర్లు ఈశాన్యంలోని ప్రతీ మారుమూల ప్రాంతంలోనూ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై రూ.5,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. మేఘాలయలో నేడు ప్రారంభిస్తున్న 4జి మొబైల్ టవర్లు ఈ ప్రయత్నాలకు మరింత ఉత్తేజం కల్పిస్తాయి. మౌలిక వసతులు ఈ ప్రాంతంలోని యువతకు కొత్త అవకాశాలు తెచ్చి పెడతాయి. అలాగే ఇక్కడ ప్రారంభిస్తున్న ఐఐఎం, శంకుస్థాపన చేస్తున్న టెక్నాలజీ పార్కులతో విద్య, ఆదాయ అవసరాలు విస్తరిస్తాయి. నేడు ఈశాన్యంలోని గిరిజన ప్రాంతాల్లో 150 పైబడి ఏకలవ్య మోడల్ పాఠశాలలు ఏర్పాటవుతున్నాయి. వాటిలో 39 మేఘాలయలో ఏర్పాటవుతున్నాయి. అంతే కాదు, ఐఐఎంల ఏర్పాటు వల్ల యువత వృత్తిపరమైన విద్యా ప్రయోజనాలు పొందగలుగుతారు.
సోదరసోదరీమణులారా,
బిజెపి-ఎన్ డిఏ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాదిలోనే ఈశాన్య రాష్ర్టాలకు నేరుగా లేదా ఈశాన్యంలో అధిక ప్రాంతానికి ప్రయోజనం కలిగించే 3 కొత్త పథకాలు ప్రారంభించడం జరిగింది. పర్వత్ మాల స్కీమ్ కింద రోప్ వే నిర్మాణం కూడా జరుగుతోంది. దీనితో ఈశాన్యానికి చెందిన ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోను, వెలుపల సదుపాయాలు పెరుగుతాయి. పర్యాటకం అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ‘పిఎం డివైన్’ స్కీమ్ ఈశాన్యంలో అభివృద్ధికి కొత్త ఉత్తేజం కలిగిస్తుంది. ఈ స్కీమ్ తో ఈశాన్యంలో ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు మరింత తేలిగ్గా అనుమతులు లభిస్తాయి. ఫలితంగా మహిళలు, యువతకు కూడా జీవనోపాధి కూడా మెరుగుపడుతుంది. పిఎం డివైన్ పథకానికి రాబోయే 3-4 సంవత్సరాల కాలానికి రూ.6000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించడం జరిగింది.
సోదరసోదరీమణులారా,
దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న పార్టీలు ఈశాన్యాన్ని విభజించే ఆలోచన కలిగి ఉన్నాయి. కాని మేం ఇప్పుడు ‘డివైన్’ పథకంతో ముందుకు వచ్చాం. విభిన్న సమాజాలు, విభిన్న ప్రాంతాల మధ్య విభజనలు తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. నేడు మేం ఈశాన్యంలో వివాదాల రేఖలు గీయడంలేదు. అభివృద్ధి కారిడార్లు నిర్మిస్తున్నాం. గత 8 సంవత్సరాల కాలంలో పలు వర్గాలు దౌర్జన్యకాండ బాట విడనాడి శాశ్వత శాంతి బాటను ఎంచుకున్నాయి. ఇది సాధ్యం కావాలంటే ఈశాన్యంలో ఎఎఫ్ఎస్ పిఎ అవసరం ఇక ఏ మాత్రం లేదు. రాష్ర్టప్రభుత్వాల సహాయంతో పరిస్థితి నిరంతరం మెరుగుపడుతోంది. అంతే కాదు, రాష్ర్టాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు వివాదాలు పరిష్కారం అవుతున్నాయి.
