వ్యవసాయ మంత్రిత్వ శాఖ

సుస్థిర వ్యవసాయం కోసం భూసార పరిరక్షణ అనే అంశంపై ఏర్పాటైన జాతీయ సదస్సును ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి


సుస్థిర అభివృద్ధి సాధన లక్ష్య సాధనకు ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నారు .. శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ దేశంలో రైతులకు 22 కోట్ల భూసార ఆరోగ్య కార్డులు పంపిణీ.. కేంద్ర వ్యవసాయ మంత్రి

Posted On: 05 DEC 2022 2:56PM by PIB Hyderabad

సుస్థిర వ్యవసాయం కోసం భూసార పరిరక్షణ అనే అంశంపై ఏర్పాటైన జాతీయ సదస్సును ఈరోజు  కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. సదస్సులో మాట్లాడిన కేంద్ర మంత్రి వ్యవసాయం, ఇతర అవసరాల కోసం రసాయనాలను ఉపయోగించడం వల్ల భూసారం తగ్గిపోతున్నదని అన్నారు. క్షీణిస్తున్న భూసారంతో పాటు వాతావరణంలో వస్తున్న మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఈ రెండు సమస్యలు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయని శ్రీ తోమర్ పేర్కొన్నారు. వాతావరణ మార్పుల అంశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తున్న శ్రీ మోదీ సమస్య పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారని శ్రీ తోమర్ వివరించారు. ప్రణాళికల అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు అమలు చేస్తుందని అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనకు శ్రీ మోదీ కట్టుబడి ఉన్నారని శ్రీ తోమర్ స్పష్టం చేశారు.  

 

 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు ప్రపంచ భూసార  దినోత్సవం సందర్భంగా  జర్మనీలోని ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (BMZ)కి అనుబంధంగా ఉన్న GIZ సహకారంతో నీతి  ఆయోగ్ ఏర్పాటు చేసిన సదస్సులో శ్రీ తోమర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భూమిలో  సేంద్రియ కార్బన శాతం తగ్గిపోవడం భారతదేశానికి   తీవ్రమైన ఆందోళన కలగజేస్తున్నదని శ్రీ తోమర్ అన్నారు.   సవాలును ఎదుర్కోని  భూసార పరిరక్షణ కోసం   పర్యావరణానికి మేలు చేసే సహజ వ్యవసాయాన్ని  ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.  సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోందని ఆయన వివరించారు. వ్యవసాయం కోసం ప్రభుత్వం భారతీయ సహజ వ్యవసాయ విధానంలో మార్పులు తెచ్చిందని అన్నారు.  భారతదేశంలో పురాతన కాలంలో సహజ వ్యవసాయ విధానాలు ఉపయోగించారని పేర్కొన్నారు. పురాతన కాలంలో ప్రకృతితో ప్రజలు మమేకమై జీవనం సాగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సహజ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు మొదలైన రాష్ట్రాలు వినూత్న విధానాలు అమలు చేస్తున్నాయని తెలిపారు.  ఏడాది కాలంలో 17 రాష్ట్రాల్లో 4.78 లక్షల హెక్టార్ల భూమి  సహజ వ్యవసాయం కిందకు వచ్చిందని తెలిపిన శ్రీ తోమర్  సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకంగా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌ ను . 1,584 కోట్ల రూపాయలతో అమలు చేస్తున్నదని  శ్రీ తోమర్ చెప్పారు.నమామి గంగే కార్యక్రమం కింద గంగానది ఒడ్డున సహజ వ్యవసాయం  ప్రాజెక్ట్ కొనసాగుతోంది, భారత వ్యవసాయ పరిశోధనా మండలి   (ICAR) , కృషి విజ్ఞాన కేంద్రాలు (KVKలు), కేంద్ర  రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు , కళాశాలల నేతృత్వంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని శ్రీ తోమర్ తెలిపారు. 

భూసార పరిరక్షణ కోసం  భారత ప్రభుత్వం ఆరోగ్య కార్డులు ఇస్తున్నదని  శ్రీ తోమర్ చెప్పారు. రెండు దశల్లో దేశవ్యాప్తంగా 22 కోట్లకు పైగా భూసార కార్డులను రైతులకు పంపిణీ చేశామన్నారు. భూ ఆరోగ్య యాజమాన్య పథకం కింద ప్రభుత్వం  మౌలిక సదుపాయాలను  అభివృద్ధి చేస్తుందని తెలిపారు. పథకం కింద వివిధ రకాల భూముల సారాన్ని పరీక్షించేందుకు  భూసార పరీక్షా ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 499 శాశ్వత భూసార పరీక్షా ప్రయోగశాలలు, 113 మొబైల్ భూసార పరీక్షా ప్రయోగశాలలు, 8,811 మినీ  భూసార పరీక్షా ప్రయోగశాలలు, గ్రామస్థాయిలో   2,395 భూసార పరీక్షా ప్రయోగశాలలు నెలకొల్పామని మంత్రి వివరించారు. గతంలో  ఉత్పత్తి ఆధారిత వ్యవసాయ విధానాలు ఉండేవని తెలిపిన  మంత్రి  రసాయనిక సేద్యం వల్ల వ్యవసాయ దిగుబడి పెరిగింది అని అన్నారు. కానీ ప్రస్తుతం  పరిస్థితి మారిందని, వాతావరణ మార్పులతో భూసార పరిరక్షణ అంశం పెద్ద సవాలుగా మారిందని  అన్నారు. ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా భూమిని దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయన్నారు.  రసాయనిక వ్యవసాయం వల్ల  భూసారం తగ్గిపోతున్నదని శ్రీ తోమర్ అన్నారు. భూసారాన్ని రక్షించి, పర్యావరణ పరిరక్షణ  బాధ్యతగా గుర్తించి ప్రపంచ దేశాలు పనిచేయాలని ఆయన సూచించారు. 

సమావేశంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ సుమన్ బెర్రీ, సభ్యులు ప్రొ.రమేష్ చంద్, సీఈవో శ్రీ పరమేశ్వరన్ అయ్యర్, సీనియర్ సలహాదారు శ్రీమతి నీలం పటేల్, కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (ఝాన్సీ) డాక్టర్ ఎకె సింగ్ మరియు డ్రిక్ స్టెఫీస్, పలువురు శాస్త్రవేత్తలతో పాటు, విధాన రూపకర్తలు మరియు ఇతర వాటాదారులు హాజరయ్యారు. సదస్సులో వివిధ సాంకేతిక అంశాల పై నిపుణులు ప్రసంగించారు.

***(Release ID: 1881002) Visitor Counter : 167