అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

ఇస్రో, తన వాణిజ్య విభాగాల ద్వారా గత 5 సంవత్సరాలలో 19 దేశాలకు చెందిన 177 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్టు వెల్లడించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ఈ 177 ఉపగ్రహ ప్రయోగాల ద్వారా 2018 జనవరి నుంచి 2022 నవంబర్ మధ్య దేశం 94 మిలియన్ల అమెరికన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని,46 మిలియన్ యూరోలను ఆర్జించింది

ప్రభుత్వేతర సంస్థలకు సహాయం అందించేందుకు, వాటిని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన ఇన్ –స్పేస్ ద్వారా స్టార్టప్ కమ్యూనిటీ విశేష ఆసక్తి చూపుతోంది. ఇప్పటివరకు 111 స్పేస్ స్టార్టప్లు ఇన్ స్పేస్ డిజిటల్ ప్లాట్ఫారంలో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నాయి.

Posted On: 15 DEC 2022 12:46PM by PIB Hyderabad

 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ –ఇస్రో తన వాణిజ్య విభాగాల ద్వారా ,గత 5 సంవత్సరాలలో 19 దేశాలకు చెందిన  177 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్టు
కేంద్ర  భూ విజ్ఞాన శాఖ (స్వతంత్ర) ,ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు,  అటామిక్ ఎనర్జీ, అంతరిక్షశాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ఈ మేరకు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2018 జనవరి నుంచి 2022 నవంబర్ వరకు ఇస్రో 177 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిందని, ఇవి ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, కొలంబియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్,ఇజ్రాయిల్, ఇటలీ, జపాన్ లిథుయేనియా, లక్సంబెర్గ్, మలేసియా, నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్, స్పెయిన్ , స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా దేశాలకు చెందినవని తెలిపారు. వీటిని పిఎస్ఎల్వి , జిఎస్ఎల్వి ‌‌–ఎంకె3 లాంచర్ల ద్వారా వాణిజ్య ఒప్పందంలో భాగంగా ప్రయోగించినట్టు ఆయన తెలిపారు.

177 విదేశీ ఉపగ్రహాలను 2018 జనవరి నుంచి 2022 నవంబర్ మధ్య ప్రయోగించడం జరిగిందని, వీటి ద్వారా సుమారు 94 మిలియన్ల అమెరికన్ డాలర్లు, 46 మిలియన్ల యూరోల
 విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడం జరిగిందని తెలిపారు. అంతరిక్ష రంగ సంస్కరణల గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2020 జూన్లో పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రకటించడం జరిగిందని, దీనిద్వారా ప్రభుత్వేతర సంస్థలు ఈ రంగంలో పాల్గొనేందుకు వీలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఇది అంతరిక్ష కార్యకలాపాలకు వాణిజ్య ప్రాధాన్యత లభిస్తోందన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష ఆర్ధిక వ్యవస్థలో భారత్ వాటాను గణనీయంగా పెంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సంస్కరణల ఫలితంగా ,ఎల్విఎం 3 రూపంలో ఇండియా భారీ వాణిజ్య ప్రయోగం నిర్వహించిదని, దీనిద్వారా 36 ఆన్ వెబ్ ఉపగ్రహాలు ప్రయోగించామని, ఇటీవల సబ్ ఆర్బిటల్ లాంచ్ని స్కైరూట్ ఎయిరో  స్పేస్ ప్రైవేటు సంస్థ చేపట్టిందని తెలిపారు. ఈ తరహా ప్రయోగాగాలలో ఇది ప్రథమమని ఆయన తెలిపారు.

దీనికితోడు, ఇన్ స్పేస్ అనేది ప్రభుత్వేతర సంస్థల ఎండ్ టు ఎండ్ స్పేస్ కార్యకలాపాల నిర్వహణకు సింగిల్ విండో ఏజెన్సీ గా వ్యవహరిస్తుంది.  ఫలితంగా అంతరిక్ష కార్యకలాపాలపై స్టార్టప్ కమ్యూనిటీకి పెద్ద ఎత్తున ఆసక్తి పెరిగింది. ఇప్పటివరకు 111 స్టార్టప్ లు ఇన్ స్పేస్ డిజిటల్ ప్లాట్ఫారంపై రిజిస్టర్ చేయించుకున్నాయి.

గత 5 సంవత్సరాలలో ప్రభుత్వం అంతరిక్ష కార్యక్రమాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు,  ఈ రంగాన్ని  బలోపేతం చేసేందుకు పలు చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. భూ పరిశీలన, ఉపగ్రహ కమ్యూనికేషన్, అంతరిక్ష విజ్ఞాన రంగాలలో అంతరిక్ష వ్యవస్థల అభివృద్ధి , వాటిని సాకారం చేసే దిశగా గణనీయ అభివృద్ధి సాధించినట్టు ఆయన తెలిపారు. వివిధ ఉపగ్రహ ప్రయోగ వాహనాలను విజయవంతంగా ప్రయోగించడంతోపాటు, భవిష్యత్ ఉపగ్రహ ప్రయోగ వాహనాలకు సంబంధించి, అభివృద్ధి, ప్రధాన సాంకేతిక అంశాల పరిశీలన ,వాటిని సాకారం చేయడం, వంటివి కూడా గడచిన ఐదు సంవత్సరాల కాలంలో సాధించినట్టు ఆయన తెలిపారు.

***


(Release ID: 1884083) Visitor Counter : 255