మిత్రులారా,
మా వరకు ఈశాన్యం, సరిహద్దు ప్రాంతాలు చివరి పాయింట్లు కాదు, భద్రత, సుసంపన్నతకు గేట్ వేలు. జాతి భద్రతకు ఈ ప్రాంతాలు హామీ ఇస్తున్నాయి. ఇతర దేశాలో వాణిజ్యం, వ్యాపారం సైతం ఇక్కడ నుంచి సాగుతోంది. అందుకే మరో ప్రధాన స్కీమ్ ఈశాన్య రాష్ర్టాలకు ప్రయోజనం కలిగించబోతోంది. అదే సరిహద్దు గ్రామాలను చైతన్యవంతమైన అభివృద్ధి గ్రామాలుగా తీర్చి దిద్దే పథకం. దీని కింద సరిహద్దు గ్రామాల్లో మెరుగైన వసతులు అందుబాటులోకి తెస్తారు. సరిహద్దు గ్రామాలు అభివృద్ధి చెంది అనుసంధానత మెరుగు పడినట్టయితే శత్రు దేశాలు ప్రయోజనం పొందుతాయనే అపోహ చాలా కాలంగా దేశంలో నెలకొంది. అసలు అలాంటి ఆలోచనా ధోరణి ఎలా ఏర్పడిందనేది నాకు అర్ధం కావడంలేదు. గత ప్రభుత్వాల ఈ ఆలోచనా ధోరణి వల్లనే ఈశాన్యం సహా సరిహద్దు ప్రాంతాల్లో కనెక్టివిటీ మెరుగుపడలేదు. కాని నేడు ఈశాన్యంలో కొత్త రోడ్లు, కొత్త సొరంగ మార్గాలు, కొత్త వంతెనలు, కొత్త విమాన స్ర్టిప్ లు ఏది అవసరం అయితే దాని నిర్మాణం విశ్వసనీయంగా జరుగుతోంది. ఒకప్పుడు ఎడారులుగా ఉన్న సరిహద్దు గ్రామాలు ఇప్పుడు చైతన్యవంతమైన గ్రామాలుగా మారుతున్నాయి. నగరాల్లో ఎంత వేగంగా పని చేస్తున్నామో అంతే వేగంగా సరిహద్దు గ్రామాల్లో కూడా పనులు జరగాలి. ఫలితంగా టూరిజం విస్తరించడమే కాకుండా గ్రామాలను వదిలిపోయిన వారు తిరిగి వస్తారు.
మిత్రులారా,
గత ఏడాది వాటికన్ సిటీ సందర్శించే అవకాశం నాకు వచ్చింది. అక్కడ నేను పోప్ ను కూడా కలిశాను. భారతదేశం సందర్శించాలని నేను ఆయనను ఆహ్వానించాను. ఆ సమావేశం నా మనసులో లోతైన ప్రభావం చూపించింది. నేడు మొత్తం మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మేమిద్దరం చర్చించాం. ఐక్యత, సామరస్య స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ప్రయోజనం పొందేందుకు కలిసికట్టుగా కృషి చేయాలన్న విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఆ స్ఫూర్తిని మనం శక్తివంతం చేయాల్సి ఉంది.
మిత్రులారా,
మన గిరిజన సమాజం శాంతి, అభివృద్ధి రాజకీయాల నుంచి ప్రయోజనం పొందింది. సాంప్రదాయం, భాష, సంస్కృతిని పరిరక్షించుకుంటూనే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయడం మా ప్రభుత్వ ప్రాధాన్యత. అందుకే వెదురు కటింగ్ పై నిషేధాన్ని మేం తొలగించాం. దీనితో వెదురును ఉపయోగించి గిరిజనులు తయారుచేసే ఉత్పత్తులకు కొత్త ఉత్తేజం లభించింది. అడవుల నుంచి సేకరించిన ఉత్పత్తులకు విలువ జోడింపు చేయడం కోసం ఈశాన్యంలో 850 వన్ ధన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. అనేక స్వయంసహాయక బృందాలు దీనితో అనుసంధానమై ఉన్నాయి. వాటిలో మన తల్లులు, సోదరీమణులు ఎందరో పని చేస్తున్నారు. దీనికి తోడు ఇళ్లు, నీరు, విద్యుత్తు, గ్యాస్ వంటి సామాజిక మౌలిక వసతులు ఈశాన్యానికి ఎంతో లాభం కలిగించాయి. గత కొద్ది సంవత్సరాలుగా మేఘాలయలోని 2 లక్షలకు పైగా ఇళ్లకు తొలిసారిగా విద్యుత్ వసతి లభించింది. పేదలకు 70 వేలకు పైగా ఇళ్లు మంజూరయ్యాయి. తొలిసారిగా మూడు లక్షల ఇళ్లకు పైప్ ల ద్వారా నీటి సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వీటన్నింటి అతి పెద్ద లబ్ధిదారులు మన గిరిజన సోదర సోదరీమణులే.
మిత్రులారా,
ఈశాన్యంలో ఈ వేగవంతమైన అభివృద్ధి కొనసాగించే ప్రయత్నంలో మీ ఆశీస్సులే మా శక్తి. ప్రస్తుతం క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొని ఉంది. నేను ఈశాన్యంలో ఉన్న ఈ తరుణంలో నేడు ఈ భూమి నుంచే దేశవాసులందరికీ, ఈశాన్యంలోని నా సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరోసారి మీ అందరికీ హార్థిక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఖుబ్లీ శిబాన్ (ఖాసి, జైన్తియాలలో అభినందనలు), మిటెలా (గారోలో ధన్యవాదాలు).
గమనిక : ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది అనువాదం.
***