ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇటలీలోని రోమ్‌లోగల ఎఫ్‌ఏఓ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి సందేశం


అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023ను ప్రారంభించడంపై
ఐక్యరాజ్య సమితి.. ఆహార-వ్యవసాయ సంస్థకు ప్రధాని అభినందనలు;

“భూగోళంపై ఆహార భద్రత నేటికీ సమస్యగానే ఉందని శతాబ్దంలో ఒకసారి దాపురించే మహమ్మారి అనంతర సంఘర్షణ పరిస్థితులు నిరూపిస్తున్నాయి”;

“చిరుధాన్యాలను భవిష్యత్ ఆహారంగా మార్చడం నేటి తక్షణావసరం”;

“రైతులు.. వినియోగదారులు.. పర్యావరణానికీ చిరుధాన్యాలు ఉత్తమం”;

“వ్యవసాయ.. ఆహార వైవిధ్యం పెంపులో చిరుధాన్యాలు మంచి మార్గం”;

“చిరుధాన్యాసక్తి పెంపు దిశగా అవగాహన కల్పన ఈ ఉద్యమంలో కీలకాంశం”

Posted On: 06 DEC 2022 7:52PM by PIB Hyderabad

   టలీ రాజధాని రోమ్‌లోగల ఐక్యరాజ్య సమితి ఆహార-వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో భారత ప్రతినిధిగా పాల్గొన్న కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే ప్రధాని సందేశాన్ని చదివి వినిపించారు. ప్రధానమంత్రి దార్శనికత, చొరవ ఫలితంగా ప్రపంచంలోని 70కిపైగా దేశాల మద్దతుతో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 2023ను ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటిస్తూ తీర్మానించింది. సుస్థిర వ్యవసాయంలో చిరుధాన్యాల కీలక పాత్రసహా అత్యుత్తమ-అద్భుత ఆహారంగా వాటి ప్రయోజనాలపై ప్రపంచవ్యాప్త అవగాహన కల్పనకు ఇది తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో ముందుగా అంతర్జాతీయ చిరుధాన్యం సంవత్సరం-2023ను ప్రారంభించడంపై ఐక్యరాజ్య సమితి ఆహార-వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ)కు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. అలాగే సంబంధిత ప్రతిపాదనకు మద్దతిచ్చిన సభ్య దేశాలన్నిటినీ ప్రశంసించారు.

   మానవులు పండించిన తొలినాటి పంటలలో చిరుధాన్యాలు ఒకటి మాత్రమేగాక పోషక సమృద్ధికి అవి ముఖ్యమైన వనరుగా ప్రధాని వివరించారు. అందువల్ల చిరుధాన్యాలను భవిష్యత్ ఆహారంగా మార్చడం నేటి తక్షణావసరమని ఆయన స్పష్టం చేశారు. ఆహార భద్రత సంబంధిత సవాళ్లను నొక్కిచెబుతూ- శ‌తాబ్దంలో ఒక‌సారి దాపురించే మహమ్మారి గురించి, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న సంఘర్షణల గురించి ప్రధాని ప్రస్తావించారు. ఆహార లభ్యతను వాతావరణ మార్పు ఏ విధంగా ప్రభావితం చేస్తుందో కూడా ఆయన వివరించారు. ఆహార భద్రత దిశగా చిరుధాన్యాల వినియోగాన్ని అంతర్జాతీయ ఉద్యమంగా రూపొందించడం ఒక కీలక ముందడుగు కాగలదని ప్రధాని పేర్కొన్నారు. చిరుధాన్యాల సాగు చాలా సులభమే కాకుండా ఈ పంటలు వాతావరణ ప్రభావాలతోపాటు కరువును ఎదుర్కొనగలవని తెలిపారు.  అలాగే సమతుల పోషకాహారానికి గొప్ప మూలమని, సహజ వ్యవసాయ విధానాలు, తక్కువ నీటితో వీటిని సాగు చేయవచ్చునని వివరించారు. అందువల్ల “రైతులు, వినియోగదారులకే కాకుండా పర్యావరణానికీ చిరుధాన్యాలు ఉత్తమం” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

