ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం నేపథ్యంలో ప్రధాని సందేశం తెలుగు పాఠం

Posted On: 15 NOV 2022 9:15AM by PIB Hyderabad

ప్రియమైన దేశ ప్రజలారా!

గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్బంగా మీకందరికీ నా శుభాకాంక్షలు

   దేశం యావత్తూ ఇవాళ భగవాన్ బిర్సా ముండా జయంతిని భక్తి, గౌరవాలతో నిర్వహించుకుంటోంది. ముందుగా భరతమాత విశిష్ట పుత్రుడు, అసమాన విప్లవకారుడు భగవాన్ బిర్సా ముండాకు శిరసాభివందనం చేస్తున్నాను. నవంబర్ 15 భారతదేశపు గిరిజన సంప్రదాయానికి ఉజ్వలమైన రోజు. అందుకే నవంబర్ 15వ తేదీని ‘గిరిజన జాతీయ దినోత్సవం’గా ప్రకటించే అవకాశం లభించడం నా ప్రభుత్వానికి లభించిన అదృష్టంగా భావిస్తున్నాను.

మిత్రులారా!

   గవాన్ బిర్సా ముండా మన రాజకీయ స్వాతంత్ర్య కథానాయకుడు మాత్రమే కాదు… మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక శక్తికి వాహకుడు కూడా. ఈ నేపథ్యంలో ‘పంచ ప్రాణాల’ (ఐదు ప్రతిజ్ఞల) స్వాతంత్య్ర శక్తితో భగవాన్ బిర్సా ముండా సహా కోట్లాది గిరిజన వీరుల కలలను నెరవేర్చే దిశగా నేడు దేశం ముందడుగు వేస్తోంది. ఈ ‘గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం ద్వారా దేశ గిరిజన వారసత్వంపట్ల గౌరవం, గిరిజన సమాజ ప్రగతి సంకల్పాలు ఈ శక్తిలో భాగమే.

మిత్రులారా!

   బ్రిటిష్ వారుసహా విదేశీ పాలకులకు తన పరాక్రమం ఎంతటిదో భారతదేశంలోని గిరిజన సమాజం స్పష్టం చేసింది. సంథాల్‌లో తిల్కా మాంఝీ నాయకత్వంలో జరిగిన ‘దామిన్ సంగ్రామ్’ మాకెంతో గర్వకారణం. అలాగే బుధు భగత్ నేతృత్వానా సాగిన ‘లార్కా ఉద్యమం’ మాటతో మన హృదయం ఉవ్వెత్తున పొంగుతుంది. ‘సిద్ధూ-కన్హు క్రాంతి’ని చూసి మనమంతా  గర్విస్తాం. ‘తానా భగత్ ఉద్యమం’ మనం ఛాతీ విరుచుకునేలా చేస్తుంది. బేగడ భిల్ ఉద్యమం, నాయక్డా ఉద్యమం, సంత్ జోరియా పరమేశ్వర్, రూప్ సింగ్ నాయక్‌ల శౌర్యప్రతాపాలు మనం గర్వంతో ఉప్పొంగిపోయేలా చేస్తాయి.

   లింబ్డీ, దాహోద్‌లలో బ్రిటిష్‌వారిని మట్టి కరిపించిన గిరిజన వీరులు మనకు గర్వకారకులు. శ్రీ గోవింద్ గురు మాన్‌గఢ్‌ ప్రతిష్టను నిలబెట్టడంపై మననమెంతో గర్విస్తాం. అల్లూరి సీతారామరాజు నాయకత్వంలోని రంపచోడవరం ఉద్యమం మనకు గర్వకారణం. ఇలాంటి అనేక విప్లవాలు ఈ భరతభూమిని పవిత్రం చేయగా, గిరిజన వీరుల త్యాగాలు దేశమాతను రక్షించాయి. నిరుడు ఇదే రోజున రాంచీలోని బిర్సా ముండా మ్యూజియాన్ని జాతికి అంకితం చేసే అవకాశం లభించడం నా అదృష్టం. నేడు దేశంలోని వివిధ ప్రాంతాలలో పలు గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల ప్రత్యేక ప్రదర్శనశాలలను దేశం నిర్మిస్తోంది.

మిత్రులారా!

   న దేశం గత ఎనిమిదేళ్లుగా రూపొందిస్తున్న ప్రణాళికలు, వాటి అమలుకు సాగుతున్న కృషిలో గిరిజన సోదరసోదరీమణులకు పెద్దపీట వేయబడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు దేశంలోని కోట్లాది గిరిజన కుటుంబాలకు జన్‌ధన్ నుంచి గోబర్ ధన్ దాకా; వన్ ధన్ వికాస్ కేంద్రాల నుంచి వన్ ధన్ స్వయం సహాయ బృందాల వరకూ; స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి జల్ జీవన్ మిషన్ దాకా; ప్రధానమంత్రి ఆవాస్ నుంచి ఉజ్వల వంటగ్యాస్‌ కనెక్షన్‌ వరకూ;  మాతృ వందన యోజన నుంచి జాతీయ పోషకాహార కార్యక్రమం దాకా; గ్రామీణ రహదారి పథకం నుంచి మొబైల్ అనుసంధానం దాకా; ఏకలవ్య పాఠశాలల నుంచి గిరిజన విశ్వవిద్యాలయాల వరకూ; వెదురుకు సంబంధించిన దశాబ్దాల నాటి చట్టాల రద్దునుంచి దాదాపు 90 అటవీ ఉత్పత్తులపై కనీస మద్దతుధర కల్పన వరకూ; గిరిజన పరిశోధన సంస్థల నుంచి సికిల్ సెల్ అనీమియా నివారణదాకా; కరోనా ఉచిత టీకాల నుంచి అనేక ప్రాణాంతక వ్యాధుల బారినపడకుండా రక్షించే మిషన్ ఇంద్రధనుష్ వగైరాల వరకూ గిరిజన జీవితాలు సులభం  కావడంతోపాటు దేశవ్యాప్త ప్రగతి ప్రయోజనాన్ని కూడా వారు పొందుతున్నారు.

మిత్రులారా!

   గిరిజన సమాజంలో శౌర్యప్రతాపాలే కాకుండా ప్రకృతితో సహజీవనం, సార్వజనీనత కూడా ముఖ్య లక్షణాలు. భారతదేశం ఈ గొప్ప వారసత్వం నుంచి పొందే అనుభవాలతో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. ఈ దిశగా ‘గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం’ మనకొక ప్రధాన మాధ్యమం కాగలదన్నది నా దృఢ విశ్వాసం. ఈ సంకల్పంతో భగవాన్ బిర్సా ముండా సహా కోట్లాది గిరిజన వీరుల పాదాలకు మరోసారి నమస్కరిస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు!

 

ప్రమేయ నిరాకరణ: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్ఛానువాదం. అసలు ప్రసంగం హిందీలో జరిగింది.

******


(Release ID: 1879671) Visitor Counter : 222