అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

స్వచ్ఛమైన ఇంధనాన్ని సరఫరా చేయాలన్న లక్ష్య సాధన కోసం 300 మెగావాట్ల చిన్న మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధికి ప్రాధాన్యత.. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న క్లిష్టమైన సాంకేతికత అంశాలపై ప్రైవేటు రంగం, అంకుర సంస్థలు దృష్టి సారించాలి..డాక్టర్ జితేంద్ర సింగ్

చిన్న మాడ్యులర్ రియాక్టర్ల నిర్మాణ ఖర్చు తక్కువగా ఉంటుంది. నిర్మాణం వేగంగా పూర్తవుతుంది.. మంత్రి
పారిశ్రామిక ఉద్గారాలను గణనీయంగా తగ్గించే చిన్న మాడ్యులర్ రియాక్టర్లను సులువుగా రవాణా చేయడానికి వీలవుతుంది.. డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 27 NOV 2022 1:46PM by PIB Hyderabad

స్వచ్ఛమైన ఇంధనాన్ని సరఫరా చేయాలన్న లక్ష్య సాధన కోసం 300 మెగావాట్ల చిన్న మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని  కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్ర, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి ( స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్ల పై ఈరోజు నీతి ఆయోగ్, అణుశక్తి విభాగం ఏర్పాటు చేసిన  వర్క్‌షాప్‌లో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడారు. క్లిష్టమైన చిన్న మాడ్యులర్ రియాక్టర్ల సాంకేతిక  పరిజ్ఞానాన్ని  భారతదేశంలో అభివృద్ధి చేసే అంశంపై  ప్రైవేటు రంగం, అంకుర సంస్థలు దృష్టి సారించాలని డాక్టర్  జితేంద్ర సింగ్ సూచించారు. వాణిజ్య పరంగా చిన్న మాడ్యులర్ రియాక్టర్లను అభివృద్ధి చేసే అంశంలో సాంకేతిక  పరిజ్ఞాన మార్పిడి, నిధులు కీలక అంశాలుగా ఉంటాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 

వాతావరణ సమతుల్యత రక్షణ కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూపొందించిన ప్రణాళిక అమలులో భాగంగా స్వచ్ఛమైన ఇంధన వనరుల సరఫరాకు భారతదేశం కట్టుబడి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దీనిలో భాగంగా స్వచ్ఛమైన వనరుల అన్వేషణ సాగుతున్నదని అన్నారు. 

2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించడానికి శిలాజ రహిత ఇంధన వనరులను ఎక్కువగా ఉపయోగించి ఇంధన ఉత్పత్తి సాగిస్తున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. అణు ఇంధనాన్ని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నారు. స్వచ్ఛమైన ఇంధనాన్ని సరఫరా చేసే అంశంలో  కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా యావత్తు ప్రపంచంలో అణు ఇంధన ప్రాధాన్యత పెరుగుతుందని పేర్కొన్నారు. 

సులువుగా రవాణా చేయడానికి వీలుగా ఉండే 300 మెగావాట్ల చిన్న మాడ్యులర్ రియాక్టర్ల నుంచి తక్కువ మోతాదులో కర్బన ఉద్గారాల విడుదల తక్కువగా ఉంటుంది. సాధారణ అణు రియాక్టర్లను వాటిని ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో నిర్మించాల్సి ఉంటుంది. అయితే, చిన్న మాడ్యులర్ రియాక్టర్లను కర్మాగారాల్లో నిర్మించి సులువుగా తరలించవచ్చు.నిరంతర  సురక్షిత ఇంధన సరఫరా, పరిశ్రమల్లో ఉద్గారాల విడుదలను తగ్గించడం లాంటి రంగాల్లో చిన్న మాడ్యులర్ రియాక్టర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. భారీ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో పోల్చి చూస్తే  చిన్న మాడ్యులర్ రియాక్టర్లు సురక్షితంగా ఉంటాయి. వీటి పనితీరు కూడా సులభంగా ఉంటుంది. 

దేశంలో పునరుత్పాదక ఇంధన వనరులను  ప్రోత్సహించడానికి అనేక చర్యలు చేపట్టామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  చైనా, యూరప్ మరియు అమెరికా దేశాల  తర్వాత ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల   వ్యవస్థాపిత  సామర్థ్యంలో భారతదేశం 4వ స్థానంలో ఉందని వివరించారు.  ఈ చర్యలు ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి  అనుగుణంగా ఉన్నాయని అన్నారు. దీని ద్వారా ప్రపంచ విలువ గొలుసుకు   భారతదేశం గణనీయమైన విలువను జోడించగలుగుతుందని అన్నారు. 

ప్రపంచ జనాభాలో 17% జనాభా కలిగి ఉన్న భారతదేశం గత దశాబ్దంలో ప్రాథమిక ఇంధన రంగంలో  4% వృద్ధిని నమోదు చేసింది. ఇది ప్రపంచ వృద్ధి రేటు 1.3% కంటే దాదాపు రెట్టింపు. అయితే, చారిత్రక ప్రమాణాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న  ఉద్గారాల్లో భారతదేశ  వాటా 5% కంటే తక్కువగా ఉంది. 

***


(Release ID: 1879394) Visitor Counter : 202