   సాగు భూమితోపాటు భోజనంలో వైవిధ్యం ఆవశ్యకతను నొక్కిచెబుతూ- వ్యవసాయం ఒకే పంటకు పరిమితమైతే భూసారమే కాకుండా మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ప్రధాని స్పష్టం చేశారు. అందుకే వ్యవసాయ, ఆహార వైవిధ్యం పెంపు దిశగా చిరుధాన్యాలు మంచి మార్గమని ఆయన సూచించారు. చివరగా “చిరుధాన్యాసక్తి”ని పెంపు నిమిత్తం అవగాహన కల్పన అవసరమని, ఈ దిశగా ఉద్యమంలో సంస్థలు, వ్యక్తులు పోషించగల అద్భుత పాత్ర గురించి ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. సంస్థాగత యంత్రాంగాలు చిరుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ విధాన కార్యక్రమాల ద్వారా దాన్ని లాభదాయకం చేయగలవని చెప్పారు. మరోవైపు చిరుధాన్యాలను వ్యక్తులు తమ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంతోపాటు భూగోళ హిత ఎంపికకు దోహదం చేయగలరని వివరిస్తూ తన సందేశాన్ని ముగించారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి సందేశంలో ముఖ్యాంశాలు కిందివిధంగా ఉన్నాయి:

  • “అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023ను ప్రారంభించడంపై ఐక్యరాజ్య సమితి ఆహార-వ్యవసాయ సంస్థకు అభినందనలు;
  • అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం పాటించాలన్న మా ప్రతిపాదనకు మద్దతిచ్చిన వివిధ సభ్య దేశాలకూ నా ప్రశంసలు తెలియజేస్తున్నాను;
  • మానవాళి సాగుచేసిన తొలినాటి పంటలుగా చిరుధాన్యాలకు ఉజ్వల చరిత్ర ఉంది. ఒకనాటి అత్యంత ప్రధాన ఆహార వనరుగా ఉన్నది చిరుధాన్యాలే.. అయితే, వీటిని భవిష్యత్‌ ఆహార ఎంపికలో భాగం చేసుకోవడం నేటి తక్షణావసరం!;
  • భూగోళంపై ఆహార భద్రత నేటికీ సమస్యగానే ఉందని శతాబ్దంలో ఒకసారి దాపురించే మహమ్మారి అనంతర సంఘర్షణ పరిస్థితులు నిరూపిస్తున్నాయి. అంతేకాదు...  వాతావరణ మార్పు కూడా ఆహార లభ్యతను ప్రభావితం చేయగలదు;
  • ఈ పరిస్థితుల నడుమ చిరుధాన్యాల సాగు, వినియోగంపై అంతర్జాతీయ ఉద్యమం కీలకమైన ముందడుగు కాగలదు. చిరుధాన్యాల సాగు సులభమేగాక వాతావరణ మార్పును, కరువును కూడా అవి తట్టుకోగలవు.
  • చిరుధాన్యాలు రైతుకు.. వినియోగదారులకే కాకుండా వాతావరణానికీ మేలు చేస్తాయి. ఆ మేరకు వినియోగదారులకు సమతుల పోషణలో గొప్ప వనరు కాగలవు. తక్కువ నీటితో సాగు సాధ్యంగనుక రైతుకు, సహజ వ్యవసాయ పద్ధతులకు వీలైనవి కాబట్టి మన పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుంది;
  • సాగుభూమితోపాటు భోజనాల బల్లదగ్గర కూడా వైవిధ్యం భవిష్యత్‌ అవసరం. వ్యవసాయం ఒకే పంటకు పరిమితమైదే, భూసారంతోపాటు మన ఆరోగ్యంపైనా దుష్ప్రభావం తప్పదు. కాబట్టి పంటల, ఆహార వైవిధ్యానికి చిరుధాన్యాలే మంచి మార్గం;
  • ఈ ఉద్యమంలో ‘చిరుధాన్యాసక్తి’ పెంపు దిశగా అవగాహన కల్పన ఒక ముఖ్యమైన భాగం. ఇందులో అటు సంస్థల, ఇటు వ్యక్తుల ప్రభావం అద్భుతంగా ఉంటుంది;
  • సంస్థాగత యంత్రాంగాలు చిరుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ విధాన కార్యక్రమాల ద్వారా దాన్ని లాభదాయకం చేయగలవు. మరోవైపు చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా వ్యక్తులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంతోపాటు భూగోళహిత ఎంపికలకు దోహదం చేయగలరు;
  • అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023 సురక్షిత, సుస్థిర, ఆరోగ్యకర భవిష్యత్తు దిశగా ప్రజా ఉద్యమానికి నాంది కాగలదని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను.”

నేపథ్యం

   క్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 2023ను “అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం”గా ప్రకటించింది. ప్రధానమంత్రి దార్శనికత, చొరవ ఫలితంగా ప్రపంచంలోని 70కిపైగా దేశాల మద్దతుతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. సుస్థిర వ్యవసాయంలో చిరుధాన్యాల కీలక పాత్రసహా అత్యుత్తమ-అద్భుత ఆహారంగా వాటి ప్రయోజనాలపై ప్రపంచవ్యాప్త అవగాహన కల్పనకు ఇది తోడ్పడుతుంది. ప్రస్తుతం 170 లక్షల టన్నులకుపైగా చిరుధాన్యాలను భారతదేశం ఉత్పత్తి చేస్తుండగా ఆసియా ఖండంలో ఉత్పాదనతో పోలిస్తే ఇది 80 శాతానికిపైగానే ఉంటుంది. తద్వారా మన దేశం చిరుధాన్యాలకు ప్రపంచ కూడలి కాగలదనడంలో సందేహం లేదు. సింధు నాగరికతలో ఈ ధాన్యాల తొలినాటి సాగుకు ఆధారాలు లభించాయి. అలాగే ఆహారంగా పండించిన తొలి పంటలలో ఇవి ఒకటిగా ఉన్నాయి. చిరుధాన్యాల సాగుకు దాదాపు 131 దేశాలలో సానుకూల పరిస్థితులుండగా- ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో సుమారు 60 కోట్ల మందికి ఇవి సంప్రదాయక ఆహారం.

   అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023ను ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా భారతీయ చిరుధాన్యాలు, వంటకాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్త ఆమోదం పొందుతాయి. ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’ అనేది ప్రపంచవ్యాప్త ఉత్పత్తి పెంపు, సమర్థ తయారీ, వినియోగాలకు హామీ ఇస్తుంది. అలాగే పంటల మార్పిడి, మెరుగైన వినియోగంతోపాటు ఆహారంలో చిరుధాన్యాలను ప్రధానాంశంగా  ప్రోత్సహించడానికి, ఆహార వ్యవస్థలన్నిటా మెరుగైన అనుసంధానం కల్పనకు ఇదొక అరుదైన అవకాశం కాగలదు.

   ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (ఐవైఎం)-2023’ ప్రారంభోత్సవం సందర్భంగా ఆహార-వ్యవసాయ సంస్థ ఓ సంక్షిప్త సందేశమిచ్చింది. ఈ మేరకు ‘ఎఫ్‌ఏఓ’లోని సభ్య దేశాలతోపాటు సంబంధిత భాగస్వాముల ద్వారా ‘ఐవైఎం-2023’కు ఊపునిస్తూ విస్తృత ప్రచారం చేపట్టాలని సంకల్పించింది. ఇందులో చిరుధాన్యాల విననియోగంతోపాటు సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహంతో కలిగే ప్రయోజనాల వివరణకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.

***


(Release ID: 1881289) Visitor Counter : 366